శుభాలనిచ్చే శోభనాచలుడు
పుణ్యతీర్థం
దక్షిణ హిందూ దేవాలయాల్లో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం ఆగిరిపల్లి శోభనాచలం. కృష్ణాజిల్లా విజయవాడ–నూజివీడు మధ్యలో ఉన్న ఈ ప్రాచీన దివ్యక్షేత్రాన్ని దర్శించి భక్తులు ఆధ్యాత్మిక పరవశానికి లోనవుతూ ఉంటారు. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి ఆశ్రయించిన భక్తుల కోర్కెలు తీర్చే దేవదేవుడు. ఇది శివకేశవ క్షేత్రం కూడా. ఇక్కడి స్వయంభువుగా వెలసిన శ్రీ వ్యాఘ్ర లక్ష్మీ నృసింహుణ్ణీ, చేరువనే వెలసిన పరమశివుణ్ణీ దర్శించి జన్మధన్యంగా భావించే భక్తులు ఎందరో. మాఘమాసంలో ఇక్కడి పుష్కరిణిలో స్నానమాచరించి, శోభనాచలుని దర్శించుకోవాలని భక్తులు తహతహలాడుతుంటారు. ఇటీవల రథసప్తమి సందర్భంగా జరిగిన ఉత్సవాలలో భక్తులు అసంఖ్యాకంగా పాల్గొని స్వామిని సేవించుకున్నారు.
స్థల ప్రాశస్థ్యం
బ్రహ్మాండ పురాణంలో ఆగిరిపల్లి దేవాలయ స్థల ప్రాశస్థ్యం ఉంది. దానిప్రకారం కృతయుగాన శుభవ్రతుడనే రాజు శ్రీమహావిష్ణువు గురించి చాలాకాలం తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ‘నేను పర్వతాకారం పొందుతాను. మీరు లక్ష్మీసమేతులై నా యందు వేంచేసి ఉండాలి’ అని శుభవ్రతుడు కోరుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ‘పరమేశ్వరుని కూడా ప్రార్థించు. ఉభయులం వస్తాం’ అని చెప్పాడు. దాంతో ఆ రాజు పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేసి ఆయన అనుగ్రహమూ పొందాడు. తత్ఫలితంగా శివ పరమేశ్వరులిరువురూ ఈ క్షేత్రంలో వెలసి పూజలందుకుంటున్నారు. శుభవ్రతుడు తన తపస్సుతో పర్వతాకారం పొందాడు కాబట్టి ఈ కొండ శోభనగిరిగా ప్రసిద్ధికెక్కింది. ఈ పర్వతానికి పశ్చిమాన ఉన్న కొలనుకు ‘వరాహ పుష్కరిణి’ అని పేరు. వరాహావతార ఘట్టంలో శ్రీ స్వామివారిచే ఇది నిర్మించబడిందని ప్రతీతి. ‘కిరి’(వరాహం)చే నిర్మించబడిన కొలను గల పల్లె కాబట్టి శోభనగిరికి దక్షిణంగా ఉన్న గ్రామం ‘ఆకిరిపల్లి’ కాలక్రమేణ ‘ఆగిరిపల్లి’ అయిందని అంటారు.
మరో కథనం
పూర్వం శివకేశవులు ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పరుచుకోవాలని ప్రయాణం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు విష్ణుమూర్తి ‘నేను ఇక్కడ నీటి వసతి ఏర్పాటు చేస్తాను. నివసించడానికి అనువుగా ఉండే పర్వతం చూడమని శివుణ్ణి పంపాడు. శివుడు అన్ని పర్వతాలు చూసి వాటన్నింటిలో శోభనగిరి పర్వత సౌందర్య పర్వతానికి ముగ్ధుడై విష్ణుమూర్తికి ఈ కబురు చెప్పకనే అక్కడే ఉండిపోయాడు. ఈలోపు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి కొలను నిర్మించాడు. కాని శివుడు ఎంతకూ రాకపోవడంతో వెదుకుతూ వచ్చి శివుడు స్థావరం ఏర్పరుచుకోవడం చూసి అక్కడ నుంచి ఒక్క గంతు వేయగా రాతిమీద పాదముద్రలు పడ్డాయి. అక్కడ విష్ణువు వ్యాఘ్రస్వరూపుడై వెలిశాడు.
పూజలు ప్రారంభమైంది ఇలా
క్రీ.శ.17వ శతాబ్ది ప్రారంభంలో అచ్యుత భాగవతి, అనంత భాగవతి అనే పరమ భక్తులు ఉండేవారు. ఒకరోజు పరమేశ్వరుడు వీరిరువురికీ కలలో కనబడి శివకేశవులం ఇక్కడ వెలసి ఉన్నామని, తమకు పూజాదికాలు ఒనర్చాలని కోరాడు. మరునాడు వీరిరువురూ తమ స్వప్న వృత్తాంతం గ్రామస్తులకు చెప్పగా అందరూ దేవాలయ నిర్మాణానికి కావలసిన స్థలం చూసేందుకు బయలుదేరారు. అంతా అరణ్య ప్రాంతం కావడం, భక్తులు తనను గుర్తించలేకపోవడం చూసిన పరమేశ్వరుడు తంగేడు, ఇతర పూలను బారులు తీర్చి తాము ఉన్న ప్రదేశాన్ని గుర్తించేటట్టు చేశాడు. దాంతో అందరూ శోభనగిరి శిఖరం మీద వ్యాఘ్రలక్ష్మీ నరసింహ స్వరూపంలో విష్ణుమూర్తిని, చేరువలో నీలగళుని ఆకారంలో పరమశివుణ్ణి చూశారు. వెంటనే స్వామికి అభిషేకం చేద్దామని నీటి కోసం వెతకగా కొలను కనిపించింది. ఆ నీటిని తీసుకువచ్చి అభిషేకం చేసి సంతృప్తులయ్యారు. తర్వాత అచ్యుత, అనంత భాగవతులు శ్రీ స్వామివారికి ఆలయం నిర్మించి ఉత్సవాలు చేయడం ప్రారంభించారు. శ్రీ శోభనాచలస్వామికి జరిపే ఉత్సవాలు చూసి కొండపల్లి ఫిర్కా ముజుందారు ఇందుపూడి లక్ష్మీనారాయణరావు సంతోషించి ఈ అగ్రహారాన్ని భగవత్ కైంకర్యంగా ఇచ్చారని శాసనాల ద్వారా తెలుస్తోంది.
నూజివీడు జమీందార్ల సేవ
క్రీ.శ.1800 నుంచి క్రీ.శ.1804వరకు నూజివీడు ప్రభువులుగా ఉన్న శ్రీ రాజా రామచంద్ర అప్పారావు బహద్దూర్ ఈ క్షేత్రానికి ధర్మకర్తలుగా వ్యవహరించారు. అప్పటి నుంచి నూజివీడు జమీందార్లే శ్రీ స్వామివారి కైంకర్యాలను వైభవంగా జరిపిస్తూ వస్తున్నారు. క్రీ.శ. 1890 ప్రాంతంలో దేవులపల్లి వెంకటనర్సయ్య కొందిగువన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆలయాన్ని కూడా కట్టించారు. శనివారపుపేట ఎస్టేటు జమిందారిణి శ్రీ రాజా పాపయ్యమ్మారావు బహద్దూర్ వరాహ పుష్కరిణికి మెట్లు కట్టించి మంటపాన్ని నిర్మించారు.
నయనానందకరంగా నాలుగు మంటపాలు
తేలప్రోలు ఎస్టేటు జమీందారు రాజా శోభనాద్రి అప్పారావు 1856లో శ్రీ స్వామివారికి కల్యాణ మంటపాన్ని (కొఠాయి) గ్రామం మధ్యలో నిర్మించారు. అతి విశాలమైన ఈ మంటపంలో కల్యాణోత్సవాలు కడువైభవంగా జరుగుతాయి. అలాగే గ్రామంలో మరో మూడు వీధులలో నిర్మించిన ప్రాచీన మంటపాలు మూడు ఉన్నాయి. వీటిలో ఆయా పర్వదినాలలో స్వామివారి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
– నల్లాన్ చక్రవర్తుల సతీశ్ కుమార్ ఫొటోలు: ఎ.చంద్రశేఖర్, సాక్షి నూజివీడు
ఆగిరిపల్లి దివ్యక్షే్రత్రానికి వెళ్లే మార్గం
విజయవాడ నుంచి నూజివీడు వెళ్లే రోడ్డు మార్గం–30 కి.మీ
నూజివీడు నుంచి రోడ్డుమార్గం–12 కి.మీ
గన్నవరం నుంచి రోడ్డు మార్గం–17 కి.మీ
హనుమాన్ జంక్షన్ నుంచి రోడ్డుమార్గం–20 కి.మీ