పోలీసులకు సవాల్‌ విసిరిన పేకాట రాయుళ్లు.. | Gamblers Challenge To Police In West Godavari | Sakshi
Sakshi News home page

ముప్పేట దాడి చేస్తున్నా కానీ..!

Published Thu, Sep 5 2019 11:10 AM | Last Updated on Thu, Sep 5 2019 11:13 AM

Gamblers Challenge To Police In West Godavari - Sakshi

టౌన్‌హాలు వద్ద బుధవారం మోహరించిన పోలీసులు

మా భర్తలు ఉదయాన్నే పని ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ఎప్పుడో అర్ధరాత్రి వస్తున్నారు. 24 గంటలూ క్లబ్బుల్లోనే ఉండి మద్యం సేవిస్తూ.. పేకాటలోనే నిమగ్నమవుతున్నారు. ఉన్న ఆస్తులను తగలేస్తున్నారు. ఇంటి వ్యవహారాలు అసలు పట్టించుకోవడం లేదు. అత్యవసరమై ఫోన్‌ చేసినా స్పందించడం లేదు. పేకాట స్థావరాలను మూయించండి.
– ఇదీ ఇటీవల కొందరు మహిళలు జిల్లా పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి వెళ్లబోసుకున్న గోడు 

సాక్షి, పాలకొల్లు సెంట్రల్‌/భీమవరం: క్లబ్‌లు, టౌన్‌హాళ్లలోని పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో జూదరులు రూటుమార్చారు. పేరొందిన హోటళ్లు, ధనికులు నివాసముండే ప్రాంతాలను ఎంచుకుని జోరుగా పేకాట శిబిరాలు సాగిస్తున్నారు. పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల తదితర ప్రాంతాల్లో యూత్‌క్లబ్‌లు, కాస్మోక్లబ్‌లు, టౌన్‌హాళ్లు ఉన్నాయి. వీటిలో ఎంతోకాలంగా పేకాట ఆడడం సహజంగా మారిపోయింది. ఎస్పీగా నవదీప్‌సింగ్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో క్లబ్‌లపై దృష్టిసారించారు. దీంతో ఉద్యోగ విరమణ చేసిన వారు, కొంతమంది రాజకీయ నాయకులు, ధనికులు పెద్ద మొత్తంలో పేకాట ఆడే  క్లబ్‌లు కొన్ని నెలలుగా దాదాపు మూతపడ్డాయి. పోలీసులు నిత్యం దాడులు చేస్తూ పేకాటను దాదాపుగా అరికట్టారనే చెప్పాలి. అయితే పేకాట ఆడడమే నిత్యకృత్యంగా మారిన వారు దానిని మానలేక కొత్తకొత్త స్థావరాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు.

కొంతకాలం పొరుగు రాష్ట్రాలకు వెళ్లినా.. 
పోలీసుల దాడులతో బెంబేలెత్తిన జూదరులు కొంతకాలం యానాం, ఖమ్మం, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు వెళ్లి పేకాట ఆడినా.. ఇటీవల మళ్లీ రూటు మార్చి జిల్లాలోని పట్టణాల్లోనే ప్రత్యేక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. భీమవరం పట్టణంలో  పేరొందిన హోటళ్లు, లాడ్జిల్లోనే పెద్ద ఎత్తున జూదం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ హోటళ్లలో అయితే పోలీసు  దాడులుండవనే భావనతోనే వీటిని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ సమాచారం మేరకు ఇటీవల భీమవరంలోని పలు హోటళ్లల్లో పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చేసి వారినుంచి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా అనేక చోట్ల పేకాట స్థావరాలు నడుస్తున్నాయని తెలుస్తోంది. అలాగే ధనికులు నివాసం ఉండే ప్రాంతాల్లోని ఖాళీగా ఉన్న విశాలమైన గృహాలను ఆఫీసు కార్యకలపాలంటూ అద్దెకు తీసుకుని వాటిలో గుట్టుచప్పుడు కాకుండా పేకాడుతున్నట్టు సమాచారం.

పట్టుబడుతున్నది యువకులే! 
పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్నది అధికంగా యువకులేనని పోలీసులు చెబుతున్నారు. బడాబాబులూ పట్టుబడుతున్నా.. వారిని పోలీసులు తప్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  కొంతమంది పోలీసు సిబ్బంది జూదరులకు సహకరిస్తూ దాడుల్లో జరిగే అవకాశం ఉంటే ముందుగా వారికి ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. పోలీసు శాఖ మరింత పకడ్బందీగా ముందుకెళ్తే పేకాటను పూర్తిగా అరికట్టవచ్చని, అయితే స్థానిక పోలీసు సిబ్బందితో కాకుండా పొరుగు స్టేషన్ల సిబ్బందితో దాడులు చేయిస్తే ప్రయోజనం ఉంటుందనే వాదన వినబడుతోంది.

పాలకొల్లులో పోలీసులకే సవాల్‌!
పాలకొల్లు టౌన్‌ హాలులో మంగళవారం పోలీసులు దాడి చేసి 16 మంది జూదరులను అరెస్ట్‌ చేశారు. గతంలో చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసినా క్లబ్‌ సభ్యులు వినకపోవడంతో ఆఖరికి పోలీసులు దాడులు చేసినట్టు తెలుస్తోంది. దాడి చేసిన సమయంలో కొందరు జూదరులు గోడ దూకి పారిపోయారు. కొందరు పోలీసులను చూసినా కోతాట ఆడుతూనే ఉన్నారు. క్లబ్‌ సభ్యులు కొందరు తమకు కోర్టు అనుమతి ఉంది.. ఆడే దమ్ముంది.. మీకు ఆపే దమ్ముంటే ఆపుకోవచ్చని పోలీసులకు సవాల్‌ విసిరినట్టు సమాచారం. ఈ విషయం ఎస్పీ నవదీప్‌సింగ్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్‌ అయ్యారు. టౌన్‌ హాలు వద్ద బుధవారం కూడా భారీగా పోలీసులను మోహరించారు. బుధవారం సాయంత్రం కొందరు సభ్యులు టౌన్‌హాల్‌ వద్దకు కార్లలో రావడంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేకించి కార్లలో ఇక్కడకు ఎందుకు వచ్చారో తెలుసుకుంటామని, వారు సరైన వివరాలు ఇస్తే వారి అడ్రస్‌లు తీసుకుని విడుదల చేస్తామని సీఐ ఆంజనేయులు తెలిపారు.

కాయిన్లతో ఆట 
జిల్లాలోని క్లబ్బుల్లో నగదు ప్రత్యక్షంగా టేబుల్‌పై పెట్టకుండా అక్కడ ఉండే కౌంటర్లలో నగదు చెల్లించి దానికి సరిపడా కాయిన్లు తీసుకుంటారు. వాటితోనే ఆట కొనసాగిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement