సర్కారు తోడుగా.. రెచ్చిపోతున్నారు | TDP Corporator, rowdy-sheeters attack police, three injured | Sakshi
Sakshi News home page

సర్కారు తోడుగా.. రెచ్చిపోతున్నారు

Published Wed, Jun 8 2016 7:51 PM | Last Updated on Sat, Aug 11 2018 4:24 PM

సీఎం చంద్రబాబుతో కార్పొరేటర్ హరిబాబు (ఫైల్) - Sakshi

సీఎం చంద్రబాబుతో కార్పొరేటర్ హరిబాబు (ఫైల్)

సాక్షి, విజయవాడ: అధికారమదంతో తెలుగు తమ్ముళ్ల దాష్టీకాలు పెచ్చుమీరుతున్నాయి. పచ్చచొక్కా నేతలు చేస్తున్న అక్రమ దందాలు, అడ్డగోలు వ్యవహారాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ విప్ నుంచి కిందిస్థాయి టీడీపీ కార్యకర్త వరకు అధికారులు, పోలీసులపై దాడులకు దిగుతున్నారు. అసభ్య పదజాలంతో తిడుతున్నారు. కొన్నిసార్లు పోలీసులపైనే దాడిచేసినప్పటికీ వారు కేసులు నమోదు చేయలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ కేసులు నమోదు చేసినా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో నిందితులు క్షణాల్లో బయటపడుతున్నారు. తాజాగా సోమవారం కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో నడిరోడ్డు మీద కానిస్టేబుళ్లపై టీడీపీ కార్యకర్తల దాడి చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తోందని, ప్రభుత్వోద్యోగులపై దాడులకు దిగుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను వదిలిపెడుతోందని అధికారులు, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇవీ సంఘటనలు
విజయవాడలో సోమవారం టీడీపీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ జి.హరిబాబు, అనుచరుడు శ్రీనివాస్‌తో కలసి ప్రకాశం బ్యారేజీ సమీపంలో ఘాట్‌రోడ్డు నుంచి కుమ్మరిపాలెంవైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ రహదారిలో ఫ్లైఓవర్ పనులు జరుగుతుండడంతో అటువైపు రాకపోకలు నిషేధించారంటూ వారిని హోంగార్డు నాగరాజు ఆపా రు. ఎస్‌ఐ అనుమతి తీసుకునివెళ్లాలని సూచించడంతో పట్టరాని కోపంతో హరిబాబు, శ్రీనివాస్‌లు నాగరాజును తీవ్రంగా కొట్టారు. అడ్డుకోవడానికి వచ్చిన కానిస్టేబుల్ రామకృష్ణను తోసేసి దౌర్జన్యం చేశారు. అనంతరం విజయవాడ వన్‌టౌన్ పోలీసు లు హరిబాబును స్టేషన్‌కు తీసుకురాగా.. అతన్ని అరెస్టు చేయొద్దంటూ టీడీపీ నాయకులు, మంత్రుల నుంచి పోలీసులకు ఫోన్ ద్వారా ఒత్తిళ్లు పెరిగాయి. చివరకు బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్టు చేసి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.

ఇదే రోజు ఆగిరిపల్లిలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. టీడీపీ కార్యకర్తలుగా ఉన్న రౌడీషీటర్లు పాలేటి మహేశ్వరరావు, భాటియాలు మూడ్రోజుల నుంచి స్టేషన్‌లో సంతకాలు చేయకుండా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆగిరిపల్లి సెంటర్‌లో ఎస్సై రాజేంద్రప్రసాద్ వాహనాల తనిఖీ చేస్తుం డగా వీరు వస్తున్న వాహనాన్ని ఆపి ప్రశ్నించారు. దీంతో వారు ఎస్‌ఐని తీవ్ర దుర్భాషలాడారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ సతీష్‌కుమార్, మరో కానిస్టేబుల్‌పై దాడికి దిగారు.  

జూన్ 3న విజయవాడలోని రమేశ్ హాస్పిటల్ సెంటర్‌లో టీడీపీ నాయకులు ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడి దిష్టిబొమ్మ దహన చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమం చేస్తుండడంతో మాచవరం ఎస్సై కృష్ణమోహన్ అక్కడకు వచ్చారు. అదే సమయంలో దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా టీడీపీ కార్పొరేట్ సాంబశివరావుకు గాయాలయ్యాయి. మంటలు ఆర్పడానికి ప్రయత్నించిన ఎస్సైని సాం బశివరావు అనుచరుడు, రౌడీషీటర్ గన్నె హరిప్రసాద్ దూషిస్తూ ఆయన టోపీని విసిరేసి దాడికి యత్నించాడు. ఇది జరిగి నాలుగు రోజులైనా రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదుకాలేదు.

అసభ్య ప్రవర్తన కేసులో కార్పొరేటర్...
టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు (చంటి) గత నెలలో విమానంలో తోటి ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె కేంద్ర మంత్రి మేనకాగాంధీకి ఫిర్యాదు చేయడంతో గన్నవరం విమానాశ్రయంలో వెంకటేశ్వరరావును పోలీసులు ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఆయన్ని వదిలేశారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌లోనూ ఘటనపై కేసు నమోదైంది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి రాగా ఆరోగ్యం బాగాలేదనే సాకుతో రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి తరువాత న్యాయవాదితో సహా వెళ్లి వివరణ ఇచ్చుకున్నారు. ఈ ఘటనలోనూ అరెస్టు లేదు.

ఎమ్మెల్యే చింతమనేని ఆగడాలు
గతేడాది జూలై 8న తహశీల్దారు వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దాడిచేశారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ప్రశ్నించినందుకు ఆమెపై దాడికి దిగారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యోగులు ఆందోళనకు దిగినా చింతమనేనిని అరెస్టు చేయలేదు. గత నెల 23న మరోసారి చింతమనేని ప్రభాకర్ కొల్లేరు అభయారణ్యంలో నిబంధనలు అతిక్రమించి అడ్డగోలుగా రహదారిని ఏర్పాటు చేస్తున్న క్రమంలో అటవీశాఖ సహాయ కన్జర్వేటర్ వినోద్‌కుమార్‌కు ఫోన్‌చేసి బూతు పురాణం విప్పారు. మరుసటిరోజు రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి యత్నించిన అటవీ సిబ్బందిపై సమీప గ్రామస్తులతో దాడి చేయించారు.

సీఎం సొంత జిల్లాలో ఖాకీలనే తరిమికొట్టారు
పాకాల(తిరుపతి రూరల్): చంద్రబాబు సొంత జిల్లాలో అధికార పార్టీ నేతల పోలీసులనే తరిమికొట్టారు. మే 13సాయంత్రం పాకాలలో టీడీపీలోని రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీకే చెందిన దళిత ఎంపీపీ చాముండేశ్వరీ వర్గంపై టీడీపీ మండలాధ్యక్షుడు నాగరాజునాయుడు, తెలు గు యువత మండలాధ్యక్షుడు మాన్యం కిషోర్‌నాయుడు, మరో ఆరుగురు దాడికి పాల్పడ్డారు. ఘర్షణను అడ్డుకునేందుకు వెళ్లిన పాకాల ఏఎస్సై రవీంద్రనాయక్, శ్యామ్‌బాబు, కానిస్టేబుల్ హనీఫ్ బాషాలపై టీడీపీ నాయకులు దాడి చేశారు.

కానిస్టేబుల్ హనీఫ్‌బాషా ఫిర్యాదుతో అదేరోజు సాయంత్రం నాగరాజనాయుడు, కిషోర్‌నాయుడు, మరో ఆరుగురిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. పోలీసులపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఐ చల్లనిదొర నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో ఆయనపై కక్షకట్టిన అధికారపార్టీ నేతలు పాకాల నుంచి బదిలీ చేయించారు. పోస్టింగ్ ఇవ్వకుండా అధికారులు వీఆర్‌లో ఉంచారు.
 
ఆగిరిపల్లి ఎస్.ఐ.కు పోలీసు సంఘం నేతల పరామర్శ
హనుమాన్ జంక్షన్ రూరల్: పోలీసులపై దాడులను అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పోలీస్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు కోరారు. పోలీస్ సంక్షేమ సంఘం నాయకులు మంగళవారం బాపులపాడు మండలంలోని వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో దాడికి గురైన ఎస్సై రాజేంద్రప్రసాద్‌ను పరామర్శంచారు.

సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు పి.ఓంకార్, ప్రధాన కార్యదర్శి డి.సుబ్రమణ్యం, జిల్లా అధ్యక్షుడు మస్తాన్ ఖాన్‌లు ఆయనకు నైతిక మద్దతు పలికారు.  ఈఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ రాముడుకు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. హనుమాన్ జంక్షన్ సీఐ జయకుమార్, వీరవల్లి ఎస్సై పి.మురళీకృష్ణ పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement