Soil Mafia
-
అడ్డూ.. అదుపు లేదు
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో మట్టి, గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. దేవుని మాన్యం... అటవి భూమి... ప్రభుత్వ పోరంబోకు... పంట పొలం... అనే తారతమ్యం లేకుండా తవ్వేస్తోంది. భారీ యంత్రాలతో 30 అడుగుల మేర తవ్వి పచ్చటి పొలాలను, ప్రభుత్వ భూములను చెరువులుగా మార్చేస్తోంది. రోజూ వందలాది టిప్పర్లు, లారీల ద్వారా మట్టి, గ్రావెల్(చిన్న చిన్న రాళ్లతో కూడిన మట్టి)ను తరలించి కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలో మగ్గురు అధికార పార్టీ ముఖ్య నేతల కనుసన్నల్లో ఈ మట్టి, గ్రావెల్ దందా సాగుతోంది. – సాక్షి టాస్క్ఫోర్స్రైతులు నోరెత్తకుండా చేసిన మట్టి మాఫియా నేతలు.. ఆ తర్వాత కాంట్రాక్టర్లను టార్గెట్ చేశారు. గూడూరు డివిజన్ పరిధిలో గత ప్రభుత్వం సముద్రతీరం నుంచి జాతీయ రహదారిని కలుపుతూ రూ.2,203 కోట్లతో చేపట్టిన సాగరమాల, భారతమాల పనులతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లతో మట్టి మాఫియా నేతలు సమావేశమయ్యారు. పనులు యథాతథంగా కొనసాగాలంటే కమీషన్ల రూపంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము అడిగినంత ఇస్తేనే మట్టి, గ్రావెల్ తీసుకువెళ్లేందుకు అనుమతిస్తామని హెచ్చరించారు. అప్పటికే వారం నుంచి పనులు ఆగిపోవడంతో భయపడిన కాంట్రాక్టర్లు వారు అడిగినంత రెండు విడతల్లో ఇవ్వటానికి ఒప్పుకున్నారు. అలా మొదటి విడతలో పలువురు కాంట్రాక్టర్ల నుంచి రూ.కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. మామూళ్లు ముట్టజెప్పిన తర్వాతే మట్టి, గ్రావెల్ తరలింపునకు అనుమతిచ్చినట్లు ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. దేవుడి భూమిలో పాగా..చిల్లకూరు మండలం కలవకొండ పరిధిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉన్న 246 ఎకరాలను మట్టి మాఫియా హస్తగతం చేసుకుంది. ఇదే రెవెన్యూ పరిధిలో స్థానిక రైతుల ఆధీనంలో ఉన్న భూములు, పొన్నవోలు, తిక్కవరం పరిధిలోని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని కొద్ది రోజులుగా విచ్చలవిడిగా తవ్వకాలు సాగిస్తోంది. పెద్ద పెద్ద యంత్రాలతో తవ్వి టిప్పర్లు, లారీల ద్వారా తరలిస్తోంది. ప్రభుత్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఈ మాఫియా వద్ద ఎకరాకు రూ.5 లక్షలు చెల్లించి మట్టి, గ్రావెల్ కొనుగోలు చేస్తున్నారు. మిగిలినవారు యూనిట్‌కు రూ.350 చెల్లించి తీసుకువెళుతున్నారు. గూడూరు డివిజన్ పరిధిలోని చేడిమాల, కోట, గూడూరు రూరల్, నాయుడుపేట, పెళ్లకూరు పరిధిలో చెరువులు, ప్రభుత్వ భూముల్లో కూడా యథేచ్చగా మట్టి, గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. టీడీపీ నేతల అనుమతులు ఉన్న వాహనాలను ఎవ్వరూ ఎక్కడా ఆపటానికి వీల్లేదని మైనింగ్, రెవెన్యూ, పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే..» ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే గూడూరు డివిజన్ పరిధిలో మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ముగ్గురు ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలో ఉన్న సీఎం చంద్రబాబు ముఖ్య అనుచరుడిగా పేరొందిన కాంట్రాక్టర్ తెరపైకి వచ్చారు. ఆయన సంబంధిత అధికారులకు ఫోన్ చేసి అప్పటి వరకు వివిధ అభివృద్ధి పనుల కోసం కొనసాగుతున్న మట్టి, గ్రావెల్, ఇసుక తవ్వకాలను ఆపేయాలని చెప్పారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.» ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రెండో రోజు డివిజన్ పరిధిలోని రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులతో సీఎం ముఖ్య అనుచరుడు, ఓ ఎమ్మెల్యే, గతంలో ఖమ్మం నుంచి మావోయిస్టులు హెచ్చరించడంతో పారిపోయి ఇక్కడికి వచ్చిన నాయకుడు, స్థానికంగా ఉన్న మరో నాయకుడు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. గూడూరు డివిజన్ పరిధిలో ఎక్కడెక్కడ ఏయే పనులు జరుగుతున్నాయి... ఆ పనులకు మట్టి, గ్రావెల్, ఇసుక ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారనే సమాచారం తెలుసుకున్నారు. » మట్టి, గ్రావెల్, ఇసుక బాగా ఎక్కడ లభిస్తాయి.. ఆ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి.. రహదారుల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు మట్టి, గ్రావెల్ ఎలా విక్రయిస్తున్నారు.. అనే వివరాలపై ఆరా తీశారు. మట్టి తవ్వకాలు చేపట్టే అవకాశం ఉన్న భూముల రికార్డులను కూడా తెప్పించుకున్నారు. » ఆ సమావేశం ముగిసిన మరుసటి రోజే చిల్లకూరు, పెళ్లకూరు, గూడూరు రూరల్, కోట, వాకాడు మండలాల నుంచి ఎంపిక చేసుకున్న రైతులను పిలిపించారు. ఆ రైతుల ఆధీనంలోని ప్రభుత్వ భూములకు సంబంధించి మట్టి, గ్రావెల్ తవ్వకాలకు ఎవ్వరూ అడ్డుచెప్పకుండా ఉండేలా బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. వారికి కొంత నగదును ముట్టజెప్పి ఎవ్వరూ నోరెత్తకూడదని హుకుం జారీచేశారు.టీడీపీ నాయకుల అనుచరులు కాపలా!మట్టి మాఫియా అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్న భూముల వద్ద టీడీపీ నాయకుల అనుచరులు కాపలా ఉంటున్నారు. ఎన్ని లారీలు, టిప్పర్ల ద్వారా ఎన్ని యూనిట్ల మట్టి, గ్రావెల్ తరలిస్తున్నారనే వివరాలను వారు పుస్తకాల్లో నోట్ చేసుకంటున్నారు. ప్రస్తుతం డివిజన్లో మట్టి మాఫియా సాగిస్తున్న తవ్వకాలకు ఎక్కడా అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. -
అక్రమ రవాణాకు పోలీస్ ఎస్కార్ట్!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసుల అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రామచంద్రాపురం మండలం బొప్పరాజుపల్లి, పాడిపేట నుంచి మట్టి, ఇసుక ప్రతి రోజూ రాత్రిళ్లు 30 టిప్పర్లలో తిరుపతికి తరలి వెళ్తోంది. ఈ దందాను అరికట్టాల్సిన పోలీసులే ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాలతో ఆ వాహనాలకు రక్షణ కల్పిస్తుండడం విస్తుగొలుపుతోంది. -
కొడకంచిలో మట్టి అక్రమ తరలింపు
జిన్నారం (పటాన్చెరు): కొడకంచిలో క్రషర్ నుంచి భారీగా మట్టిని తరలిస్తున్నారని, దీనిని ఆపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ శ్రీశైలం, గ్రామ నాయకులు భాస్కర్, సాయి, దుబ్బ శ్రీనివాస్, భిక్షపతి తదితరులు డిమాండ్ చేశారు. బుధవారం మట్టిని తరలిస్తున్న ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రషర్ యజమాని నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతోనే ఈ వ్యాపారం నడుస్తోందని ఆరోపించారు. రాత్రి సమయంలో వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారన్నారు. ఈ విషయమై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మట్టి తరలింపుపై కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. -
తవ్వలేక... తోడలేక!
సాక్షి, హైదరాబాద్: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లో సొరంగా ల తవ్వకాల పరిస్థితి. ఎప్పుడూ ఏదో అవాంతరాల తో ఆగుతున్న ఈ పనులకు ప్రస్తుతం సీపేజీ, పాడైన బోరింగ్ యంత్రానికి తోడు నిధుల సమస్య వచ్చి పడింది. గతేడాది మే నెల నుంచి ఈ పనులు నిలిచిపోగా, ఇప్పుడు కొత్తగా సీపేజీ సమస్యతో భారీగా నీరు చేరుతూ మొత్తానికి ఎసరు వచ్చేలా ఉంది. తిరిగి పనులను గాడిలో పెట్టేందుకు రూ.80 కోట్ల వరకు చెల్లిస్తే కానీ పనులు సాగవని నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి తేల్చిచెప్పడంతో ఆ నిధులు సర్దడం ఎలా అన్నదానిపై ప్రభుత్వం తల పట్టుకుంటోంది. ఇప్పుడైనా స్పందిస్తారా..? ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా తవ్వాల్సిన రెండు సొరంగాలకు గాను మొదటి దాన్ని శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.93 కి.మీ. కాగా, ఇప్పటి వరకు 33.20 కి.మీల పని పూర్తయింది. మరో 10.73కి.మీ.ల పని పూర్తి చేయాల్సి ఉంది. ఈ టన్నెల్‌ను రెండు వైపుల నుంచి తవ్వుతూ వస్తుండగా.. శ్రీశైలం నుంచి జరుగుతున్న పనులు గత ఏడాది మే నెల నుంచి ఆగాయి. టన్నెల్ బోరింగ్ మెషీన్ పాడవడం, కన్వేయర్ బెల్ట్ మార్చాల్సి ఉండటం, ఇతర యంత్రాల్లో మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇక ఇన్లెట్ టన్నెల్ పనుల వద్ద ప్రస్తుతం ఊహించని విధంగా సీపేజీ వస్తోంది. గరిష్టంగా గంటకు 9వేల లీటర్ల మేర నీరు సీపేజీ రూపంలో వస్తుండగా, అంత నీటిని తోడే సామర్ధ్యం పనులు చేస్తున్న జేపీ సంస్థ వద్ద లేకపోవడంతో నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ దృష్ట్యానే యంత్రం మరమ్మతులకు తోడు నీటిని తోడేందుకు తమకు కనిష్టంగా రూ.60 కోట్లు అడ్వాన్స్‌గా ఇవ్వా లని ఏజెన్సీ ప్రభుత్వానికి గత ఏడాది నవంబర్ నెల లో కోరింది. ఎన్నికల నేపథ్యంలో అది ఆగి చివరకు దీనిపై చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం నీటి పారుదల శాఖకు సూచించింది. దీనిపై ఆశాఖ రూ.60 కోట్ల అడ్వాన్సులు కోరుతూ ఆర్థిక శాఖకు పంపినా ఇంతవరకు నిర్ణయం తీసు కోలేదు. నిధులు విడుదల చేయలేదు.దీంతో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఈ రూ.60 కోట్లకు తోడు ప్రస్తుతం మరో రూ.20 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా రూ.80 కోట్లు చెల్లిస్తే కానీ పనులు మొదలయ్యే అవకాశం లేదని ఇటీవల మరోమారు నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. ఈ నేపథ్యంలో అయినా నిధుల విడుదల జరిగి పనులు మొదలవుతాయో లేదో చూడాలి. అయితే ప్రాజెక్టును రూ.1,925 కోట్లతో ఆరంభించగా, తర్వా త ఈ వ్యయాన్ని రూ.3,074 కోట్లకు సవరించారు.ఇందులో రూ.2,186 కోట్ల మేర నిధులు ఖర్చయ్యా యి. ప్రాజెక్టు పనులను 2022 నాటికి పూర్తి చేయా లని లక్ష్యం పెట్టుకున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మరో ఏడాది అదనపు సమయం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అధికార వర్గాలే అంటున్నాయి. -
జోరుగా మట్టి దందా
నిజాంపేట(మెదక్): నిజాంపేటకు చెందిన ఘడీం చెరువు నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. రెండు రోజులుగా చెరువులో జేసీబీతో మట్టి తీసి ట్రాక్టర్ల ద్వారా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేఉండా ఓ కాంట్రాక్టర్ చెరువు నుంచి మట్టిని తోడేస్తున్నారు. ఓ కాంట్రాక్టరు పగటి పూట అక్రమంగా మట్టిని తరలిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వింతగా ఉంది. గతంలో మట్టిని తీసిన గోతుల పక్కనే ప్రస్తు తం మట్టిని తవ్వి తీస్తున్నారు. చెరువు చివరి భాగంలో మట్టిని తీసుకుపోయేందుకు తవ్వకాలు చేపట్టడంతో పెద్ద గోతులు ఏర్పడుతున్నా యి. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న నార్లాపూర్, వెంకటపూర్(కె) గ్రామంలోని ఉన్న చెరువులల్లో చాలా వరకు పెద్ద ప్రమాదకరమైన గోతులు ఏర్పడాయి. చెరువులో జేసీబీ గోతులలో ప్రమాదాలు జరిగి ప్రాణా లకు ముప్పు వాటిల్లుతున్నా ఏ శాఖ అధికారులు అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం లేదని స్థానికంగా ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటాం మండల పరిధిలోని పలు గ్రామాల్లోని చెరువుల్లో అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతులు లేకుండా చెరువుల్లో మట్టిని తోడితే అడ్డుకుంటాం. ఇప్పటి వరకు సమస్య మా దృష్టికి తీసుకురాలేదు. వెంటనే చర్యలు తీసుకుంటాం. – జైరామ్, తహసీల్దార్ -
తవ్వుడు.. పోస్కపోవుడు..
మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. నగరం చుట్టుపక్కల, ఆనుకుని ఉన్న భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. ఇక్కడ కొన్న వ్యవసాయ భూములను చదును చేసేందుకు మట్టి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇంకేముంది అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ భూముల నుంచి, అనుమతులు లేకుండా ట్రాక్టర్ల ద్వారా మట్టి తోలకాలు విచ్చలవిడిగా చేపడుతున్నారు. నగరంలో నిర్మించే ఇళ్ల నిర్మాణానికి కూడా అక్రమార్కులు ఇక్కడి నుంచే మట్టిని తరలిస్తున్నారు. ఇదంతా రెవెన్యూ, మైనింగ్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, ఖమ్మం: నగరానికి అతిసమీపంలో ఉన్న ఖమ్మంరూరల్ మండలంతోపాటు కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం అర్బన్ మండలాల్లో మట్టిదందా నిరాటంకంగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు రూరల్ మండలం గుర్రాలపాడు, తెల్దారుపల్లి, ఏదులాపురం, ముత్తగూడెం, ఆరెకోడు, గుదిమళ్ల, ఎం.వెంకటాయపాలెం తదితర గ్రామాలను ఎంచుకుని రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే యథేచ్ఛగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ట్రక్కు మట్టిని రూ.600 నుంచి రూ.700 వరకు అమ్ముకుంటూ వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ, ప్రైవేట్ భూముల నుంచి మట్టిని తరలించాలన్నా.. లేదా ప్రైవేట్ భూమిని చదును చేసుకోవాలన్నా సంబంధిత వీఆర్వోకు దరఖాస్తు చేసుకోవాలి. వీఆర్వో సంబంధిత ప్రదేశానికి వెళ్లి పర్యావరణానికి ముప్పు రాదనుకుంటేనే అనుమతివ్వాలి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమిలో ఏమైనా తవ్వకాలు జరపాలంటే మైనింగ్, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. అందుకోసం కొంత నగదును ప్రభుత్వానికి సెస్ రూపేణా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటివేమీ లేకుండానే మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. తాము తమ భూమిని చదును చేసుకుని.. అందులో నుంచి తీసే మట్టిని తమ అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారుల నుంచి సదరు భూమి యజమాని అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఏవైనా రెవెన్యూ, మైనింగ్ అధికారుల నుంచి అనుమతి తీసుకుని మాత్రమే మట్టిని తరలించాల్సి ఉంటుంది. జరుగుతోందిలా.. అయితే అంతా తామే చూసుకుంటామని రైతులను నమ్మించి అక్రమార్కులు తమ పని కానిచ్చేస్తున్నారు. దీనిని ఆసరా చేసుకున్న మట్టి అక్రమ రవాణాదారులు సదరు రైతుకు చెందిన భూమిలో మట్టిని తీసి.. ఎలాంటి అనుమతి లేకుండానే రియల్ ఎస్టేట్ ప్లాట్లకు, ఇతర అవసరాలకు రేయింబవళ్లు తరలిస్తున్నారు. గతంలో వెంకటగిరిలో ఇదే విషయమై అక్రమార్కులను అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడి చేసిన విషయం విదితమే. నాలుగు రోజుల క్రితం కూడా అక్రమార్కులను అడ్డుకున్న అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. లక్షల ట్రిప్పులు తరలింపు.. మండలంలోని గుర్రాలపాడు, ముత్తగూడెం, తెల్దారుపల్లి, ఏదులాపురం ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతి లేకుండానే మట్టిని తవ్వి లక్షల ట్రిప్పులు తరలించారు. దీంతో ప్రభుత్వ భూములను పీల్చిపిప్పి చేస్తున్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వం ఆ భూముల్లో ఏవైనా నిర్మాణాలు చేయాలంటే లోతైన పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయి. పట్టించుకోని అధికారులు పగలూ, రాత్రి తేడా లేకుండా మట్టిని అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. వీఆర్వోలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రతీ రోజు గమనించాల్సి ఉండగా.. తమ కళ్లెదుటే వందలాది ట్రక్కుల మట్టి తరలిస్తున్నా ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం రాజకీయ పార్టీల నుంచి వచ్చే ఒత్తిళ్లు ఒక ఎత్తయితే.. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు మట్టిని తరలించే అక్రమార్కుల నుంచి ఆమ్యామ్యాలు అందడం మరో కారణమనే బలమైన ఆరోపణలున్నాయి. నామమాత్రపు దాడులు ఫలానా గ్రామంలోని శివారు ప్రాంతంలో మట్టిని తరలిస్తున్నారనే సమాచారం మేరకు వీఆర్వో అక్కడికి వెళ్లి మందలిస్తే.. ఆ ఒక్కరోజు తోలకాలు నిలిపివేస్తున్నారు. మరుసటి రోజు నుంచి మళ్లీ మట్టి తోలకాలు చేపడుతున్నారు. మూడు రోజుల క్రితం గొల్లగూడెం, గుర్రాలపాడు రెవెన్యూ పరిధిలో కొందరు అక్రమార్కులు ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తుండగా.. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను, జేసీబీని సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. అనంతరం నాయకుల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో వారికి జరిమానా వేసి వదిలేశారు. అక్రమార్కుల మధ్య ఘర్షణ మండలంలో ఇటీవల అక్రమార్కుల మధ్య మట్టిని తరలించే విషయంలో ఘర్షణ జరిగినట్లు తెలిసింది. ఏదులాపురం, ఆరెంపుల, గొల్లగూడెం, ముత్తగూడెం పరిధిలో మట్టిని తాము తరలించే ప్రాంతానికి మీరు రావడం ఏమిటని ఇంకొందరు అక్రమార్కులు ఘర్షణ పడినట్లు తెలిసింది. ఈ వ్యవహారం పెద్దకు వద్దకు వెళ్లడంతో ఇరువర్గాలకు సర్ది చెప్పినట్లు తెలిసింది. చర్యలు తీసుకుంటాం.. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో నుంచి మట్టిని తరలించాలంటే తప్పకుండా రెవెన్యూ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. అలా కాకుండా అక్రమంగా మట్టిని తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే అక్రమంగా మట్టిని తరలించే వారిని.. గుర్తించి కొందరికి జరిమానా విధించాం. అనుమతులు లేకుండా మట్టిని తరలించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు. – అశోక్‌చక్రవర్తి, తహసీల్దార్, ఖమ్మం రూరల్ -
పట్టపగలే గ్రావెల్ దోపిడీ
సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ రూరల్ పరిధిలో మట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. గతంలో అర్ధరాత్రి సమయంలో చడీచప్పుడు లేకుండా సాగిపోయే ఈ దందా.. ఇప్పుడు పట్టపగలే యథేచ్ఛగా సాగిపోతోంది. ప్రభుత్వ పనుల పేరిట ఏదో ఒక అనుమతి తెచ్చుకుని నిత్యం వేలాది టన్నుల గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వంశీ అండదండలతో ఆయన అనుచరుడు చేస్తున్న ఈ మట్టి దందాపై పలుమార్లు స్థానికులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ దోపిడీ వివరాలు ఇలా ఉన్నాయి.. పోలవరం కాలువ మట్టి.. జక్కంపూడి ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతాన్ని తొలిచి పోలవరం కుడి కాలువను ప్రభుత్వం నిర్మించింది. ఈ పనుల్లో భాగంగా తవ్విన ఎర్రమట్టి, తెల్లమట్టిని జక్కంపూడి కురవ ప్రాంతంలోనే పెద్ద పెద్ద గుట్టలుగా కాంట్రాక్టర్ డంప్ చేసి వదిలేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు అది ఆదాయవనరైంది. అప్పట్లో సర్పంచ్‌గా పనిచేసే రామారావు, ఎమ్మెల్మే వంశీ అనుచరుడు గండికోట సీతయ్య కలిసి ఈ గ్రావెల్‌ను తొలుత స్థానిక అవసరాల పేరిట తరలించడం ప్రారంభించి.. ఆ తర్వాత క్రమేణా రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఇతరత్రా అవసరాలకు అనధికారికంగా విక్రయించి రూ. కోట్లు ఆర్జించారు. రూ. కోట్లలో దోపిడీ అధికారబలం అండతో ఎమ్మెల్యే అనుచరుడైన గండికోట సీతయ్య చెలరేగిపోతున్నారు. తమను అడ్డుకునేవారెవరూ లేరనే ధీమాతో రకరకాల అనుమతుల పేరిట మట్టిని అక్రమంగా విక్రయించేస్తున్నాడు. తొలుత స్థానిక అవసరాలకు తరలించిన మట్టిని తర్వాత గొల్లపూడి, సింగ్‌నగర్, అంబాపురం, నయనవరం, జక్కంపూడి, వెలగలేరు, జి.కొండూరు తదితర ప్రాంతాలకు టిప్పర్ల ద్వారా తరలిస్తూ రూ. కోట్లు పోగేశాడు. స్థానికంగా తెల్లమట్టి అయితే టిప్పర్‌కు రూ. 3,500, ఎర్రమట్టి అయితే రూ. 5వేలు చొప్పున ధర నిర్ణయించి విక్రయిస్తున్నట్లు తెలిసింది. దూరం పెరిగే కొద్దీ ధర కూడా పెరుగుతుంటుంది. గుట్టలుగా ఉన్న గ్రావెల్‌ను టిప్పర్ల ద్వారా సమీపంలోని ఖాళీ స్థలంలో డంప్ చేస్తున్నాడు. అక్కడి నుంచి వెంచర్లకు, బిల్డర్ల అవసరాలకు మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా అధికారులెవరూ స్పందించకపోవడం గమనార్హం. -
మేమింతే..!
మాగనూర్(మక్తల్): మహబూబ్‌నగర్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు త్రిబుల్ లేన్ రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి.. ఇందులో మహబూబ్‌నగర్ నుంచి మరికల్ వరకు పనులు పూర్తికాగా.. ప్రస్తుతం అక్కడి నుంచి కర్ణాటక శివారు శక్తినగర్ వరకు రోడ్డు పనులను మరో కాంట్రాక్టర్ చేపడుతున్నాడు.. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ రోడ్డు పనుల కోసమంటూ చెరువు మట్టిని తరలిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఫీట్ల లోతు వరకు మట్టిని ఇష్టారాజ్యంగా పొక్లెయినర్లతో తవ్వుతుండడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వ పనుల కోసమే అయినా.. అదే ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ప్రజలకు ఉపయోగపడే చెరువు నుంచి మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇదంతా మాగనూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కనే జరుగుతున్నా.. రెవెన్యూ అధికారులు మాత్రం తామెవరికీ అనుమతి ఇవ్వలేదని చెప్పడం గమనార్హం. పొలాలకు దారి మాగనూరు మండల కేంద్రంలోని మెన్ రోడ్డు పక్కనే సామన్‌చెరువు ఉంటుంది. ఈ చెరువు నీరు ఆయకట్టు రైతులు పొలాలు పండించుకునేందుకు, వేసవిలో పశువుల దాహార్తి తీర్చేందుకు ఉపయోగపడుతోంది. అంతేకాకుండా ఈ చెరువు మీదుగా అటు వైపు ఉన్న పొలాల్లోకి దాదాపు యాభై మంది రైతులు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ జేసీబీలు, పొక్లెయినర్లు పెట్టి మరీ ఏకంగా 20ఫీట్ల లోతు వరకు తవ్వి మట్టి తరలిస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్‌లో ప్రమాదాలకు ఆస్కారముందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం వెళ్లిన పశువులు కానీ మనుషులు కానీ అందులో పడితే ప్రాణాలు కోల్పోవాల్సిందేనని చెబుతున్నారు. అనుమతులు లేవు.. ప్రభుత్వ భూముల్లోని చెట్లను కొట్టేందుకు కూడా అధికారుల అనుమతి తీసుకోవాలి. ఇక మట్టి తవ్వాలన్నా, తరలించాలన్నా మైనింగ్, రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. గ్రామాల్లోని వ్యవసాయ భూమిలో ఇళ్లు నిర్మించాలన్నా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్‌గా అనుమతి పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మాగనూర్ మండలంలో మాత్రం చాలామంది తమ పొలాల్లో మట్టి తరలించుకునేందుకు రైల్వేలైన్ కాంట్రాక్టర్, రోడ్డు పనుల కాంట్రాక్టర్‌కు అవకాశహిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న కాంట్రాక్టర్ తమనెవరూ ఏమీ చేయలేరనే ధైర్యంతో ఏకంగా చెరువుపై కన్నేశాడు. ఇక చెరువు నుంచి సైతం 20 ఫీట్ల లోతు వరకు తవ్వకాలు చేపట్టడం అధికారుల దృష్టికి వచ్చే అవకాశమున్నా ఎందుకు పట్టించుకోవడం లేదో సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతోంది. నిబంధనలకు తిలోదకాలు మాగనూరు నుంచి కర్ణాటక శివారు వరకు రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పనుల్లో మొదటి నుంచి నిబంధనలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్డు నిర్మాణంలో ఓ పక్క వాహనాలను వెళ్లుటకు అవకాశం కల్పించి మరో పక్క రోడ్డు నిర్మించాలి. కానీ అందుకు విరుద్ధంగా కాం ట్రాక్టర్ వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా ఒకేసారి మొత్తం ఉన్న రోడ్డును త్రవ్వి కొత్త రోడ్డు ను నిర్మిస్తుండడం మూలంగా వాహనచోదకులు, ప్రయాణికులు ప్రమాదాలను గురై మృత్యువాత పడుతున్నారు. అలాగే రోడ్డుకు కల్వర్టులు నిర్మిస్తున్న సమయంలో ముందుగా హెచ్చరిక బోర్డులు కానీ స్పీడ్ బ్రేకర్లు కానీ నిర్మించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే మా ర్గంలో ఇటీవల ఓ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు, అయినప్పటికీ రోడ్డు పను ల్లో నిబంధనలు పాటించని అంశాన్ని పట్టించుకోని అధికారులు.. ఇప్పుడు మట్టి తరలింపుపై కూడా స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సామన్‌చెరువు నుంచి మట్టి తరలిస్తున్న అంశంపై స్థానికులు ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
రెండు టిప్పర్లు, పొక్లెయినర్ సీజ్
జూలూరుపాడు : మట్టి అక్రమ తవ్వకాలపై జూలూరుపాడు తహసీల్దార్ వి.సురేష్‌కుమార్ కొరడా ఝుళిపించారు. కాకర్ల రెవిన్యూ గ్రామంలోని పాలగుట్ట సమీపంలో శనివారం అర్థరాత్రి పొక్లెయినర్‌తో అక్రమంగా తవ్వకాలు జరుపుతూ టిప్పర్లతో మట్టిని తరలిస్తుండగా తహసీల్దార్ వి.సురేష్‌కుమార్, రెవిన్యూ సిబ్బందితో కలిసి వెళ్లి అడ్డుకున్నారు. కాకర్ల రెవిన్యూ గ్రామంలో 82 సర్వే నంబర్‌లోగల ప్రభుత్వ సీలింగ్ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు పొక్లెయినర్‌తో మట్టి తవ్వి, చండ్రుగొండ మండలంలోని ఓ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి తరలిస్తున్నారు. ప్రభుత్వ సీలింగ్ భూమిలో సాగుతున్న ఈ అక్రమ తవ్వకాల విషయం తెలుసుకున్న తహసీల్దార్ అక్కడకు వెళ్లారు. తవ్వకాలను అడ్డుకున్నారు. పొక్లెయినర్, రెండు టిప్పర్లు స్వాధీనపర్చుకుని సీజ్ చేశారు. పొక్లెయినర్‌ను తరలించే అవకాశం లేకపోవడంతో దానిని కాకర్ల గ్రామంలో నిలిపేశారు. టిప్పర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేయాలని ఎస్సై ఇళ్ల రాజేష్‌తో చెప్పారు. -
ఇటుకల పరిశ్రమ పేరుతో నాగావళి ఒడ్డు గుల్ల
మట్టి మాఫియా!1990 మే 22–25వ తేదీలను గుర్తు చేస్తే చాలు సిక్కోలు నగరవాసులకు నాగావళి ఉగ్రరూపం గుర్తుకు వస్తుంది! లక్ష క్యూసెక్కులకు పైగా వరదనీరు పోటెత్తింది! శ్రీకాకుళం నగరానికి సమీపంలోనే గండి పడి సగం ఊరు నీటమునిగింది! ఈ గండికి కారణం ఏమిటో తెలుసా? నదీ తీరంలో ఇటుక బట్టీల కోసం గట్టుకు ఆనించి యథేచ్ఛగా మట్టి తవ్వేయడమే! ఇప్పుడు మళ్లీ నాగావళి తీర గ్రామాలకు, పంటపొలాలకు అలాంటి ప్రమాదమే పొంచి ఉంది! దీనికీ కారణం మట్టి మాఫియానే! ఈ మాఫియాలో ఓ టీడీపీ నాయకుడి కుమారుడి పాత్ర ఉండటం గమనార్హం!! సాక్షి,శ్రీకాకుళం : నాగావళి నదీతీరంలో పొలాలున్న రైతులకు తొలుత మట్టి మాఫియా ఎర వేస్తోంది. పొలంలో మెరక తీయడమే కాకుండా ట్రాక్టరు మట్టికి రూ.200 చొప్పున ఇస్తూ బుట్టలో వేస్తోంది. ఇలా జేసీబీతో తవ్విన మట్టిని ఇటుక బట్టీల యజమానులకు ట్రాక్టరుకు రూ.1000 చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటోంది. ఇలా రెండు లోడులు మట్టి రూ.2 వేలు పెట్టి కొంటే... అంటే దాదాపు ఒక ట్రాక్టరు లోడు (2 వేలు) ఇటుకలు తయారవుతాయి. వాటిని ఇటుక బట్టీల యజమానులు రూ.12 వేలకు అమ్ముతున్నారు. ఇక శ్రీకాకుళానికి తరలిస్తే ట్రాక్టరు లోడు రూ.14 వేల వరకూ తీసుకుంటున్నారు. తీరా సారవంతమైన పొలాలను త్యాగం చేసిన రైతులకు దక్కేది ట్రాక్టరు ట్రిçప్పునకు రెండొందలే! ఈ తాత్కాలిక ప్రయోజనం మాటెలా ఉన్నా భవిష్యత్తు ప్రమాదాన్ని ఊహించలేకపోతున్నారు. ఒడిశాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తే మర్నాడికే వరద పోటెత్తే నాగావళి నది తీరంలోని గ్రామాలకు, పంటపొలాలకు మట్టి మాఫియా స్వలాభం కోసం నెత్తిన కుంపటి పెడుతుందనే విషయాన్ని గమనించలేకపోతున్నారు. ఒక్కొక్కరూ మాఫియా ఉచ్చులోకి... ఆమదాలవలస మండలంలోని నాగావళి నదీ తీర ప్రాంతాల్లో సుమారు 15 కిలోమీటర్లు పొడవునా దాదాపు 300 ఎకరాలలో ప్రస్తుతం మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. పొక్లెయినర్లు, జేసీబీలతో నది ఒడ్డుకు ఆనుకొనే లోతుగా తవ్వేస్తున్నారు. ప్రధానంగా నిమ్మతొర్లాడ, సీపానపేట, పాత నిమ్మతొర్లాడ, కొత్తవలస, తొగరాం, కలివరం, ముద్దాడపేట, పీరుసాహెబ్‌పేట, దూసిపేట, దూసి ఆర్ఎస్, తోటాడ, గోపీనగర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆ ప్రాంతానికి చెందిన సాగునీటి సంఘానికి నాయకుడిగా ఉన్న టీడీపీ నేత కుమారుడే ఈ మట్టి మాఫియా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే రెండు భారీ జేసీబీలను కేవలం మట్టి తవ్వకాల కోసమే కొనుగోలు చేయడం దీనికి నిదర్శనం. ఈ మట్టితో స్థానికంగానే ఇటుక బట్టీలు వెలుస్తున్నాయి. ముఖ్యంగా కొర్లకోట, చీమలవలస, కొత్తవలస, దూసిపేట, పాత నిమ్మతొర్లాడ, నిమ్మతొర్లాడ తదితర గ్రామాల్లో ఇటుకల వ్యాపారులు కోట్ల రూపాయలకు పడగలెత్తారు. ఇది లాభసాటిగా ఉండటంతో చాలామంది ఇటుకల వ్యాపారులుగా అవతారం ఎత్తుతున్నారు. అలాగే రైతులు కూడా ఎంతోకొంత నగదు చేతికి వస్తుందనే ఆశతో తమ పొలాలను మట్టి మాఫియాకు అప్పగించేస్తున్నారు. ఏటా కొంతమేర పొరలుపొరలుగా మట్టిని తవ్వేయడం వల్ల పొలాలు నిస్సారమైపోయే ప్రమాదం కూడా ఉంది. మరోవైపు ముంపు ముప్పు పొంచి ఉంటుంది. గండి కొడితే అంతే సంగతులు.. పర్యావరణ చట్టంలోని నిబంధనల ప్రకారం నదీ గట్లకు సమీపంలో ఎలాంటి తవ్వకాలు చేయకూడదు. ఒడ్డుకు ఆనుకొని ఉన్న పొలాల్లో జేసీబీలు, భారీ యంత్రాలను దించకూడదు. గ్రీన్‌జోన్‌లోని చెట్లను తొలగించకూడదు. కానీ మట్టి కోసం మాఫియా అవేవీ పట్టించుకోవట్లేదు. ఇటుక బట్టీల కోసం ఎక్కడైనా మట్టి తవ్వకాలకు ముందస్తుగా రెవెన్యూ, మైన్స్, అటవీ శాఖల నుంచి అనుమతి తీసుకోవాలి. అలాగే వ్యవసాయ భూమిని వ్యాపార అవసరాలకు మార్పు చేస్తే ల్యాండ్ కన్వెర్షన్ కోసం ఆర్డీవో నుంచి అనుమతి తీసుకోవాలి. వాటిలో ఓ ఒక్క నిబంధనను అనుసరించకుండానే ఇటుక బట్టీల యజమానులు వ్యాపారం చేసుకుంటున్నారు. పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు వందల లోడుల మట్టిని కొండల్లా పోగేస్తున్నా టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి నదీతీరంలో మట్టి తవ్వకాలను నిలువరించకపోతే నాగావళి నది గండి కొట్టే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడైనా లక్ష క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తితే తీరంలోని గ్రామాలకు, పంట పొలాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంటుంది. -
నిమ్మకూరులో మట్టి మాఫియా
సాక్షి , అమరావతిబ్యూరో: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపణలు అక్షరాలా నిజం చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. చినబాబు లోకేష్ దత్తత గ్రామంలో నీరు–చెట్టు పథకంలో భారీ అవినీతి చోటుచేసుకుంది. చెరువును నిబంధనలకు విరుద్ధంగా తవ్వి మట్టిని అమ్మిసొమ్ము చేసుకుంటున్నారు. చినబాబు దత్తత గ్రామం కావడంతో అధికారులు సైతం ఆ వైపు కన్నెత్తి చూడటంలేదు. మంత్రి నారా లోకేష్ దత్తత తీసుకున్న నిమ్మకూరు గ్రామంలో 8 ఎకరాల ఊర చెరువును నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా చెరువు అభివృద్ధి పనులను గత నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రారంభించారు. దీనిలో భాగంగా తొలుత చెరువులోని మట్టి తవ్వకాలు మొదలుపెట్టారు. చినబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న గ్రామస్థాయినేత ఓ వ్యక్తి చెరువుమట్టిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. నిబంధనల ప్రకారం 3 మీటర్ల మాత్రమే చెరువును తవ్వాల్సి ఉండగా దీనికి విరుద్ధంగా 15 నుంచి 20 మీటర్ల వరకు మట్టిని తోడేస్తూ విక్రయిస్తున్నారు. ట్రాక్టరు మట్టి రూ.300.. ఒక్కో ట్రాక్టరు మట్టి ని రూ.300 చొప్పున గ్రామంలోని వ్యాపార, వాణిజ్య, రహదారి నిర్మాణాదారులకు విక్రయిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు మూడొందలు వంతున స్థానిక నేతకు ముట్టజెప్పాలి. ఆపై ట్రాక్టర్ యజమాని మాత్రం అదనంగా అమ్ముకోవాలి.. గత నెలలో ప్రారంభమయిన చెరువు పూడికతీత పనుల్లో ఇప్పటి వరకు సుమారు 6 వేల ట్రాక్టర్ల మట్టి విక్రయించినట్లు తెలుస్తోంది . మట్టి అమ్మకాలకు సుమారు రూ.7లక్షల వరకు ఆ నేత లబ్ధిపొందినట్లు సమాచారం. మట్టి విక్రయాలతో పాటు పూడికతీత పనులకు నీరు–చెట్టు పథకం ద్వారా మంజూరు చేసిన దాదాపు రూ.8.5 లక్షలు నిధులు కూడా మిగులుదల అయినట్లేనని స్థానికలు ఆరోపిస్తున్నారు. మట్టి విక్రయాల ద్వారా ఆదాయం రుచిమరిగిన ఆ నేత ఆ చెరువు పక్కనేఉన్న చిన్న చెరువుల నుంచి 10 వేల ట్రాక్టర్ల మట్టిని తవ్వేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. కన్నెత్తి చూడని అధికారులు.. నిమ్మకూరు గ్రామంలో ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్నా ఏ అధికారి పట్టించుకోక పోవడం దారుణం. లోకేష్ దత్తత గ్రామంలోని ఈ విధమైన మట్టి మాఫియా టీడీపీ అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తోందని అర్థమవుతోంది. కలెక్టరు సైతం పట్టించుకోకపోవడం దురదృష్టకరం. -
కాలువ మింగేస్తోంది
తాడేపల్లిగూడెం : గోదావరి ఏలూరు కాలువ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. 18 రోజుల వ్యవధిలో ముగ్గురిని బలితీసుకుంది. మట్టిమాఫియా అకృత్యాలతో కాలువ గర్భానికి తూట్లు పడ్డాయి. ప్రమాదాలకు ఇదే కారణమవుతోంది. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. వీటిని నివారించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. గోదావరి ఏలూరు కాలువ కాల నాగులా మారింది. 18 రోజుల వ్యవధిలో అందులో మునిగి ముగ్గురు మరణించారు. ఫలితంగా కాలువ వారున ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ కాలువ వద్ద వరుస ప్రమాదాలు జరగడం ఇదే తొలిసారి. ముగ్గురూ యువకులే ఇటీవల మరణించిన ముగ్గురూ యువకులే. ఎదిగిన కొడుకులు కుటుంబాలకు ఆసరాగా నిలుస్తారనుకున్న సమయంలో ఇలా ప్రమాదాల్లో మరణించడంతో ఆ కుటుంబాలు తీరని శోకంలో మునిగిపోయాయి. గతనెల 29న స్థానిక వాసవీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి మాకా ఫణికుమార్ ఈత నేర్చుకోడానికి వెళ్లి, కాలువలో గల్లంతయ్యాడు. దేవాదాయశాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చొరవ తీసుకుని కొవ్వూరు నుంచి మరబోట్లు, గజఈతగాళ్లను తీసుకొచ్చి యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు. 24 గంటల అనంతరం యువకుని మృతదేహం కడకట్ల వద్ద లభ్యమైంది. ఈ ఘటనను మరువకుండానే కడకట్లకు చెందిన మారిశెట్టి గోవిందరావు ఒకరి దహన కార్యక్రమాలకు హాజరై స్నానానికి కాలువలో దిగి ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయాడు. మరునాటికి కాని అతని మృతదేహం దొరకలేదు. తాజాగా మంగళవారం జువ్వలపాలెంకు చెందిన ఓ యువకుడు నాయనమ్మ అంత్యక్రియల కోసం వెళ్లి గల్లంతై మరణించాడు. మట్టిమాఫియా తూట్లు పొడవడం వల్లేనా! కాలువ వెంబడి మట్టి మాఫియా చెలరేగిపోయింది. కాలువ గర్భానికి, గట్లకు తూట్లు పొడిచింది. దీనివల్ల కాలువలో గోతులు ఏర్పడ్డాయి. ఇవి కాలువలోకి దిగిన యువకులను మింగేస్తున్నాయి. మాఫియాను నియంత్రించలేని అధికారులు ప్రమాదాలను ఆపలేకపోతున్నారు. కాలువ వెంబడి పర్యవేక్షించేవారు కరువయ్యారు. కనీసం హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. గతంలో వేసవిలో కాలువలో పేరుకున్న చెత్తాచెదారాన్ని తొలగించి గోతులను పూడ్చేవారు. అయితే అలాంటి పనులకు ఇటీవల తిలోదకాలిచ్చారు. ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ గట్లపై పహారా, హెచ్చరిక బోర్డులు ఏర్పాట చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
మట్టిమాఫియా బరితెగింపు
‘ పచ్చ’ నేతల దోపిడీ మౌనంగా అధికారులు నూజివీడు: టీడీపీ ప్రభుత్వ హయాంలో మాఫియాలు పేట్రేగిపోతున్నాయి. ‘పచ్చ పార్టీ’ అండదండలతో కొంతమంది మాఫియాగా ఏర్పడి ప్రభుత్వ సంపదను దోచుకుంటున్నారు. ఇసుక, మట్టి, కాల్‌మనీ.. ఇలా అనేక మాఫియాలు నిరంతరం దోపిడీనే పనిగా పెట్టుకున్నాయి. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం సూరవరం వద్ద పోలవరం మట్టిని మాఫియా పట్టపగలు యథేచ్ఛగా తరలిస్తోంది. లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టి పోలవరం కుడికాలువ కట్టలపై ఉండకుండా రాత్రిపగలు అనే బేధం లేకుండా తరలిస్తున్నారు. అధికార బలంతోనే.. అధికార బలంతో మట్టి తరలిపోతుండటంతో అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. సూరవరం వద్ద పోలవరం కాలువ వెంబడి ఉన్న మట్టిని మాఫియాదారులు పామర్రు మండలం నిమ్మకూరుకు తరలిస్తున్నారు. అడిగేవారే లేకపోవడంతో ఇష్టారాజ్యంగా పదుల సంఖ్యలో టిప్పర్లను ఒకేసారి ఏర్పాటు చేసి మట్టిని తరలించేస్తున్నారు. పేదలకో న్యాయం.. ఎవరైనా పేదవాడు అవసరమై ఒక ట్రక్కు ఇసుక గాని, మట్టిగాని తెచ్చుకుంటుంటే వీఆర్వోలు, పోలీసులు వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారే గాని సహజ సంపద అయిన మట్టిని అడ్డగోలుగా దోచుకుంటున్నప్పటికీ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇంతభారీగా పోలవరం కాలువ మట్టిని తరలిస్తుండటంతో పలువురు గ్రామస్తులు లారీలను ఆపి ఎక్కడకు వెళ్తోందని అడిగితే నిమ్మకూరులోని ఎన్టీఆర్ బంధువులకు అని డ్రైవర్లు చెబుతున్నారు. టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు.. ఆగిరిపల్లి మండలం కొత్త సూరవరానికి చెందిన గ్రామస్థులు టిప్పర్లను నిలిపి, మట్టిని తరలించడానికి అనుమతులు ఉన్నాయా, లేవా, లేకుండా ఎందుకు తోలుతున్నారంటూ బుధవారం డ్రైవర్లను నిలదీశారు. అయినప్పటికీ డ్రైవర్ల వినకుండా తోలుతుండటంతో ఆగిరిపల్లి ఎస్ఐకు సమాచారమందించారు. దీంతో ఎస్ఐ తన సిబ్బందిని పంపించి తోలకాలను నిలిపివేయించారు. మొదటి నుంచి అంతే.. గతేడాది కాలం నుంచి పోలవరం కుడికాలువ మట్టిని తరలించేస్తున్నారు. కొత్తగా తవ్విన కాలువకు సంబంధించి 10 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వగా అందులో దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించేశారు. వైఎస్ హయాంలో కాలువను 80 శాతం వరకు తవ్వగా అప్పట్లో వచ్చిన మట్టి అంతా నేటికీ కాలువ వెంబడి పెద్దపెద్ద గుట్టలుగా అలాగే ఉంది. గతేడాది నూతనంగా తవ్విన ప్రాంతంలో మాత్రం ఒక్క ట్రక్కు మట్టికూడా లేదు. దీనిని బట్టే మట్టిదోపిడీ ఎలా సాగుతుందో చెప్పవచ్చు. మట్టితోలకాలపై ఎస్ఐ రాజేందరప్రసాద్ను వివరణ కోరగా పోలవరం కాలువకు సంబంధించిన అధికారులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని చెప్పారు. -
అడ్డుకుంటే ... అంతే
► చేబ్రోలు మండలంలో పెచ్చుమీరిన ‘అధికార’ దౌర్జన్యాలు ► చెరువులు తవ్వుకుని సొమ్ము చేసుకుంటున్న టీడీపీ పెద్దలు ► మట్టి మాఫియాను అడ్డుకుంటున్నవారిపై అక్రమ కేసులు ► సుద్దపల్లిలో వైఎస్సార్ సీపీకి చెందిన ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ కేసు ► పోలీసులను అడ్డుపెట్టుకుని ఊరూరా అక్రమాలు, అరాచకాలు అక్కడ వారి మాటే శాసనం.. వారు చెప్పిందే వేదం.. దౌర్జన్యంగా చెరువుల్లో మట్టి అమ్ముకున్నా... మాఫియాలా దందా సాగించినా. పొరపాటున ఆగడాలను అడ్డుకుంటే అక్రమ కేసులు. అదీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద. ఇలా ఒకటా రెండా అడ్డొచ్చినా ప్రతిచోటా ఇదే టెక్నిక్. చివరకు ఫాల్స్ అంటూ కేసులు తీసి వేయించడం. పొన్నూరు నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతకు వరసకు సోదరుడైన వ్యక్తి అక్రమాల చక్రం తిప్పుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. పోలీసులను కరివేపాకులా వాడుకుంటున్నాడు. సాక్షి, గుంటూరు : పొన్నూరు నియోజకవర్గంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మట్టి మాఫియా ముసుగులో టీడీపీ నేతలు చేస్తున్న దౌర్జన్య కాండ ఇది. వివరాల్లోకి వెళితే.. చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలోని 7.15 ఎకరాల విస్తీర్ణం ఉన్న సూరాయకుంటలో అధికార పార్టీ నేతలు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఒక్కో ట్రక్కు మట్టిని రూ.800 లకు విక్రయిస్తున్నారు. నీరు - చెట్టు పేరుతో ఆ శాఖ అనుమతులు లేకుండా మట్టి తవ్వి అమ్ముకోవడాన్ని గ్రామ ఎంపీటీసీ, పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు ప్రశ్నించారు. ఆగడాలను అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయించారు. ఎస్సీ వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించారు. కేసు దర్యాప్తు పూర్తి కాకముందే ముగ్గురిని అదుపులోకి తీసుకుని రెండు రోజులు స్టేషన్లో నిర్బంధించారు. ఫిర్యాదు చేసిందే తడవుగా కేసునమోదు చేయడంతోపాటు, అంతే వేగంగా తెల్లవారేసరికి దర్యాప్తు అధికారి సైతం గ్రామానికి వచ్చేశారు. దీనికంతటికీ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నేతే కారణమని ప్రజలు బహిరంగంగా చెపుతున్నారు. అంతేకాక, చేబ్రోలు మండలంలో అక్రమ కేసులు బనాయించడం కొత్తేమీ కాదంటున్నారు. తాళ్లకుంట, శలపాడులోనూ ఇంతే... గతంలో చేబ్రోలు గ్రామంలోని తాళ్లకుంట చెరువులో నీరు -చెట్టు పేరుతో మట్టిని అక్రమంగా తవ్వేస్తూ అమ్ముకుంటున్న విషయంపై నిలదీశారనే కక్షతో ముసలా వేణు అనే వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. అడ్డు వచ్చిన వారికి ఇదేగతి పడుతుందనే హెచ్చరిక పంపారు. మట్టి తవ్వకాలు పూర్తయ్యే వరకు కేసును నాన్చి ఆ తరువాత ఫాల్స్ కింద తీసేశారు. శలపాడు గ్రామంలో సైతం ఇదే టెక్నిక్ ఉపయోగించారు. మట్టి తవ్వకాన్ని అడ్డుకున్నారనే కక్షతో ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేయించారు. అక్కడ కూడా తమపని అయిపోగానే ఆ కేసులు తీసివేయించారు. గొడవర్రులో తమ అక్రమాలకు అడ్డు తగులుతున్నారనే కక్షతో ఒకరిపై కేసు నమోదు చేయించారు. మట్టి మొత్తం తవ్వేసి అమ్ముకున్న తరువాత కేసు తీసివేయించారు. పోలీసు శాఖను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు పొన్నూరు నియోజకవర్గంలో చేస్తున్న అరాచకాలు అన్నీ,ఇన్నీ కావు. దౌర్జన్యం, లేదా అక్రమ కేసు. ఇలా తమ కు అడ్డు తగిలిన వారిపై కక్షసాధింపు చర్యలకు దిగుతూ నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి పొన్నూ రు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
మట్టినీ మింగేస్తున్నారు
అధికార పార్టీ నాయకులు కళ్లు మూసుకున్న అధికారులు కోట్లకు పడగలెత్తుతున్న అధికారపార్టీకి చెందిన మాఫియా మట్టిని కూడా వదలడం లేదు. మట్టిని అమ్ముకుని కోట్లకు పడగలెత్తుతోంది. అధికారపార్టీ నాయకుల ఒత్తిడితో విజిలెన్స్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. నూజివీడు: నూజివీడు మండలం పల్లెర్లమూడి దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణాలో కుడి కాల్వ కలిసే వరకు పనులు జరుగుతున్నాయి. 80మీటర్ల వెడల్పు తవ్వాల్సిన కాలువను గతేడాది ఆగస్టులో 40మీటర్లు మాత్రమే తవ్వి నీటిని వదిలారు. మిగిలిన వెడల్పు తవ్వే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. తవ్విన మట్టిని కాల్వకట్టలపైనే పక్కగా పోయాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా అధికారపార్టీకి చెందిన మట్టి మాఫియా గుడివాడ, గన్నవరం, ఉయ్యూరు, పామ ర్రు, పశ్చిమగోదావరి తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మట్టిమాఫియా కొంతమంది రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఆమ్యామ్యాలు సమర్పించుకుంటున్నట్లు సమాచారం. పలు గ్రామాల పరిధిలో ఉన్న క్వారీ గోతులు పూడ్చటానికి మట్టిని తరలిస్తున్నారు. పల్లెర్లమూడి వద్ద నుంచి మర్రిబంధం వరకు పోలవరం కాలువను తవ్వగా 8.30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వచ్చింది. అందులో దాదాపు 5లక్షల క్యూబిక్‌మీటర్ల మట్టిని గతంలోనే అమ్మేసుకున్నారు. క్యూబిక్ మీటరు మట్టికి ప్రభుత్వం రూ.30 ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే తరలిపోయిన మట్టి విలువ రూ.1.50కోట్లు ఉంటుంది. నూజివీడు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీతారామపురం గ్రామస్తులు గతేడాది సెప్టెంబరులో ఫిర్యాదుచేశారు. మట్టితో వెళుతున్న గ్రావెల్ టిప్పర్లను పోలీసులకు పట్టిస్తే వాటిని ఆర్డీవో రూ.5వేలు జరిమానా విధించారు. అధికారులపై మంత్రి ఒత్తిళ్లు మట్టి తరలింపును పట్టించుకోవద్దని జిల్లాకు చెందిన మంత్రి విజిలెన్స్ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. నూజివీడు డివిజన్లోని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు విజిలెన్స్ అధికారులు వస్తే పశ్చిమగోదావరి జిల్లాలో అడ్డగోలుగా మట్టిని తరలించి అమ్ముకుంటుంటే అక్కడ ఎందుకు ఆపడంలేదని ప్రశ్నించడంతో వెనుదిరిగి వెళ్లినట్లు తెలిసింది. తహశీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నాం మట్టి బయటకు పోవడానికి వీల్లేదని, పనులు చేస్తున్న ఏజన్సీకి తెలియజేశాం. మట్టి తరలిపోతున్న విషయం మా దృష్టికి వచ్చినప్పుడల్లా తహశీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నాం. వారు చర్యలు తీసుకోవాల్సి ఉంది.-పద్మిని, పోలవరం కాలువ డీఈ మట్టిని దోచేస్తున్నారు పోలవరం కాలువ మట్టిని యథేచ్చగా దోచేస్తున్నారు. పగలు కంటే రాత్రిపూట మట్టిని ట్రాక్టర్లు, లారీల్లో తరలించేస్తున్నారు. పోలీసులు గాని, రెవెన్యూ అధికారులు గాని ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారపార్టీ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారు.-దేవరకొండ మధు, వైఎస్సార్సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు -
ఎట్టకేలకు మట్టి మాఫియాకు చెక్
* ఆత్మకూరు చెరువు భూమి తవ్వకాల్లో అక్రమాలు * ‘సాక్షి’ కథనాలతో విజిలెన్స్, మైనింగ్ అధికారుల్లో కదలిక * వే బిల్లులు ఇచ్చేందుకు నిరాకరణ * లెసైన్సు రద్దు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఆత్మకూరు (మంగళగిరి రూరల్) : ఆత్మకూరు చెరువు భూమిలోని మట్టి తవ్వకాలకు ఎట్టకేలకు అధికారులు చెక్ పెట్టారు. గత నవంబర్ నుంచి నిర్విరామంగా మట్టిని తవ్వుకుంటూ కోట్ల రూపాయలకు అమ్ముకుని సొమ్ముచేసుకున్న మట్టి మాఫియాకు అధికారులు అనుమతులు నిలిపివేశారు. వే బిల్లులు ఈనెల 20వరకు మాత్రమే వుండడంతో మట్టి రవాణాకు తిరిగి వే బిల్లులు ఇచ్చేందుకు మైనింగ్ అధికారులు నిరాకరించారు. మట్టి అక్రమ తవ్వకాలపై సాక్షి పత్రికలో ప్రచురితమైన పలు కథనాలపై స్పందించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఉన్నతాధికారులను కలసి అక్రమ మట్టి, ఇసుక రవాణాలను అరికట్టాలని కోరారు. ఆ మేరకు విజిలెన్స్, మైనింగ్ అధికారులు మట్టి తవ్వకాలను పరిశీలించారు. అక్రమాలు వాస్తవమేనని నిర్ధారించి సంబంధిత కాంట్రాక్టర్ నుంచి జరిమానా వసూలు చేయడంతో పాటు లెసైన్స్ రద్దుచేయాల్సిందిగా ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఉన్నతాధికారులు ఇచ్చిన వేబిల్లుల వరకు అనుమతులు ఇవ్వాలని, తదుపరి వే బిల్లులు మంజూరు చేయవద్దంటూ ఆదేశాలు జారీఅయ్యాయి. దీంతో మట్టి తవ్వకాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. జిల్లా అధికారులు మట్టితవ్వకాలకు సంబంధించి వే బిల్లులు మంజూరు చేయబోమని, మట్టి రవాణా నిలిచిపోయినట్లేనని చెబుతుంటే.. మండల అధికారులు మాత్రం కాంట్రాక్టర్‌కు 2015 వరకు అనుమతులు వున్నాయని, త్వరలోనే తిరిగి మట్టి తవ్వకాలు కొనసాగించుకోవచ్చని చెప్పడం గమనార్హం! ఈ విషయమై మైనింగ్ ఏడీ జగన్మాథరావును వివరణ కోరగా ఈనెల 20వ తేదీతో వే బిల్లుల కాలపరిమితి అయిపోయిందని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేవరకు ఇక ఎటువంటి వే బిల్లులు మంజూరు చేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి లెసైన్స్ రద్దు చేయాలని నివేదిక పంపామని, అందుకనుగుణంగా వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఏడీ తెలిపారు. -
నిబంధనలు మట్టిపాలు
మట్టిమాఫియా పేట్రేగిపోతోంది. నిబంధనలకు నీళ్లొదిలి యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుపుతోంది. పొక్లెయిన్లతో తవ్వేస్తూ... రోజూ వందలాది వాహనాలతో రవాణా చేస్తోంది. అధికారులు చోద్యం చూస్తుండటంతో లక్షలాదిరూపాయలు అక్రమంగా ఆర్జిస్తోంది. లారీలు... ట్రాక్టర్ల జోరుతో పల్లెలోని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మంగళగిరి మండలంలోని ఆత్మకూరు గ్రామాన్ని ఆనుకుని వున్న చెరువు మట్టి మాఫియాకు కల్పతరువుగా మారింది. కోట్లాదిరూపాయలు ఆర్జించి పెడుతోంది. ప్రజలంతా వర్షాలు కురవాలని దేవుడిని వేడుకుంటుంటే ఈ మట్టి మాఫియా మాత్రం వర్షాలు కురవకపోతేనే బాగుంటుందని పూజలు చేయిస్తుండం వారి ధన దాహానికి అద్దం పడుతోంది. వర్షం పడితే మట్టి తోలకాలు నిలిచిపోతాయని భావించిన మాఫియా 10 రోజులుగా ఎన్నడూ లేని విధం గా 10 పొక్లెయిన్ల్లతో మట్టిని తవ్వేస్తూ 200 ట్రాక్టర్లు, 150కు పైగా లారీలతో రోజుకు 1500 నుంచి 2వేల ట్రిప్పుల మట్టిని తరలించేస్తున్నారు. 24 గంటలూ లారీలు, ట్రాక్టర్ల రాకపోకలతో ఆత్మకూరు రోడ్డు, ఇప్పటం రోడ్డు, మంగళగిరి పట్టణం హడావుడిగా మారిపోతోంది. వాటి వేగానికి ఆయా రోడ్లలో ప్రజలు తిరగాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ము ఖ్యంగా ట్రాక్టర్లు లౌడ్ స్పీకర్లతో... మట్టి ఓవర్ లోడ్లతో పట్టణ రోడ్ల వెంబడి పరుగులెత్తిస్తుం డటం అక్కడి ప్రజలకు తలనొప్పిగా తయారైంది. అధికార పార్టీ నేతల అండతో... ఆత్మకూరు గ్రామంలో చెరువు పూడిక తీసేందుకు 202/1 సర్వే నంబరులోని 89 ఎకరాల్లో 10 ఎకరాలు కుమ్మరి వృత్తిదారులకు కేటాయించారు. మిగిలిన 79 ఎకరాల్లో మట్టి తీసేందుకు అనుమతులు పొందిన మట్టి మాఫియా ఇష్టానుసారం చెరువు మొత్తం తోడేస్తుండటంతో వర్షాకాలం వస్తే నీరు నిలిచి గ్రామం ముంపుబారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మట్టి తీసేందుకు 6 మీటర్లలోతువరకే అనుమతులు వుండగా ఈ మాఫియా 15 నుంచి 20 మీటర్లలోతులో మట్టిని తీసి సొమ్ము చేసుకుంటున్నారు. వీరికి స్థానిక అధికార పార్టీ నాయకులే కాకుండా... అధికారులు సైతం పరోక్షంగా సహకరిస్తుండటం విశేషం. దీంతో రెచ్చిపోతున్న మాఫియా పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలూ మట్టిని తరలించేస్తున్నారు. వీరికి విజయవాడకు చెందిన అధికార పార్టీ నేతల అండదండలుండటమే కారణమని తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి మట్టి తవ్వకాలను నిలువరించి గ్రామాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఈమనిలోనూ అంతే... ఈమని(దుగ్గిరాల) : మండలంలోని ఈమని గ్రామ పరిధిలో నల్లమట్లి మాఫియా పెట్రేగి పోతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో పొలాల్లోని మెరకలు చదును చేసుకుంటున్నామంటూ ట్రాక్టర్ల కొద్ది నల్లమట్టిని తవ్వి అమ్మకాలు సాగిస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏకంగా పొక్లెయిన్తోనే మట్టి తవ్వేస్తున్నారు. దూరాన్ని బట్టి ఒక్కో ట్రాక్టర్ రూ.1000 నుంచి రూ.1500 వరకు సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మట్టిలోడుతో గ్రామంలో ట్రాక్టర్లు స్వైర విహారం చేస్తున్నాయని, దీంతో రాకపోకలకు సైతం ఇబ్బందిగా ఉంటోందని, పాఠశాలలకు విద్యార్థులు వెళ్ళేందుకు కూడా ఇబ్బందిగా ఉంటోందని స్థానికులు చెప్పారు. ఇప్పటికైనా మట్టి తవ్వకాలపై సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.