
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కోడిపందేలను సంప్రదాయం ప్రకారం కాకుండా జూదంగా మార్చేశారని వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. మంగళవారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘కోట్ల రూపాయల మేర కోడి పందేల రూపంలో చేతులు మారాయి. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంమ్మెల్సీలే స్వయంగా ఈ జూదంను ప్రోత్సహించడం దారుణం. ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా పోలీసులను చూసిచూడనట్లు వ్యవహరించాలని సూచించడం వల్లే ఈ జూదం నడిచింది. పేకాట, గుండాట, బెల్ట్ షాపులు, కత్తులు కట్టి కోడిపందేలు జరుగుతూ ఉంటే పోలీసులు ఎందుకు స్పందించడం లేదు.
అధికార పార్టీ నేతలు సంప్రదాయం ముసుగులో వేలకోట్లు చేతులు మారేలా చేస్తున్నారు. చాటుమాటుగా జరిగే జూదం నేడు కార్పొరేట్ స్థాయికి అధికార పార్టీ నేతలు తీసుకువెళ్లారు. ఎంపీ మాగంటి బాబు ఏర్పాటు చేసుకున్న టీడీపీ కార్యాలయాన్ని పేకాట కేంద్రంగా మార్చేశారు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధపడటం దారుణం. కోడిపందేల శిబిరాల్లో అశ్లీల నృత్యాలు, బెల్ట్ షాపులు, పలావు సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిని పెట్టుకున్నందుకు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటు. కొన్నిచోట్ల అశ్లీల నృత్యాలు చేయించారు.
న్యాయస్థానాలు అంటే తెలుగుదేశం పార్టీ నేతలకు గౌరవం లేదా? ఇక హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే కత్తులతో కోడి పందేలు, జూదం జరుగుతోంది. ఇక పోలీసులు ఏం చేయగలరు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ అరాచకం జరుగుతోంది. ఇక రాష్ట్రంలో చట్టాలు, సంప్రదాయాలు ఎందుకు?. ఇది సమాజానికి ప్రమాదకరం. క్రికెట్ పిచ్‌ల మాదిరిగా కోడిపందేల బరులు సిద్ధం చేశారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో పందేలు నిర్వహించారు. ప్రజల బలహీనతలను పెంచేలా సాక్షాత్తూ ప్రజాప్రతినిధులే ప్రవర్తిస్తే ఎలా?. కోడి పందేల పేరుతో సామాన్యుడి జీవితాలతో ఆటాడుకుంటారా?. జూదాన్ని ప్రోత్సహించేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. అమాయకుల జీవితాలతో ఆడుకోవద్దు’ అని అంబటి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment