hen fights
-
కోస్తా బరిలో బస్తీ పుంజు
చాంద్రాయణగుట్ట: కుస్తీ పోటీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పాతబస్తీ పహిల్వాన్లు కోడి పుంజులను పెంచేందుకు కూడా అంతే ఆసక్తి చూపుతున్నారు. తమ ఇంట్లోని పిల్లల్లా ఎంతో జాగ్రత్తగా సాకడమేకాదు.. వాటిని సంక్రాంతి బరిలోకి సైతం దించుతున్నారు. పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోడి పందాల్లో పాతబస్తీ పుంజులకు ప్రత్యేక స్థానం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలలో పందెం రాయుళ్లు లక్షల ధనం వెచ్చించి ఏటా ఇక్కడి నుంచే కోడి పుంజులను తీసుకెళ్లడం విశేషం. తొలినుంచి పాతబస్తీ వాసులు గొర్రెలు, మేకలను పెంచడం ఆనవాయితీ. అయితే, పందెం కోళ్లకున్న డిమాండ్‌ను బట్టి వాటికి ప్రత్యేక శిక్షణతో పాటు ప్రత్యేకమైన మేతను సైతం పెడుతున్నారు. ప్రతిరోజు బాదం, పిస్తా, అక్రోట్స్, కీమా, ఉడికించిన గుడ్ల తెల్ల సొనను ఆహారంగా ఇస్తారు. అంతేకాదండోయ్.. ముఖ్యంగా ప్రతిరోజు నైపణ్యం కలిగిన కోచ్‌లతో రెండు పూటలా మసాజ్‌తో పాటు అలసిపోకుండా పరుగు, ఈత కొట్టిస్తారు. బార్కాస్, కొత్తపేట, ఎర్రకుంట తదితర ప్రాంతాలలోని కొంత మంది ఫహిల్వాన్ల వద్ద మాత్రమే ఇలాంటి కోడిపుంజులున్నాయి. వీటిని ప్రత్యేక ఎన్క్లోజర్లలో పెట్టి పెంచడం గమనార్హం. నచ్చితే చాలు.. ధర ఓకే.. కోస్తాంధ్ర, రాయలసీమలలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాల కోసం పందెం రాయుళ్లు బార్కాస్‌లోని పహిల్వాన్ల వద్దకు వచ్చి వాలిపోతారు. వీరి వద్ద కోడిపుంజు తీసుకెళితే పందెంలో నెగ్గుతామనే నమ్మకంతో కోళ్లను తీసుకెళతారు. జాతి, రంగును బట్టి ఒక్కో కోడిపుంజు ధర రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పలకడం విశేషం. అలాగని ఇక్కడి పహిల్వాన్లు కోళ్ల వ్యాపారం చేస్తారనుకుంటే పొరపాటే. ఎంతో దగ్గరి వ్యక్తులకు మాత్రమే ఏడాదికి పరిమిత సంఖ్యలో పుంజులను విక్రయిస్తుంటారు. రెండేళ్ల వయసున్న పుంజులనే పందానికి ఇస్తుంటారు. -
మనమూ పందెం కాద్దామా?
భద్రాద్రి కొత్తగూడెం, వైరారూరల్: ఆంధ్ర సరిహద్దులో నిర్వహించే కోడి పందేలకు తెలంగాణలోని ఖమ్మం జిల్లా వాసులు సైతం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్ ముగియడంతో ధాన్యం, పత్తి, మిర్చి తదితర పంటలు చేతికొచ్చాయి. మార్కెట్లో పత్తి, మిర్చి ధరలు ఆకాశాన్నంటి రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. ఇంకా ధరలు పెరగడమే తప్ప తగ్గే మార్గం లేదు. దీంతో రైతులతో పాటు అన్ని వర్గాల వారు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇదే తరుణంలో వ్యాపారాలు, పంటల దిగుబడిపై వచ్చిన మొత్తాన్ని సొమ్ము చేసుకొని ఆంధ్రలో నిర్వహించే కోడి పందేలు చూసేందుకు, పందేలు కాసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాహనాలు కిరాయికి తీసుకు వెళ్లే అవకాశాలు ఉండడంతో వాహనదారులు (కార్లు, టవెరా, బొలెరో, తుఫాన్) వంటి వాటికి గిరాకీ పెరగుతోంది. పుంజులకు భలే గిరాకీ.. సంక్రాంతి పండుగను పురస్కరించుకోని కోడి పందేలు నిర్వహించడం అనవాయితీ. తెలంగాణలో ఇలాంటి సదుపాయం లేకపోవడంతో ఒక్క జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాల వారు కూడా కోడి పందేలను వీక్షించేందుకు ఆంధ్ర ప్రాంతాలకు వెళ్తుంటారు. కోడి పందెంలో పాల్గొనేవారు మాత్రం రూ.వేలు వెచ్చించి కోడి పుంజులను కొనుగోలు చేస్తారు. మండల పరిధిలోని పలు గ్రామాలతో పాటు వైరా పట్టణ కేంద్రం, ఇతర మండలాల్లో పలువురు పందెం కోడి పుంజులను పెంచి వాటిని పందెం వేసేందుకు సిద్ధం చేసి మరీ విక్రయిస్తుంటారు. దీంతో కోడి పుంజుల ధరలు సైతం అధికంగానే ఉంటున్నాయి. కోడి పుంజుల్లో పలు రకాల జాతులు ఉండటంతో ఒక్కో పుంజును రూ.3 నుంచి రూ.6 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారంటే వారి గిరాకీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పలువురు కోడి పందేలు వేసే ప్రదేశాల్లోనే పందెం వేసే కోడి పుంజులను విక్రయిస్తుంటారు. దీంతో పలువురు అక్కడే కొనుగోలు చేసి అక్కడే పందెం వేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మూడు రోజులూ సందడే.. సంక్రాంతి పర్వదినం సందర్భంగా భోగి, మకర సంక్రాంతి, కనుమ మూడు రోజుల పాటు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ రోజుల పాటు కోడి పందేల నిర్వహణ ముమ్మరంగా ఉండడమే కాకుండా అర్ధరాత్రి వరకు ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు చేసి మరీ కోడి పందేల నిర్వహణ ఉంటుంది. ఆంధ్ర సరిహద్దులు, మారుమూల ప్రాంతాల్లోని మామిడి తోటలను లీజుకు తీసుకొని అక్కడ వందల రింగులను ఏర్పాటు చేసి కోడి పందేలను వేస్తారు. కోడి పందేల ప్రదేశాల్లోనే భోజనం నుంచి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తారు. దీంతో కోడి పందేలను చూసేవారు అదే విధంగా పందెం వేసే వారు ఆ మూడు రోజుల పాటు అక్కడే మకాం వేసి మరీ పందెం చూడడం, వేయడం వంటివి జరుగుతున్నాయి. ఖర్చు అధికమే.. కోడి పందేలను వేసే వాళ్లు, చూసేవాళ్లలో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. వారు తమ మిత్రులతో కలిసి సమూహాలుగా ఏర్పడి వాహనాలు కిరాయికి మాట్లాడుకొని వెళ్తుంటారు. దీంతో వారి ఖర్చులు అధికం కానున్నాయి. మూడు రోజుల పాటు కారు కిరాయికి తీసుకుంటే రూ.15 నుంచి రూ.20 వేల వరకు ఖర్చు వస్తుంది. పందెం వేసే వాళ్లకి అయితే దీనికి నాలుగింతలు అదనం ఖర్చు వస్తున్నట్లు తెలుస్తోంది. ఖర్చు ఎంత అయినా సరే వెనుకడగు వేయకుండా పందెంలో పాల్గొనేందుకు జిల్లా వాసులు సిద్ధమైనట్లు విశ్వనీయ సమాచారం. వస్తే లక్షలు..పోతే వేలు.. కోడి పందేల నిర్వహణ ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’అన్న చందంగా వర్ధిల్లుతున్నట్లు తెలుస్తోంది. కోడి పందేలు వేసే వారు అధిక శాతం రైతులు, వ్యాపారులు, యువకులు ఉన్నారు. మిర్చి, పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ మరింత ధరలు పెరిగిన తర్వాత విక్రయించుకుందాంలే అని వాటిని భద్రపర్చుకొని అప్పులు చేసి మరీ కోడి పందేలు వేసేందుకు గ్రామీణ, పట్టణాల రైతులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి ఒకసారి జరుపుకునే సంబురాలు కావడంతో వ్యాపారులు సైతం పందేలు వేసేందుకు ముందు వరుసలో ఉంటున్నారు. -
పందేలకు నై!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సంప్రదాయం పేరుతో సంక్రాంతికి ఎట్టిపరిస్థితుల్లో కోడిపందేలు నిర్వహించేందుకు పందెంరాయుళ్లు సన్నద్ధం అవుతున్నారు. కోడిపందేలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఉండటంతో వాటిని అడ్డుకునేందుకు పోలీసులు బైండోవర్ కేసులతో ముందుకు వెళ్తున్నారు. అయినా పండగ మూడు రోజులు కోడిపందేలు నిర్వహించడం ఆనవాయితీగా మారిపోయింది. ఇప్పటికే కోడిపందేలు నిర్వహించే మండలాల్లో రెవెన్యూ, పోలీసు, స్వచ్ఛంద సేవాసంస్థల బృందాలతో కమిటీలు వేశారు. ఇప్పటివరకు జిల్లాల్లో సుమారు 638 కేసులు నమోదు చేయగా, 2,730 మందిపై బెండోవర్ కేసులు పెట్టి కోడి కత్తులు స్వా«ధీనం చేసుకున్నారు. గతనెల 14 నుంచి ఈనెల 10వ తేదీ వరకూ ఏలూరు సబ్‌డివిజన్‌లో 276 మందిపై 81 కేసులు, కొవ్వూరు సబ్‌డివిజన్ పరిధిలో 520 మందిపై 144 కేసులు, నరసాపురంలో 1,611 మందిపై 309 కేసులు, జంగారెడ్డిగూడెం సబ్‌డివిజన్‌లో 188 మందిపై 54 కేసులు, పోలవరం సబ్‌డివిజన్ పరిధిలో 135 మందిపై 50 కేసులు నమోదు చేశారు. అయినా పందెంరాయుళ్లు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఈసారి భారీగా పందేలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు. సంక్రాంతి పండగకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో జిల్లావ్యాప్తంగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పాఠశాలలకు సంక్రాంతి సెలవులు కూడా ఇవ్వడంతో రాష్ట్రంలోని ప్రజలంతా తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఈనేపథ్యంలో కోడిపందేలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుట్టుగా బరులు సిద్ధం : పెద్ద సంఖ్యలో పందెంరాయుళ్లు బరులు సిద్ధం చేస్తున్నారు. కోడిపందేల బరులను పోలీసులు ధ్వంసం చేస్తుండటంతో కబడ్డీ ఇతర క్రీడాపోటీలు అంటూ బరులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో అక్కడక్కడా పోలీసుల కళ్లుకప్పి పందేలు మొదలయ్యాయి. కోడిపందేల నేపథ్యంలోనే పెదవేగి ఎస్సైపై జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ వేటు వేయడంతో మిగిలిన అధికారుల్లో భయం మొదలైంది. దీంతో ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున బైండోవర్ కేసులను నమోదు చేశారు. కోడిపందేలకు ప్రసిద్ధి చెందిన భీమవరంతో పాటు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పలు గ్రామాల్లో సంక్రాంతి కోడి పందేలకు బరులు సిద్ధమవుతున్నాయి. గతంలో పందేలు జరిగిన గ్రామాల్లో పోలీసులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటుచేయడంతోపాటు, గ్రామసభలు నిర్వహించి పందేలు, జూదాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఎవరి పని వారిది అన్నట్టుగా ఉంది. ఇప్పుడు పోలీసుల బైండోవర్ కేసుల పేరుతో అడ్డుకున్నా చివరి నాలుగురోజులు అనుమతులు వస్తాయన్న నమ్మకంతో పందేల నిర్వాహకులు తమ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
ఎన్నాళ్లిలా మాపై కక్ష
చుట్టూ పోలీసులవలయంమధ్యలో మేం...కాళ్లకు కట్లు...పైగా అదిరింపులుఅసలు ఏమి జరుగుతుందోమాకే తెలియదుమానవ వినోదానికిమేం బలి పశువులంఏవో దొరికిన గింజలు, పురుగులుతిన్న మా నోటికి పిస్తాలు, బాదం పప్పులుబలవర్ధక పౌష్టికాహార ముద్దలుఏమిటో ఈ రాచమర్యాదలనుకున్న వేళఅంతలోనే కష్టాలు...చేయని నేరానికిపోలీసుల అదుపులో ఇదిగో ఇలా...మా జాతి మధ్య లేని పౌరుషాన్నిరగిలించి.. మాలో మాకే కోపాన్ని రగిల్చిఆ ఆగ్రహాగ్నిలో మేం రక్తమోడుతుంటేనేలకొరిగి గిలగిలా కొట్టుకుంటుంటేఓడినా, గెలిచినా కొన ప్రాణంతో ఉన్నావిజయగర్వంతో వికటాట్టహాసం చేస్తూమా రక్తమాంసాలనే ఫలహారంగా ఆరగిస్తూఏమిటీ పైశాచిక ఆనందం తూర్పుగోదావరి,మలికిపురం( రాజోలు): సంక్రాంతి నేపథ్యంలో మలికిపురంలో విక్రయానికి సిద్దంగా ఉన్న 45 పందెం పుంజులను మలికిపురం ఎస్సై కె.వి.రామారావు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వివరాలను రాజోలు సీఐ కె.నాగమోహన రెడ్డి మంగళవారం మలికిపురంలో వెల్లడించారు. నెల్లూరు జిల్లా నాయుడుపాలేనికి చెందిన దేవరకొండ సుబ్బారాయుడు, దేవరకొండ మధు, పాలకిర్తి నానయ్య, నాగయ్య, సీనయ్య, దాసరి రామస్వామిలతో కూడిన బృందం లారీలో సుమారు 50 పందెం కోళ్లను మలికిపురం పద్మ «థియేటర్ వద్ద మంగళవారం ఆమ్మకానికి పెట్టారు. అప్పటికే ఐదు పుంజులను గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించేశారు. సమాచారం అందుకున్న మలికిపురం ఎస్సై. కె.వి.రామారావు తన సిబ్బందితో దాడి చేసి పుంజులను స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జంతు హింస చట్టం కింద కేసులు నమోదు చేశారు. రాజోలు సర్కిల్ పరిధిలో ఈ తరహా కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగమోహన రెడ్డి అప్పారు. -
ఆన్లైన్లో ‘పందెం కోళ్లు’
డేగ... కాకి... రసంగి.. నెమలి..ఇవన్నీ పక్షులన్న విషయం అందరికీ తెలిసిందే. వివిధ రకాల పందెం కోళ్లకు ఇవే పేర్లతో పిలుస్తారు. వీటికి ప్రత్యేకమైన పేర్లుండడమే కాదు..వేలల్లో ధరలు పలుకుతాయి. సంక్రాంతి దగ్గర పడడంతో పందెం కోళ్లకు గిరాకీ మొదలైంది. విక్రయాలు జోరందుకున్నా యి. ఇదే సమయంలో వీటి పెంపకందార్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. తాము పెంచిన కోళ్లతో సామాజిక మాధ్యమాలను వేదిక చేసుకొని ఆన్లైన్ విక్రయాలకు శ్రీకారం చుడుతున్నారు. తూర్పుగోదావరి, అమలాపురం: ‘సంక్రాంతి సమయంలో కోడి పందేలను జరగనిచ్చేది లేదు...ఉక్కు పాదంతో అణచివేస్తాం’ అని ఓ వైపు పోలీసులు హెచ్చరిస్తున్నా...మరోవైపు పందేలకు నిర్వహకులు చిరు కత్తులు నూరే పనిలో పడ్డారు. సంక్రాంతి సమయం దగ్గర పడడంతో పందేల నిర్వహకులు బరులను సిద్ధం చేయడంతోపాటు పందేలకు కావాల్సిన కోళ్ల కొనుగోలుకు వేట ప్రారంభిస్తున్నారు. ఏడాది పొడవునా మేకమాంసం, నాటు గుడ్లు, పాలు, బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష వంటి వాటిని పందెం కోళ్లకు తినిపించి బలోపేతం చేస్తున్నారు. ఒక్కో పందెం కోడి ఆహారానికి అయ్యే ఖర్చు రోజుకు రూ.50కి పైబడి ఉంటుందని అంచనా. స్థానికంగా ఉన్న పందెం నిపుణులతోపాటు, బిహార్ నుంచి వచ్చే ప్రత్యేక ట్రైనీలు వీటికి శిక్షణ ఇస్తారు. ఇందుకోసం వీరికి నెలకు రూ.50 వేల వరకూ చెల్లిస్తారు. ఇంత ఖర్చు పెడతారు కాబట్టే వీటి ధర వేలల్లో ఉంటుంది. ఒక్కో కోడి రకాన్ని బట్టి రూ.6 వేల నుంచి రూ.25 వేల వరకూ ఉంటుందంటే వీటి డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాలో పెంచే పందెం కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. మన జిల్లాలో రాజోలు దీవిలో చింతలపల్లి, సఖినేటిపల్లి, లక్కవరం, భట్టేలంక, శంకరగుప్తం, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి, అల్లవరం మండలం గోడి, గోడిలంక పరిసర ప్రాంతాల్లో పెంచే పందెం కోళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఉంది. కాకినాడ నుంచి వచ్చిన కొంతమంది రాజోలు దీవిలో పందెం కోళ్లను పెంచుతుండడం విశేషం. సాధారణంగా ఈ కోళ్లను స్థానికంగా పెంచే పెంపకందార్ల వద్దనే కొనుగోలు చేస్తారు. కానీ గత కొన్నేళ్లుగా సామాజిక మాధ్యమాల పుణ్యమాఅని కొన్ని ప్రాంతాల్లో కోళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇందుకు తగినట్టుగా పెంపకందారులు ఆన్లైన్ విక్రయాలకు తెరదీశారు. కృష్ణా జిల్లాకు చెందిన కొంతమంది పెంపకందారులు ‘నూజివీడు కాక్స్’, అనంతపురం జిల్లా పెంపకదారులు ‘జాతికోళ్ల పెంపకం’, నెల్లూరు పెంపకందారులు ‘జాతికోళ్ల పెంపకం సేల్స్’ పేర్లతో ఫేస్ బుక్‌లలో ప్రత్యేక గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో ఆయా కోళ్లు తలపడే సన్నివేశాలను, కోళ్లను ప్రదర్శనకు ఉంచుతున్నారు. కొంతమంది ఏకంగా కోళ్ల రకాలు.. వాటి ధరలనూ ప్రదర్శిస్తున్నారు. పనిలో పనిగా సెల్‌ఫోన్ నెంబర్లను పంపించి క్రయ, విక్రయాలకు తెరదీస్తున్నారు. దీంతో పందెం కోళ్ల మార్కెట్ కొత్త తరహాలో పరుగులు తీస్తోంది. -
పందెంరాయుళ్లపై పంజా
కృష్ణాజిల్లా, కోనేరుసెంటర్: జిల్లాలో పందెంరాయుళ్లను పోలీసులు పరుగులు పెట్టిస్తున్నారు. మూడు వారాలుగా జిల్లాలో పేకాట, కోడిపందేలపై విస్త్రత దాడులు చేస్తూ పందెంరాయుళ్లను హడలెత్తిస్తున్నారు. పందెంరాయుళ్లను పట్టుకునేందుకు అడుగడుక్కి జల్లెడ పడుతున్నారు. పోలీసుల వలలో ఇప్పటికే వందల సంఖ్యలో చిక్కుకోగా ఇతర జూదగాళ్లు పోలీసుల వల నుంచి తప్పించుకునేందుకు పొదల వెంట పరుగులు తీస్తున్నారు. పోలీసుల వలకు చిక్కిన జూదగాళ్లు పెద్ద మొత్తంలో జరిమానాలు చెల్లిస్తూ గొల్లుమంటున్నారు. సంక్రాంతి సమీపిస్తుండటంతో జిల్లాలో జరుగుతున్న పేకాట, కోడిపందేలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు జూదగాళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. 20 రోజుల్లోనే లెక్కలేని కేసులు... సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జిల్లాలో జరిగే పేకాట, కోడిపందేలతో పాటు ఇతరత్రా జూదాలపై ఉక్కుపాదం మోపాలంటూ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అధికారులను ఆదేశించటంతో రంగంలోకి దిగిన పోలీసులు పేకాట, కోడిపందెంరాయుళ్లను పరుగులు పెట్టిస్తున్నారు. పేక చప్పుడు వస్తే చాలు చటుక్కున వాలి వారిని చిటుక్కున పట్టేసుకుంటున్నారు. ప్రత్యేక టీంలు పందెంరాయుళ్ల కోసం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కూడా జల్లెడ పడుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటూ శిబిరాలపై దాడులు చేసూŠత్ పేకాటరాయుళ్లను పట్టేస్తున్నారు. అలా గత ఇరవై రోజుల్లో ఇప్పటి వరకు 710 పేకాట శిబిరాలపై దాడులు చేసి 764 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి తొమ్మిది సెల్ఫోన్లతో పాటు నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కోడిపందేలకు సంబంధించి 157 కేసులు నమోదు చేసిన పోలీసులు 212 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 197 పందెంకోళ్లు, 219 కోడికత్తులు, ఐదు బైక్‌లు, తొమ్మిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట, కోడిపందేలకు సంబంధించి జరిపిన దాడుల్లో మొత్తంగా 976 మంది పందెంరాయుళ్లను పట్టుకున్న పోలీసులు, వారి నుంచి రూ.11,92,285 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పండుగ సంస్కృతి ప్రశ్నార్థకమేనా? సంక్రాంతి పండుగ మరో పది రోజులు మాత్రమే ఉంది. పండుగకు బరులు పెట్టుకునేందుకు ఓ పక్క నిర్వాహకులు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు. కొన్ని ప్రాంతాల్లో బరులు పెట్టేందుకు ముహూర్తాలు కూడా పెట్టినట్లు పందెంరాయుళ్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలో జిల్లాలో ఈ ఏడాది సంక్రాంతి పండుగకు బరులు పెట్టుకునేందుకు అధికారులు అనుమతులు ఇస్తారా లేదా అనే మీమాంసలో నిర్వాహకులు ఉన్నారు. జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనా«థ్‌బాబు జూదాలపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో బరులకు పచ్చ జెండా ఊపుతారా లేదా అనేది తెలియాలి. -
ఒక్కో పందెం కోడి ధర రూ.2 లక్షలు
ఉదయాన్నే బాదం పప్పులు.. గంట గంటకు నల్లద్రాక్షలు, వెండి ఖర్జూరాలు, నల్లనువ్వులు, తాటి బెల్లం కలిపి చేసిన ఉండలు,మధ్యాహ్నం మటన్ విత్ జీడిపప్పు ఆహారం.. సాయంత్రం గుడ్డుతో పాటు ఆహారం, అప్పుడప్పుడూ స్వచ్ఛమైన వైన్ సేవనం. ఆహా ఏం మెనూరా బాబూ.. రాజయోగం అంటే ఇదే అనిపిస్తోంది కదూ.. దీన్నే కుక్కుట రాజభోగం అంటారు. సంక్రాంతి బరిలో దిగనున్న పందెం కోళ్లకు పందెం రాయుళ్లు అందిస్తున్న మెనూ ఇది.. దాదాపు ఏడాది నుంచే ఇదేవిధమైన మెనూతో ఆహారం అందిస్తున్నారు. అంతేకాదండోయ్ వీటితో పొద్దునా, సాయంత్రం వ్యాయామం కూడా చేయిస్తుండడం కొసమెరుపు.. కైకలూరు: సంక్రాంతి పండుగ అంటే గ్రామీణ ప్రాంతాల్లో మొదట గుర్తొచ్చేది కోడి పందేలు అని చెప్పవచ్చు. కొల్లేరు గ్రామాల్లో ఇప్పటి నుంచే పందెపు పుంజులను పందెం రాయుళ్లు, నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. మరో పదిరోజుల్లో జరిగే పందేల కోసం పుంజులకు భారీ గిరాకీ ఏర్పడింది. కైకలూరు నియోజకవర్గంలో వివిధ జాతులకు చెందిన పందెపు పుంజులను బరికి సిద్ధం చేస్తున్నారు. రసింగి కోడిపందేలకు కేరాఫ్ కొల్లేరు కైకలూరు ప్రాంతంలో ఆక్వా పరిశ్రమ విస్తరించి ఉండటంతో చేపల చెరువు గట్లుపై పందెపు కోడిపుంజులను పెంచడాన్ని కొందరు హాబీగా పెట్టుకున్నారు. ఏడాదిగా వివిధ జాతులకు చెందిన కోడిపుంజులను అత్యంత ఖరీదైన ఆహారాన్ని అందించి పెంచుతున్నారు. కొన్ని జాతుల పుంజులు ఒక్కోటి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలుకుతుంది. సంక్రాంతి సమీపిస్తుండటంతో పందేల కోసం వీటి పోషణలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డేగ డైలీ మెనూ ఇది... ఉదయం 6 గంటలకు పుంజులను నీటిలో ఈత కొట్టిస్తూ వ్యాయామం చేయిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఒక్కో పుంజుకు 10 బాదం పప్పులు, నల్లద్రాక్ష, వెండి ఖర్జూరం, తాటి బెల్లం, నల్లనువ్వులు కలిపిన నువ్వుల ఉండలను ప్రతి గంటకు అందిస్తున్నారు. మధ్యాహ్నం 50 గ్రాముల మటన్, జీడిపప్పు కలిపిన ఆహారాన్ని పెడుతున్నారు. సాయంత్రం సోళ్లు, సజ్జలు, వడ్లుతో పాటు గుడ్డు అందిస్తున్నారు. అదేవిధంగా కొందరు స్వచ్ఛమైన వైన్‌ను తాగిస్తూ పందేలకు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా కండపుష్టి, అరుగుదలకు లీవ్ 52, నిరోబిన్, సుగండ్రీ ట్యాబ్లెట్లను ఉపయోగిస్తున్నారు. ఇందుకు రోజుకు ఒక్కో పుంజుకు రూ.200 ఖర్చు చేస్తున్నారు. కుక్కుటశాస్త్రం ఆధారంగా... వాస్తు శాస్త్రం, సంఖ్య శాస్త్రం మాదిరిగానే కోడిపందేలకు పూర్వం నుంచి కుక్కుట శాస్త్రం అందుబాటులో ఉంది. కుక్కుటేశ్వరస్వామి నుంచి ఈ పురాణం వినతికెక్కిందని చెబుతారు. బొబ్బిలియద్ధం కాలం నుంచి ఈ శాస్త్రాన్ని పందెం రాయుళ్లు అనుసరిస్తున్నారు. కోడిపుంజు జన్మ నక్షత్రం, జాతకం, 27 నక్షత్ర, వారఫలాలు ఇందులో ఉన్నాయి. పందెం జరిగే తిథిని బట్టి కోడిపుంజు గెలుస్తుందో లేదో అంచనా వేసి మరీ లక్షల్లో పందేలు కడతారు. రంగును బట్టి రంగంలోకి... కోడిపుంజుల్లో వాటి ఈకల ఆధారంగా రకాలను నిర్ణయించి, ధరలు నిర్ణయిస్తారు. వీటిలో రంగు కీలకం. ఉదాహరణకు 100 కోడి పుంజులను తీసుకుని వాటిని నాలుగు దశల్లో పోరాట పటిమను అంచనా వేస్తారు. దీనిని బట్టి రూ.8,000 నుంచి రూ.2లక్షల వరకు ఒక్కో పుంజు ధర ఉంటుంది. ఒక్కో పుంజు పందేనికి సిద్ధమవడానికి 18 నెలల సమయం పడుతుంది. సాధారణంగా నెమలి, కొక్కిరాయి, పర్ల, పచ్చకాకి, తీతువా, డేగ, రసంగి, గౌడ నెమలి, మైలా, పింగళ, కాకి, సేతువ, నల్లబొట్ల తీతువా,అబ్రాస్ వంటివి పేరు గడించాయి. -
పందెం కోడికి భలే గిరాకీ
సాక్షి, కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. మరో మూడు వారాల్లో సంక్రాంతి పండుగ రానే వస్తుంది. పండుగ మరో 20 రోజులు ఉండగానే సంక్రాంతి సరదాలు మొదలయ్యాయి. ఏ రంగుపై ఏ రంగు కోడిని వదలాలి, ఏది గెలుస్తుంది ఏది ఓడిపోతుందనే çముచ్చట్లు మండలంలో మొదలయ్యాయి. క్రితం పండక్కి నా రసంగి, కాకిని నేలకరిపించిందిరా బావ అంటే... నీ రసంగి కాకినే కొట్టింది నా నెమలి అయితే రంగుతో పని లేకుండా నాలుగు పందేలే చేసింది రా బావ అంటూ పందెంరాయుళ్లు ముచ్చట్లు మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా మరో 20 రోజుల్లో సంకాంత్రి సందడి మొదలు కానుండటంతో ఎక్కడ చూసినా కోడిపందేలా ముచ్చట్లే వినబడుతున్నాయి. జాతిపుంజుల కోసం జల్లెడ సంక్రాంతి సమీపిస్తుండటంతో పందెంకోళ్ల కోసం పందెంరాయుళ్లు పరుగులు పెడుతున్నారు. పందెంకోడి కూతపెడితే చాలు చటుక్కున ఆగి బేరసారాలు మొదలెడుతున్నారు. రంగును బట్టి ధర నిర్ణయించి డబ్బులు విసిరేస్తున్నారు. పుంజు నచ్చితే చాలు రేటు గురించి ఆలోచించకుండా చటుక్కున చంకలో పెట్టుకుంటున్నారు. పండుగ మరో 20 రోజులు మాత్రమే ఉండటంతో పందెంకోళ్లను బరుల్లోకి వదిలేందుకు సిద్ధం చేస్తున్నారు. అందుకోసం జీడిపప్పు, పిస్తా, కోడిగుడ్లుతో పాటు మరింత ఖరీదైన మేతలతో కోళ్లను పసిపిల్లల్లా సాకుతున్నారు. రంగును బట్టి పందెకోళ్లకు గిరాకీ ఉండటంతో నచ్చిన కోడిని కొనుక్కునేందుకు పందెంరాయుళ్లు వెనుకడుగు వేయటంలేదు. కాకి, పచ్చకాకి, డేగ, కాకిడేగ, నెమలి, సీతువా, రసంగి, పర్లా, కక్కిరి, మైలా ఇలా రంగులను బట్టి ఒక్కో కోడి రూ.5000 నుంచి రూ.10000 మధ్య పలుకుతుండగా, జాతికోళ్లు అయితే రూ.8000 నుంచి రూ. 15,000 వరకు పలుకుతున్నాయి. అయితే రంగు నచ్చి కోడిపై మోజుపడితే చాలు పందెంరాయుళ్లు వాటిని కొనేందుకు ఏమాత్రం వెనుకాడటంలేదు. సండే మార్కెట్లో సందడి సంక్రాంతి సమీపిస్తుండటంతో సండే మార్కెట్లో సందడి మొదలైంది. మిగిలిన రోజుల్లో కూర కోళ్లకు మాత్రమే గిరాకీ ఉండగా గత రెండు వారాలుగా పందెంపుంజులు మార్కెట్లో కూతలు పెడుతున్నాయి. దీంతో గత రెండు ఆదివారాలుగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే పందెంరాయుళ్లు పందెం పుంజుల కోసం సండే మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో చేరతున్నారు. మచిలీపట్నంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పందెంరాయుళ్ళు సండే మార్కెట్లో పందెంకోళ్లు కోసం పడిగాపులు పడుతున్నారు. కోడి రంగు, పోట్లాట, కోడి సైజును బట్టి బేరసారాలు చేసి నచ్చిన పుంజులను పట్టుకుపోతున్నారు. దీంతో బందరు నియోజకవర్గంలో మూడు వారాల ముందుగానే సంక్రాంతి సందడి మొదలైనట్లు కనబడుతుంది. -
కోడి పందేలకు అనుమతుల్లేవు
భీమడోలు: కోడి పందేల నిర్వహణకు సంబంధించి హైకోర్టు తీర్పును అమలు చేస్తామని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ స్పష్టం చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఆయన వార్షిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసుల ప్రగతిపై ఎస్పీకి సీఐ ఎం.సుబ్బారావు వివరించారు. తొలుత పోలీస్ గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. రహదారులపై క్రైమ్ రేటు తగ్గింపుపై పలు సూచనలందించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు, ఇతర జూద క్రీడలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. భీమడోలులో విలేకర్లతో మాట్లాడుతున్న ఎస్పీ నవదీప్‌సింగ్‌గ్రేవల్ గ్రామాల్లో కోడి పందేలు జరగకుండా గట్టి నిఘా ఉంచామని చెప్పారు. బైండోవర్ కేసులను నమోదు చేస్తున్నామన్నారు. కోడి పందేల నిర్వహణపై హైకోర్టు తీర్పును విధిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో పెదవేగి, సమిశ్రగూడెం ఏరియాల్లో మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన నిందితులపై పోక్సో చట్టం మేరకు కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇలాంటి నిందితులకు కఠిన శిక్ష పడేలా పోలీస్‌శాఖ ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా మిత్ర కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో జిల్లా వ్యాప్తంగా పూర్తి చేశామని చెప్పారు. సమావేశంలో డీఎస్పీ ఒ.దిలీప్‌కిరణ్, సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై కె.శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల నుంచి తప్పించుకోబోయి..
సాక్షి, అన్నపురెడ్డిపల్లి: పోలీసుల నుంచి తప్పించుకోబోయి పరుగెత్తి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కొండాయిగూడెం గ్రామ శివారులో ఆదివారం కోడి పందేలు నిర్వహించారు. స్థానిక పోలీసులు కోడి పందేల స్థావరం దగ్గరకు వెళ్తుండగా.. పందేలకు పాల్పడుతున్నవారు గమనించి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పరుగెత్తారు. వారిలో ఎర్రగుంట కే కాలనీకి చెందిన మళ్లా వెంకటేశ్వర్లు(55) కూడా ఉన్నాడు. ఆయన పరిగెడుతూ గ్రామ సమీపంలోని జామాయిల్ తోటలో కుప్పకూలి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయంపై ఎస్సై శ్రీరాముల శ్రీనును వివరణ కోరగా.. అనారోగ్యం కారణంగా మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. -
ఇంత వేళాకోళ్లమా..!
పశ్చిమగోదావరి, తణుకు: సంక్రాంతి సంప్రదాయం పేరుతో అధికార పార్టీ నాయకులు బరులు ఏర్పాటు చేసి బహిరంగంగానే కోడి పందేలు నిర్వహించినా అధికారయంత్రాంగం పట్టించుకోలేదు. కోళ్లకు కత్తులు కట్టొద్దని న్యాయస్థానం స్పష్టం చేసినా.. బరుల నిర్వాహకులు పెడచెవిన పెట్టారు. అటువైపు కనీసం కన్నెత్తికూడా చూడకుండా అధికారులు చట్టాలు, వ్యవస్థతో పరిహాసమాడారు. ఇప్పుడు అంతా ముగిశాక చట్టం కళ్లకు గంతలు కట్టి న్యాయస్థానం ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు అటు పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. సుప్రీం కోర్టు నిబంధనలను దర్జాగా ఉల్లంఘించి పండగ మూడ్రోజుల పాటు సాగించిన రూ. వందల కోట్ల కోడిపందేల దందాను కప్పిపుచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఆయా కోడి పందేల నిర్వాహకులకు లక్ష్యాలు విధిస్తూ తమకు ఇన్ని కేసులు కావాలని వారిపైనే ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. తాపీగా తాము పందేలను అరికట్టేందుకు తీవ్రంగా శ్రమించామని నిరూపించుకునేందుకు మూడ్రోజుల పాటు 521 కేసులు నమోదు చేసి 1,499 మందిని అరెస్టు చేశామంటూ జిల్లా పోలీసులు లెక్కలు చెబుతున్నారు. ప్రేక్షక పాత్ర... సంక్రాంతి పండగ మూడ్రోజులపాటు కోర్టు తీర్పులు.. 144 సెక్షన్విధించామంటూ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు.. కోడి పందేలు అడ్డుకుని తీరతామంటూ జిల్లా ఎస్పీ చెప్పిన మాటలు... గాల్లో కలిపేసి ఇప్పుడు అధికారులు హడావుడి చేయడం విమర్శలకు తావిస్తోంది. పండగ రోజుల్లో అధికార పార్టీ నేతల సమక్షంలో.. వారి అండదండలతో కత్తులు కట్టి మరీ రూ. వందల కోట్లలో కోడి పందేలు ఆడినా పోలీసులు కనీసం కిమ్మనలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఎక్కడికక్కడే కోడి పందేల బరులను ప్రారంభించినా.. మినీ స్టేడియాలను తలపించేలా ఒకేసారి వేలాది మంది కూర్చుని వీక్షించేలా గ్యాలరీలను సిద్ధం చేసినా పోలీసులు గానీ రెవెన్యూ అధికారులు గానీ అడ్డుకోలేదు. ఇప్పుడు మాత్రం పండగ మూడ్రోజుల్లో జిల్లాలో 521 కేసులు నమోదు చేసి 1499 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 8,53,655 నగదు, 857 కోడిపుంజులు, 1131 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసు అధికారులు ప్రకటనలు జారీ చేయడం గమనార్హం. పేకాట ఆడుతున్న వారిపై 109 కేసులు నమోదు చేసి 371 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 2,08, 852 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. పండగ రోజుల్లో బరుల వద్ద బహిరంగంగా కోతాట, పేకాట నిర్వహించి ఓపెన్ బార్లు ఏర్పాటు చేసినా పట్టించుకోని అధికారులు ఇప్పుడు కేసులంటూ నిర్వాహకుల వెంట పడడం విస్మయపరుస్తోంది. డమ్మీలతోనే కనికట్టు... అధికారయంత్రాంగం అందించిన సహాయానికి టీడీపీ నేతలు ఎక్కడికక్కడే పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ యంత్రాంగాలను ‘సంతృప్తి’పరిచారు. ఒక్కో పోలీసు స్టేషన్, ఎక్సైజ్, తహసీల్దార్ పరిధిలోని బరుల నిర్వాహకులు భారీగానే కమీషన్లు ముట్టజెప్పారని తెలుస్తోంది. ఇదిలాఉంటే కోడిపందేల నిర్వహణపై ఎవరైనా ఆధారాలతో కోర్టును ఆశ్రయిస్తే అసలుకే మోసం వస్తుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్దలను కాపాడేందుకు పోలీసులు డమ్మీల కనికట్టుకు తెరతీశారు. తూతూమంత్రంగా టీడీపీ నేతల అనుచరుల్లో కొందరిపై కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిల్‌పై వదులుతారు. భవిష్యత్తులో న్యాయస్థానాలు ప్రశ్నిస్తే తాము బరులపై దాడులు చేశామని, నిర్వాహకులను సైతం అరెస్టు చేశామని చూపిస్తారు. గత ఏడాది మీడియా ప్రతినిధులకూ నోటీసులు జారీ చేసినట్లుగానే ఈ సారీ పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. -
కలర్‌ఫుల్ పందెం
ఏటా జరిగినట్టే.. కోడి గెలిచింది.. ఖాకీ ఓడింది. హెచ్చరికలు, ఆంక్షలు నీటి బుడగలయ్యాయి.సంప్రదాయం ముసుగులో పందెం కోడి కదం తొక్కింది. కాళ్లకు కట్టిన కత్తితో బరిలో దిగి హల్చల్ చేసింది. అనుబంధంగా కాయ్ రాజా.. కాయ్ అంటూ పందెం రాయుళ్లు రెచ్చిపోయారు. పందేలకు తోడు పేకాట, గుండాట తదితర జూద క్రీడలు యథేచ్ఛగా సాగిపోయాయి. వెరసి భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో దాదాపు రూ. 1000 కోట్లకు పైగా చేతులు మారాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు బరుల వైపు కన్నెత్తి చూడలేదు. సాక్షి, అమరావతిబ్యూరో : జిల్లాలో పందెంకోడి కాలు దువ్వింది. పోలీసుల హడావుడిని తోసిరాజని కూత పెట్టింది. ఏ ప్రాంతంలో చూసినా కోడిపందేలు, గుండాట, పేకాట యథేచ్ఛగా జరిగాయి. కంకిపాడు మండలం ఈడుపుగల్లు, గొడవర్రు, ఉయ్యూరు మండలంలోని గండిగుంట, కాటూరు, బోళ్లపాడు, ఆకునూరు తదితర ప్రాంతాల్లో పందేలు భారీగా సాగాయి. నందిగామ మండలం కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడులో జరిగాయి. కైకలూరు నియోజకవర్గంలోని కైకలూరు, ఆటపాక, కలిదిండి, కోరుకొల్లు, ముదినేపల్లి మండలంలో ముదినేపల్లి వైవాకలో పెద్ద ఎత్తున పందేలు జరిగాయి. మైలవరం నియోజకవర్గ పరిధిలోని నాగలూరు, బాపులపాడు మండలంలో అంపాపురం, ఉంగుటూరు మండలంలో ఇందుపల్లి, జగ్గయ్యపేట మండలంలోని చిల్లకల్లు, షేర్‌మహ్మద్‌పేటల్లో పందేలు వేశారు. పెనమలూరు మండలం పోరంకి, మచిలీపట్నం మండల పరిధిలోని గోపువానిపాలెం, శ్రీనివాసనగర్, మేకావానిపాలెం తదితర ప్రాంతాల్లో పందేలు జోరుగా సాగాయి. ఆయా ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఆటంకం లేకుండా ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారు. భారీ షామియానాలు వేసి, ఇనుప చట్రాలతో బరులు నిర్మించారు. పలుగ్రామాల్లో పేకాట శిబిరాలు నిర్వహించారు. కోడిపందేల మాటున కోతముక్క, గుండాట ఏటా తరహాలోనే ఈ ఏడాది కూడా సరిగ్గా భోగి ముందురోజున పందేలకు అనధికార అనుమతులు వచ్చాయి. అప్పటి వరకూ అక్కడక్కడా కఠినంగా వ్యవహరించిన పోలీసులు చల్లబడ్డారు. దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ కోళ్లు రంగంలోకి దిగాయి. సంప్రదాయ విధానంలో కోడిపందేలు నిర్వహించవచ్చునంటూ కొంతమంది నాయకులు ప్రకటనలిచ్చారు. అయితే మూడు రోజులపాటు నిర్వహించిన పందేల్లో ఎక్కడా సంప్రదాయ కోడిపందేలు జరగలేదనే చెప్పాలి. కోడిపందేల మాటున గుండాట, కోతాట భారీగా జరిగాయి. పందేల కంటే వీటి వద్దే జనం ఎక్కువగా ఉన్నారనే చెప్పాలి. జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి ఈ మూడు రోజుల్లో రూ. 800 కోట్లు చేతులుమారి ఉంటాయని అంచనా వేస్తున్నారు. విజయవాడలో చేతులెత్తేసిన పోలీసులు ఈ ఏడాది గతంలో ఎప్పుడూ లేని విధంగా విజయవాడ నగరంలో కోడిపందేలు, కోతముక్క, పేకాటను విచ్ఛలవిడిగా నిర్వహించారు. భవానీపురం జాతీయ రహదారి పక్కన ఎట్కిన్సన్ స్కూల్ సమీపంలో అధికారపార్టీకి చెందిన ఓ టీడీపీ నేత నేతృత్వంలో నిర్వహించిన కోడిపందేల్లో పాల్గొనేందుకు దూరప్రాంతాల నుంచి సైతం తరలివచ్చి రూ.లక్షల్లో పందేలు కాశారు. ఇక టీడీపీ పార్టీ ముఖ్యనేతలు ఎవరూ కోడిపందేల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినప్పటికీ.. వారి ఆధ్వర్యంలో నగరంలోని స్టార్ హోటళ్లలో నిర్వహించిన కోతముక్క పేకాటలో మూడు రోజులుగా బిజీబిజీగా గడపటం గమనార్హం. రామవరప్పాడు రింగ్ సమీపంలో రెండు స్టార్ హోటళ్లు, టిక్కిల్ రోడ్డులోని ఓ స్టార్ హోటల్లో ప్రత్యేక గదుల్లో ఏర్పాటు చేసిన కోతముక్క ఆటలో కోసుకు రూ. లక్ష చొప్పున పందేలు జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 200 కోట్లకు పైగా చేతులు మారినట్లు అంచనా. నామమాత్రంగా దాడులు.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ పరంగా అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జూదక్రీడల నిర్వహణతో సంబంధం ఉన్న దాదాపు 567 మందిని బైండోవర్ చేశారు. గతంలో నిర్వహించిన బరులకు సంబంధించిన యజమానులకు ఇప్పుడు పందేలు నిర్వహించకుండా నోటీసులు జారీ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మచిలీపట్నం, గూడూరు, ముసునూరు, ఘంటసాల మండలాల పరిధిలో దాడులు చేసి బరులను ధ్వంసం చేశారు. అయినా అదే ప్రాంతాల్లో నిర్వాహకులు పందేలు నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గంలోనూ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చిన్న శిబిరాలపై దాడులు నిర్వహించి అధికార టీడీపీ నేతలను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం రైల్వేస్టేషన్ సమీపంలో బహిరంగంగా పక్కా ఏర్పాట్లతో కోతముక్క సాగినా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. మామూళ్ల మత్తులో యంత్రాంగం ఈ దందాలకు అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించిందన్న విమర్శలున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలే నిర్వాహకులు కావడంతో చోద్యం చూశాయి. కత్తులు కట్టి కోడిపందేలతోపాటు మద్యం, జూదం దందాలవైపు కనీసం కన్నెత్తి చూడనేలేదు. టీడీపీ నేతలు ఎక్కడికక్కడ పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ యంత్రాంగాలను అదుపు చేసినట్లు తెలుస్తోంది. వందల కోట్లు కొల్లగొట్టిన టీడీపీ నేతలు.. ఈ కోడిపందేలను వెనుకుండి ప్రజాప్రతినిధులే ఆడించిన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, పందెంరాయుళ్లకు ప్రజాప్రతినిధులే మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. ప్రతి బరి వద్ద ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం గమనార్హం. పందేల మాటున వసూలు చేసిన కమీషన్ల రూపంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు రూ. 300 కోట్లు జేబుల్లో వేసుకున్నట్లు సమాచారం. -
యథేచ్ఛగా కోడి పందేలు
విజయనగరం, సాలూరురూరల్: కోడిపందేలు నిర్వహించరాదని, ఎక్కడైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా పలుచోట్ల పందేలు యథేచ్ఛగా సాగిపోయాయి. ఏటా హెచ్చరికలు చేస్తున్న పోలీసులు బాధ్యులపై ఎటువంటి చర్యలూ తీసుకోకుండా తూతూమంత్రంగా వ్యహరించడం వల్లే పందెం రాయుళ్లు తమపని తాము చేసుకుపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాది కూడా సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో అనేకచోట్ల కోడిపందేలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సాలూరు మండలం మామిడిపల్లి పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు పెద్ద ఎత్తున నిర్వహించారు. లక్షల్లో బెట్టింగులు నడిచాయి. సాక్షత్తూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్పీ భంజదేవ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు కూడా కోడిపందాల్లో పాల్గొన్నారని తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
'బరి'లోరంగ హరీ! యువతుల గుండాట..
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు: సుప్రీంకోర్టు తీర్పు బేఖాతరైంది. సంప్రదాయం ముసుగులో కోడిపందేలు యథేచ్ఛగా సాగాయి. రూ.వందలకోట్లలో జూదాలు జరిగాయి. వందలాది జీవితాలు కొడిగట్టాయి. తలకిందులయ్యాయి. మూడురోజుల్లో రూ.200 కోట్లపైనే..! జిల్లావ్యాప్తంగా పండగ మూడురోజుల్లో రూ.కోట్లాది రూపాయలు చేతులు మారాయి. కోడిపందేల మాటున పేకాట, గుండాట, కోతాట, లోనాబయటా వంటి ఆటలు యథేచ్ఛగా సాగాయి. దిగువ, మధ్యతరగతి వ్యక్తులేకాదు సంపన్నులూ కోలుకోలేని దెబ్బతిన్నారు. భోగి నాడు మొదలైన పందేలు, పేకాటలుసంక్రాంతి రోజు తారాస్థాయికి చేరాయి. కనుమ రోజు రాత్రి వరకూ పందేలు సాగుతూనే ఉన్నాయి. ఉన్నతస్థాయి వర్గాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు పక్కకు తప్పుకోవడంతో జూదరులు బరితెగించారు. భారీగా బరులు ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు తేడా లేకుండా జూదాలు నిర్వహించారు. అక్కడే మద్యం దుకాణాలు, బెల్టు షాపులూ వెలిశాయి. రాత్రుళ్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జూదాలు కొనసాగించారు. జాతరలను బరులు తలపించాయి. జూదరులు కోడిపందేలు, పేకాటల్లో రూ.లక్షలు పోగొట్టుకుంటే గుండాట, కోతాటల్లో రూ.వేలకు వేలు చేతులు మారాయి. 230 బరులు తొలుత పోలీసులు ఆంక్షలు విధించినా.. పందేల నిర్వాహకులు లైట్ తీసుకున్నారు. అక్కడక్కడ బరులు ధ్వంసం చేశామని, బైండోవర్ కేసులు నమోదు చేశామని పోలీసు శాఖ ప్రకటించుకున్నా.. జిల్లాలో సుమారు 230 బరుల్లో పందేలు జరిగాయంటే నిర్వాహకులు ఎంతగా రెచ్చిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఎట్టిపరిస్థితుల్లోనూ కోడిపందేలు అడ్డుకుంటామని ఉన్నతాధికారులు ప్రకటించినా మౌఖిక ఆదేశాల మేరకు పోలీసులు మాత్రం ఆయా స్టేషన్లకే పరిమితమయ్యారు. దీనికోసం భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. 30 పెద్ద బరులు జిల్లావ్యాప్తంగా 30 వరకూ పెద్ద బరులు ఏర్పాటవగా, 200 వరకూ చిన్న బరులు వెలిసినట్టు అంచనా. పెద్ద బరుల నుంచి పోలీసులకు ముడుపుగా ఒక్కోచోట నుంచి రూ.1.50 లక్షల నుంచి రెండున్నర లక్షల వరకూ, చిన్నబరుల నుంచి రూ.25 వేలు చొప్పున అందినట్టు సమాచారం. ఈసారి రెవెన్యూ అధికారులతోపాటు ఎన్నికల వేళ కావడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా నిర్వాహకుల నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. కోడి పందేలు జరిగే ప్రాంతాల్లో దాడులు చేస్తున్నట్లు చూపించడానికి ఒక్కో బరి నుంచి నలుగురైదుగురిపై కేసులు కట్టేలా వారి పేర్లను నిర్వాహకులే ఇవ్వాలని పోలీసులు షరతులు విధించినట్లు సమాచారం. మరోవైపు మద్యం అమ్మకాలూ విచ్చలవిడిగా జరిగాయి. ప్రతి బరి వద్ద ఒక బెల్ట్‌షాపు ఏర్పాటు చేయగా, పెద్ద బరులు ఉన్న చోట్ల నాలుగు వరకూ ఏర్పాటు చేశారు. నిర్వాహకునికి రూ.పది వేలు, ఎక్సైజ్ అధికారులకు రూ.పదివేలు చొప్పున ఇచ్చేలా ఒప్పందాలు కుదిరినట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి భారీగా భీమవరం, ఉండి, పాలకొల్లు, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో భారీగా బరులు వెలిశాయి. పందేలు కొనసాగాయి. చింతలపూడి మండలంలోని సీతానగరం, చింతలపూడి , లింగపాలెం మండలంలోని ములగలంపాడు, కలరాయనగూడెం, కామవరపుకోట మండలంలో రావికంపాడు, జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాల్లో భారీగా పందేలు జరిగాయి. తెలంగాణ నుంచి భారీగా జూదరులు తరలివచ్చారు. సుమారు రూ.5 కోట్లకుపైగా చేతులు మారాయి. ♦ కామవరపుకోట మండలం రావికంపాడు అడ్డరోడ్డు వద్ద జరుగుతున్న పందేల్లో మంగళవారం రాత్రి కోతాట, గుండాట ఆడుతున్న వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఇది తోపులాటకు దారితీసింది. నిర్వాహకులు కల్పించుకుని సర్దుబాటు చేశారు. ♦ కొవ్వూరు నియోజకవర్గంలో 22 చోట్ల కోడి పందేల శిబిరాలు ఏర్పాటు చేశారు. తాళ్లపూడి మండలం గజర్జం, వేగేశ్వరపురం,పెద్దేవం గ్రామాల్లో రెండేసి శిబిరాలు ఏర్పాటు చేశారు. రావూరుపాడు, తుపాకులగూడెంలో తదితర చోట్ల పందెలు నిర్వహించారు. పెద్ద సంఖ్య లో గుండాటలు జరిగాయి. ♦ పోలవరం నియోజకవర్గంలో 7 మండలాల్లో సుమారు 45 బరులు ఏర్పాటయ్యాయి. జీలు గుమిల్లి మండలం తాటియాకులగూడెం బరిలో కొట్లాట జరిగింది. ఇద్దరికి గాయాలయ్యాయి. ♦ తాడేపల్లిగూడెం రూరల్ , పెంటపాడు మండలాల్లో పందేలు భారీగా సాగాయి. రెండు బరు ల వద్ద ఫ్లడ్‌లైట్ల కాంతిలో పందేలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో 17 బరులు వెలిశాయి. ♦ ఉంగుటూరు నియోజకవర్గంలోనూ పందేలు భారీగా జరిగాయి. 20 బరులు వెలిశాయి. రూ. 8 కోట్ల వరకు చేతులు మారినట్లు అంచనా. ♦ ఏలూరు మండలంలో 8 ప్రధాన బరులు, 40 చిన్న బరులు ఏర్పాటయ్యాయి. ఈ బరులను మాజీ ప్రజాప్రతినిధులే నిర్వహించారు. మండలంలో గుడివాక లంక, చొదిమెళ్ల, కొమడవోలు, శనివారపుపేట, జాలిపూడి, శ్రీపర్రు, ప్రత్తికోళ్లలంక, వెంకటాపురంలో పందేలు జరిగాయి. ♦ నిడదవోలు నియోజకవర్గంలో 22 బరులు వెలిశాయి. సుమారు రూ.కోటి వరకూ పందేలు జరిగినట్టు అంచనా. ♦ నరసాపురం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూలేని విధంగా విచ్చలవిడిగా కోడిపందేలు, పేకాట, గుండాట సాగాయి. 14 బరులు ఏర్పాటయ్యాయి. టీడీపీ నాయకులు దగ్గరుండి జూదాలు నిర్వహించడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ♦ ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర, పోడూరు, పెనుగొండ మండలాల్లో 20కిపైగా గ్రామాలలో కోడిపందేలు జోరుగా సాగాయి. మార్టేరులో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పందేలు నిర్వహించారు. ♦ గోపాలపురం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో 27 గ్రామాల్లో బరులు ఏర్పాటు చేశారు. సుమారు రూ.10కోట్లకు పైగా చేతులు మారాయి. ♦ తణుకు పట్టణంతోపాటు ఇరగవరం, అత్తిలి మండలాల్లో కోడి పందేలు తిరునాళ్లను తలపించే రీతిలో జరిగాయి. నియోజకవర్గంలో 16 చోట్ల బరులు ఏర్పాటు చేశారు. ♦ దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదపాడు, పెదవేగి మండలంలో కొప్పాక కవ్వగుంట, లక్ష్మీపురం, వేగివాడ ప్రాంతాల్లో కోడిపందేలు భారీ ఎత్తున నిర్వహించారు. ♦ ఉండి నియోజకవర్గంలో ఐ.భీమవరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు మండలాల్లో జరిగాయి. రూ.10 కోట్ల వరకు చేతులు మారాయి. మొత్తం 27 బరులు ఏర్పాటు చేశారు. ♦ పాలకొల్లు మండలంలోని పూలపల్లి, పాలకొల్లు టౌన్, వేదంగి, వడ్లవానిపాలెం తదితర ప్రాంతాల్లో పందేలు సాగాయి. మొత్తం 20 బరులు ఏర్పాటయ్యాయి. -
కోజకు యమ డిమాండ్..
పశ్చిమగోదావరి, నిడదవోలు : కోజకు యమ డిమాండ్ పలికింది. కోడి పందేల్లో ఓడిపోయిన కోడిని కోజ అంటారు. బరుల్లో రెండు పుంజులకు కత్తులు కట్టి పోరుకు దింపిన తరువాత పోటీల్లో ఓడిన కోడిని గెలిచిన కోడికి సంబంధించిన పందెం రాయుడు తీసుకుపోతాడు. పందెంలో ఓడిన కోడితో పాటు కాసిన పందెం సొమ్ములు కూడా పొగొట్టుకుంటుంటారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయంగా పెద్దలు చెబుతున్నారు. సంక్రాంతి సీజన్‌కు ముందు కోడికి మూడు నెలల నుంచి ఎన్నో పోషక విలువలున్న ఆహారాన్ని పెట్టి దట్టంగా మేపుతారు. ఒక్కో పుంజు 3 కేజీల నుంచి 10 కేజీల వరకు బరువు ఉండి మంచి దట్టంగా తయారైన తర్వాత బరుల్లో దింపుతారు. పందేల్లో చనిపోయిన కోజాలకు డిమాండ్ ఉండటంతో 5 కేజీల కోజాను రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయించారు. వీటికి ఎంత రేటయినా కోజను కొనేందుకు జనాలు ఎగబడ్డారు. బరుల్లో చాలామంది పందాలు కాయడానికి వస్తే మరికొందరు కోజ కోసం ఎంతైనా చెల్లించి కొనాలని చాలామంది బరుల వెంట తిరిగారు. భోజనప్రియులకు కోజ పసందైన కూర. -
ఎక్కడికక్కడ.. యథేచ్ఛగా..
తూర్పుగోదావరి, గొల్లప్రోలు (పిఠాపురం): పందెం ప్రియుల ముందు ఖాకీల హెచ్చరికలు వెలవెలబోయాయి. గొల్లప్రోలు మండలంలోని కోడి పందేలు యథేచ్ఛగా కొనసాగాయి. మారుమూల ప్రాంతాలు, తుప్పలు, డొంకల్లో కాకుండా ఈసారి బహిరంగంగానే పందేలు మొదలయ్యాయి. తాటిపర్తిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో వెనుక కోడి పందేలు నిర్వహించారు. భారీ టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పందెం ప్రియులు మోటార్‌సైకిళ్లు, కార్లపై పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక టీడీపీ నాయకులు పందెం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చేబ్రోలులోని అడవిపుంత సమీపంలో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు పోటీలను ఆర్భాటంగా ప్రారంభించారు. కోళ్లకు కత్తులు కట్టి పోటీల్లో ఉత్కంఠ రేపుతున్నారు. ఇక్కడ రెండు బరుల్లో పోటీలు సాగుతున్నాయి. దుర్గాడ, చెందుర్తి, చినజగ్గంపేట, మల్ల వరం గ్రామాల్లో టీడీపీ నాయకులు పర్యవేక్షణలో భారీ ఎత్తున పందేలు సాగుతున్నాయి. పెద్ద మొత్తాల్లో బెట్టింగ్‌లు పందెం బరులు వద్ద పెద్ద మొత్తాల్లో బెట్టింగ్‌లు చేస్తున్నారు. ఒక్కో పందేనికి రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు బెట్టింగ్ చేస్తున్నారు. మూడు రోజులు వ్యవధిలో రూ.కోటికి పైగా బెట్టింగ్‌లు ఉంటాయని చెబుతున్నారు. సిండికేట్‌గా ఏర్పడి.. తాటిపర్తికి చెందిన జూదరులు సిండికేట్‌గా ఏర్పడి చేబ్రోలు, తాటిపర్తి, చెందుర్తి గ్రామాల్లో గుండాట శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో ఆటకు రూ.లక్షకు పైగా పందేం సాగుతోంది. కోడి పందేల శిబిరాలు వద్ద గుండాటలు, బొమ్మా బొరుసు వంటి జూదాలు కూడా ఏర్పాటు చేశారు. గంటల వ్యవధిలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. పత్తా లేని పోలీసులు కోడిపందేలు, గుండాలు, పేకాటలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ, పోలీసు అధికారుల హెచ్చరికలు నీటిమూటలుగా మిగిలిపోయాయి. అధికార పార్టీ అధినేత ఒత్తిడితో పోలీసులు మౌనం దాల్చి, స్టేషన్ విధులకే పరిమితమయ్యారు. కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు సెల్ఫోన్లను లిఫ్ట్ చేయడం లేదని పలువురు చెబుతున్నారు. పందేల నిర్వాహకులు పోలీసులకు భారీగా మామూళ్లు ముట్ట చెప్పారన్న విమర్శలు బాహాటంగా వినిస్తున్నాయి. మూడు రోజుల పందేలు నిర్వహణకు బరుల వారీగా మొత్తాన్ని చెల్లించారని పందెం ప్రియులు బాహాటంగా ప్రచారం చేస్తున్నారు. ఒక్కో బరికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించారని వారు చెబుతున్నారు. -
కోడి గెలిచింది
అధికార పార్టీ రాజకీయ పుంజులు కాలుదువ్వడంతో పోలీసులు వెనక్కు తగ్గారు. కోడి పందేలను చూసీ చూడనట్టు వదిలేశారు. సంక్రాంతి సంప్రదాయం ముసుగులో భోగి పండుగ రోజైన సోమవారం టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు బరుల వద్దే ఉండి మరీ కోడి పందేలు నిర్వహించారు. పోలీసులు బరులను తొలగించిన కొద్ది సేపటికే అక్కడికి వచ్చి పందేలను తిరిగి ప్రారంభించారు. ఎవరూ అడ్డుకోరు పందేలను నిర్వహించుకోవాలని పందెంరాయుళ్లకు ధైర్యం చెప్పారు. అంతే పందెం రాయుళ్లు రెచ్చిపోయారు. సాక్షి, గుంటూరు/కొల్లిపర(తెనాలి): సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందేలు జోరుగా సాగాయి. అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నప్పటికీ రేపల్లె, కొల్లిపర సహా వివిధ ప్రాంతాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ పందేలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ వచ్చిన ప్రతిసారీ అధికార పార్టీ నేతలు, పోలీసుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు పరిపాటిగా మారాయి. ఏడాది కూడా ఖాకీలపై ఖద్దరుదే పైచేయిగా నిలిచింది. అనుమతులు లేవని చెబుతున్న పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి బరివైపు తొంగి చూడకుండా అధికార పార్టీ నేతలు చేశారు. జిల్లాలోని డెల్టాప్రాంతంలో ఏటా కోడిపందెలు భారీ ఎత్తున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆనవాయితీ కాస్తా జూదంగా మారి రూ.లక్షల్లో కోడి పందేలు సాగుతున్నాయి. అదే ప్రాంగణంలో భారీ ఎత్తున పేకాట, గుండు ఆట వంటి జూద క్రీడలను నడుపుతున్నారు. జిల్లాలో కోడిపందేలు అనగానే డెల్టా ప్రాంతం గుర్తుకొచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. డెల్టాప్రాంతంలో అధికార పార్టీ నేతలు నాలుగేళ్లుగా భారీ ఎత్తున బరులు ఏర్పాటు చేసి కోడిపందేలు నిర్వహిస్తున్నారు. ఈ సారి కూడా అనుమతులు లేకున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలు దగ్గరుండి కోడిపందేలు ప్రారంభించి నిర్వహించడంతో పోలీసు అధికారులు సైతం అటువైపు వెళ్లేందుకు ధైర్యం చేయలేదని తెలుస్తోంది. ముఖ్యంగా రేపల్లె నియోజకవర్గంలో సోమవారం భారీ ఎత్తున కోడిపందేలు నిర్వహించారు. నాలుగేళ్లుగా రేపల్లె మండలం బొబ్బర్లంక, గుడికాయలంక గ్రామాల్లో కోడిపందేలు నిర్వహించిన పందెం రాయుళ్లు ఈ ఏడాది అదే నియోజకవర్గంలోని చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం, రేపల్లె మండలం గుడ్డికాయలంక, నగరం మండలం ఉయ్యూరువారిపాలెం, నిజాంపట్నం మండలం ఆముదాలపాలెంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుల కనుసన్నల్లో కోడిపందేలు భారీగా ఎత్తున నిర్వహించారు. ఈ కోడిపందేల్లో రూ.లక్షల్లో చేతులు మారాయని సమాచారం. పందేలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆలపాటి తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ దగ్గరుండి మరీ కోడిపందేలు ప్రారంభించారు. కొల్లిపర మండలం కొత్తబొమ్మునివానిపాలెంపుష్కరఘాట్ వద్ద టీడీపీ నాయకులు కోడిపందేలకు బరులను ఏర్పాటు చేశారు. దీనిపై 14వ తేదీన సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం ద్వారా సమాచారం తెలుసుకున్న కొల్లిపర ఎస్ఐ శ్రీనివాసరెడ్డి సోమవారం ఉదయం బరుల వద్దకు వెళ్లి అక్కడ టెంట్లను ధ్వంసం చేసి 20 మందిని అదుపులోకి తీసుకుని, 10 కోళ్లు, రూ.6 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అడ్డుకున్న టీడీపీ నాయకులకు కోడిపందేలు చట్టవిరుద్ధమని ఎస్ఐ శ్రీనివాసరెడ్డి స్పష్టంగా చెప్పి వెళ్లారు. ఆగ్రహించిన టీడీపీ నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఆలపాటికి తెలపడంతో ఆయన 11 గంటల సమయంలో బరి వద్దకు చేరుకుని పందేలు పునఃప్రారంభిం చారు. అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గరుండి పందేలు నిర్వహింస్తుండటంతో పోలీసులు సైతం అటువైపు వెళ్లలేదు. తెలుగుదేశం పార్టీ జెండాల రెపరెపల నడుమ ఆదివారం మొదలైన కోడిపందేలకు తెనాలి, దుగ్గిరాల, వేమూరు నుంచే కాకుండా కృష్ణానది ఆవలగల కృష్ణా జిల్లా నుంచి కూడా పందెపురాయుళ్లు హాజరయ్యారు. స్వయంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మద్దతు ఉందని తెలియటంతో పోలీసు భయం ఉండదన్న ధీమాతో పందెంరాయుళ్లు నిస్సంకోచంగా పందేలకు పూనుకున్నారు. పోలీసులపై ఎమ్మెల్యే ఒత్తిళ్లు.. రేపల్లె నియోజకవర్గంలో సుప్రీ కోర్టు నిబంధనలకు విరుద్ధంగా కోడిపందేలు నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు అడ్డువచ్చిన పోలీసులపై సైతం ఒత్తిళ్లు తెస్తున్నారు. నగరం మండలం ఉయ్యూరువారిపాలెంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారని సమాచారం తెలుసుకుని స్థానిక ఎస్ఐ వెళ్లి దాడులు చేసి పందేలు నిర్వహిస్తున్న వ్యక్తులు, కోళ్లను అదుపులోకి తీసుకోగా ఎమ్మెల్యే ఫోన్ చేసి ఒత్తిడి తీసుకురావడంతో వారిని అక్కడి వదిలిపెట్టి వెనుదిరిగారని సమాచారం. పోలీస్ ఉన్నతాధికారులపై సైతం అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తీసుకువచ్చి కోడిపందేలు నిర్వహిస్తుండటంతో పోలీస్‌లు ప్రేక్షపాత్ర వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మంగళగిరి నియోజకవర్గం నూతక్కి, రేవెంద్రపాడు, కుచనపల్లి, పాతూరుల్లో సైతం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా కోడి పందేలు సాగాయి. జోరుగా జూదం జిల్లా వ్యాప్తంగా కోడి పందేలతో పాటు డబ్బా, చక్రం ఆటలు(జూదాలు) జోరుగా సాగాయి. జూదాలకు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండలతో చట్టబద్ధత కల్పించినట్లైంది. పేకాట (కోతముక్క), డబ్బా, చక్రం ఆటలతో పాటు మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సంప్రదాయాల ముసుగులో గ్రామీణుల జీవితాలు చిధ్రమవుతున్నాయని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాయకష్టం చేసి సంపాదించుకున్న సొమ్ము జూదం వ్యసనంలో పాడుచేస్తుండటంతో పేదవర్గాలు పండగపూట కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పండుగ సాకుచూపి కోడిపందేలు, జూదం వివిధ రకాల ఆటల వల్ల కోట్లాది రూపాయిలు ప్రజాప్రతినిధుల సమక్షంలో చేతులు మారుతూ ఎన్నో జీవితాలు చిద్రమయ్యాయంటూ ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. పిట్టలవానిపాలెంలో 11 మంది అరెస్టు.. బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండల కేంద్రంలో కోడిపందేలు నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పందేలు నిర్వహిస్తున్న 11 మందిని అరెస్టుచేసి పందెం కోళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.6,400 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కాలు దువ్వి.. కత్తి దూసి..
పందెం రాయుళ్ల పంతం ముందు హైకోర్టు ఆంక్షలు నిలబడలేదు. కోడి పుంజులకు కత్తులు కట్టి పందేలు వేస్తే జైలుకు పంపుతామని పోలీసులు చేసిన హెచ్చరికలను ఎవ్వరూ ఖాతరు చేయలేదు. సంక్రాంతి ముసుగులో గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో కత్తి కట్టి కోడి పందేలు నిర్వహించారు. అధికారపార్టీ నేతల అండదండలతో జూదం విచ్చలవిడిగా సాగిపోయింది. రాత్రికి రాత్రే ఏర్పాట్లు పూర్తి చేసి భారీ ఎత్తున వేసిన షామియానాలు, గ్యాలరీల్లో పందేలు యథేచ్ఛగా నిర్వహించారు. అనుబంధంగా పేకాట, గుండాట, నంబర్ల ఆటలు సైతం జోరుగా సాగాయి. వారం రోజుల నుంచి తనిఖీల పేరుతో హడావుడి చేసిన పోలీసులు పండుగ రోజుల్లో చేష్టలుడిగిపోయారు. సాక్షి, అమరావతిబ్యూరో : జిల్లాలో కంకిపాడు, బాపులపాడు, ముసునూరు, కైకలూరు, జగ్గయ్యపేట, మచిలీపట్నం, గుడివాడ మండలాల్లో రూ.కోట్లలో కోడిపందేలు జరిగాయి. ఇక్కడ భోగి పండుగ రోజున జరిగిన పందేలకు తెలుగు రాష్ట్రాల్లోని బడాబాబులు ఖరీదైన కార్లలో హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు సైతం పాల్గొన్నారు. ♦ పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు మండలం ఈడుపుగల్లులో హోరెత్తించే మైకులు, క్రీడా మైదానాలను తలపించే రీతిలో ఏర్పాటు చేసిన బరుల్లో కోడిపందేలు నిర్వహించారు. దీంతో పాటు గొడవర్రు, గండిగుంట, కాటూరు, బోళ్లపాడు, ఆకునూరు, పెదపులిపాక తదితర ప్రాంతాల్లో సిద్ధం చేసిన బరులుకోడిపందేలకు మరోసారి వేదిక అయ్యాయి. ముసునూరు మండలం కొత్తూరు గ్రామంలోనూ పెద్ద ఎత్తున కోడిపందేలు నిర్వహించారు. ♦ తిరువూరు నియోజకవర్గ పరిధిలో కోకిలంపాడు వెళ్లే రహదారిలో మినీస్టేడియం వెనుక, కాకర్ల, ముష్టికుంట్ల, చీమలపాడు, రేపూడి, పోలిశెట్టిపాడు, విస్సన్నపేట, కొండపర్వ, కలగర, పుట్రేల, తెల్లదేవరపల్లి, గంపలగూడెం మండలం గొల్లపూడి, ఊటుకూరు, నెమలి, కనుమూరు కోడి పందేలు నిర్వహించారు. ♦ కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కైకలూరు, ఆటపాకలో సిద్ధం చేసిన బరుల్లో కోళ్లు కాళ్లు దువ్వాయి. కలిదిండి, కోరుకొల్లు, ముదినేపల్లి మండలంలో ముదినేపల్లి వైవాక, మండవల్లి మం డలంలో మండవల్లి, భైరవపట్నం, చింతపాడుల్లోనూ కోడిపందేలు నిర్వహించారు. ఆటపాకలో టీడీపీ ఎంపీ మాగంటి బాబు పాల్గొన్నారు. ♦ నూజివీడు నియోజకవర్గ పరిధిలో జనార్దనపురం, పోతనపల్లి, చీపురుగూడెం, చనుబండ, ముసునూరు, సూరేపల్లి, కొత్తూరు, సుంకొల్లు, గొడుగువారిగూడెం, కాట్రేనిపాడు, చక్కపల్లి, ఆగిరిపల్లి, ఈదరలోనూ పందేలు జరిగాయి. ♦ మైలవరం నియోజకవర్గ పరిధిలో బాపులపాడు మండలం అంపాపురం, ఉంగుటూరు మండలం ఇందుపల్లి, నందిగామ మండలం చందాపురం, కలిదిండి మండలం తాడినాడ, రెడ్డిగూడెం మండలం నాగులూరు, చండ్రగూడెం తదితర ప్రాంతాల్లోనూ భారీస్థాయిలో జరిగాయి. ♦ మచిలీపట్నం నియోజకవర్గంలోని గోపువానిపాలెం, శ్రీనివాసనగర్, పోలాటితిప్ప ప్రాంతాల్లో కూడా బహిరంగంగానే బరులు ఏర్పాటు చేసి కోడిపందేలు నిర్వహించినా పోలీసులు పట్టించుకోలేదు. ♦ జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు, షేర్మహ్మద్పేటలతో పాటు నగరశివార్లలోనూ అలాగే నందిగామ మండలం కంచికచర్లలో రెండు, చందర్లపాడులో రెండు బరుల్లోనూ నిర్వాహకులు పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తూ పందేలు నిర్వహించడం గమనార్హం. ♦ విజయవాడ భవానీపురం, ఆటోనగర్‌లో ఏర్పాటు చేసిన బరులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే భవానీపురంలో ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న అనుచరలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాగైనా పందేలు నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు. రూ.150కోట్లు పైమాటే.. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో సోమవారం కోడి పందేలు, పేకాట జోరుగా సాగాయి. కొన్ని చోట్ల పోలీస్స్టేషన్లకు కూతవేటు దూరంలోనే కోడిపందాలు జరుగుతున్నాయి. కోడిపందేలతో పాటు పేకాట, గుండాట, నంబర్లు, ఎరుపు తెలుపు ఆటలు జోరుగా సాగుతున్నాయి. పెద్దలతో పాటు పిల్లలు కూడా వీటిలో పాల్గొంటున్నారు. పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వారితో కోడిపందేల బరులు కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో కోడిపందేల్లో రూ.కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఇందులో మద్యానిది 50 శాతం భాగం కావడం విశేషం. ఈ ఏడాది కూడా రూ. 150 కోట్లకు పైగా చేతులు మారే అవకాశం ఉన్నట్లు అంచానా. చాలాచోట్ల పగలు, రాత్రి సమయాల్లో కూడా నిర్వహించడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. హాజరైన తెలంగాణఎమ్మెల్యేలు, ఎంపీలు నూజివీడు: నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం వేల్పుచర్ల శివారు కొత్తూరులో నిర్వహించిన కోడిపందేలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినీ యాక్టర్లు హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, అశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్లతో పాటు సినీ కమేడియన్ శివారెడ్డి, జబర్దస్త్ కమేడియన్ వేణు, రాకేష్‌లు విచ్చేశారు. శివారెడ్డి చంద్రబాబులా మిమిక్రీ చేస్తూ పందేలకు వచ్చిన జనాన్ని కడుపుబ్బ నవ్వించారు. అంతేగాకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు జెడ్పీటీసీలు సైతం పాల్గొన్నారు. -
పొట్టి ముక్కు, పొడవాటి తోక
విశాఖపట్నం, తగరపువలస (భీమిలి): పౌరుషం చూపే పందెం కోళ్లే కాదు.. అందాలొలికే హైక్లాస్ కోళ్లు కూడా ఉంటాయి. కొన్ని ఉన్నత కుటుంబాలవారు తమ డాబు, దర్పం తెలియడం కోసం వీటిని ఇంటి ముందు కట్టి ఉంచుతారు. పోటీలకు వినియోగించే కోళ్లకు భిన్నంగా పొట్టి ముక్కు, పొడవాటి తోక, డబుల్ బాడీ కలిగి ఉండటం వీటి విశేషం. తమిళనాడులో సేలం, దిండిగల్ తరువాత కోవిల్పట్టి కోళ్లకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంటుంది. మిగతా ఏ జాతి కోళ్లతోనూ సంకరం కాని కోళ్లుగా వీటికి పేరుంది. తెలుగు రాష్ట్రాలలో అరుదుగా ఉండే ఈ కోవిల్పట్టి కోళ్లు పద్మనాభం మండలం రేవిడిలో ఔత్సాహిక కోళ్ల పెంపకందారుడు భూపతిరాజు రాజేష్ ఇంట దర్శనమిస్తాయి. ప్రస్తుతం రాజేష్ దొడ్లో అయిదు రకాల అరుదైన కోళ్లు ఉన్నాయి. కాకి నెమలి ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవి రూ.30 వేల వరకు ధర పలికితే, కోవిల్పట్టికి చెందిన పుంజులు రూ.40 వేల నుంచి చిట్టి ముక్కు, తోక పొడవును బట్టి రూ.1.50 లక్షల వరకు ఉంటాయి. సేతువ కలర్ మేల్ డబుల్ బాడీ కలిగి పొట్టి ముక్కు పొడవాటి తోక కలిగిన ఈ జాతి పుంజు రూ.80 వేలు పలుకుతుంది. మనిషికి సిక్స్ ప్యాక్‌లా గుడ్ బాడీ స్టైల్ దీని స్వంతం. ఇది తెల్లగా ఉంటుంది. పూర్తిగా కోవిల్పట్టి లైనేజీ కలిగిన కుక్కుటం ఇది. సేతువ కలర్ ఫిమేల్ అందాల పోటీలలో పాల్గొనే ఈ ఫిమేల్ పక్షులను నూరి అని కూడా అంటారు. దీని అందం బట్టి వీటి ధర రూ.20 వేల నుంచి 40 వేల వరకు ఉంటుంది. ఎర్ర కక్కెర రూ.40 వేల విలువైన ఈ పుంజు కూడా పొడవైన తోక, పొట్టి ముక్కు కలిగి ఉంటుంది. నల్ల కగర తెలుగు రాష్ట్రాలలో లభించే నల్ల కగర భిన్నంగా ఉంటుంది. కోవిల్పట్టిలో దీని ధర రూ.20 వేల వరకు ఉంటుంది. అరుదైన కోళ్ల సేకరణ హాబీ నా దగ్గర రూ.20 వేల నుంచి రూ.లక్షన్నర విలువైన కోళ్లు ఉంటాయి. ఆన్లైన్లో పక్షుల జాతిని చూసి కొనుగోలు చేస్తుంటాను. కొన్ని నెలలు పెంచిన తరువాత వేరే వాటిని కొని వీటిని అమ్మేస్తుంటాను. ఇంతేసి డబ్బులు పెట్టి కొన్నవాటిని తినడానికి మనసొప్పదు. నా దగ్గర ఉన్న అరుదైన జాతి కోళ్లను చూడటానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు.–భూపతిరాజు రాజేష్, రేవిడి -
కోట్లాట..!
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు: జిల్లాలో జూదరులు బరితెగించారు. బరుల్లో కోళ్లు కత్తులు దూశాయి. సంప్రదాయం ముసుగులో యథేచ్ఛగా పందేలు సాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల అండదండలతోనే పందేలు జరుగుతున్నాయి. నిన్నటి వరకూ బరులను ధ్వంసం చేస్తూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ పందేలు జరగనీయబోమని భీష్మించిన అధికార యంత్రాంగం సోమవారం మధ్యాహ్నం నుంచి చేతులెత్తేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే ఇలా చేశారనే వాదన వినిపిస్తోంది. జిల్లాలో సుమారు 200 బరులు ఏర్పాటు చేసినట్టు సమాచారం. రాత్రుళ్లూవేసేందుకు వీలుగా ఫ్లడ్లైట్లను బరుల నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పోటీలను అందరూ తిలకించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 200లకుపైగా బరుల్లో ఒక్కరోజే సుమారు రూ.60 కోట్ల మేర సొమ్ములు చేతులు మారినట్లు తెలుస్తోంది. అధికారపార్టీ నేతలు దగ్గరుండి మరీ పందేలు ఆడించారు. మద్యం ఏరులే.. బరుల వద్ద మద్యం ఏరులై పారుతోంది. శిబిరాల వద్ద కోడిమాంసం పకోడి, బిర్యానీ దుకాణాలతోపాటు కూల్‌డ్రింక్ స్టాళ్లు ఏర్పాటయ్యాయి. ఆ ప్రాంతాలు తిరనాళ్లను తలపిస్తున్నాయి. బరులు ప్రారంభించిన ఎమ్మెల్యేలు ♦ ఏలూరు మండలం గుడివాకలంక, జాలిపూడి, కొమడవోలు, శ్రీపర్రు గ్రా మాల్లో కోడిపందేలు జరిగాయి. దెందులూరు నియోజకవర్గం కొప్పాకలో ఎమ్మెల్యే చింతమనేని పందేలను ప్రారంభించారు. ♦ కాళ్ళ మండలం సీసలిలో ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు బరిలో నిలబడి పందేలను ప్రారంభించారు. తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ భీమవరం ప్రాంతంలో పందేలు తిలకించారు. కొణితివాడ వద్ద టీడీపీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, తెలుగుచిత్ర దర్శకుడు సుధీర్‌వర్మ పందేలను తిలకించారు. ♦ భీమవరం మండలంలోని ఒక గ్రామంలో గుండాట నిర్వహణకు బరిని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు రూ. 72 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. దీనివల్ల పందేలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ♦ భీమవరం పట్టణంలోని ఆశ్రం ఆస్పత్రి దగ్గరలోనూ, భీమవరం మండలంలోని పెదగరువు, దిరుసుమర్రు, బర్రెవానిపేట, లోసరి గ్రామాల్లోనూ వీరవాసరం మండలం కొణితివాడ, నవుడూరు, వీరవాసరం, నందమూరుగరువు తదితర గ్రామాల్లోనూ భారీస్థాయిలో పందేలు జరిగాయి. ♦ పాలకొల్లు మండలం పూలపల్లిలో ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు నేతృత్వంలోనూ, ఏఎంసీ మాజీ చైర్మన్ చెరుకూరి పండురాజు ఆధ్వర్యంలోనూ పందేలు జరిగాయి. ♦ నరసాపురం నియోజకవర్గంలో కోడిపందేలతోపాటు గుండాట, పేకాట పెద్ద ఎత్తున జరిగాయి. నరసాపురం పట్టణంలో పీచుపాలెం పెద్ద మశీదు, పీచుపాలెం ఫ్యాక్టరీ వద్ద, రుస్తుంబాదలోనూ ఇళ్లు, మసీదులు, విద్యాసంస్థల మధ్యలోనే బరులు ఏర్పాటు చేశారు. లక్ష్యణేశ్వరం బరివద్ద యాంకర్ శ్రీముఖి, జబర్దస్త్ నటులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మొగల్తూరులో సాక్షాత్తు తహసీల్దార్ కార్యాలయం పక్కనే బరి ఏర్పాటు చేశారు. కోడిపందేలు, గుండాట యథేచ్ఛగా సాగుతున్నాయి. ♦ పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయగూడెం, టీ నర్సాపురం, కొయ్యలగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లో పందేలు సాగుతున్నాయి. ♦ గోపాలపురం నియోజకవర్గంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి పందేలు మొదలయ్యాయి. అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో ఇవి జరుగుతున్నాయి. ♦ జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, గుర్వాయిగూడెం, లక్కవరం, పంగిడిగూడెం గ్రామాల్లో చింతలపూడి మండలం చిన్నంపల్లిలో, కామవరపుకోట, లింగపాలెం మండలం ములగలంపాడు, కలరాయనగూడెం గ్రామాల్లో కోడిపందేలు జరిగాయి. ♦ ఆచంట నియోజకవర్గంలో ఆచంట, పోడూరు, పెనుమంట్ర, పెనుగొండ మండలాలలో సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, జూదం పెద్ద ఎత్తున జరగుతున్నాయి. తణుకు మండలంలో ఇరగవరం, అత్తిలి మండలాల్లో కోడిపందేలు, జూదం, కోతాట విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ♦ నిడదవోలు పట్టణంతో పాటు పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల్లో 22 బరులు ఏర్పాటు చేశారు. ♦ ఉండి నియోజకవర్గంలో ఐ.భీమవరం, దుంపగడప, కోళ్లపర్రు, చినకాపవరం, సిద్ధాపురం, కాళ్ల, ఉండి, పాలకోడేరుల్లో పందేలు జరిగాయి. ♦ కొవ్వూరు పట్టణంలో రెండుచోట్ల, సీతంపేట, తోగుమ్మి, పశివేదల, దొమ్మేరు, ఐ. పంగిడి, ఆరికిరేవుల, చాగల్లు, తాళ్ళపూడి గ్రామాల్లో పందేలు జోరుగా సాగాయి. ♦ భీమడోలు మండలం గుండుగొలను, ఉంగుటూరు మండలం నారాయణపురం, నిడమర్రు మండలం పత్తేపురం, గణపరం లోనూ కోడిపందేల బరులు వెలిశాయి. భారీ బెట్టింగులు జిల్లాలో పరిస్థితి దారుణంగా మారింది. సోమవారం మధ్నాహ్నం వరకూ పోలీ సులు కఠినంగా వ్యవహరించినా సర్కారు ఆదేశాలతో పట్టుసడలించారనే అపవాదు వచ్చింది. ఇక బెట్టింగు రాజాలు చెలరేగిపోయారు. భారీగా పందేలు కాసినట్లు చెబుతున్నారు. జిల్లాలో సుమారు రూ. 50 నుంచి రూ.60 కోట్ల మేర పందాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇక బరుల వద్ద మద్యం ఏరులైపారింది. బరుల వద్ద కోడిపందేలు వేసినా లేకున్నా మద్యం విక్రయాలు మాత్రం భారీగా సాగుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యం వ్యాపారాలవైపు చూడకుండా నిర్వాహకులు ఒప్పం దాలు చేసుకున్నారు. పేకాట, గుండాట, కోతాట శిబిరాల నిర్వాహకులు భారీగా ఆదాయాన్ని సంపాదించారు. -
పందెం కో‘ఢీ’
జిల్లాలో సంక్రాంతి కోడిపందేలకు రంగం సిద్ధమైంది. అధికార పార్టీ నేతల అండ దొరికింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు లెక్కచేయని పరిస్థితి నెలకొంది. నదీ తీరప్రాంతాలతో పాటు అనుకూల ప్రాంతాల్లో కోడిపందేలను నిర్వహించేందుకు పందెంరాయుళ్లు సై అంటున్నారు. అనుమానిత వ్యక్తుల బైండోవర్‌తో పాటు ఆయా ప్రాంతాల్లో పోలీసులు హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అయినా అధికారపార్టీ నేతల ఆధ్వర్యంలో కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం: సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు పల్లిపాళెం పెన్నానది తీరం ఒడ్డున కోడిపందేల నిర్వాహకులు వారం రోజుల కిందటే తమ అనుకూల ప్రాంతాలను సిద్ధం చేశారు. ఈ ప్రాంతాల్లో ప్రతి ఏడాది కోడిపందేలు జరుగుతూనే ఉన్నాయి. రూ.లక్షల లావాదేవీలు జరుగుతున్నాయి. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం మండలాల్లోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఇక్కడికి చేరుకుని పందేలు నిర్వహిస్తున్నారు. విడవలూరు మండలంలోని ఊటుకూరు వెంకటరెడ్డిపాళెం గ్రామాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రాంతాల్లో కూడా కోడిపందేలు జోరుగా జరగనుంది. ఇందుకూరుపేట మండలంలోని పెన్నాతీరం వద్ద నిడిముసలి, ముదివర్తిపాళెం కోడిపందేలకు రంగం సిద్ధం చేశారు. కోవూరు మండలంలో పోతిరెడ్డిపాళెం, వేగూరులో కోడిపందేలు నిర్వహించేందుకు చూస్తున్నారు. కొడవలూరు మండలంలో గువ్వగుంట (తలమంచి సమీపంలో) ప్రాంతంలో నిర్వహించే అవకాశం ఉంది. అధికారపార్టీ నేతల అండతోనే.. కోడిపందేలకు అడ్డురావద్దని కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గతంలో అధికారులకు బహిరంగంగా సూచించిన విషయం విదితమే. దీంతో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పందేలు నిర్వహించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో తమకు అనుకూలమైన ప్రాంతాలను ఎంచుకున్నారు. పందేలకు వచ్చేవారికి కూడా తామున్నామంటూ భరోసా ఇస్తున్నారు. గతంలో పలుమార్లు ఇలా.. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని దామరమడుగు పల్లిపాళెం పెన్నానది తీరం ఒడ్డున ప్రతి ఏటా కోడిపందేలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సంక్రాంతికి ముందుకుగానే 2015 డిసెంబరులో స్థానికులు కోడిపందేల నిర్వాహకులను, ఆడేవారిని పోలీసులకు పట్టించా రు. 45 వాహనాలను స్టేషన్‌కు తరలించారు. 2014లో వవ్వేరులో జరుగుతున్న కోడిపందేలను అడ్డుకుని నిర్వాహకులను సీఐ సాంబ శివరావు పట్టుకున్నారు. కోవూరు, విడవలూరు, ఇందుకూరుపేట ప్రాంతాల్లో మాత్రం ప్రతి ఏటా జరుగుతున్నా పోలీసులు పట్టించుకున్న దాఖలాల్లేవు. కొడవలూరు మండలంలోని 2014లో గువ్వగుంట, 2016లో కూనంపాడు ప్రాంతాల్లో జరిగిన కోడిపందేలపై పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. యల్లాయపాళెంలో కోడిపందేలను ఎస్సై అంజిరెడ్డి దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 13 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. హెచ్చరిక బోర్డుల ఏర్పాటు కోడిపందేలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. కోడిపందేలు నిషేధమని, చట్టరీత్యాల చర్యలు తప్పవని బోర్డులో పేర్కొన్నారు. అయినా కాగులపాడు సమీపంలోని పొలాల్లో ఆదివారం కోడిపందేలు నిర్వహించారు. పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు కోడిపందేలపై నిషేధం ఉంది. ఎవరూ నిర్వహించరాదు. నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. పేకాట ఆడినా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే నిఘా ముమ్మరం చేశాం. ప్రజలు తమకు తెలిస్తే 9440796329కు ఫోన్ చేయగలరు. –బి.సురేష్‌బాబు, సీఐ, బుచ్చిరెడ్డిపాళెం -
కోడి పందేలకు రంగం సిద్ధం!
శ్రీకాకుళం , ఎల్.ఎన్.పేట: ఉభయ గోదావరి జిల్లాల స్థాయిలో కాకపోయినా ఎంతోకొంత వరకు జిల్లాలో కోడిపందేలు సాగుతుంటాయి. ఏటా పందేల నిర్వాహణకు ఒకస్థాయి నుంచి భారీ ఏర్పాట్లు చేస్తుంటారు. అలికాం–బత్తిలి రోడ్డుకు ఎగువున, మండలంలోని కొత్తబాలేరు, కవిటి, కొత్తపేట, చొర్లంగి, కొత్తవలస గ్రామాలకు సమీపంలోని కొండల్లో జీడి, నీలగిరి, సర్వేతోటల్లో ఈ పందేలు నిర్వహిస్తుంటారు. కోడి పందేలతో పాటు సూట్(పేకాట) ఆటలు కూడా ఆదే ప్రాంతంలో జరుగుతుంటాయి. వీటి నిర్వాహణ పరిసర గ్రామాలకు చెందిన వారే ప్రధాన బాధ్యతలు తీసుకుంటారని, వారి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని స్థానికంగా ప్రచారంలో ఉంది. గత 20 ఏళ్లుగా పందేల నిర్వాహణ కొనసాగుతునే ఉంది. ఒకటి, రెండుసార్లు జూదగాళ్ల ఆటలు సాగకుండా స్థానిక పోలీసులు అణచివేశామని చెప్పుకున్నా భోగీ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో పందేలు మాత్రం జరిగిపోతునే ఉంటాయి. సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్‌కు ఈ 3 నెలల వ్యవధిలో ఇద్దరు ఎస్ఐలు మారడంతో తమను ఎవరూ పట్టించుకోలేరన్న ధీమాలో నిర్వాహాకులు ఉన్నారు. సరుబుజ్జిలి పరిధిలోని ఎల్.ఎన్.పేట మండలంలో పందేల ప్రాంతాలు మారు మూలన ఉన్నాయి. ఈ ప్రాంతంతో సంబంధం లేని కొత్తవారు ఎవరైనా వచ్చినా.. అనుమానంగా ఉన్న వ్యక్తులు పందేలు జరిగే దారిలో వెళ్తున్నా.. వారిని పసిగట్టిన నిర్వాహాకుల వేగులు ఫోన్ల ద్వారా క్షణాల్లో సమాచారం చేరవేస్తుంటారు. వెంటనే నిర్వాహాకులు వారి మకాం మార్చి తప్పించుకుంటారు. పందేలు జరిగే ప్రాంతంలో సూట్(పేకాట) కూడా భారీ స్థాయిలో జరుగుతుందని తెలుస్తుంది. కోడి పందేల నిర్వాహాణ ఈ ఏడాది మరింత ఉత్సాహాంగా, ఎక్కువ రోజుల పాటు నిర్వహించే అవకాశం లేకపోలేదని ఈ ప్రాంతంలో ప్రచారం జరుగుతుంది. పందేల నిర్వాహాణకు కోడి పుంజులను సిద్ధం చేసుకున్నారు. ఒక్కొక్క కోడి పుంజు ధర తక్కువగా రూ.2 వేల నుంచి రూ.10 వరకు ఉందని స్థానికులు చెబుతున్నారు. వీటి నిర్వాహణపై పోలీసులు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది. -
పందేలకు రె‘ఢీ’
తూర్పుగోదావరి, అమలాపురం: ‘కోడిపందేలు నిర్వహించే అవకాశం లేదని.. అడ్డుకుని తీరుతామని’ ఎప్పటిలానే పోలీసులు గత కొన్ని రోజులుగా ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. మరోవైపు గడిచిన రెండు రోజులుగా పందేల నిర్వాహకులు యథావిధిగా సన్నాహాలు చేస్తూనే ఉన్నా రు. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోను పందేలను అడ్డుకునే అవకాశం లేదని నిర్వాహకులు బలంగా విశ్వసిస్తున్నారు. చూసీచూడనట్టుగా వదిలేయండి అని ఉన్నతాధికారు ల నుంచి అనధికార ఆదేశాలు రాకపోవడంతో పందేల నిర్వహణను అడ్డుకోవాలో, వదిలేయాలో తెలియక పోలీసులు మీమాంసలో ఉండడం గమనార్హం. సంక్రాంతి మూడు రోజులు ఈ ఏడాది కూడా పందేలు జోరుగా సాగనున్నాయి. తమకు చెడ్డపేరు వస్తోందని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు నేరుగా పందేలు నిర్వహించడానికిదూరంగా ఉండగా, కొంతమంది తమ అనుచరులతో కానిస్తున్నారు. పందేలకు అనుమతి లేదని పోలీసులు, అధికార పార్టీ పెద్దలు చెబుతున్నా నిర్వాహకులు మాత్రం యథావిధిగా బరులు సిద్ధం చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పందేలకు అనుమతి ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంశాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత ఇలాకా పెద్దాపురం నియోజకవర్గంలోనే భారీ ఎత్తున పందేలు జరిగే అవకాశముంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఈ ఏడాది కూడా పందేలు జోరుగా సాగనున్నాయి. నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే నియోజకవర్గంలోని అచ్చంపేట– తిమ్మాపురం జంక్షన్, వాలు తిమ్మాపురం, జి.రాగంపేటలో పందేలు జరగనున్నాయి. ఆర్థికమంత్రి ఇలాకా తునిలో కోడిపందేలు జోరుగా సాగనున్నాయి. తుని మండలం తేటగుంటలో పెద్ద ఎత్తున పందేలు జరగనున్నాయి. అమలాపురం నియోజకవర్గ పరిధిలో గోడిలంక, ఇందుపల్లి, ఎన్.కొత్తపల్లి, కూనవరంలో పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. అమలాపురం మండలం సమనసలో పందేల నిర్వహణ కోసం వేసిన టెంట్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. అయినా ఇక్కడ పందేలు జరుగుతాయని నిర్వాహకులు చెప్పడం విశేషం. జగ్గంపేటలో కిర్లంపూడి, మర్రిపాక, రాజానగరంలో జి.ఎర్రంపాలెం, పుణ్యక్షేత్రం, దివాన్‌చెరువు, ఏజెన్సీలో దేవీపట్నం, గంగవరం, పిఠాపురంలో పి.దొంతమూరు, ఇసుకపల్లి, కొమగిరి, విరవలలోను, మండపేట, ద్వారపూడి, కపిలేశ్వరపురం లంకలు, రాయవరం, రాజమహేంద్రవరం రూరల్‌లో వేమగిరి, బుర్రిలంక, జేగురుపాడు, ముమ్మిడివరం చెయ్యేరు, గెద్దనాపల్లి ప్రాంతాల్లో పందేల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. కొత్తపేటలో తొలిసారిగా పందేలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ స్పీకర్ రెడ్డి సుబ్రహ్మణ్యం అండదండలతో ఇక్కడ పందేల నిర్వహణకు అధికార పార్టీలో కీలక నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ ఆత్రేయపురం, రావులపాలెంలో సైతం పందేలు జరగనున్నాయి. రాజోలు నియోజకవర్గంలో ఇంచుమించు అన్ని మండలాల్లోను పందేలు జరగనున్నాయి. పశ్చిమ గోదావరిలో భారీగా పందేలు జరిగే అవకాశం ఉండడంతో ఇక్కడ పెద్ద పందేల సంఖ్య చాలా తక్కువ. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో కాట్రేనికోన మండలం గెద్దనాపల్లి వంటి చోట భారీ పందేలు జరుగున్నాయి. మురమళ్లలో పందేలు లేవు కోడిపందేల నిర్వహణలో జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలో గుర్తింపు సంతరించుకున్న ఐ.పోలవరం మండలం మురమళ్లలో ఈసారి పందేల నిర్వహణ లేకుండా పోయింది. ఇక్కడ పందేల నిర్వహణకు గ్యాలరీతో కూడిన స్టేడియంను, ఎల్సీడీలను ఏర్పాటు చేయడం, బిర్యానీల వంటి విందులు ఉండేవి. రాష్ట్రం నలుమూలల నుంచి పందేలలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చేవారు. గత ఏడాది పందేల విషయంపై న్యాయస్థానం సీరియస్ కావడంతో పందేలకు బ్రేకులు పడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పందేల నిర్వహణ వల్ల తనకు చెడ్డపేరు వస్తోందని నిర్వహణకు దూరంగా ఉన్నారు. అయితే ఐ.పోలవరం మండలం కొమరగిరిలో భారీ ఎత్తున బరులు ఏర్పాటు చేసి పందేల నిర్వహణకు సమాయత్తం అవుతున్నారు. -
బరి తెగింపు
తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: సంక్రాంతి కోడి పందేలు జోరందుకుంటున్నాయి. పందెంగాళ్లు సై అంటే సై అంటున్నారు. కోడి పందేల నిర్వహణ కోసం ఇప్పటికే జిల్లాలోని పలు చోట్ల రహస్యంగా బరులు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది కూడా భారీగా పందేలు నిర్వహించేందుకు పలువురు తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా పందెంగాళ్లు ఎలాగైనా నిర్వహించాలన్న ఉత్సాహంతో సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కోడి పుంజులకు శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. జిల్లాలోని ముమ్మిడివరం, కాట్రేనికోన, కొత్తపేట, అమలాపురం, రావులపాలెం, కాకినాడ రూరల్, సిటీ, పిఠాపురం, తుని, జగ్గంపేట, మండపేట, రాజానగరం, ప్రత్తిపాడు తదితర నియోజకవర్గాలోనూ, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించేందుకు బరులు ఏర్పాట్లు చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే... జిల్లాలో ఏటా సంక్రాంతి పండుగకు భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారు. వాటి నియంత్రణలో మాత్రం పోలీసులు వైఫల్యం చెందుతున్నారు. సీజన్లో అడపాదడపా దాడులు చేస్తూ నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుటున్నారని, బడా పందెగాళ్లపై దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులు, చోటామోటా రాజకీయ నాయకులు సైతం కోడి పందేల నిర్వహణలో పాల్గొడం గమనార్హం. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే పోలీసులు కోడిపందేలు వేయవద్దని, 144 సెక్షన్ అమలులో ఉందని, గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో సమావేశాలు పెట్టి హడావుడి చేయడం పరిపాటిగా మారింది. పండుగ నాలుగు రోజులు పెద్ద ఎత్తున కోడిపందేలు షరామామూలే. గతేడాది కూడా పోలీసులు గ్రామాల్లో దాడులు నిర్వహించడం, తరువాత అనుమతులు ఇవ్వడం, ఎస్ఐ స్థాయి అధికారి నుంచి డీఎస్పీ స్థాయి అధికారులకు కోస మాంసం ఇవ్వాలని ఒక్కొక్క బరి నుంచి 65 నుంచి 90 కోసలు కావాలని నిర్ణయించడంతోపాటు రూ. 1.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు పోలీసులు వసూలు చేశారని... ఇప్పుడు కూడా అదే జరుగుతుందని, పందేలు మాత్రం ఆపరని నిర్వాహకులు చెబుతున్నారు. 232 కేసులు..500 మంది బైండోవర్ కోడి పందేలు ఆడే వ్యక్తులుగా గుర్తించి ఇప్పటి వరకు జిల్లాలో 232 కేసులు పెట్టి 500 మందిని బైండోవర్ చేశారు. కోడిపందేలు ఆడుతున్న స్థలాలపై దాడులు చేసి 10 కేసుల్లో 8 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 30 కోళ్లు, 25 కత్తులు, రూ.40 వేలు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పేకాట శిబిరాలపై దాడి చేసి 25 కేసులు నమోదు చేసి 110 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 1.10 లక్షల నగదు, ఆరు మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. కోడిపందేలపై ఉక్కుపాదం సంక్రాంతి పండుగకు కోడి పందేలపై హైకోర్టు నిషేధం విధించింది. వీటిపై ఇప్పటికే టాస్క్ఫోర్సు టీములు తిరుగుతున్నాయి. కోడిపందేలు, పేకాట, మట్కా, గుండాట తదితర నిషేధిత ఆటలపై సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలి.– విశాల్ గున్ని, ఎస్పీ, కాకినాడ -
బరి తెగించారు
అధికార పార్టీ నాయకులు బరి తెగించారు. సంక్రాంతి సంప్రదాయం పేరిట సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా కోడిపందేలు నిర్వహించారు. పందేల నిర్వహణకు ప్రత్యేకంగా బరులను సిద్ధం చేశారు. ఆ బరుల వద్దకు చేరుకునేందుకు రోడ్లను సైతం ఏర్పాటు చేశారు. కోడిపందేలతోపాటు కోతముక్క, గ్యాంబ్లింగ్ వంటి జూద క్రీడల నిర్వహణకు చర్యలు చేపట్టారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు సైతం ఏర్పాటు చేశారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకుల కనుసన్నల్లో జరుగుతున్న పందేలు కావడంతో పోలీసులు అడ్డుకునేందుకు జంకుతున్నారు. – సాక్షి, గుంటూరు సాక్షి, గుంటూరు: సంక్రాంతికి సంప్రదాయాల పేరిట జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. కోడిపందేల నిర్వాహకులు బరుల వద్ద రూ.లక్షలు ఖర్చు చేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు సైతం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రేపల్లె నియోజకవర్గంలో కోళ్లు కత్తులు దూశాయి. పందేల నిర్వాహకులు నిర్మానుష్య ప్రదేశాల్లో బరులను ఏర్పాటు చేశారు. నిజాంపట్నం మండలం దిండి గ్రామ పరిధిలోని మడ అడవుల్లో కోడిపందేలు నిర్వహించేందుకు అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ అనుచరుడు 15 రోజుల ముందు నుంచి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి పందేలు జరుపుతున్నారు. స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం రేపల్లె రూరల్ మండలం మూళ్లకుంట గ్రామ పరిధి, చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో గతంలో పందేలు నిర్వహించిన టీడీపీ నాయకుడి నేతృత్వంలోనే తాజాగా బరులు ఏర్పాటయ్యాయి. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం కొత్తబొమ్మువాని పాలెం పుష్కరఘాట్ వద్ద మండల, గ్రామస్థాయి టీడీపీ నాయకులు ఎమ్మెల్యే అండదండలతో కోడి పందేలు జోరుగా నిర్వహించారు. కూలీలను నియమించి ఖాళీస్థలాల్లో బారికేడ్లు ఏర్పాటుచేసి, అధికారపార్టీ జెండాలతో స్టేజీ వేసి ఆగమేఘాల మీద బరులను సిద్ధం చేశారు. ఈ సమాచారం అందుకున్న పందెంగాళ్లు కోళ్లతో వాలిపోయారు. కత్తులు కట్టి కోళ్లను బరిలోకి దించారు. రూ.లక్షల్లో పందేలు కాస్తున్న పందెంరాయుళ్లకు అవసరమైన సకల ఏర్పాట్లను నిర్వహకులు అందుబాటులో ఉంచారు. ఏకంగా తమ పార్టీ ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తూ బరుల వద్ద ఫ్లెక్సీలను సైతం ఏర్పాటుచేశారు. అంతే కాకుండా గ్యాంబ్లిగ్, పేకాట కూడా యథేచ్ఛగా సాగింది. ప్రేక్షక పాత్రలో పోలీసులు కోడిపందేల నిర్వహణ సమాచారం ఆయా ప్రాంతాల డివిజన్‌స్థాయి అధికారి నుంచి మండల స్థాయి అధికారి వరకు తెలిసినా, పందేలను అడ్డుకోవాలని ఎస్పీ నుంచి ఆదేశాలు అందినా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల మద్దతు ఉండటంతో కోడిపందేలకు పోలీసులే పరోక్ష సహకారం అందించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ జిల్లా రూరల్, అర్బన్ ఎస్పీలు చేస్తున్న ప్రకటనలను పట్టించుకోకుండా పెద్ద ఎత్తును కోడి పందేలు నిర్వహించారు. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా రేపల్లె, తెనాలి నియోజకవర్గాల్లో కోడిపందేలు జరగకుండా అడ్డుకోలేరనే విషయం తేటతెల్లమైంది. కోడి పందేలకు అనుబంధంగా పేకాట(కోతముక్క), డబ్బా, చక్రం ఆటలతో పాటు మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. బహిరంగంగానే కోడి పుంజులకు కత్తులుకట్టి ఒక్కొక్క కోడి జతపై లక్షల రూపాయల పందాలు కాస్తూ జూదరులు విజృంభించిన తీరు చట్టానికి తూట్లు పొడిచాయి. సుప్రీం ఆదేశాలు బేఖాతరు గతంలో మాదిరిగానే సుప్రీం కోర్టు ఆదేశాలు, పోలీసు ఉన్నతాధికారుల హెచ్చరికలను కోడిపందేల నిర్వహకులను కట్టడి చేయలేకపోతున్నాయి. ఇదంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుండటంతో అక్కడి పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు సైతం కిక్కురు మనడం లేదు. రూ.లక్షల్లో ఖర్చు చేసి ఏర్పాటు చేసిన కోడిపందేల బరి వద్ద కోత ముక్క, గ్యాంబ్లింగ్ వంటి జూద క్రీడలు నిర్వహించుకునేందుకు కూడా కోడిపందేల నిర్వాహకులు లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా అక్కడి పోలీసు అధికారులు తమకేమీ పట్టనట్లు ఉండిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బంధువు దగ్గరుండి మరీ కోడిపందేలు జరిపిం చారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాప్రతినిధులకు చట్టాలు, న్యాయస్థానాలంటే లెక్కలేకుండాపోతోంది. అనేక సందర్భాల్లో కోర్టు ఆదేశాలను సైతం దిక్కరిస్తూ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. కోడిపందేలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కోడిపందేలు నిర్వహించారంటే వీరు ఏ స్థాయిలో బరి తెగించారో అర్ధం చేసుకోవచ్చు. కోడిపందాలను అడ్డుకున్నఅర్బన్ పోలీసులు గుంటూరు అర్బన్ జిల్లాలో కోడిపందేలు జరగకుండా ఎస్పీ సీహెచ్ విజయారావు కొంత వరకు అడ్డుకోగలిగారు. పదిహేను రోజులుగా కోడిపందేల నిర్వాహకులపై నిఘా ఉంచి వారి వద్ద ఉన్న కత్తులు, పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. బరుల తొలగింపు రేపల్లె(నగరం): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపల్లె మండలం గుడ్డికాయలంక గ్రామంలో కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాటుచేసిన బరిని పోలీసులు ఆదివారం తొలగించారు. బరికి సిద్ధం చేసిన ప్రాంతంలో సిమెంట్ స్తంభాలను తొలగించారు. రేపల్లె పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ పెంచలరెడ్డి హెచ్చరించారు. -
భీమవరం వేడుకల్లో తలసాని, మాధవరం కృష్ణారావు
సాక్షి,సిటీబ్యూరో: పట్నం బోసిపోయింది. నిత్యం అత్యంత రద్దీగా కనిపించే దారులన్నీ ఆదివారం వెలవెలబోయాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్ వారితో పాటు తెలంగాణ జిల్లాల పల్లెలకు సంక్రాంతి ప్రయాణాలు భారీగానే సాగాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొనడం ఓ కారణమైతే... ఆంధ్రాకు మాత్రం పండగ సెంటిమెంట్ నగరవాసులను క్యూ కట్టించింది. ఇదిలా ఉంటే ఇటీవల ఎన్నికలు, విజయోత్సవ సభలతో ఫుల్ బిజీగా గడిపిన నగర ఎమ్మెల్యేలు ఈసారి తమ నియోకజవర్గంలో స్థిరపడ్డ ఏపీ మిత్రులతో కలిసి సంక్రాంతి సంబరాలకు వెళ్తున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భీమవరంలో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. వీరితో పాటు నగరంలో పలువురు కార్పొరేటర్లు సైతం ఆంధ్రాబాట పట్టారు. ఇదిలావుంటే నగరం నుంచి భారీ ఎత్తున పందెం రాయుళ్లు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పయనమయ్యారు. గతంలో మాదిరిగా ఈ ఏడు కూడా నగరంలోని బార్కాస్ నుంచి ఆంధ్రా జిల్లాలకు పందెం కోళ్లు భారీ ఎత్తున ఎగుమతి అయ్యాయి. బార్కాస్‌లో పందెం కోసమే పెంచడంతో పాటు వాటికి ప్రత్యేక తర్ఫీదునిచ్చిన శిక్షకులు సైతం వారి వెంట వెళ్తున్నారు. తలసాని పర్యటన ఇలా... సనత్‌నగర్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్‌లో జరిగే సంక్రాంతి సంబరాలకు హాజరు కానున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం 7గంటలకు నగరం నుంచి రోడ్డు మార్గంలో ఆయన ఏపీకి బయలుదేరుతారు. 10గంటలకు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా ఇంద్రకీలాద్రి వరకు వెళ్తారు. 10:30 గంటలకు కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. అమ్మవారి దర్శనం అనంతరం విజయవాడ నుంచి భీమవరం చేరుకుంటారు. అక్కడి ప్రసిద్ధ మావురాలమ్మను దర్శించుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. భీమవరంలో 15న జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. అక్కడి అభిమానులు ఆయనకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం. -
ఆడం'బరి'మే!
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు/భీమవరం: సంక్రాంతికి రెండు రోజులే ఉండటంతో జూదరులు, నిర్వాహకులు జోరు పెంచారు. పోలీసుల హెచ్చరికలనూ బేఖాతరు చేస్తున్నారు. కోడిపందేలకు భారీగా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రజలంతా పండగ నిమిత్తం తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోకోడిపందేలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో నిర్వాహకులు బరులు సిద్ధం చేస్తున్నారు. కొన్నిచోట్ల కోడిపందేల బరులను పోలీసులు ధ్వంసం చేస్తుండటంతో కబడ్డీ, ఇతర క్రీడాపోటీలు నిర్వహిస్తామని చెబుతూ.. బరులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆరంభం ఇప్పటికే జిల్లాలో అక్కడక్కడ కోడిపందేలు మొదలైపోయాయి. పోలీసుల కళ్లుగప్పి నిర్వాహకులు రూ.లక్షల్లో పందేలు వేస్తున్నారు. బెట్టింగ్తో కూడిన కోడిపందేలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని, కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నా.. బేఖాతరు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున బైండోవర్ కేసులను నమోదు చేశారు. భీమవరం సమీపంలో భారీగా.. కోడిపందేలకు ప్రసిద్ధి చెందిన భీమవరం నియోజకవర్గంలో భారీగా కోడిపందేల బరులు సిద్ధమవుతున్నాయి. భీమవరం, వీరవాసరం మండలాల్లోని కొణితివాడు, నవుడూరు, వడ్డిగూడెం, పెదగరువు, యనమదుర్రు, తుందుర్రు, గొల్లవానితిప్ప తదితర గ్రామాల్లో పందేలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొణితివాడ గ్రామంలో సిద్ధం చేసిన పందేల బరిని పోలీసులు ట్రాక్టర్‌తో ధ్వంసం చేయించారు. చుట్టూ వేసిన ఫెన్సింగ్ రాళ్లను పీకి వేశారు. కబడ్డీ పోటీల పేరుతో కొన్నిచోట్ల ప్రచారం చేయడంతో అధికారయంత్రాంగం ఆ ప్రాంతాల్లోకి వెళ్లలేకపోతోంది. అయితే గతంలో పందేలు జరిగిన గ్రామాల్లో పోలీసులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. పందేలు, జూదాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవంటూ గ్రామసభల ద్వారా ప్రచారం చేస్తున్నారు. రెండేళ్ల నుంచీ నరసాపురంలోనూ.. నరసాపురంలో గతంలో కోడిపందేలు పెద్దగా జరిగేవి కాదు. రెండేళ్ల నుంచి తెలుగుదేశం నాయకులు ఆ ప్రాంతానికీ పందేలు అలవాటు చేశారు. ఈ ఏడాది మరింత భారీగా నిర్వహించాలని యత్నాలు చేస్తున్నారు. ఒక్కో ప్రాంతాన్ని టీడీపీ నాయకులు పంచుకుని బరులు సిద్ధం చేస్తున్నారు. నరసాపురం ఎంపీపీ వాతాడి కనకరాజు, మరికొంత మంది టీడీపీ నాయకులు సీతారామపురం స్వర్ణాం«ధ్ర కళాశాల వద్ద బరి సిద్ధం చేస్తున్నారు. లక్ష్మణేశ్వరంతోపాటు నరసాపురం పట్టణంలోని పీచుపాలెంలో పెద్ద బరులు సిద్ధం చేస్తున్నారు. వేములదీవి, సారవ గ్రామాల్లోనూ పందేలకు సిద్ధమవుతున్నారు. మొగల్తూరు మండలం మొగల్తూరు, కేపీపాలెం రామన్నపాలెం గ్రామాల్లో బరులు సిద్ధం చేస్తున్నారు. ఈ బరుల వద్ద పోలీసులు హెచ్చరికల బోర్డులు పెడుతున్నారు. ఎవరి పని వారిది అన్నట్టుగా ఉంది ఇక్కడి వ్యవహారం. పాలకొల్లులో టీడీపీ నేతల కనుసన్నల్లో..! పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ నేతల కనుసన్నల్లోనే పందేలకు సన్నాహాలు జరుగుతున్నాయి. పాలకొల్లు పట్టణంలోని పూలపల్లి బైపాస్ రోడ్డులో, అలాగే వడ్లవానిపాలెం, వేడంగి, పూలపల్లి, యలమంచిలి మండలంలో కొంతేరు, చించినాడ, పోడూరు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడి పందేలు, గుండాటలకు టీడీపీ నాయకులు తెరలేపారు. ఇందుకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కోడిపందేల నిర్వహణకు బరులు సిద్ధం చేస్తున్నారు. వాలమర్రులో సిద్ధం చేస్తున్న బరిని పోలీసులు ధ్వంసం చేశారు. భగ్గేశ్వరం, పూలపల్లి ప్రాంతాల్లో వేసే బరులను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. చింతలపూడిలో బేఖాతర్ చింతలపూడి నియోజకవర్గంలో జూదరులు పోలీ సుల హెచ్చరికలను బేఖాతర్ చేస్తున్నారు. చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాల్లోని పలు గ్రామాల్లో పందేలు నిర్వహించేందుకు బరులు సిద్ధం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో సిద్ధం చేసిన బరులను పోలీసులు ధ్వంసం చేశారు. ఇప్పటివరకు జంగారెడ్డిగూడెం పోలీసు సబ్ డివిజన్లో 154 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఇంకా చాలాచోట్ల ఉండి నియోజకవర్గం ఐ.భీమవరంలో ఏటా భారీగా పందేలు జరుగుతాయి. ఈ ఏడాది కూడా ఇక్కడ బరిని సిద్ధం చేస్తున్నారు. తణుకు నియోజకవర్గంలో దువ్వ, తేతలి, అత్తిలి ప్రాంతాల్లో ఇప్పటికే బరులు సిద్ధం చేశారు. కొన్నిచోట్ల పోలీసులు అడ్డుకుంటున్నారు. స్నేహపూర్వక పందేలు ప్రారంభం వీరవాసరం మండలం నందమూరుగరువు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి–మావూరు కార్యక్రమం సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు కోడి పందేలను స్నేహపూర్వకంగా పుంజులను వదిలి ప్రారంభించారు. దీంతో జూదరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పండగకు పందేలు తప్పకుండా ఉంటాయనే భరోసా కలిగింది. ప్రభుత్వం సానుకూలంగా చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని, ఈ నాలుగు రోజులూ పందేల వైపు అధికారులు కన్నెత్తి చూడరనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
పందెం.. కన్నీటి సంద్రం
పండగ సమయాన రెండు కుంటుంబాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. సరదాగా కోడి పందేలు చూద్దామని వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యుఒడికి చేరిపోయారు. కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు చేసిన దాడి రెండు కుంటుంబాలను కన్నీటి సంద్రంలోకి నెట్టింది. పోలీసులు రావడాన్ని గమనించిన పందెం రాయుళ్లు, వీక్షకులు అక్కడి నుంచి పరుగులు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇద్దరు వ్యక్తులు మాత్రం నేల బావి రూపంలో కాపుకాసిన మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు. మృతుల్లో మరో రెండు నెలల్లో పెళ్లి నిశ్చియమైన యువకుడు.. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబానికి ఆధారమైన మరో వ్యక్తి ఉన్నారు. దీంతో ఆయా కుంటుంబాలు శోకంలో మునిగిపోయాయి. సాక్షి, అమరావతిబ్యూరో/ చిత్తపూరు(చాట్రాయి) : కోడి పందేల శిబిరంపై పోలీసులు నిర్వహించిన దాడిలో పెను విషాదానికి దారి తీసింది. ఘటనలో పందెం రాయుళ్లు పారిపోగా.. పోటీలను చూసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు నేలబావిలో పడి మృత్యువాత పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామ శివారుల్లో గొల్లగూడెంకు చెందిన గంగుల సాంబయ్య ఇంటివెనుక ఉన్న స్థలంలో గ్రామంలోని యువకులు వాలీబాల్ ఆడుకుంటూ ఉంటారు. అదే ఆటస్థలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గత పదిరోజులుగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో అర్ధరాత్రి సమయంలో దాదాపు 40 మంది వరకు కోడిపందేలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం చాట్రాయి పోలీసులకు తెలియడంతో ఎస్ఐ షబ్బీర్‌అహ్మద్, తన సిబ్బందితో కలిసి గురువారం రాత్రి 12 గంటల ప్రాంతంలో దాడిచేశారు. పోలీసులు వస్తున్నారన్న విషయం తెలియడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా తలోదిక్కుకు పరుగులు పెట్టారు. వారితోపాటు పోటీలను వీక్షించేందుకు వచ్చిన చిత్తపూరు శివారు వీరయ్య నగర్‌కి చెందిన చిట్టూరి శ్రీనివాసరావు (21), విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామానికి చెందిన కుక్కల చెన్నకేశవరావు (26)లు కూడా పారిపోతూ అక్కడికి సమీపంలోనే ఉన్న నేలబావిలో పడిపోయి నీళ్లల్లో మునిగిపోయారు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే వారు మృతి చెందారు. శుక్రవారం ఉదయం విసన్నపేట అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. కొత్తబట్టలు తెచ్చుకున్న కొన్ని గంటల్లోనే.. మృతుడు శ్రీనివాసరావు చిత్తపూరు శివారు వీరయ్యనగర్‌లో నివసిస్తున్నాడు. ఇతను అవివాహితుడు. పదేళ్ల కిందటే శ్రీనివాస్ తండ్రి మృతిచెందడంతో.. తల్లి రమాదేవి, అన్న అనిల్‌తో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాత్రే కొత్త బట్టలు కొనుగోలు చేసుకుని ఇంటికి తీసుకొచ్చారు. గ్రామంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలియడంతో పందేలు చూడడానికి వెళ్లాడు. ఇంతలో పోలీసులు రావడం.. భయంతో పరుగెత్తి నేలబావిలో పడి మృతి చెందడం క్షణాల్లో జరిగిపోయాయి. చేతికొచ్చిన కుమారుడికి రెండు నెలల్లో పెళ్లి చేద్దామని అనుకుంటున్న సమయంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆధారం కోల్పోయారు.. ఇదే సంఘటనలో విస్సన్నపేట మండలం కొండపర్వలో నివసిస్తున్న కుక్కల చెన్నకేశవరావు మృతి చెందారు. దీంతో కొండపర్వలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి చెందిన చెన్నకేశవరావుకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కూలిపనులకు వెళ్లి వచ్చిన కూలి డబ్బులతో భార్య, పిల్లలను పోషించుకుంటున్నాడు. ఆనందంగా ఉన్న ఈ కుటుంబంలో పెద్ద దిక్కు మృత్యువాత పడటం ఆ కుటుంబానికి తీరని నష్టం వాటిల్లింది. నాన్నా కావాలి.. అంటూ ఇద్దరు చిన్నారులు ఏడుస్తుండటం.. ఆ చిన్న పిల్లలను ఏవిధంగా పోషించుకోవాలి అంటూ మృతుడి భార్య విలపిస్తుండడంతో స్థానికులను కంటతడి పెట్టించింది. పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు కోడి పందేలపై కఠినంగా వ్యహరిస్తామంటూ ఏటా తీవ్ర హెచ్చరికలు జారీ చేసే పోలీసులు వాటిని ముందస్తుగా కట్టడి చేయడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. జిల్లావ్యాప్తంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇప్పటికే అన్ని గ్రామాల్లోనూ టీడీపీ నేతల అండదండలతో నిర్వాహకులు బరులు ఏర్పాట్లు చేసేశారు. అయినా పోలీసులు ఎక్కడా ఎవరిని అడ్డుకున్న దాఖలాలు లేకపోగా.. ఇప్పుడు హడావుడిగా అర్ధరాత్రి వేళల్లో దాడులకు ఉపక్రమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘పుంజు’కున్నాయి..
తూర్పుగోదావరి, రంగంపేట (అనపర్తి): పండగ హడావుడి మొదలైంది. పందెపు కోళ్లు బరిలోకి దిగాయి. రంగంపేట మండలంలో కోళ్లు.. కోట్లు కొల్లగొట్టే పనిలో పడ్డాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఫైటింగ్‌కు సిద్ధమయ్యాయి. కోడిపందేలు, జూదాలపై ఉక్కుపాదం మోపుతామంటూ ఓ పక్క పోలీసులు ప్రకటిస్తుండగా.. ఆ హెచ్చరికలను సైతం పక్కన పెట్టి పందెగాళ్లు పందేలు జోరుగా నిర్వహిస్తున్నారు. అదీ కూడా పోలీస్ స్టేషన్‌కు కేవలం అరకిలోమీటరు దూరంలో జరగడం విశేషం. కాలు దువ్వుతున్న పందెంకోళ్లు అంటూ గత నెల 26న ‘సాక్షి’ ఇచ్చిన కథనం నేడు నిజమైంది. మండల పరిధిలోని కోటపాడు, రంగంపేట పోలీస్ స్టేషన్ల మధ్య ఏడీబీ రోడ్డు నుంచి వెంకటాపురం వెళ్లే మార్గంలో ఉన్న ఆయిల్ ఫామ్ తోటలో బుధవారం అర్ధరాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గుట్టు చప్పుడు కాకుండా భారీ ఎత్తున కోడి పందేలు ప్రారంభించారు. ఈ పందేల్లో ఉభయ గోదావరి జిల్లాల్లోని పందెగాళ్లు పాల్గొన్నట్టు తెలిసింది. పందేలు జోరుగా సాగుతున్న తరుణంలో బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పెద్దాపురం సీఐ యువకుమార్ ఆధ్వర్యంలో పెద్దాపురం, రంగంపేట, సామర్లకోట ఎస్సైలతో దాడులు జరపగా పలువురు పందెగాళ్లు చీకట్లో ఎటువెళుతున్నామో తెలియక పొలాల్లోకి పారిపోయి తెల్లారిన తరువాత చుట్టు పక్కల పరిసర ప్రాంతాల్లో ఉంచిన తమ వాహనాల వద్దకు చేరుకుని మెల్లగా జారుకున్నారు. చీకట్లో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భీమవరానికి చెందిన ఒక వృద్ధుడి కాలికి గాయమైనట్టు చెబుతున్నారు. ఈ పందేల కోసం సుమారు 50 కార్లలో ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ కార్లను సమీపంలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్లు చేయించుకున్నారు. పందేల నిర్వహణ వాస్తవమే.. కోడి పందేలపై నిర్వహణపై పెద్దాపురం సీఐ యువకుమార్ మాట్లాడారు. రాత్రి సమయంలో పందేలు జరగడం వాస్తవమేనని, తమకున్న సమాచారంతో దాడి చేశామని, ఈ దాడుల్లో చాలా మంది పారిపోగా ఆరుగురిని అరెస్టు చేశామని చెప్పారు. వారి నుంచి రూ.13,120 నగదు స్వాధీనం చేసుకున్నామని, రెండు కోళ్లు, తొమ్మిది కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. భారీగా కోడి పందేల నిర్వహణ వెనుక అధికార పార్టీ వ్యక్తుల ప్రమేయం ఉందని ఈ ప్రాంతం ప్రజలు అంటున్నారు. -
సైసై.. నైనై
జంగారెడ్డిగూడెం: ఒక పక్క కోడిపందేలు, పేకాటకు పోలీసులు ‘నై’ అంటున్నా.. పందెగాళ్లు మాత్రం ‘సై’ అంటూ ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు. ఏటా సంక్రాంతి సీజన్లో పండ గకు ముందు కోడిపందేలు, జూదాలపై పోలీసులు దాడులు నిర్వహించడం, పండగకు నిర్వహిస్తే ఉక్కుపాదం మోపుతామని ప్రకటించడం, ఆ తర్వాత చూసీచూడనట్టు వదిలేయడం తెలిసిందే. ఇటీవల జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ కోడిపందేలు, జూదాల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించడం, జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో రెవె న్యూ, పోలీసు యంత్రాంగం ఈ విషయంలో సీరియస్‌గానే ఉన్నారు. ఎవరి ఏర్పాట్లలో వారు.. పండగ మూడు రోజులు కోడిపందేలు నిర్వహిం చేందుకు పందెంగాళ్లు సమాయత్తమయ్యారు. ఎలాగైనా జరిగి తీరుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారి ఏర్పాట్లలో వారు నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఏజెన్సీ, మెట్ట ప్రాం తాల్లో జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపు రం, బైపాస్ రోడ్డు జంక్షన్, సుబ్బంపేటలో ఏటా భారీ ఎత్తున కోడిపందేలు జరుగుతున్నాయి. కామవరపుకోట మండలం వెంకటాపురం, కళ్లచెరువుల్లో పెద్దస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ఖమ్మం జిల్లాలు, కర్ణాటక నుంచి పందెగాళ్లు ఇక్కడకు వస్తుం టారు. గతంలో ఈ ప్రాంతంలో జరిగిన కోడిపందేల్లో తెలంగాణకు చెందిన ఒకరు రివాల్వర్‌ను మూడు రౌండ్లు గాల్లోకి పేల్చి పందేలను ప్రారంభించడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. భారీ పందేలకు ఒక బరి, మధ్యతరహా పందేలకు ఒక బరి, చిన్నపాటి పందేలకు మరో బరి అన్నట్టుగా ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఈసారి ఏర్పాట్లు ఎలా ఉంటాయో అని పందెగాళ్లు ఆసక్తిగా చూస్తున్నారు. ఏటా పోలీసులు కోడిపందేలు, జూదాలు జరగనీయమని ప్రకటించడం, ఉక్కుపాదం మోపుతామని చెప్పడం ఆనక పండగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలేయడం షరా మామూలే కాబట్టి ఈ ఏడాది కూడా ఆ మూడురోజులు కోడిపందేలు జరుగుతాయని జనం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో మోస్తరుగా.. పశ్చిమ ఏజెన్సీ మండలాల్లో చాలా చోట్ల మోస్తరుగా కోడిపందేలు నిర్వహిస్తారు. బుట్టాయగూడెం మండలంలో యర్రాయగూడెం, వెలుతురువారిగూడెం, మర్రిగూడెం, దొరమామిడి, దుద్దుకూరు, అచ్చియపాలెం, కొవ్వాడలో, టి.నరసాపురంలో, జీలుగుమిల్లి మండలంలో కామయ్యపాలెం, ములగలంపల్లి, పాలచర్ల తదితర గ్రామాల్లో, గోపాలపురం మండలం వెంకటాయపాలెం, గుడ్డిగూడెం, హుకుంపేటలో కోడిపందేలు జరుగుతాయి. కొయ్యలగూడెం మండలం రాజవరం, కన్నాపురం, రామానుజపురం తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తారు. చింతలపూడి మండలం వెంకటాపురంలో పెద్దెత్తున కోడిపందేలు జరుగుతాయి. సీతానగరం, చింతంపల్లి, తిమ్మిరెడ్డిపల్లి, రేచర్లలో పందేలు జరుగుతాయి. లింగపాలెం మండలం కొణిజర్ల, ములగలంపాడులో భారీ కోడిపందేలు జరుగుతాయి. ఇక జంగారెడ్డిగూడెం మండలంలో లక్కవరం, పేరంపేట, తాడువాయి, పంగిడిగూడెం, గుర్వాయిగూడెం, తిరుమలాపురం, కేతవరం, స్థానిక సుబ్బంపేటలలో ఒక మాదిరి కోడిపందేలు జరుగుతాయి. కోడిపందేలు నిర్వహించే ప్రతి చోటా నిర్వాహకులు ఏర్పాట్లకు సమాయాత్తమవుతుంటే, పోలీసులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. ఈసారి ఉత్కంఠ గతేడాది జరిగిన కోడిపందేలు, జూదాల విషయంలో ఇప్పటికే పోలీసు, రెవెన్యూ అధికారులు నోటీసులు అందుకోవడంతో ఇప్పుడు కోడిపందేలపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే ఆయా పోలీసు స్టేషన్ పరిధిలోని కోడిపందేలు నిర్వహించే గ్రా మాల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు అవగాహన సదస్సులు, హెచ్చరికలు జారీ చేస్తున్నా పం దెంగాళ్లు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మరి కొందరు రహస్య ప్రాంతాలకు వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా కోడిపందేల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంత కోడిపందేల నిర్వాహకులు తెలంగాణ, పొరుగుజిల్లాల పందెగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకుని కోడిపందేలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. -
పందెంకోడి.. రిలీజ్‌కు రె‘ఢీ’
పశ్చిమగోదావరి తణుకు టౌన్: సంక్రాంతికి మరో నెల రోజుల సమయముంది. ఇంకా పండుగ నెల మొదలు కాకుండానే జిల్లాలో అప్పుడే కోడి పందాలు, కోతాట, గుండాటలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గతేడాది కోడిపందాల నిర్వహణపై కోర్టు ఆదేశాలున్న నేపథ్యంలో పోలీసు కేసులు నమోదైనా పందెం రాయుళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో తమకు ఎవరూ అడ్డు చెప్పరనే ధీమాతో రెట్టింపు ఉత్సాహంతో పందెంరాయుళ్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో పందెం కోళ్ల పెంప కం ఎక్కడక్కడో జరిగేవి. ఇప్పుడు బరుల వద్దే పెంచు తూ ఏ క్షణమైనా పందాల నిర్వహణకు సిద్ధమంటున్నారు. ఈ సారి పందాలు జోరుగా సాగుతాయనే అభిప్రాయంతో పందెం రాయుళ్లు ఉన్నారు. తణుకు నియోజకవర్గాన్నే తీసుకుంటే గతేడాది ఇరగవరం మండలంలో 8 బరులు, అత్తిలి మండలంలో 6 బరులు, తణుకు పట్టణం, రూరల్ మండలంలో 20 బరుల్లో పందాలు జరిగినట్లు పోలీసు నివేదికలో పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఆ సంఖ్య పెరిగే అవకాశముందని నాయకులు చెబుతున్నారు. పందెం కోళ్లకు ముందస్తు శిక్షణ పందెం కోళ్లకు సుమారు సంవత్సరం కాలంగా ఖరీదైన ఆహారంతో పాటు ఈత, ఇతర వ్యాయామాలు నేర్పిస్తున్నారు. కోళ్లు పెంచే చోట చిన్న చిన బరులు ఏర్పాటు చేసి పందెంలో శిక్షణ ఇస్తున్నారు. గతంలో కోడి పుంజుల్ని ఇళ్ల వద్ద, చేల గట్ల వద్ద, తోటల్లో పెంచే వారు. ఇప్పుడు బరులు జరిగే ప్రాంతంలోనే పుంజుల పెంపకం మొదలైంది. గిరాకీని బట్టి ప్రత్యేక ఫారాలు ఏర్పాటు చేసి మూడు నెలల నుంచి కోళ్లను అక్కడ మేపుతున్నారు. రాగులు, జొన్నలు, ఇతర ధాన్యాలతో పాటు జీడిపప్పు, బాదంపప్పు, మటన్ కీమా పెట్టి పందాలకు సిద్ధం చేస్తున్నారు. గత సంవత్సరం గెలుపొందిన, గాయపడ్డ పుంజుల్ని ఈ సంవత్సరం బరిలోకి దించేందుకు ప్రత్యేక ఆహారం పెడుతున్నారు. బరి నిర్వాహకులకు రూ. లక్ష నుంచి రూ. 10 లక్షల ఆదాయం కోడి పందాల వద్ద గుండాట, పేకాట వంటివి ఏర్పాటు చేసుకునే పనిలో బరుల నిర్వాహకులు ఉన్నారు. దీని కోసం అనుభవమున్న వారిని ఇప్పటికే బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం కోడి పందాలతోనే మూడు రోజులు బరుల నిర్వహణ గిట్టుబాటు కాదని, గుండాట, కోతాట వంటి వాటి ద్వారా ఆదాయం పొందవచ్చనే ఆలోచనతో నిర్వాహకులున్నారు. గతంలో ఒక్కో బరి నిర్వాహకుడు రూ. 1 లక్ష నుంచి 10 లక్షల వరకూ ఆర్జించినట్లు పేర్కొంటున్నారు. సంప్రదాయం పేరుతో నిర్వహించే ఈ కోడి పందాలకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. వీటిని చూసేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు రావడంతో ఏమీ చేయలేపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. పోటీల ముసుగులో కొందరు పోలీసులకు సొమ్ము ముడుతుండడంతో సంక్రాంతి పూర్తయ్యే వరకూ తమను బదిలీ చేయవద్దని ఉన్నతాధికారులకు విన్నవించుకున్నట్లు వినికిడి. -
కోడి గుడ్డు రూ.వెయ్యి.. కోడి పిల్లల జత 10 వేలు
పందేనికి ఓ పుంజు కావాలి.. అయితే చలో కంభం! కంభంలో కోళ్లు అంత బాగుంటాయా? ఒకసారి చూస్తే కదా తెలిసేది!! అవును కంభంలో కోళ్లు ఫేమస్సే!! కోళ్లే కాదు.. పావురాలు, జాతి శునకాలు కూడా. ఇక్కడ లభించే కోడి గుడ్లు, కోడి పిల్లల కోసం ఇతర రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి క్యూ కడుతున్నారు మరి. ఇంతకీ కంభంలో కోళ్లు పెంచుతోంది ఎవరు? గుడ్డు రేటెంత? పిల్లలైతే ఎంత ధర? ఆ వివరాలు తెలుసుకుందాం కథనంలోకి పదండి.. ప్రకాశం, కంభం: కంభం పట్టణానికి చెందిన చిలకచర్ల కృష్ణామాచారి ఐటీఐ చదివి ఇంటి వద్ద ఖాళీగా ఉండేవాడు. 1989లో ఇంట్లో సరదాగా రెండు కోళ్లను పెంచుకునేవాడు. అది కాస్తా అతనికి వ్యాపకంగా మారి.. చిరు వ్యాపారంగా రూపాంతరం చెందింది. అదే వృత్తిగా మలుచుకున్న కృష్ణమాచారి 1994లో తన ఇంటి వద్ద షెడ్లు వేసి కోళ్లను పెంచడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఎన్నో రకాల కోళ్లను పెంచడమే కాకుండా, పలు రాష్ట్రాల్లో నిర్వహించే కోళ్ల అందాల పోటీల్లో పాల్గొంటూ బహుమతులు, పతకాలు సాధించి కంభం పేరును దేశ వ్యాప్తంగా తెలిసేలా చేశారు. కోళ్ల కోసం ప్రత్యేక దాణా.. పెట్టలకు సజ్జలు, మొక్కజొన్న, రాగులు, సోయా చిక్కుడు, శనగలు, పొద్దుతిరుగుడు, తవుడు, నూక మిశ్రమాలను ఆహారంగా అందిస్తారు. పుంజులకు ఉదయం బాదం పప్పు, ద్రాక్ష, ఖర్జూరాలు, శనగపప్పు, సాయంత్ర 5–6 గంటల సమయంలో సజ్జలు, రాగులు 4 గంటలు నానబెట్టి పెడతారు. వెటర్నరీ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ కోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కోళ్లకు ఆహారం తినిపిస్తూ.. గుడ్డు రూ.1,000 ఒక పెట్ట ఏడాదికి నాలుగుసార్లు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లను ఆ కోడి ద్వారానే పొదిగించి పిల్లలను విక్రయిస్తారు. పుంజులు 4 నుంచి 6.5 కిలోల బరువు, పెట్టలు 3 నుంచి 5 కేజీల బరువు పెరుగుతాయి. గుడ్డు ఒకటి రూ.1,000 కాగా, 40 రోజుల పిల్లల జత రూ.10 వేలు పలుకుతోంది. దుబాయ్, శ్రీలంకతోపాటు, మన దేశంలో ఒడిశా, తమిళనాడు నుంచి కొనుగోలుదారులు కంభం వచ్చి కోళ్లను కొనుగోలు చేస్తుంటారని కృష్ణమాచారి తెలిపారు. ఏటా పెరుగుతున్న ఆదాయం తొలుత నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఆదాయం వచ్చేది. 2000 సంవత్సరంలో రూ.7 వేల వరకు వచ్చాయి. ఆ తర్వాత అందాల పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టినప్పటి నుంచి కోళ్లు, గుడ్ల విక్రయం, అందాల పోటీల్లో నగదు బహుమతులు అన్నీ కలిపి 2015 నుంచి ఏడాదికి రూ.3 లక్షలు ఆదాయం వచ్చింది. 2017 నుంచి ఏడాదికి రూ.5 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు. అరుదైన ఆశీల్.. భారతదేశంలోనే అరుదైన ఆశీల్ జాతి కోళ్లను కృష్ణమాచారి పెంచుతున్నారు. అందమైన చిలుకలాంటి ముక్కు, నెమలి లాంటి తోకలు, గద్దను తలపించే దేహాదారుఢ్యం.. చూడ చక్కని ఆకృతి అస్లీ జాతి కోళ్ల ప్రత్యేకత. ప్రస్తుతం చారి వద్ద 20 పెట్టలు, 3 పుంజులు ఉన్నాయి. ఇవి నూరు శాతం నాణ్యమైనవి. వీటి జీవిత కాలం గతంలో తొమ్మిదేళ్లు కాగా ప్రస్తుతం 6 నుంచి 7 సంవత్సరాలు బతుకుతున్నాయి. వీటికి ఎటువంటి జబ్బులు సోకవు. భారతదేశంలోనే అత్యంత అరుదుగా దొరికే ఆశీల్ జాతి కోళ్లను అందాల పోటీల కోసం, ఇంట్లో సరదాగా పెంచుకోవడం కోసం కొనుగోలు చేస్తారు. పావురాలు, కుక్కలు కూడా.. కృష్ణమాచారి కోళ్లతోపాటు అమెరికన్ విత్ ఇంగ్లిష్ క్యారియర్, జర్మన్ బాటిన్, రోమన్, బడంగ్ రేసర్ వంటి అరుదైన జాతి పావురాలను పెంచుతున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు కర్నూలు, కడప, హైదరాబాద్, ఒంగోలు నుంచి వస్తుంటారు. వీటితోపాటు రెండు డాబర్‌మెన్ కుక్కలు కూడా చారి వద్ద ఉన్నాయి. ‘అరుదైన జాతులను అభివృద్ధి చేసి రాష్ట్ర, దేశ స్థాయిలో కంభం పట్టణానికి గుర్తింపు తీసుకురావలన్నదే నా ఆశయం. ప్రస్తుతానికి కోళ్ల కోసం దుబాయ్, శ్రీలంకతోపాటు ఇతర దేశాల వారు కూడా సంప్రదిస్తున్నార’ని కృష్ణమాచారి చెబుతున్నారు. అందాల పోటీల్లో కోళ్లు సాధించిన బహుమతులు, దిండిగల్‌లో జరిగిన అందాల పోటీల్లో8 గ్రాముల బంగారు చైన్ గెలుపొందిన పుంజు అందాల పోటీల్లో బహుమతుల పంట కృష్ణమాచారి తన కోళ్లను తీసుకుని పోటీలకు వెళ్లాడంటే బహుమతి సాధించే తిరిగొస్తారు.! 2015లో దిండిగల్‌లో నిర్వహించిన అందాల పోటీల్లో ఒక సారి ప్రథమ, మరోసారి తృతీయ బహుమతి సాధించారు. ఈ ఏడాది ఆలిండాయా ఆశీల్ క్లబ్, ఇండియా ఆశీల్ క్లబ్, ఓఏటీ క్లబ్‌ల ఆధ్వర్యంలో జనవరి 5, మార్చి 3, జూన్ 10వ తేదీన పోటీలు నిర్వహించగా మూడింటిలో బంగారు పతకాలు పొంది హ్యాట్రిక్ సాధించారు. వీటితోపాటు మండల, జిల్లా స్థాయి పోటీల్లో బహుమతులు అందుకున్నారు. -
పందెం కోడి.. చికెన్ పకోడి!
ఓ ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటుంది...సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి బుకీలతో పాటు సామగ్రిని స్వాధీనం చేసుకుంటారు... ఓ భవనంలో కొందరు పేకాట ఆడుతూ ఉంటారు...దాడి చేసి పట్టుకునే పోలీసులు పేకాటరాయుళ్లతో పాటు నగదు తదితరాలు సీజ్ చేస్తారు... ఓ ప్రదేశంలో కోడి పందేలు జరుగుతుంటాయి...అక్కడకు వెళ్లే పోలీసులు దొరికిన పందెంరాయుళ్లతో పాటు కోళ్లనూ స్వాధీనం చేసుకుంటారు... ఇవన్నీ తరచుగా వింటున్న వార్తలే. సాధారణంగా ఏ కేసులో అయినా పోలీసులు తాము అరెస్టు చేసిన నిందితుల్ని కోర్టులో హాజరు పరిచి, వారి నుంచి స్వాధీనం చేసుకున్న వాటినీ కోర్టుకు అప్పగిస్తారు. మరి కోడి పందేల కేసుల్లో స్వాధీనం చేసుకున్న కోళ్లను ఏం చేస్తారు? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదూ...ఏమీ లేదు...కోర్టు అనుమతి తీసుకుని ఎంచక్కా పందెం కోళ్లను చికెన్ షాపుల్లో అమ్మేస్తారట. ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని, జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించిన కోళ్ల వ్యవహారంలో ఇదే జరిగిందని, పోలీసులు మొత్తం 17 కోళ్లను రూ.10వేలకు అమ్మేశారని సమాచారం. సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొందరు పందెంరాయుళ్ళు గత జనవరి 7న కోడి పందేలకు దిగారు. ఏకంగా ఓ అపార్ట్మెంట్ టెర్రస్‌నే బరిగా మార్చుకున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఎం.వెంకటకృష్ణ...తన స్నేహితుడైన టి.వెంకటప్రసాద్‌తో కలిసి శ్రీకృష్ణానగర్‌లోని ఓ ఐదంతస్తుల భవనం టెర్రస్‌పై బరికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. కోడి పందేలు ఆడే ఆసక్తి ఉన్న వారిని ఇక్కడకు పిలిపించి పందేలు నిర్వహిస్తూ కమీషన్లు తీసుకుంటున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. ఈ ఇద్దరు నిర్వాహకులతో పాటు మొత్తం 29 మందిని అరెస్టు చేసి 17 పందెం కోళ్లు, వాటికి కట్టే కత్తులు 60, 26 సెల్ఫోన్లు, రూ.80,150 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కోళ్లను ‘రెహ్మత్‌నగర్’కు తరలించి... టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్ని ఆ మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచిన జూబ్లీహిల్స్ పోలీసులు 17 పందెం కోళ్లను రికవరీ చేసిన విషయాన్నీ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళారు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలనూ సమర్పించారు. ఆ కోళ్లను సేఫ్ కస్టడీలో ఉంచాల్సిందిగా పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో అప్పటి వరకు జూబ్లీహిల్స్ ఠాణాలో ఉన్న వీటిని కాస్త సువిశాల ఖాళీ ప్రదేశం ఉన్న రెహ్మత్‌నగర్ పోలీసు ఔట్‌పోస్టుకు తరలించారు. అక్కడే కొన్ని రోజుల పాటు తమ సంరక్షణలో ఈ కోళ్లు ఉండాల్సి రావడంతో పోలీసులు తాత్కాలిక భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ వాటికి తిండి గింజలు, నీళ్లు తదితరాలు అందిస్తూ జాగ్రత్తగా కాచుకున్నారు. కోర్టు అనుమతితో విక్రయించి... నిబంధనల ప్రకారం ఈ కోళ్లు సైతం న్యాయస్థానం సొత్తు (కోర్ట్ ప్రాపర్టీ) కావడంతో పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. ఆపై కోళ్లను విక్రయించడానికి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించడంతో జూబ్లీహిల్స్ ప్రాంతంలో రూ.10 వేలకు ఆ కోళ్లను ఓ చికెన్ షాపులో అమ్మేశారని, అతను ప్రత్యేక రేటుతో ఇతరులకు చికెన్‌గా అమ్మేశాడని సమాచారం. అలా అమ్ముతున్న సమయంలో ఆ పుంజుల్ని తిరిగి పందేలకు వినియోగించకుండా కొనుగోలుదారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఆ కోణంలో కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. ఈ విషయాలన్నింటికీ కోర్టుకు విన్నవించిన జూబ్లీహిల్స్ పోలీసులు వాటిని విక్రయించగా వచ్చిన మొత్తాన్ని న్యాయస్థానానికే జమ చేశారు. పందెం రాయుళ్ళను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించిన వెంటనే టాస్క్‌ఫోర్స్ బాధ్యత తీరిపోగా... ఈ విక్రయం జరిగిన తర్వాత మాత్రమే జూబ్లీహిల్స్ పోలీసులు ఊపిరి పీల్చుకోగలిగారు. జరగరానిది జరిగితే పెద్ద తంతే... ఈ పందెం కోళ్లు తమ ఆధీనంలో ఉన్నన్ని రోజులూ జూబ్లీహిల్స్ పోలీసులు కంటిమీద కునుకు లేకుండా గడిపారనే చెప్పవచ్చు. ఈ కేసులో అరెస్టు చేసిన నిందితుల్ని మరుసటి రోజు కోర్టులో హాజరుపరచడంతో పోలీసుల బాధ్యత తీరింది. అయితే పుంజుల్ని సంరక్షణ నిమిత్తం కోర్టు పోలీసులకు అప్పగించడంతో అమ్మకం పూర్తయ్యే వరకు ప్రతి రోజూ ‘దినదిన గండం’గా గడిపారు. ఈ మధ్య కాలంలో ఆ పుంజులకు ఏమైనా జరిగితే పోలీసులదే పూర్తి బాధ్యత అయ్యేది. అనివార్య కారణాలతో ఒక్క కోడిపుంజు చనిపోయినా... దానికి సంబంధించి కేసు నమోదు చేయడం, కళేబరానికి ప్రభుత్వ పశు వైద్యుడితో పోస్టుమార్టం చేయించడం, అధికారికంగా ఖననం/దహనం చేయించడం.. వంటి తంతులతో పాటు ఈ రికార్డుల్ని కోర్టులో దాఖలు చేయడం కచ్చితం. ఈ పరిణామాల నేపథ్యంలోనే పోలీసులు పందెం పుంజుల్ని కంటికిరెప్పలా కాపాడారు. -
పందెం కోడిదే పైచేయి!
పోలీసులు చేతులెత్తేశారు. కళ్లెదుటే కోడిపందాలు జరుగుతున్నా కళ్లు మూసేసుకున్నారు. అమాత్యులు, అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు బరి తెగించి బరులు నిర్వహించినా వారి జోలికెళ్లలేకపోయారు. చోద్యం చూశారే తప్ప కోడి పందాల వైపు అడుగేసే సాహసం చేయలేకపోయారు. అయితే ఎవరి అండా లేకుండా ఆడుతున్న చిన్నపాటి పందేలపై దాడులు చేసి తమ పరువు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారు. సంక్రాంతి సందర్భంగా వీధుల్లోను, పల్లెల్లోనూ సరదాగా పేకాడుకునే వారిని అరెస్టు చేసి, కేసులు నమోదు చేసి తమ ‘సత్తా’ చాటుకున్నారు. సాక్షి, విశాఖపట్నం: నగరంలోనూ, జిల్లాలోనూ గతంలోకంటే ఈ ఏడాది కోడిపందాలు ఊపందుకున్నాయి. కోడి పందాల నిర్వహణకు వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చినా తగ్గకపోగా పెరిగాయి. కత్తులు కట్టకుండా కోడిపందాలకు అనుమతించాలన్న విజ్ఞప్తిని కూడా న్యాయస్థానం అంగీకరించలేదు. అయినప్పటికీ కోడిపందాలు జోరుగా సాగాయి. చట్టసభల సభ్యులే వాటికి తిలోదకాలిచ్చారు. తొలుత జిల్లాలోని నర్సీపట్నంలో జిల్లా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కోడి పందాలకు పబ్లిగ్గా శ్రీకారం చుట్టారు. నగరంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తన నియోజకవర్గం ఆరిలోవ రామకృష్ణాపురంలో పందాలకు నడుంకట్టారు. సంక్రాంతికి కొద్దిరోజుల ముందు అక్కడ కోడిపందాలను ట్రయల్ రన్‌లా నిర్వహిస్తే ఆరిలోవ పోలీసులు ఎమ్మెల్యే వెలగపూడి అనుచరుడితో సహా మరికొందరిని అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని కూడా ప్రకటించారు. దీంతో పోలీ సులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా బాగా స్పం దించారని నగరవాసులు భావించారు. కానీ అదంతా తాత్కాలికమేనని తేలింది. భోగి నాటి నుంచి అదే ప్రదేశంలో వెలగపూడి అండ్ కో నిర్భీతిగా పందాలు ప్రారంభించారు. వీటిని వీక్షించడానికి ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కూడా వెళ్లడం విశేషం. ఆరిలోవలో జరుగుతున్న కోడిపందాలు రూ.కోట్ల లో పందాలు కాస్తున్నారు. అయినా పోలీసులు తూతూమంత్రంగా మరో ప్రాంతంలో ఆడుతున్న పందాల వద్దకు వెళ్లి పదిమందిని అరెస్టు చేశారు. మూడు పుంజులను, పదివేల నగదును స్వాధీనం చేసుకున్నారు. గుండాటలు వంటివి ఆడుతున్న మరో 28 మందిని అరెస్టు చేశారు. రూ.కోట్లలో బెట్టింగులు.. జిల్లావ్యాప్తంగా సంక్రాంతి పండగ పేరు చెప్పి నిర్వహించిన కోడిపందాల్లో కోట్ల రూపాయలు బెట్టింగులు కట్టారు. జిల్లావ్యాప్తంగా రూ.10 కోట్ల విలువైన పందాలు జరగ్గా ఒక్క ఆరిలోవలోనే రూ.10 కోట్లు జరిగినట్టు అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల కత్తికట్టి కోడి పందాలు ఆడించారు. ముఖ్యంగా పాయకరావుపేట, నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం, అరకు నియోజకవర్గాల్లో ఈ పందాలు సాగాయి. విశాఖ ఏజెన్సీలోనూ కోడిపందాలు నిర్వహించారు. గొలుగొండ మండలం కేడీపేట, పాయకరావుపేట మండలం పాల్మాన్పేట తీర ప్రాంతం, నక్కపల్లి మండలం వేంపాడు, కశింకోట మండలం వెంకుపాలెం, ఏఎస్‌పేట, కన్నూరుపాలెం, చోడవరం మండలం అడ్డూరు, బుచ్చయ్యపేట మండలం రాజాం, పెదపూడి తదితర ప్రాంతాల్లో కోడిపందాలు సాగాయి. విశాఖ రూరల్ పోలీసులు దాడులు చేస్తారన్న భయంతో కొంతమంది పందెంరాయుళ్లు పొరుగున ఉన్న ఒడిశా సరిహద్దులకు వెళ్లి కోడిపందాలు నిర్వహిస్తున్నారు. హుకుంపేట మండలానికి ఆనుకుని ఉన్న ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సోబాపుట్లో పందాలు జోరుగా సాగిస్తున్నారు. అక్కడ పోలీసులు దాడులు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ భారీగా బెట్టింగులు వేస్తున్నారు. అరెస్టులు.. కేసులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు 29 కోడి పందాల కేసులు నమోదు చేశారు. 145 మందిని అరెస్టు చేశారు. 77 కోడిపుంజులను, రూ. 1,48,637 లను స్వాధీనం చేసుకున్నారు. 16 గ్యాంబ్లింగ్ కేసులు నమోదు చేసి 77 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,39,018 లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నగరం మొత్తమ్మీద పోలీసులు ఆరిలోవలో రెండంటే రెండే కేసులను నమోదు చేసి కోడిపందాలాడుతున్న 10 మందిని, గుండాటలు వంటివి ఆడుతున్న మరో 28 మందిని ఆరె స్టు చేశారు. 3 కోడిపుంజులు, రూ.10 వేల నగదును మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. సబ్బ వ రం మండలం దేవీపురం, గుల్లేపల్లి తోటల్లో పం దేలు ఆడుతున్న పది మందిని అ రెస్టు చేసి రూ. లక్షా పది వేల నగదును పట్టుకున్నారు. -
కోళ్ల కోట్లాట
సాక్షి, అమరావతి బ్యూరో :సంక్రాంతి సంప్రదాయం పేరిట అధికార పార్టీ నాయకులు బరులు ఏర్పాటు చేసి మరీ కోడిపందేలు నిర్వహించారు. కోళ్లకు కత్తులు కట్టొద్దని కోర్టు స్పష్టంచేసినా అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. ఇప్పుడు చట్టం కళ్లకు గంతలు కట్టి న్యాయస్థానం ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు డమ్మీలను రంగంలోకి దించుతున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలను దర్జాగా ఉల్లంఘించీ పండుగ మూడురోజులు సాగించిన రూ.వెయ్యికోట్ల కోడిపందేల దందాను కప్పిపుచ్చేందుకు వ్యూహరచన చేశారు. పోలీసులు వారికి వంతపాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతిలో రూ.వెయ్యి కోట్ల దందా సుప్రీంకోర్టు ఉత్తుర్వులు అమరావతిలో అధికార పార్టీ నేతల ప్రాబల్యం ముందు వీగిపోయాయి. కృష్ణా జిల్లాలో దాదాపు వంద బరులు, గుంటూరు జిల్లాల్లో మరో 50 బరులు ఏర్పాటు చేశారు. కోళ్లకు కత్తులు కట్టి మరీ పందేలను రక్తికట్టించారు. ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి మరీ రాత్రింబవళ్లూ కోడి పందేలు నిర్వహించారు. పందేల మాటున టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలకు రూ.కోట్లు కొల్లగొట్టారు. బరుల నిర్వహకులు ఒక్కో పందెం మొత్తం మీద 10 శాతం కమీషన్ వసూలు చేశారు. అంటే రూ.5 వేలు పందెం కడితే రూ.500 నిర్వాహకులకు కమీషన్‌గా ఇచ్చేయాలి. రెండు జిల్లాల్లో రూ.వెయ్యికోట్ల పందేలు సాగాయన్నది అంచనా. ఆ ప్రకారం బరుల నిర్వాహకులైన టీడీపీ నేతలు కమీషన్ల రూపంలోనే రూ.100 కోట్లు జేబుల్లో వేసుకున్నారు. ఇక బరుల వద్ద సాగిన మద్యం, జూదం దందా సరేసరి. ఎమ్మార్పీ మీద 30 శాతం వరకు ధర పెంచేసి మరీ జోరుగా విక్రయాలు సాగించారు. నిర్వాహకులైన టీడీపీ నేతలు మద్యం అమ్మకాల్లో 20 శాతం కమీషన్‌గా వసూలు చేశారు. దీంపాటు మట్కా, పేకాట జూదం యథేచ్ఛగా సాగింది. మట్కా, పేకాట జూదం నిర్వాహకులు కూడా టీడీపీ నేతలకు 20 శాతం కమీషన్‌గా ఇచ్చారు. ఈ లెక్కలన కోడి పందేలు, మద్యం, మట్కా జూదాల ద్వారా టీడీపీ నేతలు ఈ మూడురోజుల్లో వందలకోట్లు కొల్లగొట్టారు. మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం సంప్రదాయం ముసుగులో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నిర్వహించిన కోడిపందేల దందాలకు అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించింది. కత్తులు కట్టి కోడిపందేలతోపాటు మద్యం, జూదం దందాలవైపు కనీసం కన్నెత్తి చూడనేలేదు. టీడీపీ నేతలు ఎక్కడికక్కడ పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ యంత్రాంగాలను ‘సంతృప్తి’పరిచారు. ఒక్కో పోలీస్ స్టేషన్, ఎక్సైజ్, తహసీల్దార్ పరిధిలోని బరుల నిర్వాహకులు భారీగానే కమీషన్లు ముట్టజెప్పారని తెలుస్తోంది. తూర్పుపాలెంలో.. తూర్పుపాలెం(చెరుకుపల్లి): సంక్రాంతి పర్వదినం సందర్భంగా మూడు రోజులపాటు నిబంధనలకు విరుద్ధంగా సంక్రాంతి పండుగ ముసుగులో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భారీగా కోడి పందాలను కోట్లలో నిర్వహించారు. రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో సుమారు 35 ఎకరాల్లో భారీ ఎత్తున బరులు ఏర్పాటు చేశారు. కోడి పందేలతోపాటు, గుండాట, కోతముక్క వంటి జూద క్రీడలను సైతం యథేచ్చగా నిర్వహించారు. కోడి పందేలను స్వయంగా ప్రజాప్రతినిధులే ప్రారంభించారు. సంప్రదాయ పేరుతో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిబంధనలను పాటించకుండా, చట్టాలను అతిక్రమించి తమ ఇష్టానుసారం కోడి పందేలను నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో సుమారు రూ. 10 కోట్ల వరకు పందాలు జరిగినట్లు సమాచారం. బాపట్ల ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ ముమ్మినేని వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావులతోపాట పలువురు టీడీపీ నాయకులు స్వయంగా పందేలను పర్యవేక్షించారు. ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులు కోడి పందేల ముసుగులో జూద క్రీడలు యథేచ్చగా నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు తమకేం పట్టనట్లుగా ప్రేక్షకప్రాత పోషించారు. చెరుకుపల్లి మండలంలో కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని, బరులు సిద్ధం అయ్యాయంటూ ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి స్పందించిన పోలీసులు చెరుకుపల్లి మండలానికి 100 మంది పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కానీ సంక్రాంతి మూడు రోజులపాటు జూద క్రీడలు జరుగుతున్నా..అధికార పార్టీ నేతల అండ ఉండడంతో ఏమీ చేయలేక చేతులు కట్టుకున్నారు. పందేల కోసం పరుగులు తాడేపల్లి రూరల్: సంక్రాంతి సందర్భంగా సోమ, మంగళవారాల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి సుమారు 4 వేల నుంచి 5 వేల మంది పందెం రాయుళ్లు కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు తరలివెళ్లారు. కుంచనపల్లి గ్రామంలో ఏకంగా 300 మంది వరకు పయనమయ్యారు. ఒకే వ్యక్తి 8 కోడిపుంజులను తీసుకెళ్లగా 7 పుంజులు పందెం గెలుపొందడం, అదే గ్రామానికి చెందిన ఒకే పుంజు 7 పందేలను కొట్టడంతో గ్రామంలో ఉత్సవాలు చేశారు. ఉండవల్లి నుంచి గ్రామం నుంచి కూడా పందేల నిర్వహణకు భారీగా ఏలూరు తరలివెళ్లారు. వివిధ ప్రాంతాల్లో కోడి పుంజులతో బరుల్లో ఫొటోలు దిగి వాట్సప్‌ల్లోనూ, ఫేస్‌బుక్‌లలోనూ అప్డేట్ చేశారు. కొందరు పేకాటరాయుళ్లు జేబులు ఖా చేయించుకుని వచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక, ఉండవల్లి, కుంచనపల్లి, పాతూరు, కొలనుకొండ, వడ్డేశ్వరం, ఇప్పటం, మెల్లెంపూడి, ఆత్మకూరు, నిడమర్రు, యర్రబాలెం, నూతక్కి డొంక, రామచంద్రాపురం, శృంగారపురం, తదితర గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించారు. పోలీసులకు సమాచారం వచ్చేలోగా వీరు అప్రమత్తమై తప్పించుకున్నారు. డమ్మీలతో కనికట్టు చేద్దాం...! పండుగ సందడి ముగింపునకు రావడంతో కిక్కు దిగుతోంది. సుప్రీంకోర్టు ఆగ్రహిస్తుందేమోనని అటు నిర్వాహకులు ఇటు పోలీసులు సందేహిస్తున్నారు. ఎవరైనా ఆధారాలతో కోర్టును ఆశ్రయిస్తే అసలుకే మోసం వస్తుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్దలను కాపాడే కనికట్టుకు పోలీసులు తెరతీశారు. ఆ పథకం ప్రకారం... పోలీసు అధికారులు తూతూ మంత్రంగా కొన్ని కేసులు కడతారు. అందుకు టీడీపీ నేతలే తమ అనుచరుల్లో కొందరి పేర్లను చెబుతారు. అమరావతి పరిధిలో వేళ్లపై లెక్కపెట్టినన్ని కేసులు కడతారు. స్టేషన్ బెయిల్ మీదే విడిచిపెడతారు. మునుముందు సుప్రీంకోర్టుగానీ దీనిపై ప్రశ్నిస్తే... తాము బరుల మీద దాడులు చేశామని... నిర్వాహకులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశామని చూపిస్తారు. లేకపోతే లేదు. కొన్ని రోజులకు ఆ కేసులు వీగిపోయినట్టో... నామమాత్రపు జరిమానాలతో సరిపుచ్చినట్టో చూపిస్తారు. తద్వారా రూ.వెయ్యికోట్లు మేర సాగిన దందాకు రక్షాకవచం ఏర్పాటు చేస్తారు. దందా నిర్వాహకులైన టీడీపీ ప్రజాప్రతినిధులు, దానికి సహకరించిన అధికారులకు ఎలాంటి ఇబ్బందిరాకుండా ముందస్తు వ్యూహమన్న మాట. విజయవాడకు చెందిన ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు ఈ తతంగాన్ని దగ్గరుండీ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ శివార్లలో కొన్ని పోలీస్స్టేషన్లలో కొందరు పేర్లను నమోదు చేసుకున్నారు. రానున్న రెండ్రోజుల్లో అమరావతి పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఇలాంటి తూతూ మంత్రం కేసులు నమోదు చేయనున్నారు. -
మహిళలకు జల్లికట్టు
సేలం: నామక్కల్ జిల్లా, తిరుచెంగోడు ఇలంజర్ మండ్రం ఆధ్వర్యంలో ఎనిమిదేళ్లుగా మహిళలు, పిల్లలకు కోడి పందెం(మహిళల జల్లికట్టు) పోటీని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం తిరుచెం గోడులోని నందవనం వీధిలో ఈ పోటీ నిర్వహించారు. ఇందులో ఒక వృత్తంలో ఒక కోడి పుంజు కాలిని ..మహిళ కాలిని తాడుతో కట్టి ఉంచుతారు. మహిళ కళ్లకు గంతలు కడతారు. ఆ మహిళ నిమిషంలోపు ఆ కోడి పుంజును పట్టుకోవాలి. ఈ పోటీల్లో విజేతలకు ఆసక్తికరమైన బహుమతులు అందజేశారు.ఈపోటీని మహిళల జల్లికట్టుగా పిలుస్తుండడం విశేషం. రెక్లా రేసు.. నామక్కల్ జిల్లా, తిరుచెంగోడులోని సీహెచ్‌పీ కాలనీ, కొల్లపట్టి, కరట్టుపాళయం సానార్ పాళయం కమిటీల ఆధ్వర్యంలో పొంగల్ సందర్భంగా రెక్లా(గుర్రాల)పోటీలు నిర్వహించారు. పోటీల్లో సేలం, ఈ రోడ్, కోవై, తిరుచ్చి జిల్లాలకు చెందిన 42 గుర్రాలు పోటీ పడ్డాయి. ఇందులో ఏడు కి.మీ దూరం పందెం, 44 ఇంచుల ఎత్తు గుర్రాలు, పెద్ద గుర్రాలు, చిన్న గుర్రాలు వంటి నాలుగు విభాగాల పోటీల్లో యువకులు పాల్గొన్నారు. లండన్‌కు చెందిన యోగా శిక్షకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. -
సంప్రదాయం ముసుగులో జూదమా?
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కోడిపందేలను సంప్రదాయం ప్రకారం కాకుండా జూదంగా మార్చేశారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. మంగళవారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘కోట్ల రూపాయల మేర కోడి పందేల రూపంలో చేతులు మారాయి. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంమ్మెల్సీలే స్వయంగా ఈ జూదంను ప్రోత్సహించడం దారుణం. ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా పోలీసులను చూసిచూడనట్లు వ్యవహరించాలని సూచించడం వల్లే ఈ జూదం నడిచింది. పేకాట, గుండాట, బెల్ట్ షాపులు, కత్తులు కట్టి కోడిపందేలు జరుగుతూ ఉంటే పోలీసులు ఎందుకు స్పందించడం లేదు. అధికార పార్టీ నేతలు సంప్రదాయం ముసుగులో వేలకోట్లు చేతులు మారేలా చేస్తున్నారు. చాటుమాటుగా జరిగే జూదం నేడు కార్పొరేట్ స్థాయికి అధికార పార్టీ నేతలు తీసుకువెళ్లారు. ఎంపీ మాగంటి బాబు ఏర్పాటు చేసుకున్న టీడీపీ కార్యాలయాన్ని పేకాట కేంద్రంగా మార్చేశారు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధపడటం దారుణం. కోడిపందేల శిబిరాల్లో అశ్లీల నృత్యాలు, బెల్ట్ షాపులు, పలావు సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిని పెట్టుకున్నందుకు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటు. కొన్నిచోట్ల అశ్లీల నృత్యాలు చేయించారు. న్యాయస్థానాలు అంటే తెలుగుదేశం పార్టీ నేతలకు గౌరవం లేదా? ఇక హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే కత్తులతో కోడి పందేలు, జూదం జరుగుతోంది. ఇక పోలీసులు ఏం చేయగలరు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ అరాచకం జరుగుతోంది. ఇక రాష్ట్రంలో చట్టాలు, సంప్రదాయాలు ఎందుకు?. ఇది సమాజానికి ప్రమాదకరం. క్రికెట్ పిచ్‌ల మాదిరిగా కోడిపందేల బరులు సిద్ధం చేశారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో పందేలు నిర్వహించారు. ప్రజల బలహీనతలను పెంచేలా సాక్షాత్తూ ప్రజాప్రతినిధులే ప్రవర్తిస్తే ఎలా?. కోడి పందేల పేరుతో సామాన్యుడి జీవితాలతో ఆటాడుకుంటారా?. జూదాన్ని ప్రోత్సహించేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. అమాయకుల జీవితాలతో ఆడుకోవద్దు’ అని అంబటి సూచించారు. -
రూ.200 కోట్లు ‘బరి’ తెగించిన తమ్ముళ్లు
-
‘బరి’ తెగించారు
అధికార పార్టీ నేతల దన్నుగా జూదగాళ్లు ‘బరి’ తెగించారు. అనుకున్నట్టుగానే పందెం కోళ్లతో కాళ్లు దువ్వించారు. పదుల సంఖ్యలో బోర్డులు ఏర్పాటు చేసి గుండాటలు నిర్వహించారు. తాత్కాలిక బెల్టు షాపులు పెట్టి మద్యాన్ని ఏరుల్లా పారించారు. చట్టాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూ చెలరేగిపోయారు. కోర్టు ఆంక్షలు.. పోలీసుల హెచ్చరికలు ఉన్నప్పటికీ జూదాల నిర్వాహకులు కోడి పందేలు.. గుండాటలు నిర్వహించి తమ సత్తాచాటారు. కోడి పందేలు కాకుండా ఈ ఏడాది కొత్తగా ఎనిమిది పుంజుల పందేలు, ... పొట్టేలు పందేలు...సూట్‌బాల్ పందేలతో ‘కాయ్‌రాజా కాయ్’ అంటూ స్వైర విహారం చేశారు. అమలాపురం: అటు పందేల్లో కోళ్లు...ఇటు నోట్ల కట్టలు తెగ తెగిపడుతున్నాయి. వేల రూపాయలతో మొదలై లక్షల రూపాయలు దాటాయి. ఒకప్పుడు చాటుమాటుగా సాగే పందేలు ఇప్పుడు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగాయి. కోనసీమలోని నియోకవర్గాల్లో ఈ జోరు ఎక్కువగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే తంతు సాగింది. ఐ.పోలవరం మండలం మురమళ్లలో పందేలు తారస్థాయికి చేరుకున్నాయి. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు లాంఛనంగా ప్రారంభించారు. తొలిసారి సూట్‌బాల్ బాల్ పందేలకు శ్రీకారం చుటారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యాపార ప్రముఖులు తరలిరావడంతో అంచనాలకు మించి బెట్టింగులు జరిగాయి. అందరికీ కనిపించే విధంగా ఇక్కడ ఐదు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సుమారు ఐదు వేల మంది కూర్చొనేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. హోంమంత్రి నియోజకవర్గాల్లో... శాంతి భద్రతలు పర్యవేక్షించి.. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన ఉప ముఖ్యమంత్రి, హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజకవర్గమైన పెద్దాపురం, ఆయన సొంత ప్రాంతమైన అమలాపురం నియోజక వర్గాల్లో ఈ ఏడాది పెద్ద ఎత్తున పందేలు జరిగాయి. ఒక్క పెద్దాపురం నియోజకవర్గంలోనే ఎనిమిది చోట్ల పందేలు జరగడం విశేషం. సామర్లకోట మండలం వేట్లపాలెంలో జోరుగా సాగాయి. వీటికి చిన్నాచితకా పందేలు అదనం. ఈ నియోజకవర్గంలోనే రూ.2.50 కోట్ల వరకూ చేతులు మారాయి. అమలాపురం నియోజకవర్గంలో అల్లవరం, ఉప్పలగుప్తం, అమలాపురం మండలాల్లో పందేలు.. గుండాటలు జోరుగా జరిగాయి. అల్లవరం మండలం గోడి, గోడిలంకల్లో రూ.కోటికి పైగా పందేలు జరిగాయి. ఇక్కడ ఒక్కో పందెం రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల మధ్య సాగింది. ఇవే కాకుండా జిల్లాలో రాజానగరం నియోజకవర్గంలో పుణ్యక్షేత్రం, దివాన్‌చెరువు, రాజోలు నియోజకవర్గంలో మలికిపురం, లక్కవరం, రాజోలు, చింతలపల్లిలో, మామిడికుదురు మగటపల్లిలో ఆరుచోట్ల పందేలు నిర్వహిస్తున్నారు. పి.గన్నవరం మండలం వాడ్రేవులపల్లి, ఏజెన్సీలోని రంపచోడవరం, మెట్టలోని తుని, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం లంకల్లోనూ ఇదే జోరు కొనసాగింది. కొత్త తరహాలో ఎనిమిది పుంజుల పందెం ఆత్రేయపురం మండలం లొల్ల, వసంతవాడ, పేరవరం, బొబ్బర్లంక, ర్యాలీ, తాడిపూడి, నార్కెడుమిల్లిలో పందేలు శనివారం రాత్రి 11 గంటల నుంచే ఆరంభించారు. ఇక్కడ తొలిసారిగా ఎనిమిది పుంజుల పందేలు జరుగుతున్నాయి. సాధారణంగా రెండు పుంజులను బరిలోకి వదిలి పందెం నిర్వహిస్తారు. కానీ ఇక్కడ ఎనిమిది పుంజులను ఒకేసారి వదిలి పోటీ పెడుతున్నారు. ఇంచుమించు అన్ని పుంజులు మీద పందెం కాస్తారు. కానీ చివరి వరకు నిలిచే పందెం కోడి మీద కాసినవారికి మాత్రమే జూదం గెలుస్తున్నారు. రూపాయి పందెం కాస్తే ఏడు రూపాయిల వరకు వచ్చే అవకాశముండడంతో ఈ పందేలపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ పుంజుమీద రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పందేలు కాస్తున్నారు. గుండాట.. మద్యమే... ప్రధాన ఆదాయం కోడిపందేల నిర్వాహకులకు గుండాటల్లో ఆదాయం కనిపిస్తుండడంతో ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో వీటిని ఏర్పాటు చేశారు. జూదగాళ్లు సైతం గుండాటల్లోనే పెద్ద ఎత్తున సొమ్ములు కాస్తున్నారు. మురమళ్లలో జరిగిన గుండాట పందేనికి వచ్చి రూ.30 వేలు కాసిన వారు కూడా ఉన్నారు. మద్యం అమ్మకాలు సైతం జోరుగా సాగుతున్నాయి. తాగినవారికి తాగినంతగా అందుబాటులో ఉంచారు. మురమళ్ల వంటి చోట అందుబాటులో ఖరీదైన మద్యాన్ని కూడా ఉంచడం గమనార్హం. ఖాకీల మౌనం... పందేలు జరగనిచ్చేది లేదంటూ హెచ్చరించిన పోలీసులు శనివారం అర్ధరాత్రి నుంచి మౌనం వహించారు. పందేలను చూసీచూడనట్టుగా వదిలేశారు. హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత జిల్లాలో టీడీపీ పెద్దల ఒత్తిడికి పోలీసులు తలొగ్గారు. విచిత్రమైన విషయం ఏమిటంటే గత ఏడాదికన్నా ఈ ఏడాది పందేల బరులు రెట్టింపు కావడం విశేషం. కోడి పందేలంటే ముందుగా గుర్తుకువచ్చే పశ్చిమ గోదావరి జిల్లాలో మధ్యాహ్నం వరకు పోలీసులు పందేలు జరగకుండా చూడగలిగారు. కానీ ఈ జిల్లాలో మాత్రం శనివారం అర్ధరాత్రి నుంచే ఊపందుకోవడం గమనార్హం. -
నగరం నడిబొడ్డున కోడి పందేలు
భవానీపురం: నగరం నడిబొడ్డున కత్తి కట్టి మరీ కోడి పందేలు నిర్వహించారు. మునుపెన్నడూ లేని విధంగా ఇళ్ల మధ్యే ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో రాత్రి వేళ సైతం పందేలు నిర్వహించారు. అధికార పార్టీ నాయకులు తీరుతో న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ అపహాస్యంపాలయ్యాయని పలువురు విమర్శించారు. శనివారం వరకు కోడి పందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవంటూ హడావుడి చేసిన పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఆదివారం చేతులెత్తేసి స్టేషన్లకు, కార్యాలయాలకే పరిమితమయ్యారు. 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన భవానీపురం అవుట్ ఏజెన్సీ వద్ద ఉన్న మూడెకరాల ప్రైవేట్ స్థలంలో కోడి పందేలు నిర్వహించేందుకు టీడీపీ నాయకులు వారం మందుగానే ఏర్పాట్లు ప్రారంభించారు. పెద్ద బరి, చిన్న బరి ఏర్పాటు చేయడంతోపాటు పేకాడేందుకు టెంట్లు భారీగానే వేశారు. అయితే పోలీసు ఉన్నతాధికారులు వచ్చి ఇక్కడ పందేలు నిర్వహించేందుకు వీలులేదని ఖరాకండిగా చెప్పడంతోపాటు భవానీపురం పోలీసులతో పికెట్ ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం ఉదయం 11 గంటలకు పోలీసులు వెళ్లిపోయారు. పోలీసులు వెళ్లిన 10 నిమిషాల్లోనే పందేల నిర్వాహకులు ప్రవేశించారు. చకచకా ఏర్పాట్లు పూర్తి చేశారు. 4 గంటలకు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వచ్చి పందేలను ప్రారంభించారు. అక్కడి నుంచి పెద్ద బరిలో ఫ్లడ్ లైట్లతో పందేలు కొనసాగాయి. చిన్నబరిలో చీకటి పడగానే నిలిపివేశారు. ఒక టెంట్లో చిన్న బజార్–పెద్ద బజార్ పేకాట జోరుగా సాగింది. ‘పిల్ల వచ్చింది’ పేరుతో మహేష్‌బాబు, సమంత, ప్రభాస్ చిత్రాలతో మరో బృందం పేకాట నిర్వహించింది. పికెట్ ఉపసంహరణపై పోలీసులను వివరణ అడగగా మధ్యాహ్నం నుంచి పందేలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిసిందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బందోబస్తును ఉపసంహరించుకున్నామని తెలిపారు. -
‘బరి’ తెగించిన తమ్ముళ్లు
విజయవాడ: పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ కోడిపందేలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. విజయవాడ కమిషనరేట్‌తో పాటు జిల్లావ్యాప్తంగా ఆదివారం దాదాపు వంద బరుల్లో జరిగిన కోడి పందేలు, జూదంలో సుమారు రూ.100 కోట్లు చేతులు మారినట్లు అంచనా. టీడీపీ ప్రజాప్రతిని«ధులు, నాయకులు బహిరంగంగా కోడిపందేల్లో పాల్గొన్నారు. అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బరుల్లో సుప్రీంకోర్టు నిబంధనలకు తుంగలో తొక్కి కత్తులతోనే కోడి పందేలు నిర్వహించారు. వందలాది కోళ్లు పందేల్లో పోరాడి రక్తపు మడుగులో ప్రాణాలు వదిలాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన పోలీసు యంత్రాంగం వారికి సలామ్ కొట్టి బరుల నిర్వహణకు అనుమతి ఇచ్చేసింది. ఏరులై పారిన మద్యం ఎన్నడూలేని విధంగా విజయవాడ నగరంలో కోడి పందేల బరి ఏర్పాటు చేశారు. మిగతా 13 నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ ఒక్కో నియోజకవర్గానికి కనీసం ఐదారు బరుల్లో పందేలు నిర్వహించారు. ఈ బరుల్లో జూదం యథేచ్ఛగా జరగ్గా, మద్యం ఏరులై పారింది. దాదాపు అన్ని బరుల వద్ద బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలతో పాటు టీడీపీ కార్యకర్తలు రెస్టారెంట్లు కూడా నిర్వహించారు. కొందరు టీడీపీ కార్యకర్తలు బరుల వద్ద ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లను నిర్వహించి సొమ్ము చేసుకున్నారు. విజయవాడ శివారు ప్రాంతమైన ఈడ్పుగల్లులో కోడిపందేల బరికి కర్నాటక, హైదరాబాద్, తెలంగాణ నుంచి పందెపురాయుళ్లు తరలివచ్చారు. టీడీపీ నేతలు ఏర్పాటుచేసిన బరుల్లో కోడిపందేలతో పాటు కోత ముక్క జూదం, పెద్దబజార్, చిన్నబజార్, గుండు ఆటతో పాటు రకరకాలుగా జూదం నిర్వహించారు. హోటళ్లు, లాడ్జిలు ఫుల్ కోడిపందేల నేపథ్యంలో విజయవాడలో హోటళ్లు, లాడ్జిలు కిటకిటలాడాయి. హైదరాబాద్, కర్నాటక నుంచి పందెపురాయుళ్లు ఇక్కడ మకాం పెట్టారు. పత్తాలేని పోలీసులు జిల్లావ్యాప్తంగా కోడిపందేలు జరిగినా పోలీస్ యంత్రాంగం పత్తా లేకుండాపోయింది. జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, సిటీ జాయింట్ పోలీస్ కమిషనర్ బీవీ రమణకుమార్‌లు కోడి పందేలు, జూదం జరగనివ్వబోమని రెండు రోజులుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రత్యేక బలగాలను ఏర్పాటుచేశామని, 144వ సెక్షన్ కూడా అమలు చేస్తున్నామని ప్రకటించారు. అయితే, అన్ని నియోజకవర్గాల్లో బరులు నిర్వహించినా పోలీసులు పత్తా లేకుండాపోయారు. జిల్లావ్యాప్తంగా ఇలా.. ♦ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం అవుట్ ఏజెన్సీ వద్ద జాతీయ రహదారి పక్కనే టీడీపీ నేతలు మూడు ఎకరాల పొలంలో పెద్ద బరిని ఏర్పాటుచేశారు. ♦ తూర్పులోని కృష్ణలంక, రామలింగేశ్వరనగర్ రుద్రభూమి వద్ద టీడీపీ నాయకులు కోడిపందేలు ప్రారంభించారు. జూదం జోరుగా సాగింది. ♦ పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరు, పోరంకి, ఈడ్పుగల్లు, పెదపులిపాక, బోళ్లపాడు, ఉయ్యూరు పరిసర గామ్రాల్లో బరులు నిర్వహించారు. ఈడ్పుగల్లు బరిలో పొట్టేళ్లతో పందేలు జరిగాయి. వీటికి హైదరాబాద్, కర్నాటక, తెలంగాణ నుంచి పందెందారులు తరలివచ్చారు. పేకాట కోసుల్లో చట్ట వ్యతిరేక కోతముక్క ఆటను కూడా నిర్వహించారు. ఇక్కడ టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధులు ఇద్దరు పాల్గొనగా, అనుచరులు బరులు వేశారు. ♦ గన్నవరం నియోజకవర్గంలో అంపాపురం గ్రామంలో కోడిపందేల బరిని నిర్వహించారు. అధికార పార్టీ ముఖ్యనేత అనుచరగణం శిబిరాలు ఏర్పాటుచేసింది. టీడీపీ నాయకులు జూద శిబిరాలు నిర్వహించారు. ♦ గుడివాడ బైపాస్ రోడ్డు, పోలుకొండ, పుట్టగుంట, గుడ్లవల్లేరు, డోకిపర్రులో టీడీపీ నేతల ఆధ్వర్యంలో కోడిపందేలు జరిగాయి. ♦ తిరువూరు పట్టణంతో పాటు కాకర్ల, పెనుగొలను, ఊటుకూరులో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున కోడిపందేల్లో పాల్గొన్నారు. ♦ మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ వద్ద కోడిపందేల కోసం బరి ఏర్పాటుచేశారు. మైలవరం సమీపంలోని పుల్లూరు, గణపవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం మండలాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో కోడిపందేలు నిర్వహించారు. ♦ మోపిదేవి మండలం రావివారిపాలెం, ఘంటసాల మండలం, కొడాలిలో టీడీపీ నేతలు కోడిపందేలు భారీగా నిర్వహించారు. ♦ జగ్గయ్యపేటలోని షేర్‌మహ్మద్‌పేట, నందిగామ, కైకలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం రూరల్ ప్రాంతంలో, నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లిలో కోడిపందేలు జరిగాయి. ‘బరి’ తెగించిన తమ్ముళ్లు హనుమాన్ జంక్షన్ రూరల్ (గన్నవరం): ‘సంక్రాంతి సంప్రదాయం’ పేరుతో తెలుగు తమ్ముళ్లు భారీ జూద శిబిరానికి తెరలేపారు. బాపులపాడు మండలం అంపాపురంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో సకల సదుపాయాలు, హంగామాతో జూద శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహాన్ అనుచరగణం పర్యవేక్షణలో ఈ జూదాలు సాగాయి. పేకాట, కోడిపందేలు, గుండాట, కాయ్ రాజా కాయ్ వంటి జూదాలు అడ్డూ అదుపు లేకుండా జరిగాయి. పండగ ముసుగులో ఇష్టారాజ్యంగా జూద శిబిరాన్ని నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు పత్తా లేరు. నిన్నటి వరకు కోడిపందేలు జరగనివ్వబోమని పోలీస్ పికెటింగ్, బైండోవర్ కేసులు పెట్టిన పోలీసులు ఆదివారం అడ్రస్ లేకుండా పోయారు. రూ.లక్షల్లో పందేలు జూద శిబిరంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. సంప్రదాయం పేరుతో అమాయకుల జేబులు గుల్ల చేసేందుకు రకరకాల జూదాలను ఏర్పాటుచేశారు. కోడి పందేలు నిర్వహించే ప్రధాన బరిలోకి పందెం నిర్వహించాలంటే రూ.లక్షకు పైమాటే. అంతకు తక్కువ ఉంటే అనుమతించరు. కానీ, పందెపురాయుళ్లు నిరుత్సాహ పడకుండా రూ.లక్ష పందెలు ఒకచోట, రూ.లక్షలోపు పందేలు మరో నిర్వహించారు. ఈ శిబిరం ఏర్పాటుచేసిన ప్రాంగణంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ప్రధాన ద్వారం దగ్గర రూ.50 ప్రవేశరుసుం చెల్లించాలి. కోడిపందేలను నిర్వహించేందుకు ప్రత్యేక బరి, వాటిని కూర్చుని తిలకించేందుకు ప్రత్యేక గ్యాలరీలు, ప్రేక్షకులకు ఏసీ కూలర్లు కూడా ఏర్పాటు చేశారు. రేయింబవళ్లు పేకాట అంపాపురంలోని జూద శిబిరంలో పేకాట జోరుగా సాగుతోంది. ఐదు కోతముక్క సిట్టింగ్‌లు ఏర్పాటుచేశారు. లోనా, బయట అంటూ క్షణాల్లో రూ.లక్షల్లో పేకాట ఆడుతున్నారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా 24 గంటల పాటు పేకాట ఆడేందుకు ఈ శిబిరంలో ఏర్పాట్లు చేశారు. ఫ్లడ్‌లైట్లు, తాగునీరు, మందు, బిర్యానీ వంటి సకల సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. గుండాట, కాయ్ రాజా కాయ్ అంటూ ఏర్పాటుచేసిన జూద కేంద్రాల్లోనూ అమాయకులు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. సందిట్లో సడేమియా.. అన్నట్టు జేబు దొంగలు చేతివాటం చూపించారు. -
కాలు దువ్విన కోడి
టీడీపీ నాయకులదే హడావుడి కత్తులు కట్టవద్దని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తీవ్ర హెచ్చరికలు చేసినా వెలగపూడి బ్యాచ్ ఏమాత్రం తగ్గలేదు. కత్తి పందేలు రూ.లక్ష నుంచి గరిష్టంగా రెండు మూడు లక్షల రూపాయల వరకు జరిగాయి. డింకీ పందాలు రూ.50వేల నుంచి రూ.80 వేల జరిగాయి. ఇక్కడ గుండాట కోసం వేలం పాటలు నిర్వహించగా... ఓ టీడీపీ నేత రూ. 7.5లక్షలకు మూడు రోజులకు బోర్డు పాడుకున్న విషయం తెలిసిందే. కాగా శనివారం రాత్రి పందెం బరి వద్ద అనధికారిక మద్యం దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు.. పందేలకు వచ్చే వాహనదారుల నుంచి ఆశీలు వసూలు చేసుకునేందుకు టీడీపీకి చెందిన మరో నేత రూ.15లక్షలకు పాడుకున్నారు. మూడ్రోజులు ఇక్కడ మద్యం అమ్ముకునేందుకు ఎమ్మెల్యే అనుమతితో ఇక్కడ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. భారీ డ్రమ్ముల్లో చీప్ లిక్కర్, ఇతర ఖరీదైన మద్యం బాటిళ్లను నిల్వ చేశారు. ఓ వైపు పందేలు... మరో వైపు తాగినోళ్లకు తాగినంత అన్నట్టుగా తయారైంది. బిర్యానీ ప్యాకెట్ రూ.100లకు అమ్మగా.. మద్యం బాటిళ్లు రెట్టింపు ధరలకు విక్రయించారు. ఇక్కడ కోడిపందేలు నిర్వహించాలంటే నిర్వాహకులు ఏటా ముందుగా ఎమ్మెల్యేకి రూ.15లక్షల కమిషన్ చెల్లించాల్సి వుంటుందని విశ్వసనీయంగా తెలిసింది. సాక్షి, విశాఖపట్నం: హైకోర్టు ఆదేశాలు పనిచేయలేదు. అధికారుల ఆంక్షలు లెక్క చేయలేదు. పందేల నియంత్రణకు పోలీసులు, రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు అడ్రస్ లేకుండా పోయాయి. అధికార, ధనబలం ముందు ఖాకీలు తలవంచారు. పందేనిదే పై చేయి అయ్యింది. ఫలితంగా సంక్రాంతి పండుగ తొలిరోజునే కోడి బరిలో నిలిచింది. పందెం రాయుళ్లను గెలిపించింది. అడ్డుకట్ట వేసినా... ఆంక్షలు విధించినా పందెం రాయుళ్లు ఏమాత్రం తగ్గలేదు. అధికార పార్టీ నేతలు తమ పలుకుబడిని ఉపయోగించి కోడిపందేలకు సై అంటే సై అన్నారు. తొడగొట్టి బరిలో నిలిచారు. ఎప్పటిలాగే మారుమూల గ్రామాల్లో సరదాగా పందేలాడుకునే వారిపై ప్రతాపం చూపే పోలీసులు మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో జరిగిన పందేల దరిదాపుల్లోకి రాలేదు. పండుగ తొలిరోజే కోట్లల్లో పందేలు జరిగాయి. ఈ శిబిరాల వద్ద గుండాటలు, పేకాట శిబిరాలు ప్రారంభించారు. పందేలు జరిగే ప్రాంతాల్లో మద్యం ఏరులై పారింది. తొలిరోజే ఐదారు కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్టుగా చెబుతున్నారు. పంతం నెగ్గించుకున్న వెలగపూడి సిటీతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఆరిలోవ బరిలో కోడిపందేలు అట్టహాసంగా మొదలయ్యాయి. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్వయంగా పందేలను ప్రారంభించారు. బరిలో కూర్చొని మరీ ఆయన పందేలు ఆడించారు. స్వయంగా పందేలు కాశారు. వెలగపూడి యువసేన అధ్యక్షుడు కంచర్ల సందీప్‌తో పాటు 12 మందిని అరెస్ట్ చేయడం... ఆరిలోవ సమీప సెంట్రల్ జైలు దరి రామకృష్ణాపురం వద్ద గడిచిన మూడ్రోజులుగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడంతో ఈ సారి పందేలు జరుగుతాయో లేదో అనే సందిగ్ధత నెలకొంది. శనివారం అర్థరాత్రి వరకు బరి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ తెల్లారేసరికి మాయమైపోయింది. బరి దరిదాపుల్లో ఖాకీ అనే వాడే కన్పించలేదు. అర్థరాత్రి నుంచే కోలాహలం మొదలైంది. తెల్లారేసరికి విశాఖ సిటీతో పాటు విజయనగరం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు ఆరిలోవ బరికి పోటెత్తారు. వేలాది వాహనాలతో ఆరిలోవ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఎమ్మెల్యే వెలగపూడితో పాటు పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో ఈ బరిలో దిగి జోరుగా పందాలు కాశారు. వందలాది కోళ్లు ఇక్కడ బరిలో కాలుదువ్వాయి. తొలిరోజే కోట్లు చేతులు మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో కానరాని సందడి సిటీతో పోల్చుకుంటే గ్రామీణ జిల్లాలో కోడిపందాల సందడి తొలిరోజు పెద్దగా కన్పించలేదు. పెందుర్తి, అనకాపల్లి, చోడవరం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో పందేలు ఆదివారం మధ్యాహ్నం నుంచి మొదలయ్యాయి. కాగా నర్సీపట్నం, యలమంచలి నియోజకవర్గాల్లో మాత్రం మారుమూల గ్రామాల్లో తప్ప పెద్దగా పందేల జాడ కన్పించలేదు. తీర మండలాల్లోని మట్టిదిబ్బలు, మామిడి, జీడి మామిడి తోటల్లో, పోలవరం కాలువ గట్లపైన పందేల సందడి కన్పించింది. కానీ గుండాటలు, పేకాట శిబిరాలు మాత్రం పెద్ద ఎత్తునే ప్రారంభమయ్యాయి. -
కో అంటే కోటి...
ఈ చిత్రం చూశారు కదా...కోళ్లను చేతుల్లోకి తీసుకొని ఢీ కొట్టిస్తున్నవారు ఎవరో కాదు ... ఒకరు కాకినాడ ఎంపీ తోట నరసింహం...ఇంకొకరు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ. ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలే. ఈ ఘటన జరిగి ఇరవై నాలుగ్గంటలైనా ‘చట్టం తన పని తాను’ ఎందుకు చేసుకుపోలేదు. ప్రసార మాద్యమాల్లో హల్చల్ చేసినా...పత్రికల్లో ఫొటోలతో ప్రచురితమైనా జిల్లా అధికారులు ఎందుకు స్పందించలేదన్నదే ప్రశ్న. కోడి పందేల నిర్వహణపై కోర్టులు... కన్నెర్ర చేస్తున్నాయి జిల్లా కలెక్టర్... ససేమిరా అంటున్నారు జిల్లా ఎస్పీ... చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్నారు...చట్టానికి ప్రతినిధులైన వీరంతా ఒకే మాటపై ఉంటే ఏమి జరగాలి.. కచ్చితంగా చట్టం అమలు జరగాల్సిందే... ఆచరణలో...చట్ట‘బద్ధకం’గా పని చేయడంతో వ్యవస్థలను అవహేళన చేస్తూ ... జిల్లాలో పందేలు పరుగులు తీస్తున్నాయి.. కో...అంటే కోటి రూపాయలంటూ కాళ్లు దువ్వుతున్నారు... సాక్షి ప్రతినిధి, కాకినాడ: బరి గీస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు. బరికి స్థలమిస్తే యజమానులపై కేసు నమోదు చేస్తామంటున్నారు. కోడి పందేలే కాదు పేకాట, గుండాట, ఆశ్లీల నృత్యాలు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని చేస్తున్న హెచ్చరికలను నిర్వాహకులు ‘డోంట్ కేర్’ అనడం పోలీసులకు సవాల్‌గా మారింది. సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలే పండక్కి ముందే పందెం కోళ్లతో ఢీకొట్టిస్తూ మీ వెనుకే కాదు ... మీతోపాటు మేం ఉన్నామంటూ అధికార పార్టీ నేతలు భరోసానివ్వడంతో ‘కో అంటే కోటి’ అంటూ కోడి పందేలు వేసేందుకు బరిలు సిద్ధమవుతున్నాయి. ఏజెన్సీ, మెట్ట, కోనసీమ అనే తేడా లేకుండా పందెం కోళ్లు రె‘ఢీ’ అవుతున్నాయి. కోనసీమలోనైతే మరింత ఎక్కువగా బరులు ఏర్పాటవుతున్నాయి. మంత్రులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా శిబిరాలు ఇలా... ఒక్క మురమళ్లే కాదు జిల్లాలో దాదాపు 26 మండలాల్లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో జరిగిన ప్రాంతాల్లోనే మరింత హుషారుగా నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు. కపిలేశ్వపురం మండలం కపిలేశ్వరపురం, కేదారిలంక, వల్లూరు, పిఠాపురం మండలం పి.దొంతమూరు, మండపేట మండలం మండపేట, ద్వారపూడి, ఏడిద, వై.సీతానగరం, గొల్లప్రోలు మండలం కొడవలి, చెందుర్తి, తుని మండలం తేటగుంట, వి.కొత్తూరు, మల్లవరం, రాజరపేట, డి.పోలవరం, వల్లూరు, కుమ్మరిలోవ, ప్రత్తిపాడు మండలం రాచపల్లి, ఉత్తరకంచి, లంపకలోవ తోట, ధర్మవరం, మామిడికుదురు మండలం గోగన్నమఠం, పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని వేట్లపాలెం, మేడపాడు, వాలు తిమ్మాపురం, గోకవరం మండలం కృష్ణునిపాలెం, మల్లవరం, కామరాజుపేట, తంటికొండ, మలికిపురం మండలంలోని లక్కవరం, మలికిపురం, శంకరగుప్తం, గుడపల్లి, రాయవరం మండలం రాయవరం, కూర్మపురం, చెల్లూరు, మాచవరం, ఆత్రేయపురం మండలంలోని పేరవరం, తాడిపూడి, వసంతవాడ, లొల్ల, జగ్గంపేట మండలం కట్రావులపల్లి, రాజపుడి, కొత్తూరు, రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో కె.బాలాంత్రమ్, పేకేరు, మసకపల్లి, జగన్నదగిరి, కాజు లూరు, అల్లవరం మండలంలోని గోడి, గోడిలంక, కొమరిగిరిపట్నం, అల్లవరం, గుండెపుడి, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి, గొల్లవిల్లి, చల్లపల్లి, బీమనపల్లి, ఎస్.యానాం, రాజమండ్రి రూరల్ పరిధిలోని కావలగొయ్యి, పిడింగొయ్యి, కొలమూరు, బొమ్మూరు, వేమగిరి, అమలాపురం రూరల్‌లోని హిందుపల్లి, సమనస, సాకుర్రు, తొండంగి మండలం సీతారాంపురం, పి.చిన్నయ్యపాలెం, బెండపూడి, రావకంపాడు, పి.అగ్రహారం, కోన ప్రాంతాలు, బుచ్చియ్యపేట, పెరుమల్లపురం, వకడారిపేట, అద్దరిపేట, వేమవరం, రంపచోడవరం పరిధిలోని పందిరిమామిడి, బందపల్లి, జగమెట్లపాలెం, గెద్దాడ, వాడపల్లి, తామరపల్లి, ఆకూరు, ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం,కేసనకుర్రు, ఎదుర్లంక, నీలపల్లి,చెయ్యేరు, కాట్రేనికోన ప్రాంతాల్లో మళ్లీ జరుగనున్నాయి. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కోళ్ల సందడితోపాటు పేకాట, గుండాటలు కూడా భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నోట్ల ఇబ్బందులు... పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలు కన్నా పందెంగాళ్లకు నోట్ల సమస్య ఇబ్బందికరంగా మారింది. ఏటీఎంలలో నగదు రాకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో కరెన్సీ వేట మొదలైంది. ఎక్కడెక్కడ నగదు ఉందో తెలుసుకుని, వారి వద్ద నుంచి ఏదో ఓ గ్యారంటీ చూపించి డబ్బు సమీకరించేపనిలో పడ్డారు. కొందరు చెక్కుల ద్వారా, మరికొందరు ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేసేలా సిద్ధపడుతున్నారు. భోగి నాడే రూ.కోట్లాది పందేలకు సిద్ధం గతేడాది పోలీసులు, అధికారులు ఎన్ని ఆంక్షలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కోడి పందేలు ఆగలేదు. తొలుత కత్తుల్లేకుండా, ఆ తర్వాత కత్తులు కట్టేసి రక్తం చిందించారు. ఈసారి కూడా అదేరకంగా పావులు కదుపుతున్నారు. గత భోగి నాడు రూ.7 కోట్ల వరకూ పందేలు జరిగినట్టు అంచనా. ఈసారి రూ.10 కోట్ల వరకు పందేలు ఒక్క భోగి రోజునే జరుగుతాయని అంచనా. మురమళ్ల వద్ద భారీ ఏర్పాట్లు ఐ.పోలవరం మండల ముఖద్వారం మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం వెనుక శరభయ్య చెరువు సమీపంలో అధికార పార్టీ నేత కనుసన్నల్లో సుమారు 15 ఎకరాలలో కోడి పందేలకు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ వీక్షించేలా ప్రత్యేక వసతులు కూడా కల్పిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రధాన పోటీదార్లకు వాట్సాప్‌ల్లో ఆహ్వానాలు కూడా పంపించారని తెలిసింది. -
కత్తుల్లేని పందెంకోడి
సాక్షి, మచిలీపట్నం: సంక్రాంతిని పురస్కరించుకుని కోడి పందేల నిర్వహణ అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఇన్నాళ్లు పందేల నిర్వహణ తదితర అంశాలపై సంది గ్ధం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని తీవ్రం గా పరిగణించాలన్న హైకోర్టు.. బరులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడైనా జరిగినట్లు సమాచారం అం దితే బాధ్యులపై చర్యలకు వెనుకాడొద్దని చెప్పింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సుప్రీంకోర్టు ఓ తీర్పును వెలువరించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జీవహింసకు పాల్పడితే సహించబోమని, కోళ్లకు కత్తులు కట్టే ప్రక్రియకు స్వస్తి పలకాలని, సంప్రదాయ పందేలతో ఆనందించాలని సూచించింది. కోర్టు తీర్పుతో పం దెం రాయుళ్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బరిలోకి దించేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో కోడి పందేల నిర్వహణకు పందెంరాయుళ్లు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందుకు అవసరమైన నిర్వహణ కేంద్రాలను సైతం చదునుచేసి, టెంట్లు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా అంతా సిద్ధం ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో నిర్వహణ కేంద్రాలు సిద్ధమయ్యాయి. మేకవానిపాలెం, గోపువానిపాలెం, శ్రీనివాసనగర్, పోలాటితిప్ప, చిన్నాపురం, సీతారామపురం, గుండుపాలెం, గూడూరు మండలంలో గూడూరు, పోసినవారిపాలెం, పెడన మండలంలో కొంకేపూడి, నందమూరు, కాకర్లమూడి, మొవ్వ మండలం కాజ, గుడ్లవల్లేరు, డోకిపర్రులో పరదాలు సిద్ధం చేశారు. బంటుమిల్లి, ముదినేపల్లి మండలం వడాలి, పెదపాలపర్రు, పెనమలూరు, వణుకూరు, యనమలకుదురు గ్రామాల్లో కోళ్లకు కత్తులు కట్టే నిపుణులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పోరంకి, ఈడ్పుగల్లు, తాడిగడప, గోడపర్రు గ్రామాల్లో గత మూడు రోజులుగా భారీ ఏర్పాట్లు చేశారు. నూజివీడు, నున్న మామిడి తోటల్లో బరులు సిద్ధమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే, సుప్రీంకోర్టు జీవ హింస చేయకూడదన్న తీర్పుతో వెనక్కు తగ్గుతారా? లేక ముందుకెళ్తారా? అన్న మీమాంస నెలకొంది. మోపిదేవిలో భారీ సెట్టింగులు మోపిదేవీ మండలం వెంకటాపురం గ్రామంలో భారీ స్థాయిలో పందేల నిర్వహణ జరుగుతోంది. ఏటా 30 ఎకరాల్లో టెంట్లు వేసి మరీ పందేల నిర్వహణ చేస్తుంటారు. గత ఏడాది సినీ తారలు సైతం ఇందులో పాల్గొనడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పందేలు సైతం భారీస్థాయిలో కాయడంతో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తారు. రూ.కోట్లు చేతులు మారతాయి. సిటీ శివారులో జాతరే.. విజయవాడ: సంక్రాంతి సంబరాల ముసుగులో అధికార పార్టీ నేతలు కోడిపందేలకు బరులు సిద్ధం చేస్తున్నారు. విజయవాడ శివారు భవానీపురం, గొల్లపూడి, పోరంకి, ఈడ్పుగల్లు, పెదపులిపాక, నిడమానూరు, ఏరియాల్లో ఇప్పటికే బరులు సిద్ధమయ్యాయి. ఇవికాక ఆగిరిపల్లి మండలంలోని నెక్కలం, గొల్లగూడెం, శోభనాపురం, గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడు, మానికొండ తదితర ప్రాంతాల్లో బరులు సిద్ధం చేశారు. ఉయ్యూరు సమీపంలో బోళ్లపాడు, మైలవరం, ఇబ్రహీంపట్నంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. పెనమలూరు, గన్నవరం, మైలవరం నియోజకవర్గాల్లో పేకాట శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు పేకాట కోసులు సిద్ధం చేశారు. రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకుని కోత ముక్క జూదం ఆడించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కోసులకు, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి జూదరులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు సమాచారం. -
కొక్కురోకో'మని'
సంక్రాంతి వచ్చిందంటే పందెంరాయుళ్లకు పండగే. కోడి, పొట్టేళ్ల పందాలకు రెడీ అయిపోతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో అయితే ఈ పందాలు రూ. కోట్లలో జరుగుతాయి. ప్రజాప్రతినిధులు, పందెంరాయుళ్లు అధిక సంఖ్యలో నోట్ల కట్టలతో బరులు వద్ద వాలిపోతుంటారు. ఈ స్థాయిలో కాకపోయినా శ్రీకాకుళం జిల్లా వాసులు కూడా పందాలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, వీరఘట్టం మండల సరిహద్దు ప్రాంతాల్లోని తోటల్లో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పందాలను గుట్టుగా జోరుగా నిర్వహిస్తూ పందెంరాయుళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీకాకుళం, వీరఘట్టం: జిల్లాలో సంక్రాంతి సందడి నెలకొంది. పండగ సందర్భంగా పందెంరాయుళ్లు కోడి, పొట్టేళ్ల పందాలకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ పోటీలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరఘట్టం మండలంలోని సరిహద్దు ప్రాంతాలు ఈ పందాలకు అనువుగా ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని రావివలస–వీరఘట్టం మండలంలోని కంబర సరిహద్దు మామిడి తోటలు, పాలమెట్ట(పి.వి.ఆర్.పురం) నాగావళి నదీతీర ప్రాంతం, పనసనందివాడ–తలవరం సరిహద్దు మామిడి తోటల్లో, హుస్సేనుపురం మామిడి తోటల్లో ఎక్కువగా ఈ పందాలు నిర్వహించనున్నట్టు సమాచారం. పోలీసులు దాడులు చేసేటప్పుడు తప్పించుకునేందుకు ఈ సరిహద్దు ప్రాంతాలు అనువుగా ఉండడం, అలాగే పోలీసులు వస్తున్న సమాచారం ముందుగా తెలుసుకునేందుకు వెసులుబాటు ఉండడం తదితర కారణాలతో ఇటువంటి ప్రదేశాల్లో ఈ పందాలను నిర్వహిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. గత నెల 29న పాలమెట్ట తోటలో పెద్ద ఎత్తున జరిగిన పొట్టేళ్ల పందాలపై పోలీసులు దాడులు చేసి పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే పదుల సంఖ్యలో పందెంరాయుళ్లు పాల్గొనగా కేవలం 8 మంది మాత్రమే పట్టుబడినట్లు పోలీసులు చెబుతున్నారు. తెల్లవారుజామునే... కోడి, పొట్టేళ్ల పందాలు ఎక్కువగా తెల్లవారుజామున నిర్వహిస్తుంటారు. వీరఘట్టం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, పార్వతీపురం, వంగర, రేగిడి, పాలకొండ మండలాల నుంచి అధికంగా పందెంరాయుళ్లు ఈ పందాలలో పాల్గొంటున్నారు. వీరిలో కొందరు ఉద్యోగులు కూడా గతంలో జరిగిన పందాలలో పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. అయితే పోలీసులతో వీరికున్న పరిచయాలు వల్ల మళ్లీ మళ్లీ పాల్గొంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ పోటీలు సందర్భంగా రూ. లక్షల్లో చేతులు మారనున్నాయి. వాహనాలు సీజ్ చేస్తే ఆగుతాయి పోలీసుల దాడుల్లో వాహనాలు, మొబైల్ ఫోన్లు, ఇతర సామగ్రి దొరుకుతున్నప్పటికీ వాటిని పట్టుబడినట్టు రికార్డులో చూపకపోవడంతో పందాలు జోరందుకుంటున్నాయి. వాహనాలను సీజ్ చేసి, మొబైల్స్‌లోని కాల్ డేటా ఆధారంగా విచారణ చేపడితే అందరినీ అదుపులోకి తీసుకోవచ్చును. అయితే ఆ తరహాలో పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం, వాహనాలను వెంటనే వదిలేయడంతో ఇంతే కదా అంటూ పందెంరాయుళ్లు బరితెగిస్తున్నారు. పోస్టర్లు విడుదల సంక్రాంతి పండగ సందర్భంగా ఎవరైనా కోడి, పొట్టేళ్ల పందాలు నిర్వహిస్తే శిక్షార్హులంటూ వీరఘట్టం పోలీసులు మంగళవారం పోస్టర్లు విడుదల చేశారు. గతంలో పందాలు ఆడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని ఎస్ఐ జి.అప్పారావు తెలిపారు. సుప్రీం ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి కోడి, పొట్టేళ్ల పందాల నిర్వాహకులపై కఠినమైన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పందాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. పాలకొండ డివిజన్లో ఎక్కువగా వీరఘట్టం మండల ప్రాంతాల్లోనే ఈ పందాలు జరుగుతున్నాయి. ఈ పందాలపై నిఘా వేశాం. అందుకు ప్రత్యేక బలగాలను సిద్ధం చేశాం. – జి.స్వరూపారాణి, డీఎస్పీ, పాలకొండ డివిజన్ -
కోడి పందేలు నిషేధం
అనంతపురం సెంట్రల్: జిల్లాలో ఎక్కడా కోడి పందేలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కోడిపందేలు కట్టడి చేసేందుకు రెవెన్యూశాఖ, జంతు సంక్షేమబోర్డు సిబ్బందితో కలిసి సమన్వయంగా పనిచేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో నిఘా ఉంచాలని, సర్పంచులు, గ్రామ పెద్దల సహకారంతో సమావేశాలు నిర్వహించి చైతన్యవంతులను చేయాలని కోరారు. గతంలో కేసులున్న వారిని ముందస్తుగా బైండోవర్ చేయాలని ఆదేశించారు. మూగ జీవాలను హింసిస్తే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్డివిజన్ల పరిధిలో 30 పోలీసుయాక్టు అమలుచేయాలని ఆదేశించారు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి వెల్లకుండా కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనుమతి తప్పనిసరి జిల్లా కేంద్రంలో మూన్నెళ్లపాటు 30 పోలీసుయాక్టు అ మల్లో ఉంటుందని డీఎస్పీ వెంకట్రావ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అనంతపురం సబ్‌డివిజన్ ప్రాంతాల్లో కూడా అమలవుతుందన్నారు. ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించరాదని సూచించారు. ప్రధాన కూడళ్లలో అంతరాయం ఏర్పడి ప్రజలకు అసౌకర్యం కల్పించేలా దిష్టిబొమ్మలు దహనం చేయరాదని ఆదేశించారు. –డీఎస్పీ వెంకట్రావ్ -
రెఢీ
‘తెల్లారింది లెగండోయ్ కొక్కొరొక్కో..’ అంటూ పందెంకోళ్లు నిద్ర లేపుతుంటే, ‘పంతం నీదా.. నాదా.. సై..’ అంటూ పందెపురాయుళ్లు కత్తులు దూస్తున్నారు. సంక్రాంతి సందడి ప్రారంభమైందో లేదో గ్రామాల్లో కోడిపందేల జోరు రోజురోజుకూ పెరిగిపోతోంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులను ప్రసన్నం చేసుకునే పనిలో కొందరుంటే, పందెం కోళ్లను దిట్టంగా పెంచి, కత్తులు సిద్ధం చేస్తున్నవారు మరికొందరు. మొత్తం మీద ఈ ఏడాది జిల్లాలో కోడిపందేలకు కోట్లు చేతులు మారుతున్నాయని సమాచారం. సాక్షి, మచిలీపట్నం: సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. జిల్లాలో కోడిపందేల నిర్వహణకు పందెంరాయుళ్లు సన్నాహాలు మొదలుపెట్టేశారు. పైకి పందేలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టీకరిస్తున్న పోలీసులు లోపల పందెం రాయుళ్లతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు నిర్వహణ కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇద్దరు చొప్పున కానిస్టేబుళ్లతో భద్రత ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా, కలెక్టర్ లక్ష్మీకాంతం కోడిపందేలను అడ్డుకునేందుకు అధికారులతో కూడిన ఓ కమిటీని నియమించారు. ఎక్కడైనా పందేలు జరిగినట్లు సమాచారం అందితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పందేల నిర్వహణపై ఉత్కంఠ ఏర్పడింది. ఒకవైపు పోలీసులు పందేలను ప్రోత్సహించేందుకు పావులు కదుపుతుండగా, మరోవైపు రెవెన్యూ అధికారులు ఏ మేరకు వాటిని నివారించగలరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ తంతు మొత్తం ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతుందన్నది వాస్తవం. జిల్లాలో పరిస్థితి ఇదీ.. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఏటా కోడి పందేలు జోరుగా నిర్వహిస్తారు. పెడన నియోజకవర్గంలోని కొంకేపూడి, నందమూరు, పుల్లపాడు, కాకర్లమూడి, నందమూరు, బందరు రూరల్ మండలంలోని కానూరు, గోపువానిపాలెం, మేకవానిపాలెం, పోలాటితిప్ప, రుద్రవరం, మాలకాయలంక, చిన్నాపురం, ఘంటసాల మండలం కొడాలి, శ్రీకాకుళం, పాపవినాశనం, మొవ్వ మండలం కూచిపూడి, గోడపాడు, బార్లపూడి, భట్లపెనుమర్రు, గూడూరు, కంకిపాడు మండలం ఈడ్పుగల్లు, గుడివాడ, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల్లో జోరుగా నిర్వహిస్తారు. మోపిదేవిలో భారీ సెట్టింగులు మోపిదేవీ మండలం వెంకటాపురం గ్రామంలో భారీస్థాయిలో పందేల నిర్వహణ జరగనుంది. ఏటా 30 ఎకరాల్లో టెంట్లు వేసి మరీ పందేల నిర్వహిస్తూ ఉంటారు. గత ఏడాది సినీ తారలు సైతం ఇందులో పాల్గొననుండటంతో వీటికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పందేలు సైతం భారీస్థాయిలో కాయడంలో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తారు. రూ.కోట్లు చేతులు మారతాయి. రూ.లక్ష నుంచి రూ.కోట్లల్లో పందేలు వేస్తుంటారు. కనీసం పందెం కాయాలంటే రూ.లక్ష ఉండాల్సిదేనన్న నిబంధన సైతం ఉంది. ఇప్పటికే పుంజులను పోషించే పనిలో పందెం రాయుళ్లు నిమగ్నమయ్యారు. నిర్వహణపై అయోమయం వాస్తవానికి కోడిపందేలు జరిగే పదిరోజుల ముందు నుంచీ వాటి విషయంలో స్పష్టత లేకపోవడం, చివరి నిమిషంలో ఏదోలా నిర్వహించడం, పరిపాటిగా మారింది. అయితే, ఈసారి హైకోర్టు ఘాటుగా స్పందించిన నేపథ్యంలో వీటిని ఇటు రెవెన్యూ, పోలీసు విభాగాలు ఎలా అడ్డుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఐదేళ్లుగా కోడిపందేల నిర్వహణ జిల్లాలో కొంతమంది నాయకులకు.. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా మారింది. కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు పందేల్లో పాల్గొనడం, ప్రారంభించడం చేశారు. అయితే, ఈ ఏడాది ముఖ్యమంత్రి సైతం పందేలకు దూరంగా ఉండాలని సూచించారు. వివిధ ప్రాంతాల పందెంరాయుళ్లు తమ ప్రాంతాల్లో పందేలు నిర్వహించాలని, ఆయా ప్రాంతాలకు పోలీసులు రాకుండా చూడాలని స్థానిక నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. బరులకు దారులివీ.. పందెంరాయుళ్లకు సంవత్సరం మొత్తం ఒక ఎత్తయితే సంక్రాంతి పండుగ మూడు రోజులు ఒక ఎత్తు. దీనికోసం కొంతమంది సంవత్సరం మొత్తం ఎదురుచూస్తారు. కొందరు కోళ్ల పెంపకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఒక్కో కోడిని సంవత్సరం మొత్తం మేపడం ద్వారా దాని సామర్థ్యాన్ని బట్టి రూ.50వేల నుంచి రూ.2 లక్షల వరకూ అమ్మకాలు, కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇదే క్రమంలో ఈసారి పండుగకు కూడా కోళ్ల కొనుగోళ్లు పూర్తయ్యాయి. స్థలం మార్చి.. ఏమార్చి.. ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రాంతాలను పక్కనపెట్టి ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో పందేల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. చిన్నచిన్న పందేలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే, వీటి వివరాలు, ప్రాంతాలు ఎక్కడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈసారి కూడా జిల్లాలో భారీగా పందేలు నిర్వహిస్తారని భావిస్తున్నారు. కుదిరిన ఒప్పందం పందేల నిర్వహణకు ఇప్పటి నుంచే పోలీసులు, నిర్వాహకులకు మధ్య ఒప్పందం కుదిరినట్లు విమర్శలు వస్తున్నాయి. ఒక కేంద్రం నిర్వాహకుడు పోలీసులకు ముందస్తుగా రూ.10వేలు, నలుగురు వ్యక్తులు, ఆరు కోళ్లు అప్పగించాలి. నిర్వహణ సమయంలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే పోలీసుల ఆధ్వర్యంలో ఉన్న వీటిపై చర్యలు తీసుకున్నట్లు చూపించి కోర్టుకు పంపుతారు. దీంతో పందెం రాయుళ్లు మనుషులను వెతికే పనిలో పడ్డారు. కాగా, ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించనున్నారు. ఏటా ఇదే తంతు గ్రామాల్లో కోడిపందేలు భారీగా నిర్వహిస్తారనే ప్రచారం నడుస్తోంది. దీనికి తగ్గుట్టుగానే కొన్నేళ్లుగా పైన పేర్కొన్న ప్రాంతాల్లో భారీ ఎత్తున పందేలు నిర్వహించిన దాఖాలాలు ఉన్నాయి. రెండేళ్లుగా వీటి విషయంలో పలువురు కోర్టుకు వెళ్లగా, వ్యాజ్యాలు కూడా నడిచాయి. కోడిపందేలను నిర్వహించకూడదనే స్పష్టమైన ఆదేశాలు ఉన్న తరుణంలో గడిచిన సంవత్సరం సుప్రీంకోర్టు కత్తులు కట్టకుండా, జీవులను హింసించకుండా ముందుకు వెళ్లవచ్చన్న వాదన తెరమీదకు తీసుకొచ్చింది. దీంతో పందెంరాయుళ్లు యథేచ్ఛగా పందేలు నిర్వహించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొంతమంది పక్కదోవ పట్టించారు. తాజాగా హైకోర్టు దీనిపై ఘాటుగా స్పందించింది. డీజీపీ, ప్రధాన కార్యదర్శులను బాధ్యులను చేసింది. -
పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు వార్నింగ్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పార్టీ ముఖ్యనేతలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ...పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే కోడిపందాలు, జూదాల విషయంలో హద్దులు దాటొద్దంటూ పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు చంద్రబాబు సూచించారు. జూదాల విషయంలో పార్టీకి చెడ్డపేరు తెస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అలాగే నియోజకవర్గాలకు ఏ,బీ,సీ గ్రేడింగులు ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పనితీరు సరిగా లేకుంటే అభ్యర్థులను మార్చడానికి వెనకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. 2018 చివరికల్లా జిల్లా, నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు గుర్తించాలని సూచన చేశారు. అలాగే జన్మభూమి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రభుత్వ విధానాలను ప్రజలలోకి తీసుకు వెళ్లాలన్నారు. అర్హులైన లబ్దిదారులు ఇబ్బండి పడకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఇన్ఛార్జ్ మంత్రులు, పార్టీ ఇన్ఛార్జుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
పోలీసుల అనుమతితో బరిలో పందెంకోళ్లు
విజయవాడ: సంక్రాతి పండుగకు నెల రోజుల ముందే జిల్లాలో కోడిపందేల జోరు మొదలైంది. ఎక్కడో ఒకటి రెండు చోట్ల కాదు, జిల్లా వ్యాప్తంగా బరులు గీసి మరీ పందేలు నిర్వహిస్తున్నారు. కోడిపందేలకు అనుమతులు ఇవ్వాలని పోలీసు అధికారులపై అధికారపార్టీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెంచారు. దీంతో పోలీసులు పచ్చజెండా ఊపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలవొగ్గిన పోలీసు ఉన్నతాధికారులు కోడిపందేల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించాలని కింది స్థాయి సిబ్బందికి సూచించారన్న ప్రచారం సాగుతోంది. దీంతో అధికార పార్టీ నేతలు కోడిపందేలకు ఎక్కడికక్కడ రంగం సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో టీడీపీ నాయకుల అండదండలతో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. కమిషరేట్ పరిధిలో పెనమలూరు సమీపంలో యనమలకుదురు లంకల్లో ఆదివారం పెద్ద ఎత్తున సాగిన కోడిపందేలు నిర్వహించారు. ఈ ఒక్క రోజే రూ.లక్షల్లో చేతులు మారాయని తెలిసింది. నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్యనేత అనుచరగణం 15 రోజులుగా లంకల్లో కోడిపందేలు నిర్వహిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా.. కృష్ణా నది పరీవాహక ప్రంతంలోని యనమలకుదురు, పెదపులిపాక, సమీప లంకల్లో పందేల సందడి ఊపందుకుంది. శని, ఆదివారం రోజుల్లో జోరుగా పందేలు సాగుతున్నాయి. విజయవాడ– ఆగిరపల్లి రహదారిలోనూ కోడి పందేల బరులు భారీగా ఏర్పాటయ్యాయి. నున్న మామిడితోటల్లో పందేలు సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మైలవరం, తిరువూరు, గన్నవరం, మచిలీపట్నం, అవనిగడ్డ, నాగాయలంక, నందిగామ ప్రాంతాల్లో ఇప్పటికే కోడిపందేలు సాగుతున్నాయి. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని రూ.లక్షల్లో పందేలు కాస్తున్నారు. కృష్ణానది కరకట్ట పొడవునా మాటుగా ఉండే ప్రాంతాల్లో కోడిపందేలు వేస్తున్నారు. పోలీసుల పేరుతో దందా జిల్లాలో పలు ప్రాంతాల్లో పోలీసుల అనుమతుల పేరుతో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు డబ్బులు వసూలు చేసి జేబులు నింపుకొంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల నుంచి అనుమతులు తెచ్చామని పెనమలూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు డబ్బు వసూలు చేస్తున్నారు. ఆదివారం ఒక రోజుకు పోలీసు స్టేషన్‌కు రూ.10 వేలు చెల్లించాలని పందెంరాయుళ్ల నుంచి టీడీపీ నేతలు డబ్బువసూలు చేశారని సమాచారం. -
కోడి పందాలకు హైకోర్టు బ్రేక్!
-
కోడి పందాలకు హైకోర్టు బ్రేక్!
హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా కోలాహలంగా నిర్వహించే కోడిపందాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. కోడి పందాల పేరుతో మద్యం, జూదం విచ్చలవిడిగా సాగుతుందని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడిపందాల పేరుతో జంతువులను హింసిస్తున్నారని పేర్కొంటూ.. పీపుల్ ఫర్ యనిమల్ ఆర్గనైజేషన్, యనిమల్ వెల్ఫేర్ బోర్డు వేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోడి పందాలు నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. -
కోడిపందెం ఆడుతున్న ఎనిమిది మంది అరెస్ట్
మంగపేట : మండలంలోని కమలాపురంలో కోడిపందాలు అడుతున్న ఎనిమిది మందిని బుధవారం అరెస్టు చేసినట్లు పీఎస్సై కుకునూరి సతీష్‌కుమార్ తెలిపారు. కమలాపురంలోని గొల్లవాడలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో వెళ్లి దాడి చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోడిపందాలు నిర్వహిస్తున్న గ్రామస్తులు చల్ల గట్టయ్య, జాగరి కృష్ణ, అంతటి కృష్ణ, నిమ్మల కొండలు, బానోతు ప్రసాద్, కుదురుపాక చందు, కామేష్, తోట ముత్తయ్యను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి రూ.700 నగదుతో పాటు పందెం కోళ్లను స్వాధీనం చేసుకోగా, మరికొందరు పరారయ్యారని పీఎస్సై వివరించారు. -
కోడిపందాలు ఆడుతున్న నలుగురి అరెస్ట్
కరీంనగర్: కోడిపందాలు ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండలం శివపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కోడిపందాల్లో పాల్గొన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 33 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.