ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
చెరువు మట్టి కొల్లగొట్టి అందినకాడికి దండుకుంటున్న వైనం
రాత్రిళ్లు ఇష్టానుసారం తవ్వకాలు.. అడ్డొస్తే బెదిరింపులు
ఒక్కో టిప్పర్ మట్టి రూ.25 వేల చొప్పున ఇటుక బట్టీలకు విక్రయం
రోజూ 100 ట్రిప్పులు.. రూ.25 లక్షలు జేబుల్లోకి
కళ్లు మూసుకున్న పోలీస్, రెవెన్యూ, మైనింగ్, అటవీ శాఖలు
ఆళ్లగడ్డ: మట్టి మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు.. చివరకు చెరువులను సైతం వదిలి పెట్టడం లేదు. రేయింబవళ్లు ప్రొక్లెయిన్‌లతో యథేచ్ఛగా తవ్వేస్తూ భారీ టిప్పర్లు, లారీల్లో తరలిస్తున్నారు. ఎవరైనా అడ్డు చెబితే వారిపై దాడులకు కూడా వెనుకాడడం లేదు. ‘మేం ఎమ్మెల్యే భర్త తాలుకా.. అధికారం మాది.. మీరెవరు అడగడానికి..’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అయినా మాట వినకపోతే అక్రమ కేసులు బనాయించడానికి బరితెగించారు.
ఈ దారుణాలకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం వేదికైంది. ఈ ప్రాంతంలో ఇటుకల బట్టీలు ఎక్కువ. వాటికి అవసరమయ్యే ఎర్ర మట్టిని చలి కాలంలో తోలుకుని నిల్వ చేసుకుంటారు. ఇదే అదునుగా భావించిన నియోజకవర్గం టీడీపీ కీలక నేత.. తన మనుషులను పెట్టి, కోటకొండ చెరువులో భారీగా ప్రొక్లెయినర్లు మోహరించి రాత్రిళ్లు తవ్వకాలు సాగించి తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌లో 35 టన్నుల చొప్పున రోజూ 100 టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నారు.
ఫిర్యాదులందినప్పటికీ.. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, అటవీ, మైనింగ్ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. రాత్రిళ్లు మట్టి తరలించేటప్పుడు 20 మంది గూండాలు కాపలాగా ఉంటున్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి రాయల్టీ చెల్లించకుండా యథేచ్ఛగా దండుకుంటున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ.25 వేల చొప్పున ఇటుకల బట్టి నిర్వాహకులు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క రోజులోనే రూ.25 లక్షలు వెనకేసుకుంటున్నారు. కోటకొండ నుంచి గాజులపల్లె వరకు ఉన్న తెలుగు గంగ ప్రధాన కాలువ కట్టపై నుంచి మట్టి తరలిస్తున్నారు.
35–40 టన్నుల బరువున్న వాహనాలు వెళ్తుండటం వల్ల కట్ట ధ్వంసం అవుతోంది. తమ పొలంలోకి వెళ్లేందుకు కట్టను కాస్త చదును చేస్తే మాత్రం కేసులు పెట్టి వేధించిన అధికారులు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, రైతుల నుంచి భూమి లీజుకు తీసుకుని మట్టి తరలించే వ్యాపారులకు మాత్రం అధికారులు సవాలక్ష నిబంధనలు విధిస్తుండటం గమనార్హం.
‘జేసీబీలు పెట్టకూడదు. మూడు అడుగులు కంటే లోతు తీయకూడదు. పెద్ద మిషన్లు, టిప్పర్లు ఉపయోగించకూడదు. దారిలో దుమ్ము లేవకుండా నీళ్లు కొట్టాలి’ అని చెబుతున్నారు. విచ్చలవిడిగా సాగుతున్న ఈ దందాను మాత్రం గాలికొదిలేశారు.
కట్ట ధ్వంసం చేసి.. రోడ్డేసి..
ఇది కోటకొండ కల్యాణి చెరువు కట్ట. ఈ చెరువు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల పరిధిలో ఉండటంతో పాటు కట్ట పక్కనే రిజర్వు ఫారెస్ట్ ట్రెంచ్ ఉంది. అయినప్పటికీ చెరువు కట్టను చదును చేసి రోడ్డు వేసి అక్రమంగా మట్టి దందా సాగిస్తున్నారు. ఒక వేళ మళ్లీ కట్ట నిర్మించినా, అంత బలంగా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
మట్టి దందా గురించి మైనర్ ఇరిగేషన్ ఏఈ రఘురాంను వివరణ కోరగా.. ‘చెరువులో మట్టిని తోలుకునేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. మట్టి తోలుతున్నట్లు మా దృష్టికి రాలేదు. తక్షణమే పరిశీలించి అక్రమ మట్టి తవ్వకాలు సాగించే వారిపై చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment