ఏసీబీ వలలో ఎస్‌ఐ
- కోడిపందేల నిర్వహణకు రూ.25 వేలకు డీల్
- రెండో విడత రూ.10 వేలు తీసుకుంటుండగా దాడి
ఆగిరిపల్లి, న్యూస్‌లైన్ : ఆగిరిపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ తాటిపాక చంద్రశేఖర్ సోమవారం ఏసీబీ వలలో చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని కలటూరుకు చెందిన జాలిపర్తి ఎస్.రామకృష్ణ సంక్రాంతి పండగకు కోడిపందేలు నిర్వహించుకోవడానికి ఎటువంటి కేసులూ లేకుండా అనుమతులు ఇవ్వాల్సిందిగా ఎస్‌ఐని అడిగారు. రూ.25 వేలు ఇస్తే కేసులు పెట్టకుండా వదిలేస్తానని ఎస్‌ఐ డిమాండ్ చేశారు.
ఈ నెల 14న రామకృష్ణ చివరకు రూ.10 వేల నగదు ఎస్‌ఐకి ఇచ్చారు. రామకృష్ణ బృందం కోడిపందేలను 14, 15 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించారు. ఈ క్రమంలో 19న ఎస్‌ఐ రామకృష్ణను పిలిపించి నువ్వు పెద్దఎత్తున కోడిపందేలు నిర్వహించావు.. మరో రూ.15 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. నగదు ఇవ్వని పక్షంలో మీ గ్రామానికి చెందిన వారిపై కేసులు ఎలా పెట్టానో నీ మీద అలా కేసులు పెడతానంటూ బెదిరించారు. అదేరోజు సాయంత్రం రామకృష్ణ విజయవాడ ఏసీబీ అధికారులకు ఉప్పందించారు.
ఈ నేపథ్యంలో ఎస్‌ఐకి, రామకృష్ణకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. అనంతరం సోమవారం సాయంత్రం ఆరు గంటలకు పోలీస్‌స్టేషన్ ఆవరణలో రామకృష్ణ రూ.10 వేల నగదు ఇవ్వగా దాడి చేసి పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ ఆర్.విజయ్‌పాల్ తెలిపారు. రాజమండ్రిలోని ఎస్‌ఐ నివాసంలో కూడా అక్రమ ఆదాయంపై తనిఖీలు నిర్వహించనున్నట్లు విలేకర్లకు తెలిపారు. ఏ ప్రభుత్వాధికారైనా లంచానికి డిమాండ్ చేస్తే 9440446164, 9440446169, 9440446133, 9440446167 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు.