మట్టినీ మింగేస్తున్నారు
అధికార పార్టీ నాయకులు
కళ్లు మూసుకున్న అధికారులు
కోట్లకు పడగలెత్తుతున్న
అధికారపార్టీకి చెందిన మాఫియా మట్టిని కూడా వదలడం లేదు. మట్టిని అమ్ముకుని కోట్లకు పడగలెత్తుతోంది. అధికారపార్టీ నాయకుల ఒత్తిడితో విజిలెన్స్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
నూజివీడు: నూజివీడు మండలం పల్లెర్లమూడి దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణాలో కుడి కాల్వ కలిసే వరకు పనులు జరుగుతున్నాయి. 80మీటర్ల వెడల్పు తవ్వాల్సిన కాలువను గతేడాది ఆగస్టులో 40మీటర్లు మాత్రమే తవ్వి నీటిని వదిలారు. మిగిలిన వెడల్పు తవ్వే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. తవ్విన మట్టిని కాల్వకట్టలపైనే పక్కగా పోయాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా అధికారపార్టీకి చెందిన మట్టి మాఫియా గుడివాడ, గన్నవరం, ఉయ్యూరు, పామ ర్రు, పశ్చిమగోదావరి తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మట్టిమాఫియా కొంతమంది రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఆమ్యామ్యాలు సమర్పించుకుంటున్నట్లు సమాచారం. పలు గ్రామాల పరిధిలో ఉన్న క్వారీ గోతులు పూడ్చటానికి మట్టిని తరలిస్తున్నారు. పల్లెర్లమూడి వద్ద నుంచి మర్రిబంధం వరకు పోలవరం కాలువను తవ్వగా 8.30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వచ్చింది. అందులో దాదాపు 5లక్షల క్యూబిక్‌మీటర్ల మట్టిని గతంలోనే అమ్మేసుకున్నారు.
క్యూబిక్ మీటరు మట్టికి ప్రభుత్వం రూ.30 ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే తరలిపోయిన మట్టి విలువ రూ.1.50కోట్లు ఉంటుంది. నూజివీడు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీతారామపురం గ్రామస్తులు గతేడాది సెప్టెంబరులో ఫిర్యాదుచేశారు. మట్టితో వెళుతున్న గ్రావెల్ టిప్పర్లను పోలీసులకు పట్టిస్తే వాటిని ఆర్డీవో రూ.5వేలు జరిమానా విధించారు.
అధికారులపై మంత్రి ఒత్తిళ్లు
మట్టి తరలింపును పట్టించుకోవద్దని జిల్లాకు చెందిన మంత్రి విజిలెన్స్ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. నూజివీడు డివిజన్‌లోని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు విజిలెన్స్ అధికారులు వస్తే పశ్చిమగోదావరి జిల్లాలో అడ్డగోలుగా మట్టిని తరలించి అమ్ముకుంటుంటే అక్కడ ఎందుకు ఆపడంలేదని ప్రశ్నించడంతో వెనుదిరిగి వెళ్లినట్లు తెలిసింది.
తహశీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నాం
మట్టి బయటకు పోవడానికి వీల్లేదని, పనులు చేస్తున్న ఏజన్సీకి తెలియజేశాం. మట్టి తరలిపోతున్న విషయం మా దృష్టికి వచ్చినప్పుడల్లా తహశీల్దార్లకు ఫిర్యాదు చేస్తున్నాం. వారు చర్యలు తీసుకోవాల్సి ఉంది.-పద్మిని, పోలవరం కాలువ డీఈ
మట్టిని దోచేస్తున్నారు
పోలవరం కాలువ మట్టిని యథేచ్చగా దోచేస్తున్నారు. పగలు కంటే రాత్రిపూట మట్టిని ట్రాక్టర్లు, లారీల్లో తరలించేస్తున్నారు. పోలీసులు గాని, రెవెన్యూ అధికారులు గాని ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారపార్టీ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారు.-దేవరకొండ మధు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు