కృష్ణా జిల్లా పాయకాపురంలో.. పందెం కోళ్లు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా, సంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. చాలా ఏళ్ల తర్వాత మంచి వర్షాలు కురవడం, వాతావరణం అనుకూలించడం.. పేదలు, అల్పాదాయ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందడంతో పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ ఆనందంగా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. చేతినిండా గాజులు వేసుకుని పట్టువస్త్రాలు ధరించి సంప్రదాయబద్ధంగా ముస్తాబైన ఆడపడుచులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జీన్స్ ప్యాంట్లు, పంజాబీ డ్రస్‌లకే పరిమితమైన పట్టణ, నగర యువతులు స్వగ్రామాలకు వచ్చి పట్టు పరికిణీలు ధరించి సందడి చేస్తూ సరికొత్త అనుభూతులు పంచుకున్నారు. యువతులు రంగురంగుల రంగవల్లులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. డూడూ బసవన్నలు గ్రామాల్లో సందడి చేశాయి. హరిదాసుల కీర్తనలు మార్మోగాయి. ఇక చాలా ప్రాంతాల్లో గురువారం భక్తిశ్రద్ధలతో పెద్దలకు తర్పణాలు వదిలి బ్రాహ్మణులకు తోచిన రీతిలో దానధర్మాలు చేశారు.
పశువుల ముస్తాబు
మరోవైపు.. శుక్రవారం కనుమ (పశువుల) పండుగ సందర్భంగా తెల్లవారుజామునే గోవులు, ఎద్దులు, గేదెలు, పొట్టేళ్లు వంటి వాటికి వేడినీటితో స్నానాలు చేయించి కొమ్ములకు రంగులు పూసి పసుపు, కుంకుమతో బొట్లు పెట్టారు. పూలమాలలు వేసి అలంకరించారు. గోవులు, ఎద్దులకు అరిసెలు, బెల్లం, తవుడు తినిపించి పూజలు చేశారు. ఇక పలు జిల్లాల్లో ఎద్దులతో బండ లాగుడు పోటీలు వైభవంగా జరిగాయి. వీటిని వీక్షించేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు.
జనసంద్రం.. విశాఖ సాగరతీరం
ఇదిలా ఉంటే.. సంక్రాంతి సంబరాలతో విశాఖ సాగర తీరం జన సంద్రంగా మారింది. గురు, శుక్రవారాలు ఆర్‌కే బీచ్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. ఆకాశంలో వయ్యారాలొలుకుతూ పతంగులు సందడి చేశాయి. సంక్రాంతి పండుగకు సగం నగరం ఊళ్ల వైపు పరుగులు తీయగా.. మిగిలిన వారు బీచ్‌లో కనిపించారు. దీంతో నగర రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
కోనసీమలో కోలాహలంగా ప్రభల తీర్థాలు
తూర్పు గోదావరి జిల్లాలో కనుమ పండగ రోజైన శుక్రవారం ప్రభల తీర్థాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనంతో కోలాహలంగా జరిగాయి. కోనసీమలోని దాదాపు 175 గ్రామాల్లో ఇవి నేత్రపర్వంగా జరిగాయి. ప్రభల తయారీతో సంక్రాంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన భక్తులు ప్రభలను గ్రామగ్రామాన ఊరేగించి, తీర్థాలు నిర్వహించారు. వీటిని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల్లో స్థిరపడిన స్థానికులు కూడా గ్రామాలకు తరలివచ్చారు. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట ప్రభల తీర్థానికి 11 గ్రామాల నుంచి ఏకాదశ (11) రుద్ర ప్రభలు తరలివచ్చాయి. అపురూపమైన ఆ దృశ్యాన్ని చూసిన భక్తజనం ఓ మధురానుభూతికి గురైంది. ఇక్కడకు లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చారని అంచనా. అలాగే, ఇదే మండలం తొండవరం గ్రామంలో 45 అడుగులు, వాకలగరువులో 42 అడుగుల ఎత్తున రూపొందించిన ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి రోజున కొత్తపేటలో జరిగిన ప్రభల తీర్థం, భారీ బాణాసంచా కాల్పులతో వేడుకగా జరిగింది.
తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గన్నతోట తీర్థంలో కొలువుదీరిన ప్రభలు
ముగిసిన పందెం
సంక్రాంతి కోడి పందాల ముచ్చట శుక్రవారం ముగిసింది. పలు జిల్లాల్లో పోలీసులు రంగంలోకి దిగి బరుల వద్ద పందేలను నిలిపివేయించారు. భోగి రోజైన బుధవారం ఒక మోస్తరుగా మొదలైన కోడి పందాలు సంక్రాంతి రోజైన గురువారం జాతరను తలపించాయి. కనుమరోజైన శుక్రవారం అదే జోరు కొనసాగింది. ప్రధానంగా ఉభయ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందల కోట్ల రూపాయల బెట్టింగ్‌లు చేతులు మారాయి. సంప్రదాయం పేరుతో జరిగిన కోడి పందేలను చూసీచూడనట్టు వదిలేసిన పోలీసులు పేకాట, గుండాట, కోతాట తదితర జూదాలపై కఠినంగా వ్యవహరించారు. అయితే గతంలో పోల్చితే ఈ ఏడాది సంక్రాంతి కోడి పందాల జాతర కళ తప్పింది. కోడి పందాలపైన కోవిడ్ ప్రభావం స్పష్టంగా కన్పించింది. పందేలు చూసేందుకు, బెట్టింగ్‌లు వేసేందుకు గతంలో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చేవరాని, ఈ ఏడాది అంత పెద్ద సంఖ్యలో జనం రాలేదని బరుల నిర్వాకులు తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈసారి అశించిన స్థాయిలో రాలేదు.
గతంలో జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన, సొంత తోటల్లోను, గుర్తింపు పొందిన ప్రాంతాల్లోను బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహించే వారు. ఈసారి నిర్వాహకులు రహదారులకు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో కొత్త ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేయడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లా గోదావరి నదీ పాయల్లోని లంకల్లో బరులు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి, పాలకొల్లు, వీరవారసరం, నరసాపురం, గోపాలపురం, దేవరపల్లి, తణుకు మండలం తేతలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర ప్రాంతాల్లో పెద్దఎత్తున పందేలు నిర్వహించారు. కృష్టా జిల్లా గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, పెనమలూరు, బాపులపాడు, కంచికచర్ల, నందిగామ, తోట్లవల్లూరు మండలాల్లో, గుంటూరు జిల్లా తెనాలి, రెపల్లె, వేమూరు తదితర ప్రాంతాల్లో కోడి పందాలు సాగాయి.
Comments
Please login to add a commentAdd a comment