కారులో హైటెక్ జూదం!
ఆదిబట్ల: ప్రెస్ స్టిక్కర్‌ను అంటించుకొని టవేరా వాహనంలో తిరుగుతూ హైటెక్ పద్ధతిలో పేకాటాడుతున్న ఎనిమిది నిందితులను శుక్రవారం ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ అశోక్ కుమార్ కథనం ప్రకారం.. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాలకు చెందిన గంగారామ్ రాజేష్, దిలోవర్ రాజేష్, దేవీ అమర్, మట్టిపల్లి అయిలేష్, పూజారి కృష్ణ, బుచ్చి వెంకటేష్, బోడి నీరజ్‌రెడ్డి, నల్లమోతు మధులు ఓ గ్రూప్‌గా ఏర్పడ్డారు.
వీరు తరచూ ఓ టవేరా వాహనంను అద్దెకు తీసుకొని అందులోని సీట్లు తొలగించి లాంగ్ డ్రైవ్‌కు వెళ్తూ పేకాటాడుతున్నారు. ఈ క్రమంలో ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని బొంగ్లూర్ గేట్ ఔటర్ రింగ్ రోడ్ టోల్‌గేట్ వద్ద వాహనాన్ని పట్టుకున్నారు. ఎనిమిది మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ పేకాట నిర్వాహకులు ప్రసాద్, రమేష్ వాహనం దిగి పరారయ్యారు.
పట్టుబడిన జూదరుల నుంచి రూ. 2.20లక్షల నగదు, 9 సెల్‌ఫోన్‌లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎవరికీ అనుమానం రాకుండా జూదరులు వాహనాన్ని ప్రెస్ స్టిక్కర్ అంటించుకొని తిరుగుతుండడం గమనార్హం. నెలలో పది, పదిహేను సార్లు ఇలా వాహనం అద్దెకు తీసుకొని లాంగ్ డ్రైవ్‌కు వెళ్తుంటామని జూదరులు తెలిపారు. ఈ మేరకు ఆదిబట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.