సాక్షి, అమరావతి: సంక్రాంతికి ఆడే కోడి పందేల కట్టడికి పోలీసులు రంగంలోకి దిగారు. రెండు రోజులుగా ప్రధానంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కోడి పందేలతో పాటు గుండాట, పేకాటలను అడ్డుకునేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. కోడి పందేలు, జూదం కట్టడికి ప్రతి మండలంలో జాయింట్ యాక్షన్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈసారి పోలీసులతో పాటు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) కూడా రంగంలోకి దిగింది. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, గుట్కా, మట్కా, కోడిపందేలపై నిఘా ముమ్మరం చేసింది. తొలిదశలో పలు గ్రామాల్లో కోడిపందేల నిర్వాహకులను, కత్తులు తయారు చేసే వాళ్లను, కత్తులు కట్టేవాళ్లను, కోళ్లను పెంచే వాళ్లను అదుపులోకి తీసుకుని బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్క ఏలూరు రేంజ్ పరిధి (కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలు)లో 4,395 బైండోవర్ కేసులు నమోదు చేశారు. కోడి కత్తులు తయారు చేసేవారు, కోడి కత్తులు కట్టే వారి నుంచి 5,243 కత్తులను స్వాదీనం చేసుకున్నారు. కోడి పందేలు, పేకాటలు నిర్వహించే వారిపై 848 కేసులు నమోదు చేశారు.
కోవిడ్ వ్యాప్తి ప్రమాదం..
సంక్రాంతి పేరుతో కోడి పందేలు, పేకాట నిర్వహిస్తే పెద్ద ఎత్తున జూదరులు ఒక చోటకు చేరతారని, అందువల్ల కోవిడ్ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామాల్లో పోలీసులు ప్రచారం చేస్తున్నారు. పందేలు, పేకాట నిర్వహకులపై చట్టరీత్యా కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల్లోని లాడ్జిల్లో ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చారా? అనే కోణంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. లాడ్జిల్లో ఉండే వారి వద్ద ఎక్కువగా నగదు ఉంటే సీజ్ చేస్తామని, బెట్టింగ్ ఆడితే క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సంక్రాంతి సంబరాల కోసం వస్తే సంతోషమని, అదే పేకాట, కోడి పందేలు కోసం వచ్చి లాడ్జిల్లో ఉంటే అరెస్టులు తప్పవని పోలీసులు సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలు, పేకాటలను అడ్డుకునేందుకు ఐపీసీ సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30ను అమలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment