అడ్డుకుంటే ... అంతే
► చేబ్రోలు మండలంలో పెచ్చుమీరిన ‘అధికార’ దౌర్జన్యాలు
► చెరువులు తవ్వుకుని సొమ్ము చేసుకుంటున్న టీడీపీ పెద్దలు
► మట్టి మాఫియాను అడ్డుకుంటున్నవారిపై అక్రమ కేసులు
► సుద్దపల్లిలో వైఎస్సార్ సీపీకి చెందిన ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ కేసు
► పోలీసులను అడ్డుపెట్టుకుని ఊరూరా అక్రమాలు, అరాచకాలు
అక్కడ వారి మాటే శాసనం.. వారు చెప్పిందే వేదం.. దౌర్జన్యంగా చెరువుల్లో మట్టి అమ్ముకున్నా... మాఫియాలా దందా సాగించినా. పొరపాటున ఆగడాలను అడ్డుకుంటే అక్రమ కేసులు. అదీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద. ఇలా ఒకటా రెండా అడ్డొచ్చినా ప్రతిచోటా ఇదే టెక్నిక్. చివరకు ఫాల్స్ అంటూ కేసులు తీసి వేయించడం. పొన్నూరు నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతకు వరసకు సోదరుడైన వ్యక్తి అక్రమాల చక్రం తిప్పుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. పోలీసులను కరివేపాకులా వాడుకుంటున్నాడు.
సాక్షి, గుంటూరు : పొన్నూరు నియోజకవర్గంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మట్టి మాఫియా ముసుగులో టీడీపీ నేతలు చేస్తున్న దౌర్జన్య కాండ ఇది. వివరాల్లోకి వెళితే.. చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలోని 7.15 ఎకరాల విస్తీర్ణం ఉన్న సూరాయకుంటలో అధికార పార్టీ నేతలు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఒక్కో ట్రక్కు మట్టిని రూ.800 లకు విక్రయిస్తున్నారు. నీరు - చెట్టు పేరుతో ఆ శాఖ అనుమతులు లేకుండా మట్టి తవ్వి అమ్ముకోవడాన్ని గ్రామ ఎంపీటీసీ, పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు ప్రశ్నించారు. ఆగడాలను అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయించారు. ఎస్సీ వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించారు. కేసు దర్యాప్తు పూర్తి కాకముందే ముగ్గురిని అదుపులోకి తీసుకుని రెండు రోజులు స్టేషన్‌లో నిర్బంధించారు. ఫిర్యాదు చేసిందే తడవుగా కేసునమోదు చేయడంతోపాటు, అంతే వేగంగా తెల్లవారేసరికి దర్యాప్తు అధికారి సైతం గ్రామానికి వచ్చేశారు. దీనికంతటికీ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నేతే కారణమని ప్రజలు బహిరంగంగా చెపుతున్నారు. అంతేకాక, చేబ్రోలు మండలంలో అక్రమ కేసులు బనాయించడం కొత్తేమీ కాదంటున్నారు.
తాళ్లకుంట, శలపాడులోనూ ఇంతే...
గతంలో చేబ్రోలు గ్రామంలోని తాళ్లకుంట చెరువులో నీరు -చెట్టు పేరుతో మట్టిని అక్రమంగా తవ్వేస్తూ అమ్ముకుంటున్న విషయంపై నిలదీశారనే కక్షతో ముసలా వేణు అనే వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. అడ్డు వచ్చిన వారికి ఇదేగతి పడుతుందనే హెచ్చరిక పంపారు. మట్టి తవ్వకాలు పూర్తయ్యే వరకు కేసును నాన్చి ఆ తరువాత ఫాల్స్ కింద తీసేశారు. శలపాడు గ్రామంలో సైతం ఇదే టెక్నిక్ ఉపయోగించారు. మట్టి తవ్వకాన్ని అడ్డుకున్నారనే కక్షతో ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేయించారు. అక్కడ కూడా తమపని అయిపోగానే ఆ కేసులు తీసివేయించారు. గొడవర్రులో తమ అక్రమాలకు అడ్డు తగులుతున్నారనే కక్షతో ఒకరిపై కేసు నమోదు చేయించారు.
మట్టి మొత్తం తవ్వేసి అమ్ముకున్న తరువాత కేసు తీసివేయించారు. పోలీసు శాఖను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ నేతలు పొన్నూరు నియోజకవర్గంలో చేస్తున్న అరాచకాలు అన్నీ,ఇన్నీ కావు. దౌర్జన్యం, లేదా అక్రమ కేసు. ఇలా తమ కు అడ్డు తగిలిన వారిపై కక్షసాధింపు చర్యలకు దిగుతూ నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి పొన్నూ రు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.