Press Sticker
-
లాక్డౌన్: చికెన్ వ్యాపారి కారుకు ప్రెస్ స్టిక్కర్.. చివరికి!
సాక్షి, చిలకలగూడ: లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఆంక్షల సడలింపుల్లో ఉన్న ‘ప్రెస్’ను తమకు అనుకూలంగా వాడుకుంటున్న ఉల్లంఘనులు చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు. కారుకు ప్రెస్ స్టిక్కర్ పెట్టుకుని లాక్డౌన్ సమయంలో దర్జాగా తిరుగుతున్న చికెన్ వ్యాపారిపై చీటింగ్ కేసు నమోదు చేసి కారును సీజ్ చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకకు చెందిన బొమ్మగాని ఉపేందర్ చికెన్ వ్యాపారి. లాక్డౌన్ సమయంలో పోలీసు తనిఖీలు ముమ్మరం కావడంతో తన సొంతకారు (టీఎస్ 09 ఈఎఫ్ 4174)కు ప్రెస్ స్టిక్కరు పెట్టుకుని దర్జాగా తిరుగుతున్నాడు. గురువారం రాత్రి చిలకలగూడ పోలీసులు సీతాఫల్మండి చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఉపేందర్ తన కారులో అటుగా వచ్చాడు. పోలీసులు కారును ఆపగా రిపోర్టర్‌ను అంటూ దబాయించాడు. ఏ పత్రికలో పనిచేస్తున్నావో ఐడెంటిటీ కార్డు చూపించమని కోరగా నీళ్లు నమిలాడు. వాస్తవానికి తాను చికెన్ వ్యాపారినని, లాక్డౌన్ సమయంలో సడలింపు ఉండడంతో తన కారుకు ప్రెస్ స్టిక్కర్ అతికించానని వివరించాడు. లాక్డౌన్ ఆంక్షలు ఉల్లంఘించినందుకు కారును సీజ్ చేయడంతోపాటు జరిమాన విధించారు. ప్రెస్ పేరిట మోసానికి పాల్పడిన ఉపేందర్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ నరేష్ వివరించారు. లాక్డౌన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చదవండి: ఆన్లైన్ డేటింగ్ పేరుతో వ్యభిచారం.. కస్టమర్‌గా ఫోన్‌చేసి.. Lockdown: సీఎం కేసీఆర్ ఆదేశం.. రంగంలోకి డీజీపీ -
కారులో హైటెక్ జూదం!
ఆదిబట్ల: ప్రెస్ స్టిక్కర్‌ను అంటించుకొని టవేరా వాహనంలో తిరుగుతూ హైటెక్ పద్ధతిలో పేకాటాడుతున్న ఎనిమిది నిందితులను శుక్రవారం ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ అశోక్ కుమార్ కథనం ప్రకారం.. నగరంలోని దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాలకు చెందిన గంగారామ్ రాజేష్, దిలోవర్ రాజేష్, దేవీ అమర్, మట్టిపల్లి అయిలేష్, పూజారి కృష్ణ, బుచ్చి వెంకటేష్, బోడి నీరజ్‌రెడ్డి, నల్లమోతు మధులు ఓ గ్రూప్‌గా ఏర్పడ్డారు. వీరు తరచూ ఓ టవేరా వాహనంను అద్దెకు తీసుకొని అందులోని సీట్లు తొలగించి లాంగ్ డ్రైవ్‌కు వెళ్తూ పేకాటాడుతున్నారు. ఈ క్రమంలో ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని బొంగ్లూర్ గేట్ ఔటర్ రింగ్ రోడ్ టోల్గేట్ వద్ద వాహనాన్ని పట్టుకున్నారు. ఎనిమిది మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ పేకాట నిర్వాహకులు ప్రసాద్, రమేష్ వాహనం దిగి పరారయ్యారు. పట్టుబడిన జూదరుల నుంచి రూ. 2.20లక్షల నగదు, 9 సెల్ఫోన్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎవరికీ అనుమానం రాకుండా జూదరులు వాహనాన్ని ప్రెస్ స్టిక్కర్ అంటించుకొని తిరుగుతుండడం గమనార్హం. నెలలో పది, పదిహేను సార్లు ఇలా వాహనం అద్దెకు తీసుకొని లాంగ్ డ్రైవ్‌కు వెళ్తుంటామని జూదరులు తెలిపారు. ఈ మేరకు ఆదిబట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.