నిబంధనలు మట్టిపాలు
మట్టిమాఫియా పేట్రేగిపోతోంది. నిబంధనలకు నీళ్లొదిలి యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుపుతోంది. పొక్లెయిన్లతో తవ్వేస్తూ... రోజూ వందలాది వాహనాలతో రవాణా చేస్తోంది. అధికారులు చోద్యం చూస్తుండటంతో లక్షలాదిరూపాయలు అక్రమంగా ఆర్జిస్తోంది. లారీలు... ట్రాక్టర్ల జోరుతో పల్లెలోని ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
మంగళగిరి మండలంలోని ఆత్మకూరు గ్రామాన్ని ఆనుకుని వున్న చెరువు మట్టి మాఫియాకు కల్పతరువుగా మారింది. కోట్లాదిరూపాయలు ఆర్జించి పెడుతోంది. ప్రజలంతా వర్షాలు కురవాలని దేవుడిని వేడుకుంటుంటే ఈ మట్టి మాఫియా మాత్రం వర్షాలు కురవకపోతేనే బాగుంటుందని పూజలు చేయిస్తుండం వారి ధన దాహానికి అద్దం పడుతోంది. వర్షం పడితే మట్టి తోలకాలు నిలిచిపోతాయని భావించిన మాఫియా 10 రోజులుగా ఎన్నడూ లేని విధం గా 10 పొక్లెయిన్ల్లతో మట్టిని తవ్వేస్తూ 200 ట్రాక్టర్లు, 150కు పైగా లారీలతో రోజుకు 1500 నుంచి 2వేల ట్రిప్పుల మట్టిని తరలించేస్తున్నారు. 24 గంటలూ లారీలు, ట్రాక్టర్ల రాకపోకలతో ఆత్మకూరు రోడ్డు, ఇప్పటం రోడ్డు, మంగళగిరి పట్టణం హడావుడిగా మారిపోతోంది. వాటి వేగానికి ఆయా రోడ్లలో ప్రజలు తిరగాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ము ఖ్యంగా ట్రాక్టర్లు లౌడ్ స్పీకర్లతో... మట్టి ఓవర్ లోడ్లతో పట్టణ రోడ్ల వెంబడి పరుగులెత్తిస్తుం డటం అక్కడి ప్రజలకు తలనొప్పిగా తయారైంది.
అధికార పార్టీ నేతల అండతో...
ఆత్మకూరు గ్రామంలో చెరువు పూడిక తీసేందుకు 202/1 సర్వే నంబరులోని 89 ఎకరాల్లో 10 ఎకరాలు కుమ్మరి వృత్తిదారులకు కేటాయించారు. మిగిలిన 79 ఎకరాల్లో మట్టి తీసేందుకు అనుమతులు పొందిన మట్టి మాఫియా ఇష్టానుసారం చెరువు మొత్తం తోడేస్తుండటంతో వర్షాకాలం వస్తే నీరు నిలిచి గ్రామం ముంపుబారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మట్టి తీసేందుకు 6 మీటర్లలోతువరకే అనుమతులు వుండగా ఈ మాఫియా 15 నుంచి 20 మీటర్లలోతులో మట్టిని తీసి సొమ్ము చేసుకుంటున్నారు. వీరికి స్థానిక అధికార పార్టీ నాయకులే కాకుండా... అధికారులు సైతం పరోక్షంగా సహకరిస్తుండటం విశేషం. దీంతో రెచ్చిపోతున్న మాఫియా పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలూ మట్టిని తరలించేస్తున్నారు. వీరికి విజయవాడకు చెందిన అధికార పార్టీ నేతల అండదండలుండటమే కారణమని తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి మట్టి తవ్వకాలను నిలువరించి గ్రామాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
ఈమనిలోనూ అంతే...
ఈమని(దుగ్గిరాల) : మండలంలోని ఈమని గ్రామ పరిధిలో నల్లమట్లి మాఫియా పెట్రేగి పోతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో పొలాల్లోని మెరకలు చదును చేసుకుంటున్నామంటూ ట్రాక్టర్ల కొద్ది నల్లమట్టిని తవ్వి అమ్మకాలు సాగిస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఏకంగా పొక్లెయిన్‌తోనే మట్టి తవ్వేస్తున్నారు. దూరాన్ని బట్టి ఒక్కో ట్రాక్టర్ రూ.1000 నుంచి రూ.1500 వరకు సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మట్టిలోడుతో గ్రామంలో ట్రాక్టర్లు స్వైర విహారం చేస్తున్నాయని, దీంతో రాకపోకలకు సైతం ఇబ్బందిగా ఉంటోందని, పాఠశాలలకు విద్యార్థులు వెళ్ళేందుకు కూడా ఇబ్బందిగా ఉంటోందని స్థానికులు చెప్పారు. ఇప్పటికైనా మట్టి తవ్వకాలపై సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.