అడ్డూ.. అదుపు లేదు | Scattered excavation of soil and gravel in Guduru Division | Sakshi
Sakshi News home page

అడ్డూ.. అదుపు లేదు

Published Mon, Aug 26 2024 5:21 AM | Last Updated on Mon, Aug 26 2024 5:21 AM

Scattered excavation of soil and gravel in Guduru Division

గూడూరు డివిజన్‌లో విచ్చలవిడిగా మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు

దేవుడు మాన్యం.. పంట పొలం..ప్రభుత్వ భూమి అనే బేధాలు లేవు

ఎవరైనా అడ్డుకుంటారని భయమూ లేదు..

ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వుకోవడం.. అమ్ముకోవడమే..

కాంట్రాక్టర్లను బెదిరించి కమీషన్ల వసూలు 

ఆపై ఎకరం మట్టికి రూ.5లక్షలు... యూనిట్‌కు రూ.350 

డివిజన్‌లో చెలరేగిపోతున్న ముగ్గురు టీడీపీ నేతలు

కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుపతి జిల్లా గూడూరు డివిజన్‌లో మట్టి, గ్రావెల్‌ మాఫియా చెలరేగిపోతోంది. దేవుని మాన్యం... అటవి భూమి... ప్రభుత్వ పోరంబోకు... పంట పొలం... అనే తారతమ్యం లేకుండా తవ్వేస్తోంది. భారీ యంత్రాలతో 30 అడుగుల మేర తవ్వి పచ్చటి పొలాలను, ప్రభుత్వ భూము­లను చెరువు­లుగా మార్చే­­స్తోంది. రోజూ వందలాది టిప్పర్లు, లారీల ద్వారా మట్టి, గ్రావెల్‌­(చిన్న చిన్న రాళ్లతో కూడిన మట్టి)ను తరలించి కోట్ల రూపా­యలను ఆర్జిస్తోంది. గూడూరు, సూళ్లూ­రు­పేట, వెంకటగిరి నియోజకవ­ర్గాల పరిధిలో మగ్గురు అధికార పార్టీ ముఖ్య నేతల కనుసన్నల్లో ఈ మట్టి, గ్రావెల్‌ దందా సాగుతోంది.  – సాక్షి టాస్క్‌ఫోర్స్‌

రైతులు నోరెత్తకుండా చేసిన మట్టి మాఫియా నేతలు.. ఆ తర్వాత కాంట్రాక్టర్లను టార్గెట్‌ చేశారు. గూడూరు డివిజన్‌ పరిధిలో గత ప్రభుత్వం సము­ద్రతీరం నుంచి జాతీయ రహదారిని కలుపుతూ రూ.2,203 కోట్లతో చేపట్టిన సాగరమాల, భారత­మాల పనులతోపాటు మరికొన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల­తో మట్టి మాఫియా నేతలు సమావేశ­మయ్యారు. పనులు యథాతథంగా కొనసాగాలంటే కమీషన్ల రూపంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

తాము అడిగినంత ఇస్తేనే మట్టి, గ్రావెల్‌ తీసుకు­వెళ్లేందుకు అనుమతి­స్తామని హెచ్చరించారు. అప్ప­టికే వారం నుంచి పనులు ఆగిపోవడంతో భయ­పడిన కాంట్రాక్టర్లు వారు అడిగినంత రెండు విడతల్లో ఇవ్వటానికి ఒప్పుకున్నారు. అలా మొదటి విడతలో పలువురు కాంట్రాక్టర్ల నుంచి రూ.కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. మామూళ్లు ముట్ట­జెప్పిన తర్వాతే మట్టి, గ్రావెల్‌ తరలింపునకు అను­మతిచ్చినట్లు ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. 

దేవుడి భూమిలో పాగా..
చిల్లకూరు మండలం కలవకొండ పరిధిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉన్న 246 ఎకరాలను మట్టి మాఫియా హస్తగతం చేసుకుంది. ఇదే రెవెన్యూ పరిధిలో స్థానిక రైతుల ఆధీనంలో ఉన్న భూములు, పొన్నవోలు, తిక్కవరం పరిధి­లోని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని కొద్ది రోజులుగా విచ్చలవిడిగా తవ్వకాలు సాగిస్తోంది. పెద్ద పెద్ద యంత్రాలతో తవ్వి టిప్పర్లు, లారీల ద్వారా తరలిస్తోంది. ప్రభుత్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఈ మాఫియా వద్ద ఎకరాకు రూ.5 లక్షలు చెల్లించి మట్టి, గ్రావెల్‌ కొనుగోలు చేస్తున్నారు. 

మిగిలినవారు యూనిట్‌కు రూ.350 చెల్లించి తీసుకువెళుతున్నారు. గూడూరు డివిజన్‌ పరిధిలోని చేడిమాల, కోట, గూడూరు రూరల్, నాయుడు­పేట, పెళ్లకూరు పరిధిలో చెరువులు, ప్రభుత్వ భూముల్లో కూడా యథేచ్చగా మట్టి, గ్రావెల్‌ తవ్వ­కాలు చేపడుతున్నారు. టీడీపీ నేతల అనుమతులు ఉన్న వాహనాలను ఎవ్వరూ ఎక్కడా ఆపటానికి వీల్లేదని మైనింగ్, రెవెన్యూ, పోలీసులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే..
» ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే గూడూరు డివిజన్‌ పరిధిలో మట్టి, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై ముగ్గురు ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా డివిజన్‌ పరిధిలో ఉన్న సీఎం చంద్రబాబు ముఖ్య అనుచరుడిగా పేరొందిన కాంట్రాక్టర్‌ తెరపైకి వచ్చారు. ఆయన సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసి అప్పటి వరకు వివిధ అభివృద్ధి పనుల కోసం కొనసాగుతున్న మట్టి, గ్రావెల్, ఇసుక తవ్వకాలను ఆపేయాలని చెప్పారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.

» ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రెండో రోజు డివిజన్‌ పరిధిలోని రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులతో సీఎం ముఖ్య అనుచరుడు, ఓ ఎమ్మెల్యే, గతంలో ఖమ్మం నుంచి మావోయిస్టులు హెచ్చరించడంతో పారిపోయి ఇక్కడికి వచ్చిన నాయకుడు, స్థానికంగా ఉన్న మరో నాయకుడు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. గూడూరు డివిజన్‌ పరిధిలో ఎక్కడెక్కడ ఏయే పనులు జరుగుతున్నాయి... ఆ పనులకు మట్టి, గ్రావెల్, ఇసుక ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నా­రనే సమాచారం తెలుసుకున్నారు. 

»  మట్టి, గ్రావెల్, ఇసుక బాగా ఎక్కడ లభి­స్తాయి­.. ఆ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి.. రహదారుల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు మట్టి, గ్రావెల్‌ ఎలా విక్ర­యి­స్తు­న్నారు.. అనే వివరాలపై ఆరా తీశారు. మట్టి తవ్వకాలు చేపట్టే అవకాశం ఉన్న భూముల రికార్డులను కూడా తెప్పించుకున్నారు. 

»  ఆ సమావేశం ముగిసిన మరుసటి రోజే చిల్ల­కూరు, పెళ్లకూరు, గూడూరు రూరల్, కోట, వాకాడు మండలాల నుంచి ఎంపిక చేసు­కున్న రైతులను పిలిపించారు. ఆ రైతుల ఆధీనంలోని ప్రభుత్వ భూములకు సంబంధించి మట్టి, గ్రావెల్‌ తవ్వకాలకు ఎవ్వరూ అడ్డుచెప్పకుండా ఉండేలా బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. వారికి కొంత నగదును ముట్టజెప్పి ఎవ్వరూ నోరెత్తకూడ­దని హుకుం జారీచేశారు.

టీడీపీ నాయకుల అనుచరులు కాపలా!
మట్టి మాఫియా అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్న భూముల వద్ద టీడీపీ నాయకుల అనుచరులు కాప­లా ఉంటున్నారు. ఎన్ని లారీలు, టిప్పర్ల ద్వారా ఎన్ని యూనిట్ల మట్టి, గ్రావెల్‌ తరలిస్తు­న్నా­రనే వివ­రాలను వారు పుస్తకాల్లో నోట్‌ చేసుకంటున్నారు. ప్రస్తుతం డివిజన్‌లో మట్టి మాఫియా సాగిస్తున్న తవ్వకాలకు ఎక్కడా అను­మతి లేదని అధికా­రులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement