మట్టిమాఫియా బరితెగింపు
మట్టిమాఫియా బరితెగింపు
Published Wed, Jul 27 2016 9:56 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
‘ పచ్చ’ నేతల దోపిడీ
మౌనంగా అధికారులు
నూజివీడు:
టీడీపీ ప్రభుత్వ హయాంలో మాఫియాలు పేట్రేగిపోతున్నాయి. ‘పచ్చ పార్టీ’ అండదండలతో కొంతమంది మాఫియాగా ఏర్పడి ప్రభుత్వ సంపదను దోచుకుంటున్నారు. ఇసుక, మట్టి, కాల్‌మనీ.. ఇలా అనేక మాఫియాలు నిరంతరం దోపిడీనే పనిగా పెట్టుకున్నాయి. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం సూరవరం వద్ద పోలవరం మట్టిని మాఫియా పట్టపగలు యథేచ్ఛగా తరలిస్తోంది. లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టి పోలవరం కుడికాలువ కట్టలపై ఉండకుండా రాత్రిపగలు అనే బేధం లేకుండా తరలిస్తున్నారు.
అధికార బలంతోనే..
అధికార బలంతో మట్టి తరలిపోతుండటంతో అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. సూరవరం వద్ద పోలవరం కాలువ వెంబడి ఉన్న మట్టిని మాఫియాదారులు పామర్రు మండలం నిమ్మకూరుకు తరలిస్తున్నారు. అడిగేవారే లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పదుల సంఖ్యలో టిప్పర్లను ఒకేసారి ఏర్పాటు చేసి మట్టిని తరలించేస్తున్నారు.
పేదలకో న్యాయం..
ఎవరైనా పేదవాడు అవసరమై ఒక ట్రక్కు ఇసుక గాని, మట్టిగాని తెచ్చుకుంటుంటే వీఆర్వోలు, పోలీసులు వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారే గాని సహజ సంపద అయిన మట్టిని అడ్డగోలుగా దోచుకుంటున్నప్పటికీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇంతభారీగా పోలవరం కాలువ మట్టిని తరలిస్తుండటంతో పలువురు గ్రామస్తులు లారీలను ఆపి ఎక్కడకు వెళ్తోందని అడిగితే నిమ్మకూరులోని ఎన్టీఆర్ బంధువులకు అని డ్రైవర్లు చెబుతున్నారు.
టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు..
ఆగిరిపల్లి మండలం కొత్త సూరవరానికి చెందిన గ్రామస్థులు టిప్పర్లను నిలిపి, మట్టిని తరలించడానికి అనుమతులు ఉన్నాయా, లేవా, లేకుండా ఎందుకు తోలుతున్నారంటూ బుధవారం డ్రైవర్లను నిలదీశారు. అయినప్పటికీ డ్రైవర్ల వినకుండా తోలుతుండటంతో ఆగిరిపల్లి ఎస్‌ఐకు సమాచారమందించారు. దీంతో ఎస్‌ఐ తన సిబ్బందిని పంపించి తోలకాలను నిలిపివేయించారు.
మొదటి నుంచి అంతే..
గతేడాది కాలం నుంచి పోలవరం కుడికాలువ మట్టిని తరలించేస్తున్నారు. కొత్తగా తవ్విన కాలువకు సంబంధించి 10 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వగా అందులో దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించేశారు. వైఎస్ హయాంలో కాలువను 80 శాతం వరకు తవ్వగా అప్పట్లో వచ్చిన మట్టి అంతా నేటికీ కాలువ వెంబడి పెద్దపెద్ద గుట్టలుగా అలాగే ఉంది. గతేడాది నూతనంగా తవ్విన ప్రాంతంలో మాత్రం ఒక్క ట్రక్కు మట్టికూడా లేదు. దీనిని బట్టే మట్టిదోపిడీ ఎలా సాగుతుందో చెప్పవచ్చు. మట్టితోలకాలపై ఎస్‌ఐ రాజేందరప్రసాద్‌ను వివరణ కోరగా పోలవరం కాలువకు సంబంధించిన అధికారులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని చెప్పారు.
Advertisement