పోలవరం రూరల్: గత టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును సర్వ నాశనం చేసిందని, ప్రొటోకాల్‌కు భిన్నంగా పనులు చేయడం వల్లే నిర్మాణంలో జాప్యం జరుగుతోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఎగువ, దిగువ కాఫర్‌డ్యామ్ నిర్మాణం పూర్తి చేయకుండా డయాఫ్రమ్‌వాల్ నిర్మించి చరిత్రాత్మక తప్పిదం చేసిందని తెలిపారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, ఈసీఆర్‌ఎఫ్ ప్రాంతంలో పడిన గోతులను ఇసుకతో నింపి వైబ్రో కాంపాక్షన్ చేసే పనులను ఆయన బుధవారం పరిశీలించారు.
మీడియాతో మాట్లాడుతూ కాఫర్‌డ్యామ్‌కు మూడేళ్ల వరకు గ్యారెంటీ ఉంటుందని, ఆ సమయంలోనే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్) నిర్మించాల్సి ఉందని, అలా కాకుండా పనులు చేసిందని తెలిపారు. ఐదేళ్లు పనులు చేయకుండా జాప్యం చేసిందన్నారు. వర్కింగ్ ప్లేస్‌ను పటిష్టం చేసుకోకుండా పనులు చేపట్టడం వల్ల ఈసీఆర్‌ఎఫ్ ప్రాంతంలో కవర్స్ ఏర్పడ్డాయన్నారు. టీడీపీ ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతూ తమ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేస్తోందని తెలిపారు.
కాఫర్ డ్యామ్‌లు, స్పిల్‌వే, స్పిల్‌చానల్, పైలెట్ చానెల్, అప్రోచ్ చానల్ పనులను పూర్తిచేశామని, స్పిల్‌వేకు గేట్లు ఏర్పాటు చేసి నీటిని మళ్లించామన్నారు. డయాఫ్రమ్‌వాల్‌కు మరమ్మతులు చేయాలా, సమాంతరంగా మరో డయాఫ్రమ్‌వాల్ నిర్మించాల అన్నది కేంద్ర జల సంఘం, నేషనల్ హైడ్రో ప్రాజెక్టు కార్పొరేషన్ నిపుణుల సూచనలు మేరకు నిర్ణయిస్తామన్నారు. ప్రాజెక్టు పనులపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరగా పూర్తయ్యేలా దిశా నిర్దేశం చేస్తున్నారని తెలిపారు. ఈఎన్‌సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment