అక్రమంగా చెరువుల్ని తోడేస్తున్న దృశ్యం
సాక్షి , అమరావతిబ్యూరో: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపణలు అక్షరాలా నిజం చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. చినబాబు లోకేష్ దత్తత గ్రామంలో నీరు–చెట్టు పథకంలో భారీ అవినీతి చోటుచేసుకుంది. చెరువును నిబంధనలకు విరుద్ధంగా తవ్వి మట్టిని అమ్మిసొమ్ము చేసుకుంటున్నారు. చినబాబు దత్తత గ్రామం కావడంతో అధికారులు సైతం ఆ వైపు కన్నెత్తి చూడటంలేదు. మంత్రి నారా లోకేష్ దత్తత తీసుకున్న నిమ్మకూరు గ్రామంలో 8 ఎకరాల ఊర చెరువును నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా చెరువు అభివృద్ధి పనులను గత నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రారంభించారు.
దీనిలో భాగంగా తొలుత చెరువులోని మట్టి తవ్వకాలు మొదలుపెట్టారు. చినబాబుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న గ్రామస్థాయినేత ఓ వ్యక్తి చెరువుమట్టిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు. నిబంధనల ప్రకారం 3 మీటర్ల మాత్రమే చెరువును తవ్వాల్సి ఉండగా దీనికి విరుద్ధంగా 15 నుంచి 20 మీటర్ల వరకు మట్టిని తోడేస్తూ విక్రయిస్తున్నారు.
ట్రాక్టరు మట్టి రూ.300..
ఒక్కో ట్రాక్టరు మట్టి ని రూ.300 చొప్పున గ్రామంలోని వ్యాపార, వాణిజ్య, రహదారి నిర్మాణాదారులకు విక్రయిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు మూడొందలు వంతున స్థానిక నేతకు ముట్టజెప్పాలి. ఆపై ట్రాక్టర్ యజమాని మాత్రం అదనంగా అమ్ముకోవాలి.. గత నెలలో ప్రారంభమయిన చెరువు పూడికతీత పనుల్లో ఇప్పటి వరకు సుమారు 6 వేల ట్రాక్టర్ల మట్టి విక్రయించినట్లు తెలుస్తోంది . మట్టి అమ్మకాలకు సుమారు రూ.7లక్షల వరకు ఆ నేత లబ్ధిపొందినట్లు సమాచారం.
మట్టి విక్రయాలతో పాటు పూడికతీత పనులకు నీరు–చెట్టు పథకం ద్వారా మంజూరు చేసిన దాదాపు రూ.8.5 లక్షలు నిధులు కూడా మిగులుదల అయినట్లేనని స్థానికలు ఆరోపిస్తున్నారు. మట్టి విక్రయాల ద్వారా ఆదాయం రుచిమరిగిన ఆ నేత ఆ చెరువు పక్కనేఉన్న చిన్న చెరువుల నుంచి 10 వేల ట్రాక్టర్ల మట్టిని తవ్వేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది.
కన్నెత్తి చూడని అధికారులు..
నిమ్మకూరు గ్రామంలో ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్నా ఏ అధికారి పట్టించుకోక పోవడం దారుణం. లోకేష్ దత్తత గ్రామంలోని ఈ విధమైన మట్టి మాఫియా టీడీపీ అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తోందని అర్థమవుతోంది. కలెక్టరు సైతం పట్టించుకోకపోవడం దురదృష్టకరం.
Comments
Please login to add a commentAdd a comment