కాలువ మింగేస్తోంది | kaluva mingestondi | Sakshi
Sakshi News home page

కాలువ మింగేస్తోంది

Published Thu, Aug 18 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

కాలువ మింగేస్తోంది

కాలువ మింగేస్తోంది

తాడేపల్లిగూడెం : గోదావరి ఏలూరు కాలువ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. 18 రోజుల వ్యవధిలో ముగ్గురిని బలితీసుకుంది. మట్టిమాఫియా అకృత్యాలతో కాలువ గర్భానికి తూట్లు పడ్డాయి. ప్రమాదాలకు  ఇదే కారణమవుతోంది. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. వీటిని నివారించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. గోదావరి ఏలూరు కాలువ కాల నాగులా మారింది. 18 రోజుల వ్యవధిలో అందులో మునిగి ముగ్గురు  మరణించారు. ఫలితంగా కాలువ వారున ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ కాలువ వద్ద వరుస ప్రమాదాలు జరగడం ఇదే తొలిసారి. 
ముగ్గురూ యువకులే 
ఇటీవల మరణించిన ముగ్గురూ యువకులే. ఎదిగిన కొడుకులు కుటుంబాలకు ఆసరాగా నిలుస్తారనుకున్న సమయంలో ఇలా ప్రమాదాల్లో మరణించడంతో ఆ కుటుంబాలు తీరని శోకంలో మునిగిపోయాయి. గతనెల 29న స్థానిక వాసవీ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థి మాకా ఫణికుమార్‌ ఈత నేర్చుకోడానికి వెళ్లి, కాలువలో గల్లంతయ్యాడు. దేవాదాయశాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చొరవ తీసుకుని కొవ్వూరు నుంచి మరబోట్లు, గజఈతగాళ్లను తీసుకొచ్చి యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు. 24 గంటల అనంతరం యువకుని మృతదేహం కడకట్ల వద్ద లభ్యమైంది. ఈ ఘటనను మరువకుండానే కడకట్లకు చెందిన మారిశెట్టి గోవిందరావు ఒకరి దహన కార్యక్రమాలకు హాజరై స్నానానికి కాలువలో దిగి ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయాడు. మరునాటికి కాని అతని మృతదేహం దొరకలేదు. తాజాగా మంగళవారం జువ్వలపాలెంకు చెందిన ఓ యువకుడు నాయనమ్మ అంత్యక్రియల కోసం వెళ్లి గల్లంతై మరణించాడు. 
మట్టిమాఫియా తూట్లు పొడవడం వల్లేనా! 
కాలువ వెంబడి మట్టి మాఫియా చెలరేగిపోయింది. కాలువ గర్భానికి, గట్లకు తూట్లు పొడిచింది. దీనివల్ల కాలువలో గోతులు ఏర్పడ్డాయి. ఇవి కాలువలోకి దిగిన యువకులను మింగేస్తున్నాయి. మాఫియాను నియంత్రించలేని అధికారులు ప్రమాదాలను ఆపలేకపోతున్నారు. కాలువ వెంబడి పర్యవేక్షించేవారు కరువయ్యారు. కనీసం హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. గతంలో వేసవిలో కాలువలో పేరుకున్న చెత్తాచెదారాన్ని తొలగించి గోతులను పూడ్చేవారు. అయితే అలాంటి పనులకు ఇటీవల తిలోదకాలిచ్చారు. ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ గట్లపై పహారా, హెచ్చరిక బోర్డులు ఏర్పాట చేయాలని స్థానికులు కోరుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement