
సాక్షి, చిలకలగూడ: లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘించేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఆంక్షల సడలింపుల్లో ఉన్న ‘ప్రెస్’ను తమకు అనుకూలంగా వాడుకుంటున్న ఉల్లంఘనులు చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు. కారుకు ప్రెస్ స్టిక్కర్ పెట్టుకుని లాక్‌డౌన్ సమయంలో దర్జాగా తిరుగుతున్న చికెన్ వ్యాపారిపై చీటింగ్ కేసు నమోదు చేసి కారును సీజ్ చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకకు చెందిన బొమ్మగాని ఉపేందర్ చికెన్ వ్యాపారి. లాక్‌డౌన్ సమయంలో పోలీసు తనిఖీలు ముమ్మరం కావడంతో తన సొంతకారు (టీఎస్ 09 ఈఎఫ్ 4174)కు ప్రెస్ స్టిక్కరు పెట్టుకుని దర్జాగా తిరుగుతున్నాడు.
గురువారం రాత్రి చిలకలగూడ పోలీసులు సీతాఫల్‌మండి చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఉపేందర్ తన కారులో అటుగా వచ్చాడు. పోలీసులు కారును ఆపగా రిపోర్టర్‌ను అంటూ దబాయించాడు. ఏ పత్రికలో పనిచేస్తున్నావో ఐడెంటిటీ కార్డు చూపించమని కోరగా నీళ్లు నమిలాడు. వాస్తవానికి తాను చికెన్ వ్యాపారినని, లాక్‌డౌన్ సమయంలో సడలింపు ఉండడంతో తన కారుకు ప్రెస్ స్టిక్కర్ అతికించానని వివరించాడు. లాక్‌డౌన్ ఆంక్షలు ఉల్లంఘించినందుకు కారును సీజ్ చేయడంతోపాటు జరిమాన విధించారు. ప్రెస్ పేరిట మోసానికి పాల్పడిన ఉపేందర్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ నరేష్ వివరించారు. లాక్‌డౌన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
చదవండి:
ఆన్‌లైన్ డేటింగ్ పేరుతో వ్యభిచారం.. కస్టమర్‌గా ఫోన్‌చేసి..
Lockdown: సీఎం కేసీఆర్ ఆదేశం.. రంగంలోకి డీజీపీ
Comments
Please login to add a commentAdd a comment