kanuma festivals
-
అంగరంగ వైభవం.. సంక్రాంతి సంబరం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా, సంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. చాలా ఏళ్ల తర్వాత మంచి వర్షాలు కురవడం, వాతావరణం అనుకూలించడం.. పేదలు, అల్పాదాయ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందడంతో పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ ఆనందంగా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. చేతినిండా గాజులు వేసుకుని పట్టువస్త్రాలు ధరించి సంప్రదాయబద్ధంగా ముస్తాబైన ఆడపడుచులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జీన్స్ ప్యాంట్లు, పంజాబీ డ్రస్‌లకే పరిమితమైన పట్టణ, నగర యువతులు స్వగ్రామాలకు వచ్చి పట్టు పరికిణీలు ధరించి సందడి చేస్తూ సరికొత్త అనుభూతులు పంచుకున్నారు. యువతులు రంగురంగుల రంగవల్లులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. డూడూ బసవన్నలు గ్రామాల్లో సందడి చేశాయి. హరిదాసుల కీర్తనలు మార్మోగాయి. ఇక చాలా ప్రాంతాల్లో గురువారం భక్తిశ్రద్ధలతో పెద్దలకు తర్పణాలు వదిలి బ్రాహ్మణులకు తోచిన రీతిలో దానధర్మాలు చేశారు. పశువుల ముస్తాబు మరోవైపు.. శుక్రవారం కనుమ (పశువుల) పండుగ సందర్భంగా తెల్లవారుజామునే గోవులు, ఎద్దులు, గేదెలు, పొట్టేళ్లు వంటి వాటికి వేడినీటితో స్నానాలు చేయించి కొమ్ములకు రంగులు పూసి పసుపు, కుంకుమతో బొట్లు పెట్టారు. పూలమాలలు వేసి అలంకరించారు. గోవులు, ఎద్దులకు అరిసెలు, బెల్లం, తవుడు తినిపించి పూజలు చేశారు. ఇక పలు జిల్లాల్లో ఎద్దులతో బండ లాగుడు పోటీలు వైభవంగా జరిగాయి. వీటిని వీక్షించేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. జనసంద్రం.. విశాఖ సాగరతీరం ఇదిలా ఉంటే.. సంక్రాంతి సంబరాలతో విశాఖ సాగర తీరం జన సంద్రంగా మారింది. గురు, శుక్రవారాలు ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. ఆకాశంలో వయ్యారాలొలుకుతూ పతంగులు సందడి చేశాయి. సంక్రాంతి పండుగకు సగం నగరం ఊళ్ల వైపు పరుగులు తీయగా.. మిగిలిన వారు బీచ్‌లో కనిపించారు. దీంతో నగర రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కోనసీమలో కోలాహలంగా ప్రభల తీర్థాలు తూర్పు గోదావరి జిల్లాలో కనుమ పండగ రోజైన శుక్రవారం ప్రభల తీర్థాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనంతో కోలాహలంగా జరిగాయి. కోనసీమలోని దాదాపు 175 గ్రామాల్లో ఇవి నేత్రపర్వంగా జరిగాయి. ప్రభల తయారీతో సంక్రాంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన భక్తులు ప్రభలను గ్రామగ్రామాన ఊరేగించి, తీర్థాలు నిర్వహించారు. వీటిని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల్లో స్థిరపడిన స్థానికులు కూడా గ్రామాలకు తరలివచ్చారు. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట ప్రభల తీర్థానికి 11 గ్రామాల నుంచి ఏకాదశ (11) రుద్ర ప్రభలు తరలివచ్చాయి. అపురూపమైన ఆ దృశ్యాన్ని చూసిన భక్తజనం ఓ మధురానుభూతికి గురైంది. ఇక్కడకు లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చారని అంచనా. అలాగే, ఇదే మండలం తొండవరం గ్రామంలో 45 అడుగులు, వాకలగరువులో 42 అడుగుల ఎత్తున రూపొందించిన ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి రోజున కొత్తపేటలో జరిగిన ప్రభల తీర్థం, భారీ బాణాసంచా కాల్పులతో వేడుకగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గన్నతోట తీర్థంలో కొలువుదీరిన ప్రభలు ముగిసిన పందెం సంక్రాంతి కోడి పందాల ముచ్చట శుక్రవారం ముగిసింది. పలు జిల్లాల్లో పోలీసులు రంగంలోకి దిగి బరుల వద్ద పందేలను నిలిపివేయించారు. భోగి రోజైన బుధవారం ఒక మోస్తరుగా మొదలైన కోడి పందాలు సంక్రాంతి రోజైన గురువారం జాతరను తలపించాయి. కనుమరోజైన శుక్రవారం అదే జోరు కొనసాగింది. ప్రధానంగా ఉభయ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందల కోట్ల రూపాయల బెట్టింగ్‌లు చేతులు మారాయి. సంప్రదాయం పేరుతో జరిగిన కోడి పందేలను చూసీచూడనట్టు వదిలేసిన పోలీసులు పేకాట, గుండాట, కోతాట తదితర జూదాలపై కఠినంగా వ్యవహరించారు. అయితే గతంలో పోల్చితే ఈ ఏడాది సంక్రాంతి కోడి పందాల జాతర కళ తప్పింది. కోడి పందాలపైన కోవిడ్ ప్రభావం స్పష్టంగా కన్పించింది. పందేలు చూసేందుకు, బెట్టింగ్‌లు వేసేందుకు గతంలో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చేవరాని, ఈ ఏడాది అంత పెద్ద సంఖ్యలో జనం రాలేదని బరుల నిర్వాకులు తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈసారి అశించిన స్థాయిలో రాలేదు. గతంలో జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన, సొంత తోటల్లోను, గుర్తింపు పొందిన ప్రాంతాల్లోను బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహించే వారు. ఈసారి నిర్వాహకులు రహదారులకు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో కొత్త ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేయడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లా గోదావరి నదీ పాయల్లోని లంకల్లో బరులు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి, పాలకొల్లు, వీరవారసరం, నరసాపురం, గోపాలపురం, దేవరపల్లి, తణుకు మండలం తేతలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర ప్రాంతాల్లో పెద్దఎత్తున పందేలు నిర్వహించారు. కృష్టా జిల్లా గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, పెనమలూరు, బాపులపాడు, కంచికచర్ల, నందిగామ, తోట్లవల్లూరు మండలాల్లో, గుంటూరు జిల్లా తెనాలి, రెపల్లె, వేమూరు తదితర ప్రాంతాల్లో కోడి పందాలు సాగాయి. -
సంక్రాంతి: కను‘మా విందు’
సాక్షి, కడప: కోడి కూయకముందే పల్లె నిద్ర లేచింది.. ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చిన తన బిడ్డలను చూసి పల్లె తల్లి మురిసింది.. పట్టణాలు..నగరాల నుంచి తరలివచ్చిన బంధుమిత్రులతో కళకళలాడుతున్న తెలుగు లోగిళ్లను చూసి ముచ్చటపడింది. ‘పల్లెల్లో ఏముంది... మట్టి మనుషులు.. వట్టిపోయిన భూములు’ అంటుంటారు కదా.... ఇప్పుడు మీరే చూడండి.. నాలోని ప్రేమ.. ఆప్యాయత ఏపాటిదో.. కను‘మా విందు’ ఎలా ఉంటుందో.. అంటూ తన స్వగతాన్ని ఇలా చెప్పుకొచ్చింది. ‘రేయ్ సంటోడా.. మీ నాయన ఏడిరా...’ తన మనవడిని ఆపి అడిగింది జేజి. ‘అదిగో వస్తున్నాడు చూడు..’ మనవడు సమాధానమిచ్చాడు.. అటు వైపు నుంచి వస్తున్న తన తండ్రిని చూపిస్తూ.. ‘యాడికిపోయినావ్.. నాయనా.. కూచ్చో.. కూచ్చో.. వడలు సల్లారిపోతాండాయ్.. ఓ పల్లెంలో వడలు.. నాటుకోడి కూర తెచ్చి పెట్టింది ప్రేమతో... నువు కూడా రామ్మా.. కోడలిని పిలిచింది.. దగ్గరుండి మరీ వడ్డించింది..’ పండక్కు కొడుకు కోడలు వచ్చినారని ప్రపంచాన్నే జయించానన్న సంతోషం ఆమెది. చూశారా.. కొడుక్కి దగ్గరదగ్గర ఐదు పదుల వయసున్నా.. అమ్మ ప్రేమ ఎలాంటిదో.. అదిగో అటు చూడండి.. ‘నమస్తే సార్.. బాగున్నారా.. ’ తన చిన్ననాటి గురువు సత్యమయ్యకు దండం పెట్టాడు శిష్యుడు శివ. శివ వేరే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. సత్యమయ్య అంటే ఆ ఊర్లో అందరికీ గౌరవం. ట్యూషన్ పెట్టి ఎందరికో విద్యాబుద్ధులు నేర్పించాడాయన. ‘ఏం శివా.. బాగున్నావా.. ఉద్యోగం ఎలా ఉంది’ బాగున్నా సార్.. మీరెలా ఉన్నారు.. ఇలా వారి సంభాషణ నడిచింది. చాలా ఏళ్ల తర్వాత ఊరికి వచ్చిన శివ తన గురువు కోసం తెచ్చిన కానుక ఇచ్చి.. శాలువాతో సన్మానించాడు.. కాళ్లకు దండం పెట్టి ఆశీర్వచనాలు అందుకున్నాడు. చూశారా.. నా ఒడిలో పెరిగిన బిడ్డ ఎంతెత్తుకు ఎదిగినా ఎలా ఒదిగి ఉన్నాడో.. అంటూ ఆ పల్లె తల్లి గర్వంగా చెప్పింది. ఆ పక్కనే ఉన్న ఇంట్లో ఒకటే నవ్వులు వినిపిస్తున్నాయ్.. హైదరాబాద్ నుంచి వచ్చిన తన సహచర ఉద్యోగులు, మిత్రులతో అనిల్ పండుగను ఎంజాయ్ చేస్తున్నాడు. ఊర్లో తన చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ.. అవన్నీ తన మిత్రులతో పంచుకుంటున్నాడు.. అంతలోనే అనిల్ అమ్మ పల్లెం నిండా స్వీట్లు తెచ్చి పెట్టింది. ‘కడుపు నిండిపోయింది.. వద్దు.. వద్దు’ అంటున్న ‘లేదు తినాల్సిందే’ అంటూ వారి ముందు పెట్టింది. మూడు రోజుల నుంచి ఆమె అలుపెరగకుండా వారికి ఏం కావాలో అడిగి మరీ వండి వడ్డిస్తోంది. అదీ నేను నేర్పిన ఆప్యాయత.. ప్రతి ఇంటా చుట్టాలు.. పిల్లల అల్లర్లు.. వంటింట్లో ఘుమఘమలాడే పిండివంటలు.. పంట చేలు.. పిల్ల కాలువలు.. బండెద్దు పోటీలు.. కర్రసాము విన్యాసాలు..ఒక ఇంట ఏంటి.. ఒక చోట ఏంటి.. ఊరు ఊరంతా సంబరం..చూశారా..నాలో ఉన్న అందాల్ని ....నా ఒడిలోని అనురాగ ఆప్యాయతల్ని ..పండుగ వేళ.. నాదొక విన్నపం..నేను పల్లెనే....ఊరికెనే ఎవరికీ పల్లెత్తి మాట అనను.. ‘మాట’ పడను.. అందుకే ఎవరైనా ‘పల్లెల్లో ఏముంటాయి’ అంటే బాధేస్తుంది.. ఏమున్నాయ్ అంటారే.. ఏమి లేవు నాలో.. సంస్కృతికి ప్రతీక నేను.. సంప్రదాయాలకు పట్టుకొమ్మను నేను.. మనిషి నడకకు.. నడతకు ఊపిరిపోసిన‘తల్లి’ని నేను.. ఏదై తేనేం అందరూ వచ్చారు.. ఆడిపాడి ఆనందంగా గడిపారు... సంతోషం.. పండుగ పూ ట నా గురించి చెప్పుకునే అవకాశం కల్పించారు.. ఉంటాను.. మీ పల్లెను.. -
అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ధనుర్మాసంలో వచ్చే పండగల్లో భోగి.. మకర సంక్రాంతి.. కనుమ పండగలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. అందుకే ఈ పండగలకు అంత ప్రాముఖ్యత. దూరాన ఉన్న కొడుకులు.. కోడళ్లు.. అల్లుళ్లు.. మనమలు, మనవరాళ్లు.. అంతా కలసి చేసుకునే పండగ. మూడు రోజుల పాటు జరిగిన సంబరాలు అంబరాన్నంటాయి. ఆవుపేడ అలికిన వాకిళ్లు .. రంగు రంగుల ముగ్గులు.. మధ్యలో గొబ్బెమ్మలు.. ఇంటి ముంగిట మామిడాకుల తోరణాలు.. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల భజనలు. ఇంట్లో పిండ వంటల ఘుమఘుమలు.. పతంగులు.. కబడ్డీ.. ముగ్గులు.. ఎద్దులు.. కోళ్ల పందేలు పోటీలు. కొత్తబట్టలతో పండక్కి వచ్చిన చుట్టాలతో ఇల్లంతా సందడి.. సందడిగా సంక్రాంతి పండగ జరుపుకున్నారు. ముఖ్యంగా కొత్త అల్లుళ్లకు రాచమర్యాదలు.. అప్యాయతానురాగాల మధ్య పండగ అంబరాన్నింటింది. గురువారం సంక్రాంతి రోజున పల్లెల్లో మహిళలు ప్రత్యేకంగా మట్టిపాత్రలో పాలతో పొంగళ్లుపెట్టి.. కొత్తబట్టలతో పెద్దలకు నైవేద్యంగా సమర్పించుకున్నారు. అందులో భాగంగా నెల్లూరులోని బోడిగాడి తోటలో నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొని పూర్వీకుల సమాధుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తర్పణం వదలటం కనిపించింది. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండగను సంప్రదాయబద్ధంగా చేసుకున్నారు. మూడవరోజైన శుక్రవారం కనుమ పండగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పశువులకు పూజలు నిర్వహించారు. నెల్లూరులో గురువారం రాత్రి శ్రీతిక్కన మహాకవి లలితకళాపీఠం ఆధ్వర్యంలో శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మకరసంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కళాపీఠం వ్యవస్థాపకులు ఆలూరు శిరోమణిశర్మ ఆధ్వర్యంలో కవిసమ్మేళనం, సంగీత కార్యక్రమాలతో ఆహూతులను అలరింపజేశారు. కనుమ పండగ రోజైన శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి బంధుమిత్రుల మధ్య సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకున్నారు. నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ఇస్కాన్ మందిరం ప్రాంగణంలో నిర్వహించిన గోపూజోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 గోశాలలోనూ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కనుమ పండగ సందర్భంగా కావలిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో కనులపండువగా గోదాదేవి, రంగనాథస్వామి కల్యాణం జరిగింది. కావలి ఇలవేల్పు శ్రీకళుగోళశాంభవి దేవి అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి నుంచి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం శుక్రవారం రాత్రి వరకు పురవీధులలో ఊరేగారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. సంగంలో కొండతిరుగుడు ఉత్సవాలు వేడుకగా నిర్వహించారు. వెంకటగిరిలో శుక్రవారం గొబ్బెమ్మ నిమజ్జనం వేడుకగా నిర్వహించారు. స్థానిక కాశీతోట ప్రాంతంలోని కైవల్యానదితీరంలో మహిళలు గొబ్బిపాటలు, ఆటలు, వనభోజనాలతో సందడి చేశారు. అనంతరం గొబ్బెమ్మ( గౌరమ్మ)ను నిమజ్జనం చేశారు. వెంకటగిరి పట్టణం కుమ్మరిగుంట సాయిబాబా ఆశ్రమం ఆధ్వర్యంలో కుమ్మరిగుంట పుష్కరిణిలో సాయిబాబా తెప్పోత్సవం కనుల పండువగా సాగింది. వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. పెంచలయ్యకోనలో కనుమ పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కనుల పండువగా తెప్పోత్సవం... నెల్లూరు నవాబుపేట మైపాడుగేట్వద్ద జాఫర్సాహెబ్కెనాల్లో శుక్రవారం రాత్రి శ్రీభ్రమరాంబసమేత శ్రీమల్లేశ్వరస్వామివారి కనుమ తెప్పోత్సవం కనుల పండువగా సాగింది. సంప్రదాయంలో భాగంగా నగర పరిసరాల్లో కొలువైన దేవతలు దేవేరులతో కలసి నవలాకులతోట ప్రాంతానికి కల్యాణమహోత్సవం అనంతరం వనవిహారానికి మేళతాళాలతో సర్వాలంకారశోభితులుగా విచ్చేసి విహరించారు.