అమెరికన్ పెర్విన్ జాతి పందెం కోడి పుంజు , అమెరికన్ గేమ్ పౌల్ జాతి పందెం కోడి
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోచింగ్ క్యాంపులు మొదలయ్యాయి. ఆ క్యాంపుల్లో కోడి పుంజులు కొత్త అల్లుళ్ల మాదిరిగా మహారాజ భోగాలు అనుభవిస్తున్నాయి. బాదం..పిస్తా.. మేక మాంసంతో చేసిన ఖైమా వంటి అదిరిపోయే మెనూతో ఒళ్లు పెంచుకుంటున్నాయి. ఆ తరువాత స్పెషల్ ట్రైనర్ల సమక్షంలో వ్యాయామాలు కూడా చేస్తున్నాయి.నిత్యం గోరు వెచ్చని నీటిలో జలకాలాడుతూ సంక్రాంతి పందేలకు సిద్ధమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి తీరంలో సంస్కృతి, సంప్రదాయల కలబోతగా సాగే సంక్రాంతి సంబరాల కోసం పందెం కోళ్లు క్యాంపుల్లో శిక్షణ పొందుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని పల్లెల్లో 6 నెలలుగా పందెం కోళ్లకు శిక్షణ ఇస్తున్నారు. దేశవాళీ జాతులైన నెమలి, డేగ, శేషువా, గేరువా, రసంగి, కాకి, అబ్రాస్, కక్కిరా, పింగళి, నల్లబొట్ల శేషువా, కోడి కాకి వంటి 20 రకాల జాతులకు చెందిన కోడి పుంజులు ఈ క్యాంపుల్లో శిక్షణ పొందుతున్నాయి.
ట్రైనర్లను నియమించి మరీ కోడి పుంజులకు శిక్షణ ఇస్తున్నారు. వాటికి బలవర్ధకమైన ఆహారం ఇచ్చేందుకు వేలకు వేలు వెచ్చిస్తున్నారు. రూ.5 వేల నుంచి రూ.10 వేలకు కోడి పుంజుల్ని కొనుగోలు చేసి.. వాటికి 6 నెలల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం ఒక్కొక్క పుంజును రూ.2 లక్షలకు పైనే విక్రయిస్తుంటారు.
మెనూ మామూలుగా ఉండదు మరి
అక్టోబర్ నెలలో ఉదయాన్నే కోడిగుడ్డు, ధాన్యం, గంట్లు కలిపిన మిశ్రమాన్ని కోడి పుంజులకు ఆహారంగా పెట్టారు. ఆ తరువాత నుంచి ఉడకబెట్టిన కోడి గుడ్డును పిండి మాదిరిగా నలిపి మొదటివిడతగా ఉదయం 9 గంటలకు అల్పాహారం, ఉదయం 10 గంటలకు బాదం, పిస్తా కలిపిన మిశ్రమం, 50 గ్రాముల ఖైమా వంటి వాటిని విడివిడిగా పెట్టారు. మధ్యాహ్నం శక్తి కోసం రివైటల్ ట్యాబ్లెట్స్ వేస్తారు.
డిసెంబర్ నెలలో 20 నుంచి 30 రకాల డ్రైఫ్రూట్స్‌తో తయారయ్యే నాస్తా పెడుతున్నారు. అంజూర, బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండు ఖర్జూరం, కిస్మిస్, నల్లద్రాక్ష, తేనె, నువ్వుల నూనె, సొంఠి, తోక మిరియాలు, మసాలా దినుసులు కలిపి రోటిలో ముద్దగా చేసి రోజుకు ఒక గోలీ చొప్పున తినిపిస్తున్నారు. ఇలా ఒక్కో పుంజుకు రోజుకు రూ.200 వరకు ఆహారం కోసం వెచ్చిస్తున్నారు. ఇలా ఒక పందెం కోడికి 6 నెలల మెనూ ఖర్చు రూ.36 వేలకు పైగా దాటిపోతుంది. ట్రైనర్ల జీతాలు, క్యాంప్ నిర్వహణ ఖర్చులు అదనం.
క్రాస్ జనరేషన్ పుంజులదే హవా
గడచిన మూడేళ్లుగా పందేలలో క్రాస్ జనరేషన్ కోడి పుంజుల హవా నడుస్తోంది. వీటిలో ప్రధానమైనవి అమెరికన్ గేమ్ పౌల్, అమెరికన్ పెర్విన్, సాహివాల్‌తో పాటు బ్రెజిల్ జాతి కోళ్లు వంటివి ఉన్నాయి. జత పుంజు, పెట్టను రూ.3.50 లక్షలకు మూడేళ్ల క్రితం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. వీటిని దేశీయ నెమలి, డేగ తదితర జాతి కోళ్లతో క్రాసింగ్ చేయించారు.
విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పశు వైద్యుల పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. ఇలా సుమారు 100 జతల కోళ్లను దిగుమతి చేసుకున్నారని అంచనా. ప్రస్తుతం పందెం కోళ్లలో ‘అమెరికన్ గేమ్ పౌల్’ పుంజు ఇటీవల విజేతగా నిలుస్తోంది. దీని తరువాత స్థానం పెర్విన్ జాతిదే. ఈ రెండు క్రాసింగ్ జనరేషన్ పుంజులే. ఈ విదేశీ పుంజులు తొలి ఏడాది బరిలో బోల్తా పడ్డాయి.
దీనిని గుర్తించి వీటిని దేశవాళీ మేలు రకం పుంజులతో క్రాసింగ్ చేయడంతో మూడో జనరేషన్ నుంచి వీటిలో పోరాట పటిమ పెరిగిందంటున్నారు. అమెరికన్ జాతి కోళ్లలో మెళకువలు, స్వదేశీ జాతి కోళ్లలో ఎముక పటుత్వం కలగలిపి ఇవి బరిలో మేటిగా నిలుస్తున్నాయని పెంపకందారులు చెబుతున్నారు. ఈ కోడిపుంజు ధర రూ.లక్షకు పైమాటే. తరువాత అమెరికన్ పెర్విన్ జాతి పుంజు రూ.70 వేల ధర పలుకుతోంది. వీటికి శిక్షణ ఖర్చులు అదనం.
పోషణ, శిక్షణతోనే గెలుపు
పందెం కోళ్ల పోషణ చాలా ముఖ్యమైనది. చక్కని బలవర్ధకమైన ఆహారంతో పాటు ఉదయాన్నే కోళ్లకు వ్యాయామం కూడా చేయిస్తాం. నీళ్ల పోత, కాక తీత చేయిస్తాం. ఇదంతా నిపుణుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. వైద్యుల సాయంతో మందులు కూడా వినియోగిస్తాం.
– రామరాజు, బట్టేలంక, కోనసీమ జిల్లా
ఈ ఏడాదీ అమెరికన్ గేమ్ పౌల్‌దే
2018లో అమెరికన్ గేమ్ పౌల్‌దే జాతి కోళ్లను దిగుమతి చేసుకున్నాం. తొలి జనరేషన్ బాగా క్లిక్ అయింది. రెండో జనరేషన్ ఫెయిలైంది. వీటిని నాణ్యమైన దేశీయ కోళ్లతో క్రాసింగ్ చేయడంతో గత సంక్రాంతికి మూడో జనరేషన్ నుంచి ఈ జాతి పోటీలలో విజేతగా నిలుస్తోంది. ఈ ఏడాది కూడా అమెరికన్ గేమ్ పౌల్ పైచేయిగా నిలిస్తుందన్న నమ్మకం ఉంది.
– పరుచూరి కృష్ణారావు, గుడివాడ, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment