సాక్షి, అమరావతి: పోలవరం నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాలు, వారి పాపాలు ప్రాజెక్టును ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్లో మరింత జాప్యానికి కారణమవుతున్నాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన స్పిల్ వే పూర్తి చేసి, గేట్లు బిగించారు. ఈ చర్యల కారణంగా వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో గోదావరికి జూలై రెండో వారంలో రికార్డు స్థాయిలో భారీ వరద వచ్చినా, స్పిల్ వే ద్వారా సులభంగా దిగువకు విడుదల చేస్తున్నారు.
ఈ నీరు దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 25 అడుగులకు చేరడంతో కోతకు గురైన ప్రాంతం మీదుగా ప్రవహిస్తోంది. దాంతో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ ప్రాంతం వరద నీటితో నిండిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ వద్ద అప్పట్లో ఏర్పడ్డ అగాధాలను పూడ్చే పనులకు ఆటంకం కలిగింది. వీటిని పూడ్చే విధానాన్ని ఖరారు చేసేందుకు 11 రకాల పరీక్షలను జూలైలోగా పూర్తి చేయాలని సీడబ్ల్యూసీ ఆదేశించింది. ప్రస్తుతం ఆ పరీక్షలు చేస్తున్నారు. కానీ.. వరద నీరు చేరడంతో అవి పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ పరీక్షల ఫలితాలు వెల్లడైతేనే అగాధాలను పూడ్చే విధానాన్ని సీడబ్ల్యూసీ ఖరారు చేస్తుంది.
డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం పరీక్షలకూ ఆటంకం
2019, 2020లలో వరదల ఉద్ధృతికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. సీడబ్ల్యూసీ సూచనల మేరకు డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చేందుకు ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. గత నెల 28, 29న ఎన్‌హెచ్‌పీసీ బృందం డయాఫ్రమ్ వాల్‌ను పరిశీలించింది. సామర్థ్యం తేల్చే పరీక్షలకు సిద్ధమని పేర్కొంది. సీడబ్ల్యూసీ ఆమోదించిన పద్ధతి ప్రకారం డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని నిర్ధారించే పరీక్షలు చేయడానికి ఇప్పుడు వచ్చిన వరద ఆటంకంగా మారింది.
వరద పూర్తి స్థాయిలో తగ్గి ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ ప్రాంతంలో చేరిన వరద నీటిని తోడివేస్తేగానీ డయాఫ్రమ్ వాల్ సామర్థ్య పరీక్షలు, అగాధాల పరీక్షలు పూర్తి చేయలేరు. ఆ తర్వాతే పాత దానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదా దెబ్బతిన్న భాగానికి సమాంతరంగా డయాఫ్రమ్‌వాల్ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేయాలా అన్నది సీడబ్ల్యూసీ తేల్చదు. దీంతో పోలవరం పనుల్లో మరింత జాప్యం జరుగుతోందని జలవనరుల శాఖ అధికారవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
‘చంద్ర’శాపమే
టీడీపీ సర్కారు అవగాహన రాహిత్యం, కమీషన్ల కక్కుర్తి వల్ల గోదావరి వరదను మళ్లించే స్పిల్ వేను పూర్తి చేయకుండానే ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్ నిర్మించేసింది. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు చేపట్టింది. దీనిపై నిర్వాసితులు 2019 ఫిబ్రవరిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల్ శక్తి శాఖలకు ఫిర్యాదు చేశారు.
నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే 2019 మే నాటికి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయాలని పీపీఏ, కేంద్ర జల్ శక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాయి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేకపోయింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో కుడి, ఎడమ వైపున ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. 2019, 2020లో ఈ ఖాళీ ప్రదేశాల గుండా గోదావరి వరద ప్రవహించడంతో ఈసీఆర్‌ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో రెండు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్ డ్యామ్ 218 మీటర్ల నుంచి 600 మీటర్ల వరకూ కోతకు గురైంది.
యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్న జగన్ సర్కారు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేస్తూ ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి చర్యలు చేపట్టారు. 50 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా ప్రపంచంలో అతి భారీ సామర్థ్యం కలిగిన స్పిల్ వే (చైనాలోని త్రీగోర్జెస్ స్పిల్ వే వరద విడుదల సామర్థ్యం 41 లక్షల క్యూసెక్కులే), ఎగువ కాఫర్ డ్యామ్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావసం కల్పించారు. గతేడాది స్పిల్ వేకు 42 గేట్లను బిగించారు. గోదావరి ప్రవాహాన్ని అప్రోచ్ చానల్, స్పిల్ వే, స్పిల్ చానల్, పైలట్ చానల్ మీదుగా 6.6 కిలోమీటర్ల దూరం మళ్లించి సహజ ప్రవాహ మార్గంలో కలిపారు.
ఈ ఏడాది మిగతా 6 గేట్లను బిగించి, వాటికి హైడ్రాలిక్ సిలిండర్లు, హోయిస్ట్‌లను ఏర్పాటు చేసి.. పవర్ ప్యాక్‌లతో అనుసంధానం చేశారు. అత్యాధునికమైన హైడ్రాలిక్ పద్ధతిలో గేట్లను నిర్వహిస్తున్నారు. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం జియోమెంబ్రేన్ బ్యాగ్‌లతో పూడ్చి.. 30.5 మీటర్ల ఎత్తుకు డ్యామ్ పనులను చేపట్టారు. సీడబ్ల్యూసీ డిజైన్ల ఆమోదంలో జాప్యం, జియోమెంబ్రేన్ బ్యాగ్‌ల కొరతతో 20.5 మీటర్ల ఎత్తు వరకు పనులు పూర్తి చేశారు.
ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు జూలై రెండో వారంలోనే గోదావరికి రికార్డుస్థాయిలో వరద వచ్చింది. ఆకస్మికంగా వచ్చిన 15 లక్షల క్యూసెక్కుల వరదను పోలవరం స్పిల్ వే 48 గేట్లను ఎత్తి విజయవంతంగా దిగువకు విడుదల చేస్తున్నారు. టీడీపీ సర్కార్ ప్రణాళిక మేరకు పనులు చేపట్టి ఉంటే.. ఈ పాటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేదని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment