గోదావరి జిల్లాల్లో జూదాల టర్నోవర్ రూ.500 కోట్లు | 500 crores of bettings turn over in Godavari districts | Sakshi
Sakshi News home page

గోదావరి జిల్లాల్లో జూదాల టర్నోవర్ రూ.500 కోట్లు

Published Thu, Jan 16 2014 2:55 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

గోదావరి జిల్లాల్లో జూదాల టర్నోవర్ రూ.500 కోట్లు - Sakshi

గోదావరి జిల్లాల్లో జూదాల టర్నోవర్ రూ.500 కోట్లు

పందేలకు రెట్టింపు స్థాయిలో పేకాట, గుండాట
 సంక్రాంతి ముసుగులో జూదం తొడగొట్టి మరీ పురివిప్పింది. గోదావరి జిల్లాల్లో మూడురోజుల నుంచి కోడి పందేలు  అడ్డూఅదుపూ లేకుండా సాగిపోతున్నాయి. ఆ బరుల వద్దే కోడి పందేలను తలదన్నే రీతిలో పేకాట, గుండాట, కోసాటలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ మూడు రోజుల నుంచి వందల ప్రాంతాల్లో జరిగిన పందేలు, జూదాల్లో రూ.500 కోట్లు చేతులు మారినట్లు అంచనా. కోడి పందేలకు పేరొందిన పశ్చిమగోదావరి జిల్లాలోనే రూ.300 కోట్లకుపైగా లావాదేవీలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ పందేల్లో అన్ని పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు కూడా పాల్గొనడం గమనార్హం.
 - న్యూస్‌లైన్ నెట్‌వర్క్
 
 జూదం.. మద్యం..
 కోడి పందేలు జరిగే బరుల వద్దే పేకాట, గుండాట, కోసాటలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. వెంప, ఐ.భీమవరం, భీమవరం ప్రకృతి ఆశ్ర మం, కొప్పాక, ఫతేపురం తదితర చోట్ల 200కిపైగా గుండాట బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పేకాట శిబిరాలు ఇక్కడ వెలిశాయి. కోడి పందేలకు రెట్టింపు స్థాయిలో ఇక్కడ డబ్బులు చేతులు మారుతున్నాయి. ఇక్కడే మినీ బార్లు కూడా వెలిశాయి. టెంట్లు వేసి మద్యం అమ్మారు. బిర్యానీతోపాటు, బార్లలో దొరికే ఐటమ్‌లతో రెస్టారెంట్లూ ఏర్పాటుచేశారు.
 
 ఎమ్మెల్యేలు, ప్రముఖుల హడావుడి
 కోడి పందేలు జరిగే చోట్ల ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సినీప్రముఖుల హడావుడి ఎక్కువగా కనిపించింది. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పందేల్లో హల్‌చల్ చేశారు. టీడీపీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొప్పాకలో కోడిపందేలను స్వయంగా నిర్వహించారు. వెంపలో బుధవారం కాంగ్రెస్‌కు చెందిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, ప్రముఖ సినీ దర్శకుడు కోదండ రామిరెడ్డి పందేలు కాశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హనుమంతుషిండే, టీడీపీ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెంపలో పందేలను వీక్షించారు. టీడీపీకి చెందిన ఉండి ఎమ్మెల్యే శివరామరాజు కూడా పందేల్లో పాల్గొన్నారు. నిడదవోలులో సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ పందేలను వీక్షించారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ జిల్లాలు, రాయలసీమ కోస్తా జిల్లాలేకాకుండా బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భీమవరం ప్రాంతాల్లో జరిగే పందేలకు రావడం విశేషం.
 
 బడ్జెట్‌ను బట్టి బరి
 పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వెంపలో ఈసారి ఊహించని రీతిలో కోడి పందేలు జరిగాయి. ఇక్కడ రెండు లక్షలకుపైబడి పందేల కోసం ఒక బరి, లక్ష లోపు పందేలకు మరో బరిని ఏర్పాటు చేశారు. రెండు బరుల్లోనూ సగటున రోజుకు 100కుపైగా పందేలు జరిగాయి. బరిలో దిగేవాళ్లు రెండు లక్షలకు పందెం వేస్తే వీక్షించేవారు వాటిపై రూ.20 లక్షలనుంచి రూ.30 లక్షల వరకు పైపందేలు కాశారు. అంటే ఒక పందెం జరిగితే రూ.30 లక్షలు చేతులు మారుతున్నాయి. ఇలా పెద్ద బరిలోనే రోజుకు రూ.15 కోట్లు చొప్పున మూడురోజుల్లో రూ.45 కోట్ల పందేలు జరిగినట్లు తెలిసింది. లక్ష లోపు పందేల కోసం ఏర్పాటుచేసిన బరిలోనూ రూ.10 నుంచి రూ.20 లక్షల వరకూ చేతులు మారుతున్నాయి. ఇలా ఒక్క వెంపలోనే మూడు రోజుల్లో రూ.60 కోట్లకుపైగా పందేలు జరిగినట్లు సమాచారం.
 

ఇక్కడ జరిగిన బరిలో బుధవారం హైదరాబాద్ నుంచి కుమారుడితో కలిసి వచ్చిన ఒక ప్రముఖుడు రూ.30 లక్షలు ఒకసారి, రూ.20 లక్షలు ఒకసారి పోగొట్టుకున్నారు. భీమవరం పట్టణంలోని ప్రకృతి ఆశ్రమం, ఆకివీడు మండలం ఐ.భీమవరంలోనూ ఇదేస్థాయిలో పందేలు జరిగాయి. భీమవరం, కొప్పాక, ఫత్తేపురం బరుల్లో లక్షలోపు పందేలు లేవంటే ఏ స్థాయిలో జరిగాయో ఊహించుకోవచ్చు. ఇవిగాక జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లింగపాలెం, పోలవరం, నర్సాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తణుకు తదితర అన్ని ప్రాంతాల్లోనూ పందేలు ఇష్టానుసారం జరిగాయి. మొత్తంగా పశ్చిమగోదావరి జిల్లాలో రూ.300 కోట్లకుపైగా పందేలు జరిగినట్లు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలం తాడిపూడి, మలికిపురం, ఐ.పోలవరం మండలంలోని కేశనకుర్రు, సామర్లకోట మం డలం మట్లపాలెంలో భారీ పందేలు జరిగాయి. ఈ పందేల విలువ రూ.100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. మొత్తంగా గోదావరి జిల్లాల్లో రూ.400 కోట్ల మేర కోడి పందేలు జరిగినట్లు చెబుతున్నారు.
 
 రాజకీయ పందేరం
 ఈసారి కోడి పందేల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపించింది. అన్ని పార్టీలకు చెందిన నేతలు పందేల్లో పాల్గొనడంతోపాటు కొన్నిచోట్ల స్వయంగా బరులను నిర్వహించడం గమనార్హం. కోడి పందేల బరుల వద్ద ఆధిపత్యం కోసం పార్టీల నేతలు మోహరించారు. కొవ్వూరు మండలం వాడపల్లిలో కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు ఏకమై వైఎస్సార్ సీపీ నేతలపై కాలుదువ్వారు. దీంతో ఘర్షణ జరిగి పందేలు నిలిచిపోయాయి.  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే స్థాయి నేతలు, ఎంపీ స్థాయి నేతలు కూడా పందేల బరుల వద్ద ఆధిపత్యం కోసం ప్రయత్నించడం విశేషం. ఈ పందేల వద్ద ఆధిపత్యం కోల్పోతే ఆయా గ్రామాల్లో రాజకీయం కూడా తమ చేతుల్లోంచి జారిపోతుందనే ఆందోళనతో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైంది.
 
 జాతరను తలపించిన ప్రాంతాలు
 కోడి పందేల ప్రాంతాలు తిరునాళ్లను తలపిస్తున్నాయి. వందల సంఖ్యలో కార్లు, ద్విచక్రవాహనాలు ఈ ప్రాంతాలకు వస్తున్నాయి. పార్కింగ్ కోసమే పందేల బరుల వద్ద ప్రత్యేకంగా 30 నుంచి 50 ఎకరాల స్థలాన్ని ఏర్పాటు చేశారు. కొప్పాకలో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి 14 మంది సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశారు.
 
 కరీంనగర్‌లోనూ కదనరంగం
 గోదావరి జిల్లాలను తలపించేలా... తెలంగాణలోనూ కోడి పందేలు ఊపందుకున్నాయి. రెండు ప్రాంతాలను రెండు కళ్ల సిద్ధాంతంలా భావించిన ‘తెలుగు తమ్ముడు..’ అన్నీ తానై దగ్గరుండి ఈ పందేలకు సారథ్యం వహించారు. స్వయానా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు స్వగ్రామం ఎలిగేడు మండలం శివపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు జోరుగా సాగాయి.
 
 కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వందలాది వాహనాల్లో పందెం రాయుళ్లు ఇక్కడి బరిలోకి దిగారు. స్వయానా ఎమ్మెల్యేతోపాటు అదే గ్రామానికి సర్పంచ్‌గా ఉన్న ఆయన సోదరుడు పోటీలకు సారథ్యం వహించడం గమనార్హం. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన స్వగ్రామం సున్నంబట్టిలో బహిరంగంగా రెండు బిర్రులు కట్టి అధికార పార్టీ నాయకులు కోడిపందేలు నిర్వహించారు. భద్రాచలం ఏజెన్సీలో కూడా పందేలు నడిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement