‘పుంజు’కుంటున్న పందేలు!
గోదావరి జిల్లాల్లో భారీ స్థాయిలో కోడి పందేలకు రంగం సిద్ధం
చేతులు మారనున్న రూ.300 కోట్లు
పోలీసు అధికారుల హెచ్చరికలు బేఖాతరు
చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముగ్గులద్దుకున్న ముంగిళ్లు.. అందులో కొలువుదీరిన గొబ్బిళ్లు.. భోగి మంటలు.. గంగిరెద్దు విన్యాసాలు.. కొత్త అల్లుళ్ల సందళ్లు.. సంక్రాంతి అంటే ఇంతే కాదు.. గోదావరి జిల్లాల్లో కోడి పందేలు కూడా! ఎప్పట్లాగే ఈసారి కూడా పందెం బరులు సిద్ధమవుతున్నాయి. కోట్ల రూపాయలు కుమ్మరించేందుకు పందెంరాయుళ్లూ రెడీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, విపక్షాలకు చెందిన నాయకులు ఈ పందేలపై ప్రత్యేక దృష్టి సారించారు. ‘‘మీ వెనుక మేమున్నాం.. ఏర్పాట్లు చేసుకోండి’’ అంటూ నేతలు ఇస్తున్న భరోసాతో పందేల నిర్వాహకులు ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ.300 కోట్ల మేర పందేలు జరుగుతాయని అంచనా. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే రూ.200 కోట్లు చేతులు మారుతాయంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం నుంచి సుమారు 400 పందెం కోళ్లను భీమవరం పరిసర ప్రాంతాలకు తీసుకుపోయి సాధన చేయిస్తున్నట్టు సమాచారం. ఈ పందేలను చూసేందుకు సామాన్యుల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు పెద్దఎత్తున తరలిరానున్నారు. నర్సాపురం ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు స్వగ్రామమైన ఆకివీడు మండలం ఐ.భీమవరంలో పందేలు కోట్లలో జరుగుతాయి. పండుగ మూడ్రోజులు ఈ ఒక్క గ్రామంలోనే సుమారు రూ.70 కోట్లు చేతులు మారతాయని అంచనా. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గోడి, ఐ.పోలవరం మండలం కేశనకుర్రు, ఆత్రేయపురం, మెట్ట ప్రాంతంలోని జగ్గంపేట, కిర్లంపూడి ప్రాంతాల్లో కూడా కోట్లలో పందేలు జరుగుతాయి. పశ్చిమ గోదావరిలో భీమవరం పరిసర ప్రాంతాలతో పాటు నర్సాపురం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో 30 నుంచి 40 చోట్ల, తూర్పుగోదావరిలో కోనసీమతో పాటు మెట్టలోని జగ్గంపేట తదితర ప్రాంతాల్లో 30 చోట్ల పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పందేల కోసం రానున్న రాజకీయ, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు భీమవరం, అమలాపురం పరిసర ప్రాంతాల్లో నాలుగు నెలల క్రితమే హోటళ్లలో గదులను బుక్ చేసుకున్నారు.
పోలీసులది ప్రేక్షక పాత్రేనా?
పందేలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు. ఏలూరు రేంజి డీ ఐజీ విక్రమ్‌మాన్‌సింగ్ పందేలకు అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించినా.. బరులు ఎప్పట్లాగే సిద్ధమవుతుండడం గమనార్హం.
2 నిమిషాల పందేనికి నాలుగేళ్ల రాజభోగం..
పందేల్లో ప్రధానంగా డేగ, నెమలి, కాకి, నెమలి కాకి, పర్ల వంటి 28 రకాల జాతుల కోళ్లకు డిమాండ్ ఎక్కువ. పుంజును బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ధరలున్నాయి. రెండు నిమిషాలపాటు పందెంలో పోరాడే కోడిపుంజుకు నాలుగేళ్లపాటు రాజభోగాలు కల్పిస్తారు. సంక్రాంతికి ఆరు నెలల ముందు నుంచే వీటికి సైనికుల మాదిరి కఠిన శిక్షణనిస్తారు. పండుగకు నెలరోజుల ముందు వరకు కోడిగుడ్లు, చోళ్లు, వడ్లు మాత్రమే ఆహారంగా అందిస్తారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా బాదంపప్పు, జీడిపప్పు, గంట్లు, ధాన్యం మిశ్రమాల ఆహారాన్ని పెడతారు. మటన్ ఖైమాను గానుగ నూనెలో వేయించి అందిస్తారు. పౌరుషాన్ని పెంచేందుకు ఉల్లి రసాన్ని పట్టిస్తారు. కొంతమంది తొండమాంసాన్ని సైతం ఆహారంగా పెడతారు.ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తారు. ఈత కొట్టించడంతోపాటు నాలుగు రోజులకోసారి వేడినీళ్లతో స్నానం చేయిస్తారు. కోళ్లకు తర్ఫీదునిచ్చేందుకు ప్రత్యేక శిక్షకులను ఏర్పాటు చేస్తారు. వీరికి నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు జీతాలు ఉంటాయి.