Agiripalli
-
విషాదం: అదృశ్యమైన చిన్నారులు చెరువులో శవాలై..
అప్పటివరకూ బుడిబుడి అడుగులతో కళకళలాడిన ఆ ఇళ్లు బోసిపోయాయి. ముద్దులొలికే చిన్ని నవ్వులు ‘అదృశ్య’మయ్యాయి. ఏమైందో అర్థంకాని తల్లి మనసులు తల్లడిల్లాయి. కూలీనాలీ చేసుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు చెంగుచెంగున గెంతుతూ అమ్మా అంటూ ఒడి చేరతారని ఆశపడ్డాయి.. భర్తలు దూరంగా ఉంటున్నా బిడ్డలే సర్వస్వంగా భావించి బతుకులీడుస్తున్న ఆ మాతృమూర్తుల గుండెలను అంతలోనే పిడుగులాంటి వార్త పిండేసింది. కన్నీరుమున్నీరు చేసింది. ముగ్గురు పిల్లల దుర్మరణంతో ఈదర గ్రామం గుండె చెరువయ్యేలా రోధించింది. శోకసముద్రంలో మునిగిపోయింది. ఈదర(ఆగిరిపల్లి): ఈదరకు చెందిన కగ్గా జ్యోతి భర్తతో విడిపోయింది. రెండేళ్లుగా తన ఇద్దరు ఆడపిల్లలు శశిక(11), చంద్రిక(9)లే ప్రాణంగా జీవిస్తోంది. కూలీనాలీ చేసుకుని వారిని పెంచుకుంటోంది. సోమవారం జ్యోతి కూలి పనికి వెళ్లింది. మధ్యాహ్న సమయంలో జ్యోతి పని చేసే మేస్త్రీకి ఆమె అక్క ఫోన్ చేసి పిల్లలు కనబడటం లేదని చెప్పింది. దీంతో పని నుంచి ఇంటికి వచ్చిన ఆమె పిల్లల కోసం ఊరంతా వెతికింది. వీరితోపాటు సమీప బంధువు గండికోట పంగిడమ్మ కుమారుడు జగదీష్ (8) కూడా కనిపించలేదు. దీంతో బంధువుల సాయంతో పిల్లల కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో జ్యోతి ముగ్గురు పిల్లలు కనిపించడం లేదని పోలీసులకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేసింది. పోలీసులు నూజీవీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు పర్యవేక్షణలో ఆరు బృందాలుగా ఏర్పడి హనుమాన్ జంక్షన్ సీఐ కె.సతీశ్ ఆగిరిపల్లి ఎస్ఐ చంటిబాబు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం శోభనాపురం అల్లూరమ్మ చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలను ఓ రైతు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పిల్లల మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆడుకుంటూనే వెళ్లి.. శశిక, చంద్రిక, జగదీష్ ముగ్గురూ జ్యోతి ఇంటి ముందు సోమవారం మధ్యాహ్నం ఆడుకున్నారు. ఈదర గ్రామం నుంచి బొద్దనపల్లి ఆర్సీఎం చర్చి మీదుగా వారు ఆడుకుంటూ వెళ్లడాన్ని కొందరు గ్రామస్తులు చూశారు. ఆ తర్వాత వీరు శోభనాపురం అల్లూరమ్మ చెరువు వైపు వెళ్లి స్నానం చేసేందుకు చెరువులోకి దిగి మరణించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. చెరువులో ముందుగా శశిక, చంద్రిక మృతదేహాలు లభ్యం కాగా, మరి కొంత దూరంలో జగదీష్ మృతదేహం లభ్యమైంది. ప్రమాద స్థలాన్ని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, హనుమాన్‌జంక్షన్ సీఐ కె.సతీశ్, తహసీల్దార్ వీవీ భరత్‌రెడ్డి పరిశీలించారు. ఆ తల్లులకు పిల్లలే సర్వస్వం శశిక, చంద్రిక తల్లిదండ్రులు, గండికోట జగదీష్ తల్లిదండ్రులు విడిపోవడంతో ముగ్గురు పిల్లలు వారి తల్లుల వద్దే ఉంటున్నారు. ముగ్గురూ బొద్దనపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. తల్లులిద్దరూ బిడ్డలనే సర్వస్వంగా భావిస్తున్నారు. కూలి పనులు చేసుకుని వారిని చదివించుకుంటున్నారు. పిల్లల మృతితో గుండెలవిసేలా రోధిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావట్లేదు. చదవండి: కోడలిని వేధించిన పాపం..! -
కలకలం : స్కూల్ ఎదుటే బాలిక కిడ్నాప్
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. ఆగిరిపల్లి ఎస్వీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి లీలా ప్రసాద్‌ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. స్కూల్ బయటకు వచ్చిన బాలికను బైక్‌పై వచ్చిన దుండగులు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
శుభాలనిచ్చే శోభనాచలుడు
పుణ్యతీర్థం దక్షిణ హిందూ దేవాలయాల్లో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం ఆగిరిపల్లి శోభనాచలం. కృష్ణాజిల్లా విజయవాడ–నూజివీడు మధ్యలో ఉన్న ఈ ప్రాచీన దివ్యక్షేత్రాన్ని దర్శించి భక్తులు ఆధ్యాత్మిక పరవశానికి లోనవుతూ ఉంటారు. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి ఆశ్రయించిన భక్తుల కోర్కెలు తీర్చే దేవదేవుడు. ఇది శివకేశవ క్షేత్రం కూడా. ఇక్కడి స్వయంభువుగా వెలసిన శ్రీ వ్యాఘ్ర లక్ష్మీ నృసింహుణ్ణీ, చేరువనే వెలసిన పరమశివుణ్ణీ దర్శించి జన్మధన్యంగా భావించే భక్తులు ఎందరో. మాఘమాసంలో ఇక్కడి పుష్కరిణిలో స్నానమాచరించి, శోభనాచలుని దర్శించుకోవాలని భక్తులు తహతహలాడుతుంటారు. ఇటీవల రథసప్తమి సందర్భంగా జరిగిన ఉత్సవాలలో భక్తులు అసంఖ్యాకంగా పాల్గొని స్వామిని సేవించుకున్నారు. స్థల ప్రాశస్థ్యం బ్రహ్మాండ పురాణంలో ఆగిరిపల్లి దేవాలయ స్థల ప్రాశస్థ్యం ఉంది. దానిప్రకారం కృతయుగాన శుభవ్రతుడనే రాజు శ్రీమహావిష్ణువు గురించి చాలాకాలం తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ‘నేను పర్వతాకారం పొందుతాను. మీరు లక్ష్మీసమేతులై నా యందు వేంచేసి ఉండాలి’ అని శుభవ్రతుడు కోరుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ‘పరమేశ్వరుని కూడా ప్రార్థించు. ఉభయులం వస్తాం’ అని చెప్పాడు. దాంతో ఆ రాజు పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేసి ఆయన అనుగ్రహమూ పొందాడు. తత్ఫలితంగా శివ పరమేశ్వరులిరువురూ ఈ క్షేత్రంలో వెలసి పూజలందుకుంటున్నారు. శుభవ్రతుడు తన తపస్సుతో పర్వతాకారం పొందాడు కాబట్టి ఈ కొండ శోభనగిరిగా ప్రసిద్ధికెక్కింది. ఈ పర్వతానికి పశ్చిమాన ఉన్న కొలనుకు ‘వరాహ పుష్కరిణి’ అని పేరు. వరాహావతార ఘట్టంలో శ్రీ స్వామివారిచే ఇది నిర్మించబడిందని ప్రతీతి. ‘కిరి’(వరాహం)చే నిర్మించబడిన కొలను గల పల్లె కాబట్టి శోభనగిరికి దక్షిణంగా ఉన్న గ్రామం ‘ఆకిరిపల్లి’ కాలక్రమేణ ‘ఆగిరిపల్లి’ అయిందని అంటారు. మరో కథనం పూర్వం శివకేశవులు ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పరుచుకోవాలని ప్రయాణం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు విష్ణుమూర్తి ‘నేను ఇక్కడ నీటి వసతి ఏర్పాటు చేస్తాను. నివసించడానికి అనువుగా ఉండే పర్వతం చూడమని శివుణ్ణి పంపాడు. శివుడు అన్ని పర్వతాలు చూసి వాటన్నింటిలో శోభనగిరి పర్వత సౌందర్య పర్వతానికి ముగ్ధుడై విష్ణుమూర్తికి ఈ కబురు చెప్పకనే అక్కడే ఉండిపోయాడు. ఈలోపు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి కొలను నిర్మించాడు. కాని శివుడు ఎంతకూ రాకపోవడంతో వెదుకుతూ వచ్చి శివుడు స్థావరం ఏర్పరుచుకోవడం చూసి అక్కడ నుంచి ఒక్క గంతు వేయగా రాతిమీద పాదముద్రలు పడ్డాయి. అక్కడ విష్ణువు వ్యాఘ్రస్వరూపుడై వెలిశాడు. పూజలు ప్రారంభమైంది ఇలా క్రీ.శ.17వ శతాబ్ది ప్రారంభంలో అచ్యుత భాగవతి, అనంత భాగవతి అనే పరమ భక్తులు ఉండేవారు. ఒకరోజు పరమేశ్వరుడు వీరిరువురికీ కలలో కనబడి శివకేశవులం ఇక్కడ వెలసి ఉన్నామని, తమకు పూజాదికాలు ఒనర్చాలని కోరాడు. మరునాడు వీరిరువురూ తమ స్వప్న వృత్తాంతం గ్రామస్తులకు చెప్పగా అందరూ దేవాలయ నిర్మాణానికి కావలసిన స్థలం చూసేందుకు బయలుదేరారు. అంతా అరణ్య ప్రాంతం కావడం, భక్తులు తనను గుర్తించలేకపోవడం చూసిన పరమేశ్వరుడు తంగేడు, ఇతర పూలను బారులు తీర్చి తాము ఉన్న ప్రదేశాన్ని గుర్తించేటట్టు చేశాడు. దాంతో అందరూ శోభనగిరి శిఖరం మీద వ్యాఘ్రలక్ష్మీ నరసింహ స్వరూపంలో విష్ణుమూర్తిని, చేరువలో నీలగళుని ఆకారంలో పరమశివుణ్ణి చూశారు. వెంటనే స్వామికి అభిషేకం చేద్దామని నీటి కోసం వెతకగా కొలను కనిపించింది. ఆ నీటిని తీసుకువచ్చి అభిషేకం చేసి సంతృప్తులయ్యారు. తర్వాత అచ్యుత, అనంత భాగవతులు శ్రీ స్వామివారికి ఆలయం నిర్మించి ఉత్సవాలు చేయడం ప్రారంభించారు. శ్రీ శోభనాచలస్వామికి జరిపే ఉత్సవాలు చూసి కొండపల్లి ఫిర్కా ముజుందారు ఇందుపూడి లక్ష్మీనారాయణరావు సంతోషించి ఈ అగ్రహారాన్ని భగవత్ కైంకర్యంగా ఇచ్చారని శాసనాల ద్వారా తెలుస్తోంది. నూజివీడు జమీందార్ల సేవ క్రీ.శ.1800 నుంచి క్రీ.శ.1804వరకు నూజివీడు ప్రభువులుగా ఉన్న శ్రీ రాజా రామచంద్ర అప్పారావు బహద్దూర్ ఈ క్షేత్రానికి ధర్మకర్తలుగా వ్యవహరించారు. అప్పటి నుంచి నూజివీడు జమీందార్లే శ్రీ స్వామివారి కైంకర్యాలను వైభవంగా జరిపిస్తూ వస్తున్నారు. క్రీ.శ. 1890 ప్రాంతంలో దేవులపల్లి వెంకటనర్సయ్య కొందిగువన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆలయాన్ని కూడా కట్టించారు. శనివారపుపేట ఎస్టేటు జమిందారిణి శ్రీ రాజా పాపయ్యమ్మారావు బహద్దూర్ వరాహ పుష్కరిణికి మెట్లు కట్టించి మంటపాన్ని నిర్మించారు. నయనానందకరంగా నాలుగు మంటపాలు తేలప్రోలు ఎస్టేటు జమీందారు రాజా శోభనాద్రి అప్పారావు 1856లో శ్రీ స్వామివారికి కల్యాణ మంటపాన్ని (కొఠాయి) గ్రామం మధ్యలో నిర్మించారు. అతి విశాలమైన ఈ మంటపంలో కల్యాణోత్సవాలు కడువైభవంగా జరుగుతాయి. అలాగే గ్రామంలో మరో మూడు వీధులలో నిర్మించిన ప్రాచీన మంటపాలు మూడు ఉన్నాయి. వీటిలో ఆయా పర్వదినాలలో స్వామివారి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. – నల్లాన్ చక్రవర్తుల సతీశ్ కుమార్ ఫొటోలు: ఎ.చంద్రశేఖర్, సాక్షి నూజివీడు ఆగిరిపల్లి దివ్యక్షే్రత్రానికి వెళ్లే మార్గం విజయవాడ నుంచి నూజివీడు వెళ్లే రోడ్డు మార్గం–30 కి.మీ నూజివీడు నుంచి రోడ్డుమార్గం–12 కి.మీ గన్నవరం నుంచి రోడ్డు మార్గం–17 కి.మీ హనుమాన్ జంక్షన్ నుంచి రోడ్డుమార్గం–20 కి.మీ -
‘ఈ–పోస్’ పనితీరును పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ బృందం
ఆగిరిపల్లి : మండల కేంద్రమైన ఆగిరిపల్లిలో ఈ–పోస్ మిషన్ల పనితీరును ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు బుధవారం పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గౌసియాబేగం, తహసీల్దార్ సీహెచ్ ఉమామహేశ్వరరావును పింఛన్ల పంపిణీ చేసే విధానం, ఎన్ఆర్ఈజీఎస్ అమలు జరుగుతున్న తీరు, రేషన్ పంపిణీ విధానం, ఎరువుల దుకాణాల్లో పంపిణీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సత్రం సెంటర్లో గల ఎరువుల దుకాణంలో ఈ–పోస్ విధానం ద్వారా ఎరువుల పంపిణీని దుకాణదారుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు సునీతచోప్రా, వసుమతి, మండల వ్యవసాయ విస్తరణ అధికారిణి బి.త్రివేణి, ఏపీవో రాజు, తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మట్టిమాఫియా బరితెగింపు
‘ పచ్చ’ నేతల దోపిడీ మౌనంగా అధికారులు నూజివీడు: టీడీపీ ప్రభుత్వ హయాంలో మాఫియాలు పేట్రేగిపోతున్నాయి. ‘పచ్చ పార్టీ’ అండదండలతో కొంతమంది మాఫియాగా ఏర్పడి ప్రభుత్వ సంపదను దోచుకుంటున్నారు. ఇసుక, మట్టి, కాల్‌మనీ.. ఇలా అనేక మాఫియాలు నిరంతరం దోపిడీనే పనిగా పెట్టుకున్నాయి. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం సూరవరం వద్ద పోలవరం మట్టిని మాఫియా పట్టపగలు యథేచ్ఛగా తరలిస్తోంది. లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టి పోలవరం కుడికాలువ కట్టలపై ఉండకుండా రాత్రిపగలు అనే బేధం లేకుండా తరలిస్తున్నారు. అధికార బలంతోనే.. అధికార బలంతో మట్టి తరలిపోతుండటంతో అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. సూరవరం వద్ద పోలవరం కాలువ వెంబడి ఉన్న మట్టిని మాఫియాదారులు పామర్రు మండలం నిమ్మకూరుకు తరలిస్తున్నారు. అడిగేవారే లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పదుల సంఖ్యలో టిప్పర్లను ఒకేసారి ఏర్పాటు చేసి మట్టిని తరలించేస్తున్నారు. పేదలకో న్యాయం.. ఎవరైనా పేదవాడు అవసరమై ఒక ట్రక్కు ఇసుక గాని, మట్టిగాని తెచ్చుకుంటుంటే వీఆర్వోలు, పోలీసులు వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారే గాని సహజ సంపద అయిన మట్టిని అడ్డగోలుగా దోచుకుంటున్నప్పటికీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇంతభారీగా పోలవరం కాలువ మట్టిని తరలిస్తుండటంతో పలువురు గ్రామస్తులు లారీలను ఆపి ఎక్కడకు వెళ్తోందని అడిగితే నిమ్మకూరులోని ఎన్టీఆర్ బంధువులకు అని డ్రైవర్లు చెబుతున్నారు. టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు.. ఆగిరిపల్లి మండలం కొత్త సూరవరానికి చెందిన గ్రామస్థులు టిప్పర్లను నిలిపి, మట్టిని తరలించడానికి అనుమతులు ఉన్నాయా, లేవా, లేకుండా ఎందుకు తోలుతున్నారంటూ బుధవారం డ్రైవర్లను నిలదీశారు. అయినప్పటికీ డ్రైవర్ల వినకుండా తోలుతుండటంతో ఆగిరిపల్లి ఎస్ఐకు సమాచారమందించారు. దీంతో ఎస్ఐ తన సిబ్బందిని పంపించి తోలకాలను నిలిపివేయించారు. మొదటి నుంచి అంతే.. గతేడాది కాలం నుంచి పోలవరం కుడికాలువ మట్టిని తరలించేస్తున్నారు. కొత్తగా తవ్విన కాలువకు సంబంధించి 10 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వగా అందులో దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించేశారు. వైఎస్ హయాంలో కాలువను 80 శాతం వరకు తవ్వగా అప్పట్లో వచ్చిన మట్టి అంతా నేటికీ కాలువ వెంబడి పెద్దపెద్ద గుట్టలుగా అలాగే ఉంది. గతేడాది నూతనంగా తవ్విన ప్రాంతంలో మాత్రం ఒక్క ట్రక్కు మట్టికూడా లేదు. దీనిని బట్టే మట్టిదోపిడీ ఎలా సాగుతుందో చెప్పవచ్చు. మట్టితోలకాలపై ఎస్ఐ రాజేందరప్రసాద్ను వివరణ కోరగా పోలవరం కాలువకు సంబంధించిన అధికారులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని చెప్పారు. -
సర్కారు తోడుగా.. రెచ్చిపోతున్నారు
సాక్షి, విజయవాడ: అధికారమదంతో తెలుగు తమ్ముళ్ల దాష్టీకాలు పెచ్చుమీరుతున్నాయి. పచ్చచొక్కా నేతలు చేస్తున్న అక్రమ దందాలు, అడ్డగోలు వ్యవహారాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ విప్ నుంచి కిందిస్థాయి టీడీపీ కార్యకర్త వరకు అధికారులు, పోలీసులపై దాడులకు దిగుతున్నారు. అసభ్య పదజాలంతో తిడుతున్నారు. కొన్నిసార్లు పోలీసులపైనే దాడిచేసినప్పటికీ వారు కేసులు నమోదు చేయలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ కేసులు నమోదు చేసినా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో నిందితులు క్షణాల్లో బయటపడుతున్నారు. తాజాగా సోమవారం కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో నడిరోడ్డు మీద కానిస్టేబుళ్లపై టీడీపీ కార్యకర్తల దాడి చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తోందని, ప్రభుత్వోద్యోగులపై దాడులకు దిగుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను వదిలిపెడుతోందని అధికారులు, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇవీ సంఘటనలు విజయవాడలో సోమవారం టీడీపీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ జి.హరిబాబు, అనుచరుడు శ్రీనివాస్‌తో కలసి ప్రకాశం బ్యారేజీ సమీపంలో ఘాట్‌రోడ్డు నుంచి కుమ్మరిపాలెంవైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ రహదారిలో ఫ్లైఓవర్ పనులు జరుగుతుండడంతో అటువైపు రాకపోకలు నిషేధించారంటూ వారిని హోంగార్డు నాగరాజు ఆపా రు. ఎస్ఐ అనుమతి తీసుకునివెళ్లాలని సూచించడంతో పట్టరాని కోపంతో హరిబాబు, శ్రీనివాస్‌లు నాగరాజును తీవ్రంగా కొట్టారు. అడ్డుకోవడానికి వచ్చిన కానిస్టేబుల్ రామకృష్ణను తోసేసి దౌర్జన్యం చేశారు. అనంతరం విజయవాడ వన్‌టౌన్ పోలీసు లు హరిబాబును స్టేషన్‌కు తీసుకురాగా.. అతన్ని అరెస్టు చేయొద్దంటూ టీడీపీ నాయకులు, మంత్రుల నుంచి పోలీసులకు ఫోన్ ద్వారా ఒత్తిళ్లు పెరిగాయి. చివరకు బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్టు చేసి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఇదే రోజు ఆగిరిపల్లిలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. టీడీపీ కార్యకర్తలుగా ఉన్న రౌడీషీటర్లు పాలేటి మహేశ్వరరావు, భాటియాలు మూడ్రోజుల నుంచి స్టేషన్లో సంతకాలు చేయకుండా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆగిరిపల్లి సెంటర్లో ఎస్సై రాజేంద్రప్రసాద్ వాహనాల తనిఖీ చేస్తుం డగా వీరు వస్తున్న వాహనాన్ని ఆపి ప్రశ్నించారు. దీంతో వారు ఎస్ఐని తీవ్ర దుర్భాషలాడారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ సతీష్‌కుమార్, మరో కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. జూన్ 3న విజయవాడలోని రమేశ్ హాస్పిటల్ సెంటర్లో టీడీపీ నాయకులు ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడి దిష్టిబొమ్మ దహన చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమం చేస్తుండడంతో మాచవరం ఎస్సై కృష్ణమోహన్ అక్కడకు వచ్చారు. అదే సమయంలో దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా టీడీపీ కార్పొరేట్ సాంబశివరావుకు గాయాలయ్యాయి. మంటలు ఆర్పడానికి ప్రయత్నించిన ఎస్సైని సాం బశివరావు అనుచరుడు, రౌడీషీటర్ గన్నె హరిప్రసాద్ దూషిస్తూ ఆయన టోపీని విసిరేసి దాడికి యత్నించాడు. ఇది జరిగి నాలుగు రోజులైనా రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదుకాలేదు. అసభ్య ప్రవర్తన కేసులో కార్పొరేటర్... టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు (చంటి) గత నెలలో విమానంలో తోటి ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె కేంద్ర మంత్రి మేనకాగాంధీకి ఫిర్యాదు చేయడంతో గన్నవరం విమానాశ్రయంలో వెంకటేశ్వరరావును పోలీసులు ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఆయన్ని వదిలేశారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌లోనూ ఘటనపై కేసు నమోదైంది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి రాగా ఆరోగ్యం బాగాలేదనే సాకుతో రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి తరువాత న్యాయవాదితో సహా వెళ్లి వివరణ ఇచ్చుకున్నారు. ఈ ఘటనలోనూ అరెస్టు లేదు. ఎమ్మెల్యే చింతమనేని ఆగడాలు గతేడాది జూలై 8న తహశీల్దారు వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దాడిచేశారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ప్రశ్నించినందుకు ఆమెపై దాడికి దిగారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యోగులు ఆందోళనకు దిగినా చింతమనేనిని అరెస్టు చేయలేదు. గత నెల 23న మరోసారి చింతమనేని ప్రభాకర్ కొల్లేరు అభయారణ్యంలో నిబంధనలు అతిక్రమించి అడ్డగోలుగా రహదారిని ఏర్పాటు చేస్తున్న క్రమంలో అటవీశాఖ సహాయ కన్జర్వేటర్ వినోద్‌కుమార్‌కు ఫోన్‌చేసి బూతు పురాణం విప్పారు. మరుసటిరోజు రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి యత్నించిన అటవీ సిబ్బందిపై సమీప గ్రామస్తులతో దాడి చేయించారు. సీఎం సొంత జిల్లాలో ఖాకీలనే తరిమికొట్టారు పాకాల(తిరుపతి రూరల్): చంద్రబాబు సొంత జిల్లాలో అధికార పార్టీ నేతల పోలీసులనే తరిమికొట్టారు. మే 13సాయంత్రం పాకాలలో టీడీపీలోని రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీకే చెందిన దళిత ఎంపీపీ చాముండేశ్వరీ వర్గంపై టీడీపీ మండలాధ్యక్షుడు నాగరాజునాయుడు, తెలు గు యువత మండలాధ్యక్షుడు మాన్యం కిషోర్‌నాయుడు, మరో ఆరుగురు దాడికి పాల్పడ్డారు. ఘర్షణను అడ్డుకునేందుకు వెళ్లిన పాకాల ఏఎస్సై రవీంద్రనాయక్, శ్యామ్‌బాబు, కానిస్టేబుల్ హనీఫ్ బాషాలపై టీడీపీ నాయకులు దాడి చేశారు. కానిస్టేబుల్ హనీఫ్‌బాషా ఫిర్యాదుతో అదేరోజు సాయంత్రం నాగరాజనాయుడు, కిషోర్‌నాయుడు, మరో ఆరుగురిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. పోలీసులపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఐ చల్లనిదొర నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో ఆయనపై కక్షకట్టిన అధికారపార్టీ నేతలు పాకాల నుంచి బదిలీ చేయించారు. పోస్టింగ్ ఇవ్వకుండా అధికారులు వీఆర్‌లో ఉంచారు. ఆగిరిపల్లి ఎస్.ఐ.కు పోలీసు సంఘం నేతల పరామర్శ హనుమాన్ జంక్షన్ రూరల్: పోలీసులపై దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోలీస్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు కోరారు. పోలీస్ సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం బాపులపాడు మండలంలోని వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో దాడికి గురైన ఎస్సై రాజేంద్రప్రసాద్‌ను పరామర్శంచారు. సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు పి.ఓంకార్, ప్రధాన కార్యదర్శి డి.సుబ్రమణ్యం, జిల్లా అధ్యక్షుడు మస్తాన్ ఖాన్లు ఆయనకు నైతిక మద్దతు పలికారు. ఈఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ రాముడుకు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. హనుమాన్ జంక్షన్ సీఐ జయకుమార్, వీరవల్లి ఎస్సై పి.మురళీకృష్ణ పాల్గొన్నారు. -
పోలీసులపై తెలుగు తమ్ముళ్ల దాడి
నూజివీడు: అధికారంలో ఉన్నామనే అహంకారంతో కృష్ణాజిల్లాలో తెలుగు తమ్ముళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఆగిరిపల్లిలో పోలీసులపై దాడికి తెగబడ్డారు. టీడీపీ చెందిన రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేయాలని పోలీసులు చెప్పడంతో తమ్ముళ్లకు ఆగ్రహం వచ్చింది. ఆగిరిపల్లి ఎస్ఐ రాజేంద్రప్రసాద్ తమను స్టేషన్‌కు రమ్మంటారా అని రౌడీషీటర్లు శ్రావణ్ కుమార్, నవీన్ వీరంగం సృష్టించారు. టీడీపీ నాయకుడు పాలేటి ఉమా మహేశ్వరరావు అలియాస్ పింకీ నేతృత్వంలో 20 మంది కలిసి మారణాయుధాలతో పోలీసులపై దాడి చేశారు. ఎస్ఐ రాజేంద్రప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ సతీష్ కుమార్, కానిస్టేబుల్ వెంకటేశ్వరరావుపై నడిరోడ్డుపైనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ఆగిరిపల్లి బయల్దేరి వెళ్లారు. ఉమామహేశ్వరరావు మండవల్లిలో రౌడీషీటర్ అని, భూకబ్జాలు.. సెటిల్మెంట్లు చేసే అతడిపై చాలా కేసులు ఉన్నాయని ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. తాను వచ్చాక అడ్డుకోవడంతో తనమీద కక్ష పెంచుకున్నారని చెప్పారు. ట్రాఫిక్ పరిస్థితిని సమీక్షిస్తూ.. స్టేషన్‌కు వచ్చి వాళ్లను సమాచారం ఇవ్వాలని కోరగా, 'మేం రౌడీషీటర్లమని నువ్వెవడురా చెప్పడానికి' అంటూ బూతులు తిట్టారని, దీనిపై తాను తన ఉన్నతాధికారులకు చెప్పానని ఎస్ఐ అన్నారు. తర్వాత పాలేటి ఉమా కారులో మారణాయుధాలు తీసుకుని వచ్చి తనపై దాడికి ప్రయత్నించాడని తెలిపారు. దాడిలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయన్నారు. -
పులి కాదు...కుక్కే భయపడవద్దు
విజయవాడ: కృష్ణాజిల్లాలో పులులు సంచరిస్తున్నాయన్న వదంతులను ప్రజలు నమ్మెద్దని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. ఆగిరిపల్లి మండలం సూరవరం గ్రామంలో కొంతకాలంగా చిరుతపులి తిరుగుతుందని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు పులి సంచరించినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని చెప్పారు. కొందరు ఆకతాయిలు వీధి కుక్కకు రంగులు వేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు భయపడవద్దని అధికారులు సూచించారు. ఇలాంటి పనులు చేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కట్నం వేధింపులతో వివాహిత ఆత్మాహుతి
ఆగిరిపల్లి : కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో ఓ వివాహిత ఆత్మాహుతి యత్నం చేయగా, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విస్సన్నపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన శిలోను కుమారి(20)కి ఏడాది క్రితం వడ్లమాను గ్రామానికి చెందిన సురేష్‌తో వివాహం అయింది. వివాహ సమయంలో రూ.2 లక్షల కట్నం ఇచ్చారు. అయితే అదనపు కట్నం కోసం అత్త పార్వతి, మామ బుజ్జయ్య, సమీప బంధువు ఒకరు వేధిస్తున్నారు. దీంతో కుమారి పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం మొరపెట్టుకుంది. తామొచ్చి మాట్లాడతామని సర్ది చెప్పి కుమారిని తల్లిదండ్రులు అత్తారింటికి పంపించేశారు. ఆదివారం వడ్లమానుకు వెళ్లిన కుమారి రాత్రి సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. -
గూడెం నుంచి ఆగిరిపల్లికి తరలిపోయిన నిట్
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పెట్టాలనుకున్న 'నిట్'ను కృష్ణాజిల్లా ఆగిరిపల్లికి మార్చేశారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మార్చి 11వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలను ఏపీ ప్రభుత్వమే నిర్వహిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలుకావట్లేదని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలో రెండు రోజులు 'బడిలో బస' కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో వీడియో పాఠాలు చెప్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన సూచించారు. -
నేడు ఆగిరిపల్లి ఎంపీపీ ఎన్నిక
నూజివీడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేసిన చొప్పరమెట్ల ఎంపీటీసీ శ్రీనివాసరావు ఆకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. ఆయనను నూజివీడు పోలీసులు నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, శ్రీశైలం మొక్కు తీర్చుకునేందుకు వెళ్లానని, అయితే ఎంపీపీ ఎన్నికకు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్నందున హుటాహుటీన బయలుదేరి వచ్చినట్లు శ్రీనివాసరావు పోలీసులకు తెలిపారు. అనంతరం విచారణ నిమిత్తం అతడిని డీఎస్పీ కార్యాలయానికి తీసుకు వెళ్లారు. కాగా నిన్న నిలిచిపోయిన ఆగిరిపల్లి ఎంపీపీ ఎన్నిక నేడు జగరనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. -
ఆగిరిపల్లి ఎంపీపీ ఎన్నికను అడ్డుకునేందుకు కుట్ర
విజయవాడ : మండల పరిషత్ పీఠాలు దక్కించుకోవటానికి అధికార తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు కొనసాగిస్తూనే ఉంది. గెలుపు అవకాశం లేని కొన్ని మండలాల్లో తెరచాటు రాజకీయాలు సాగిస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బెదరింపులకు దిగటం, కొందరిని ఆర్థికంగా ప్రలోభాలకు గురి చేయటం, మరికొందరిని ఓటింగ్‌కు రాకుండా చేస్తూ పల్లె రాజకీయాలను కలుషితం చేస్తోంది. ప్రధానంగా ఆపార్టీ గెలుపొందిన నియోజకవర్గాల్లో ప్రలోభాల పర్వం సాగుతోంది. తాజాగా కృష్ణాజిల్లా ఆగిరిపల్లి ఎంపీపీ ఎన్నికను అడ్డుకునేందుకు తెలుగు దేశం పార్టీ కుట్ర చేస్తోంది. టీడీపీ పార్టీ తన సభ్యులను కనపడకుండా చేసి...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎదురు దాడికి దిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ సభ్యులను కిడ్నాప్ చేశారంటూ శుక్రవారం పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. హైకోర్టు ద్వారా ఎన్నికను ఆపడానికి టీడీపీ యత్నిస్తోంది. -
ఏసీబీ వలలో ఎస్ఐ
కోడిపందేల నిర్వహణకు రూ.25 వేలకు డీల్ రెండో విడత రూ.10 వేలు తీసుకుంటుండగా దాడి ఆగిరిపల్లి, న్యూస్‌లైన్ : ఆగిరిపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ తాటిపాక చంద్రశేఖర్ సోమవారం ఏసీబీ వలలో చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని కలటూరుకు చెందిన జాలిపర్తి ఎస్.రామకృష్ణ సంక్రాంతి పండగకు కోడిపందేలు నిర్వహించుకోవడానికి ఎటువంటి కేసులూ లేకుండా అనుమతులు ఇవ్వాల్సిందిగా ఎస్ఐని అడిగారు. రూ.25 వేలు ఇస్తే కేసులు పెట్టకుండా వదిలేస్తానని ఎస్ఐ డిమాండ్ చేశారు. ఈ నెల 14న రామకృష్ణ చివరకు రూ.10 వేల నగదు ఎస్ఐకి ఇచ్చారు. రామకృష్ణ బృందం కోడిపందేలను 14, 15 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించారు. ఈ క్రమంలో 19న ఎస్ఐ రామకృష్ణను పిలిపించి నువ్వు పెద్దఎత్తున కోడిపందేలు నిర్వహించావు.. మరో రూ.15 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. నగదు ఇవ్వని పక్షంలో మీ గ్రామానికి చెందిన వారిపై కేసులు ఎలా పెట్టానో నీ మీద అలా కేసులు పెడతానంటూ బెదిరించారు. అదేరోజు సాయంత్రం రామకృష్ణ విజయవాడ ఏసీబీ అధికారులకు ఉప్పందించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐకి, రామకృష్ణకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. అనంతరం సోమవారం సాయంత్రం ఆరు గంటలకు పోలీస్‌స్టేషన్ ఆవరణలో రామకృష్ణ రూ.10 వేల నగదు ఇవ్వగా దాడి చేసి పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ ఆర్.విజయ్‌పాల్ తెలిపారు. రాజమండ్రిలోని ఎస్ఐ నివాసంలో కూడా అక్రమ ఆదాయంపై తనిఖీలు నిర్వహించనున్నట్లు విలేకర్లకు తెలిపారు. ఏ ప్రభుత్వాధికారైనా లంచానికి డిమాండ్ చేస్తే 9440446164, 9440446169, 9440446133, 9440446167 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు. -
ఆగిరిపల్లిలో బావిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య
విజయవాడ: కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. రమేష్, లక్ష్మీప్రసన్న ప్రేమించుకున్నారు. వారు ఇద్దరూ కలిసి ఆగిరిపల్లి మెట్లకోనేరు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది. వారి ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు.