అట్టుడికిన మండలి.. నిలదీసిన వైఎస్సార్‌సీపీ | YSRCP Leaders protests forced resignations of VCs in AP Legislative Council | Sakshi
Sakshi News home page

అట్టుడికిన మండలి.. నిలదీసిన వైఎస్సార్‌సీపీ

Published Wed, Feb 26 2025 4:05 AM | Last Updated on Wed, Feb 26 2025 11:25 AM

YSRCP Leaders protests forced resignations of VCs in AP Legislative Council

వీసీల బలవంతపు రాజీనామాలపై నిలదీసిన వైఎస్సార్‌సీపీ 

రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాలపైనా ప్రశ్నల వర్షం

ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామాలు చేయడం ఎన్నడూ చూడలేదు

ప్రభుత్వమే బెదిరింపులకు పాల్పడి బలవంతంగా రాజీనామాలు చేయించింది

మంత్రి లోకేశ్‌ ఆదేశాలతో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయించారు 

తుదకు ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కూడా బెదిరించి రాజీనామా చేయించడం వాస్తవం కాదా?

వీసీల వ్యవహారంపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ సభ్యుల పట్టు

ఆధారాలు చూపితే విచారణ జరిపిస్తామన్న మంత్రి లోకేశ్‌.. ఆధారాలు బయట పెట్టేసరికి మాట దాటవేసిన వైనం

ఉపాధి, పెట్టుబడులపైనా గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని విపక్షం మండిపాటు

4 లక్షల మందికి ఉపాధి చూపడం లక్ష్యం అని చెప్పారని లోకేశ్‌ కవరింగ్‌

సభ సాక్షిగా అడ్డంగా దొరికిపోయిన చినబాబు

ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ వాకౌట్‌

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల బలవంతపు 
రాజీనామాల వ్యవహారం.. రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాల అంశాలు మంగళవారం శాసన మండలిని కుదిపేశాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఒకేసారి 17 మంది వీసీలను బెదిరించి.. బలవంతంగా రాజీనామా చేయించారని, ఈ వ్యవహారంపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు పట్టుపట్టారు. 

ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని, తామెవరినీ బెదిరించలేదని మంత్రి లోకేశ్‌ దబాయించబోయారు. ‘ఏ వీసీ అయినా ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పారా.. వాట్సాప్‌లో పంపించారా.. ఫలానా వాళ్లు రాజీనామా చేయమన్నారని చెప్పారా.. ఇలా ఏ ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తారా.. ఆరోపణలను వెంటనే వెనక్కు తీసుకోవాలి’ అంటూ గుడ్లురమబోయారు. ‘వీసీలందరికి ఐఏఎస్‌ అధికారి సౌరబ్‌ గౌర్‌ ఫోన్‌ చేసి రాజీనామా చేయండని ఒత్తిడి చేశారు. కావాలంటే కాల్‌ లిస్ట్‌ చెక్‌ చేసుకోవచ్చు. 

వీసీలు తమ రాజీనామా పత్రంలో ‘ఉన్నత విద్యా మండలి అధికారుల ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నాం’ అని  పేర్కొన్నారు’ అని విపక్ష సభ్యులు ఆధారాలు చూపగా లోకేశ్‌ వెంటనే మాట మార్చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించాలో చూపాలన్న డిమాండ్‌కు సమాధానం చెప్ప­లేక మంత్రులు నీళ్లు నమిలారు. తర్జుమా చేయడంలో పొరపాటంటూ మంత్రి లోకేశ్‌ కవర్‌ చేసుకునేందుకు విఫల యత్నం చేశారు. సర్కారు ద్వంద్వ నీతిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.  

వీసీలతో బలవంతపు రాజీనామాలు
సాక్షి, అమరావతి: ‘గవర్నర్‌ ప్రసంగంలో వీసీల నియామకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీసీల నియామకం అనేది రెగ్యులర్‌ ప్రొసెస్‌. ఏ ప్రభుత్వం అయినా వారి పదవీ కాలం ముగిసిన తర్వాతే సెర్చ్‌ కమిటీ వేసి నియామకాలు చేప­డుతుంది. అయితే రాష్ట్రంలో 19 యూనివర్సిటీలుండగా, 17 వర్సిటీల వీసీలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకేసారి రాజీనామా చేశారు. ఇలా ఇంత మంది రాజీనామాలు చేయడం చరిత్రలో ఎప్పుడూ ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. బెదిరించి, బలవంతంగా వారితో రాజీనామా చేయించారు. 

ఏపీపీఎస్సీ చైర్మన్‌తో కూడా బలవంతగా రాజీ­నామా చేయించడం నిజం కాదా.. ’ అని శాసన మండలి వేదికగా వైఎస్సార్‌సీపీ గళం విప్పింది. ఈ వ్యవహారంపై జ్యుడీషియల్‌ విచార­ణకు ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ జోక్యం చేసుకుంటూ.. ‘మేము బెదిరించాం.. భయపెట్టాం.. బయటకు పం­పించాం.. అని వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆరోపి­స్తున్నారు. విద్యా­శాఖా మంత్రిగా అడుగుతున్నా.. ఆధారాలుంటే హౌస్‌లో పెట్టండి’ అని మంత్రి లోకేశ్‌ సవాల్‌ విసి­రారు. 

దీనిపై ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి బదులిస్తూ.. ‘నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీలో గొడవలు చేసి, గంద­రగోళం సృష్టించి.. వీసీ రాజీ­నామా చేసి పోయేలా చేశారు. నేను అడుగుతున్నది ఒక్కటే.. ఇంత మంది ఒకేసారి రాజీనామా చేస్తే ఎందుకు విచారణ చేయడం లేదో చెప్పాలి’ అని నిలదీశారు. వెంటనే లోకేశ్‌ జోక్యం చేసుకుంటూ.. ‘ఏదో రాయి వేస్తాం.. మట్టి వేస్తాం.. కడుక్కోండి.. అంటే కుదరదు. మా ప్రభుత్వంలో ఎవరు బెదిరించారో.. ఏమని బెదిరించారో.. రాజీనామా చేసిన వీసీలు ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పమనండి.. వీసీ పోస్టుల కోసం 500 మంది అప్లై చేశారు. 

టాప్‌ యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లను తీసుకొచ్చి వీసీలుగా  నియమించాం. సామాజిక న్యాయం చేశాం. గత ప్రభుత్వం మాది­రిగా ఒక సామాజిక వర్గానికే ఇవ్వలేదు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ సభ్యులు స్పందిస్తూ.. ‘దేశ చరిత్రలో ఓ రాష్ట్రంలో ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామా చేయడం జరగలేదు. వారు ఎందుకు రాజీనామాలు చేయాల్సి వచ్చిందో జ్యూడిషియల్‌ విచారణకు ఆదేశించండి’ అని నిలదీశారు. 

ఏ ఒక్కరినీ వదిలిపెట్టం.. 
మంత్రి లోకేశ్‌ మళ్లీ జోక్యం చేసుకుంటూ.. ‘యూనివర్సిటీలకు ఛాన్స­లర్‌ గవర్నర్‌. మీరు గవర్నర్‌ను కించ పరిచినట్టుగా ఆరోపణలు చేస్తున్నారు. లోకేశ్‌ ఫోన్‌ చేశాడా.. లేదా ఇక్కడున్న మా మంత్రులు ఎవరు ఫోన్‌ చేశారో చెప్పమనండి.. లేదా మా ఆఫీస్‌ నుంచి ఎవరైనా ఫోన్‌ చేసి బెదిరించారో చెప్పమంటే చెప్పకుండా ఆరోపణలు చేయడం సరికాదు. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల విశ్వవిద్యాలయాలకు చెడ్డపేరు వస్తుంది. తక్షణమే బేషరతుగా మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఆధారాలుంటే బయట పెట్టండి. 

తప్పకుండా విచారణ జరిపిస్తాం.. ల్యాప్‌ ట్యాప్‌ నా దగ్గరే ఉంది.. ఇప్పుడే ఆర్డర్‌ ఇస్తా.. మాజీ వీసీలు ఎవరైనా మీకు ఫోన్‌ చేశారా? వాట్సాప్‌ మెసేజ్‌ చేశారా? వివరాలు ఇవ్వండి.. చర్యలు తీసుకుంటాం. వీసీల రాజీనామాల వ్యవహారమే కాదు.. 2019 నుంచి ఏం జరిగిందో అంతా బయటకు తీద్దాం. అన్నీ బయటకొస్తాయి. ఇప్పటికే ఒకరు జైల్లో ఉన్నారు. ఎవరినీ వదిలి పెట్టం. వెయిట్‌ అండ్‌ వాచ్‌.. టైమ్, డేట్‌ రాసుకోండి’ అని తీవ్ర స్వరంతో మంత్రి లోకేశ్‌ హెచ్చరించారు. 

ఈ దశలో టీడీపీ ఎమ్మెల్సీ రాం­గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ‘రాజీనామా చేసిన వీసీలంతా మీ నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బావమరుదులు, మేనత్తలే అని అన్నారు. వైఎస్‌ జగన్‌ ఓడిపోయారు కాబట్టి వారంతా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారన్నారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో గందరగోళంతో చైర్మన్‌ కొద్దిసేపు సభను వాయిదా వేశారు.

ఇవిగో ఆధారాలు..
సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్సీ చంద్ర­శేఖరరెడ్డి మాట్లాడుతూ.. ‘వీసీలందరికీ ఐఏఎస్‌ అధికారి సౌరబ్‌ గౌర్‌æ ఫోన్‌ చేసి రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. ఆ మరుసటి రోజే వారంతా రాజీనామా చేశారు. కావాలంటే కాల్‌ లిస్ట్‌ చెక్‌ చేసుకోవచ్చు. అంతేకాదు.. వీసీలు తమ రాజీనామా పత్రంలో ఉన్నత విద్యా మండలి అధికారుల ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? తక్షణమే విచారణ జరిపించాలి’ అని డిమాండ్‌ చేశారు. 

ఇదే విషయమై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. ‘ఏ విచారణ కావాలి.. జ్యుడీషియల్‌ విచారణా లేక డిపార్టుమెంటల్‌ విచారణా.. క్లారిటీ ఇవ్వండి‘ అని చైర్మన్‌ కోరగా, ‘మేము జ్యూడిషియల్‌ ఎంక్వైరీ కోరుతున్నాం.. వాళ్లు ఎంక్వైరీ వేసినా మాకు అభ్యంతరం లేదు. మంత్రి చెబుతున్నట్టు 2019 నుంచే కాదు.. కావాలంటే 2014 నుంచి ఎంక్వైరీ చేయండి. మాకు అభ్యంతరంలేదు. వాస్తవాలే­మిటో ప్రజలకు తెలుస్తాయి’ అని బొత్స సత్యనారా­యణ స్పష్టం చేశారు. 

ఈ దశలో మంత్రి లోకేశ్‌ మాట మార్చారు. ‘ప్రైమ్‌ ఆఫ్‌ ఎవిడెన్స్‌ ఇస్తే ఎంక్వైరీ వేస్తాం. ఏ ఆధారం లేకుండా కేసు పెట్టమంటే ఎలా?’ అని తప్పించుకొనే ప్రయత్నం చేశారు. ‘ముందు ఒకలా మాట్లాడు­తు­న్నారు.. ఆధా­రాలు చూపాక మరొకలా మాట్లాడు­తున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌సీసీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

బెదిరిపోయేవాళ్లెవరూ లేరు: బొత్స 
మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్య­నారాయణ మాట్లాడుతూ ‘ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో విచారణ జరపాలని మా సభ్యులు కోరుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఎంక్వైరీ వేయండి.. నిరూపిస్తాం.. నిరూపించకపోతే అప్పుడు మాట్లాడండి. అడిగిన దానికి బదులివ్వకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. మళ్లీ మళ్లీ  చెబుతున్నాం. 

చట్ట ప్రకారం ఏం చేయదల్చుకున్నారో చేయండి. ఇక్కడ ఎవరూ బెదిరిపోయేవాళ్లు, అదిరిపోయే వాళ్లు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్లు అనుభవిస్తారు. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి’ అని బొత్స సత్యనారాయణ... మంత్రి లోకేశ్‌కు దీటుగా స్పందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement