సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ రూరల్ పరిధిలో మట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. గతంలో అర్ధరాత్రి సమయంలో చడీచప్పుడు లేకుండా సాగిపోయే ఈ దందా.. ఇప్పుడు పట్టపగలే యథేచ్ఛగా సాగిపోతోంది. ప్రభుత్వ పనుల పేరిట ఏదో ఒక అనుమతి తెచ్చుకుని నిత్యం వేలాది టన్నుల గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వంశీ అండదండలతో ఆయన అనుచరుడు చేస్తున్న ఈ మట్టి దందాపై పలుమార్లు స్థానికులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ దోపిడీ వివరాలు ఇలా ఉన్నాయి..
పోలవరం కాలువ మట్టి..
జక్కంపూడి ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతాన్ని తొలిచి పోలవరం కుడి కాలువను ప్రభుత్వం నిర్మించింది. ఈ పనుల్లో భాగంగా తవ్విన ఎర్రమట్టి, తెల్లమట్టిని జక్కంపూడి కురవ ప్రాంతంలోనే పెద్ద పెద్ద గుట్టలుగా కాంట్రాక్టర్ డంప్ చేసి వదిలేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు అది ఆదాయవనరైంది. అప్పట్లో సర్పంచ్‌గా పనిచేసే రామారావు, ఎమ్మెల్మే వంశీ అనుచరుడు గండికోట సీతయ్య కలిసి ఈ గ్రావెల్‌ను తొలుత స్థానిక అవసరాల పేరిట తరలించడం ప్రారంభించి.. ఆ తర్వాత క్రమేణా రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఇతరత్రా అవసరాలకు అనధికారికంగా విక్రయించి రూ. కోట్లు ఆర్జించారు.
రూ. కోట్లలో దోపిడీ
అధికారబలం అండతో ఎమ్మెల్యే అనుచరుడైన గండికోట సీతయ్య చెలరేగిపోతున్నారు. తమను అడ్డుకునేవారెవరూ లేరనే ధీమాతో రకరకాల అనుమతుల పేరిట మట్టిని అక్రమంగా విక్రయించేస్తున్నాడు. తొలుత స్థానిక అవసరాలకు తరలించిన మట్టిని తర్వాత గొల్లపూడి, సింగ్‌నగర్, అంబాపురం, నయనవరం, జక్కంపూడి, వెలగలేరు, జి.కొండూరు తదితర ప్రాంతాలకు టిప్పర్ల ద్వారా తరలిస్తూ రూ. కోట్లు పోగేశాడు.
స్థానికంగా తెల్లమట్టి అయితే టిప్పర్‌కు రూ. 3,500, ఎర్రమట్టి అయితే రూ. 5వేలు చొప్పున ధర నిర్ణయించి విక్రయిస్తున్నట్లు తెలిసింది. దూరం పెరిగే కొద్దీ ధర కూడా పెరుగుతుంటుంది. గుట్టలుగా ఉన్న గ్రావెల్‌ను టిప్పర్ల ద్వారా సమీపంలోని ఖాళీ స్థలంలో డంప్ చేస్తున్నాడు. అక్కడి నుంచి వెంచర్లకు, బిల్డర్ల అవసరాలకు మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా అధికారులెవరూ స్పందించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment