అంగట్లో సాగుతోన్న పేకాట !
అంగట్లో సాగుతోన్న పేకాట !
Published Thu, Jun 1 2017 2:53 PM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
యథేచ్ఛగా విస్తరిస్తోన్న మట్కా
కరువైన పోలీసుల నిఘా
బాన్సువాడ: మూడు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో పేకాట బహిరంగంగా కొనసాగుతోంది. కొందరు దళారులు ప్రత్యేకం దృష్టిపెట్టి, పేకాడేందుకు రైతులు, వ్యాపారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. నెల రోజులుగా బాన్సువాడలోని వారాంతపు సంతలో కొందరు వ్యక్తులు వినూత్న రీతిలో పేకాటను సాగిస్తున్నారు. హీరో, హీరోయిన్ల ఫొటోలను ప్రదర్శించి, హీరోకు సింగిల్, హీరోయిన్‌కు డబుల్ డబ్బులు ఇస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. హీరోయిన్ ఫొటోపై రూ.100 పెడితే రూ.300 ఇస్తామని, హీరో ఫొటోపై రూ.100 పెడితే రూ.200 ఇస్తామని చెబుతూ పేకాడిస్తున్నారు. హీరోయిన్ ఫొటోపై డబ్బులు పెడితే, పత్తాలను తీస్తారు. ఆ పత్తాల్లో సదరు హీరోయిన్ ఫోటో ఉంటే, పెట్టిన వ్యక్తికి రెండింతలు డబ్బులు ఇస్తారు. ఇలా వందలాది మంది ఈ పేకాట ఆడుతూ తమ డబ్బులను కోల్పోతున్నారు. ప్రతీ సంతలో ఈ ఆటపై రూ.2 నుంచి రూ.5లక్షల వరకు కోల్పోతున్నారని తెలిసింది. బాన్సువాడ, పిట్లం, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్ వారాంతపు సంతల్లో ఈ పేకాట కొనసాగుతోంది. బహిరంగంగా పేకాడుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బాన్సువాడ, బిచ్కుంద సర్కిళ్లలో..
కొన్ని రోజులుగా బాన్సువాడ ప్రాంతంలో పేకాట జోరుగా సాగుతోంది. పేకాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ యంత్రాంగం హెచ్చరించినా, బాన్సువాడ, బిచ్కుంద సర్కిళ్లలో జోరుగా పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో పేకాడుతున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ దాడులు చేయకుండా వదిలేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు పట్టించుకోకపోవడంతోనే పేకాట యథేచ్ఛగా కొసాగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
పలుచోట్ల పోలీసుల దాడులు..
గతంలో బాన్సువాడ పట్టణంలో ఓ మహిళ నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. అలాగే తాడ్కోల్ రోడ్డుపైన పేకాట స్థావరంపై దాడి చేసి సుమారు రూ.3 లక్షల వరకు స్వాధీనం చేసుకున్నారు. అయినా పేకాటరాయుళ్లలో మార్పు రావడం లేదు. వర్ని, బీర్కూర్, కోటగిరి, బాన్సువాడ ప్రాంతాల్లో కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు పేకాట ఆడిస్తున్నట్లు ప్రచారం ఉంది. బాన్సువాడ శివారులోని తాడ్కోల్, బోర్లం, ఇస్లాంపుర, రాజారాం దుబ్బ ప్రాంతాల్లో నిరంతరం పేకాట ఆడుతున్నారు. వీరు ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసుకొని పేకాడుతుండగా, పోలీసులు రాకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. గతేడాది క్రితం పేకాట జోరుగా సాగగా, లక్షలాది రూపాయలు చేతులు మారాయి.
రాజకీయ పలుకుబడితో..
గతంలో బీర్కూర్ మండలంలో పేకాట ఆడుతున్నవారిపై ఎస్పీ ప్రత్యేకంగా దాడులు నిర్వహించి పేకాటకు పూర్తిగా అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతం మళ్లీ పేకాట ఆడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాజకీయ పలుకుబడితో పేకాటను కొనసాగిస్తున్నారు. మరోవైపు బిచ్కుంద సర్కిల్ పరిధిలోనూ పేకాట ఆడుతున్న వారు అధికంగా ఉన్నారని తెలిసింది. వీరు ఎక్కువగా పొలాల్లో ఆడుతున్నట్లు సమాచారం.
దెగ్లూర్ నుంచి వచ్చి.. మట్కా నంబర్లు తెచ్చి..
సరిహద్దు మండలాల్లో మట్కా కూడా విస్తరిస్తోంది. మహారాష్ట్రలోని దెగ్లూర్ నుంచి పలువురు ఏజెంట్లు వచ్చి మట్కా నంబర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మట్కా నిర్వాహకులు కొందరు ఏజెంట్లను నియమించి బాన్సువాడ ప్రాంతానికి పంపుతున్నారు. వీరు మట్కా నంబర్లను విక్రయించి, సెల్‌ఫోన్లపై నంబర్లును వెల్లడిస్తూ మట్కాను విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో రైతులకు డబ్బులు రావడంతో వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు మట్కాను కొనసాగిస్తున్నట్లు సమాచారం.
సమాచారం అందిస్తే చర్యలు
పేకాట, మట్కా నిర్వాహకుల పై చర్యలు తప్పవు. ఎవరికైనా సమాచారం లభిస్తే వెంటనే పోలీసులకు చేరవేయాలి. దాడులు చేసి పట్టుకుంటాం. పేకాట, మట్కాపై ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం.
– నర్సింహారావు, డీఎస్పీ, బాన్సువాడ
Advertisement