నదీతీరంలో లోతుగా మట్టి తవ్వేసిన పొలాల పరిస్థితి ఇదీ!
మట్టి మాఫియా!1990 మే 22–25వ తేదీలను గుర్తు చేస్తే చాలు సిక్కోలు నగరవాసులకు నాగావళి ఉగ్రరూపం గుర్తుకు వస్తుంది! లక్ష క్యూసెక్కులకు పైగా వరదనీరు పోటెత్తింది! శ్రీకాకుళం నగరానికి సమీపంలోనే గండి పడి సగం ఊరు నీటమునిగింది! ఈ గండికి కారణం ఏమిటో తెలుసా?
నదీ తీరంలో ఇటుక బట్టీల కోసం గట్టుకు ఆనించి యథేచ్ఛగా మట్టి తవ్వేయడమే! ఇప్పుడు మళ్లీ నాగావళి తీర గ్రామాలకు, పంటపొలాలకు అలాంటి ప్రమాదమే పొంచి ఉంది! దీనికీ కారణం మట్టి మాఫియానే! ఈ మాఫియాలో ఓ టీడీపీ నాయకుడి కుమారుడి పాత్ర ఉండటం గమనార్హం!!
సాక్షి,శ్రీకాకుళం : నాగావళి నదీతీరంలో పొలాలున్న రైతులకు తొలుత మట్టి మాఫియా ఎర వేస్తోంది. పొలంలో మెరక తీయడమే కాకుండా ట్రాక్టరు మట్టికి రూ.200 చొప్పున ఇస్తూ బుట్టలో వేస్తోంది. ఇలా జేసీబీతో తవ్విన మట్టిని ఇటుక బట్టీల యజమానులకు ట్రాక్టరుకు రూ.1000 చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటోంది. ఇలా రెండు లోడులు మట్టి రూ.2 వేలు పెట్టి కొంటే... అంటే దాదాపు ఒక ట్రాక్టరు లోడు (2 వేలు) ఇటుకలు తయారవుతాయి.
వాటిని ఇటుక బట్టీల యజమానులు రూ.12 వేలకు అమ్ముతున్నారు. ఇక శ్రీకాకుళానికి తరలిస్తే ట్రాక్టరు లోడు రూ.14 వేల వరకూ తీసుకుంటున్నారు. తీరా సారవంతమైన పొలాలను త్యాగం చేసిన రైతులకు దక్కేది ట్రాక్టరు ట్రిçప్పునకు రెండొందలే! ఈ తాత్కాలిక ప్రయోజనం మాటెలా ఉన్నా భవిష్యత్తు ప్రమాదాన్ని ఊహించలేకపోతున్నారు. ఒడిశాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిస్తే మర్నాడికే వరద పోటెత్తే నాగావళి నది తీరంలోని గ్రామాలకు, పంటపొలాలకు మట్టి మాఫియా స్వలాభం కోసం నెత్తిన కుంపటి పెడుతుందనే విషయాన్ని గమనించలేకపోతున్నారు.
ఒక్కొక్కరూ మాఫియా ఉచ్చులోకి...
ఆమదాలవలస మండలంలోని నాగావళి నదీ తీర ప్రాంతాల్లో సుమారు 15 కిలోమీటర్లు పొడవునా దాదాపు 300 ఎకరాలలో ప్రస్తుతం మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. పొక్లెయినర్లు, జేసీబీలతో నది ఒడ్డుకు ఆనుకొనే లోతుగా తవ్వేస్తున్నారు. ప్రధానంగా నిమ్మతొర్లాడ, సీపానపేట, పాత నిమ్మతొర్లాడ, కొత్తవలస, తొగరాం, కలివరం, ముద్దాడపేట, పీరుసాహెబ్‌పేట, దూసిపేట, దూసి ఆర్‌ఎస్, తోటాడ, గోపీనగర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
ఆ ప్రాంతానికి చెందిన సాగునీటి సంఘానికి నాయకుడిగా ఉన్న టీడీపీ నేత కుమారుడే ఈ మట్టి మాఫియా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే రెండు భారీ జేసీబీలను కేవలం మట్టి తవ్వకాల కోసమే కొనుగోలు చేయడం దీనికి నిదర్శనం. ఈ మట్టితో స్థానికంగానే ఇటుక బట్టీలు వెలుస్తున్నాయి. ముఖ్యంగా కొర్లకోట, చీమలవలస, కొత్తవలస, దూసిపేట, పాత నిమ్మతొర్లాడ, నిమ్మతొర్లాడ తదితర గ్రామాల్లో ఇటుకల వ్యాపారులు కోట్ల రూపాయలకు పడగలెత్తారు.
ఇది లాభసాటిగా ఉండటంతో చాలామంది ఇటుకల వ్యాపారులుగా అవతారం ఎత్తుతున్నారు. అలాగే రైతులు కూడా ఎంతోకొంత నగదు చేతికి వస్తుందనే ఆశతో తమ పొలాలను మట్టి మాఫియాకు అప్పగించేస్తున్నారు. ఏటా కొంతమేర పొరలుపొరలుగా మట్టిని తవ్వేయడం వల్ల పొలాలు నిస్సారమైపోయే ప్రమాదం కూడా ఉంది. మరోవైపు ముంపు ముప్పు పొంచి ఉంటుంది.
గండి కొడితే అంతే సంగతులు..
పర్యావరణ చట్టంలోని నిబంధనల ప్రకారం నదీ గట్లకు సమీపంలో ఎలాంటి తవ్వకాలు చేయకూడదు. ఒడ్డుకు ఆనుకొని ఉన్న పొలాల్లో జేసీబీలు, భారీ యంత్రాలను దించకూడదు. గ్రీన్‌జోన్‌లోని చెట్లను తొలగించకూడదు. కానీ మట్టి కోసం మాఫియా అవేవీ పట్టించుకోవట్లేదు. ఇటుక బట్టీల కోసం ఎక్కడైనా మట్టి తవ్వకాలకు ముందస్తుగా రెవెన్యూ, మైన్స్, అటవీ శాఖల నుంచి అనుమతి తీసుకోవాలి.
అలాగే వ్యవసాయ భూమిని వ్యాపార అవసరాలకు మార్పు చేస్తే ల్యాండ్ కన్వెర్షన్ కోసం ఆర్‌డీవో నుంచి అనుమతి తీసుకోవాలి. వాటిలో ఓ ఒక్క నిబంధనను అనుసరించకుండానే ఇటుక బట్టీల యజమానులు వ్యాపారం చేసుకుంటున్నారు. పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాదు వందల లోడుల మట్టిని కొండల్లా పోగేస్తున్నా టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి నదీతీరంలో మట్టి తవ్వకాలను నిలువరించకపోతే నాగావళి నది గండి కొట్టే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడైనా లక్ష క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తితే తీరంలోని గ్రామాలకు, పంట పొలాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment