ఈ చిత్రం చూశారు కదా...కోళ్లను చేతుల్లోకి తీసుకొని ఢీ కొట్టిస్తున్నవారు ఎవరో కాదు ... ఒకరు కాకినాడ ఎంపీ తోట నరసింహం...ఇంకొకరు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ. ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలే. ఈ ఘటన జరిగి ఇరవై నాలుగ్గంటలైనా ‘చట్టం తన పని తాను’ ఎందుకు చేసుకుపోలేదు. ప్రసార మాద్యమాల్లో హల్‌చల్ చేసినా...పత్రికల్లో ఫొటోలతో ప్రచురితమైనా జిల్లా అధికారులు ఎందుకు స్పందించలేదన్నదే ప్రశ్న.
కోడి పందేల నిర్వహణపై కోర్టులు... కన్నెర్ర చేస్తున్నాయి జిల్లా కలెక్టర్... ససేమిరా అంటున్నారు జిల్లా ఎస్పీ... చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్నారు...చట్టానికి ప్రతినిధులైన వీరంతా ఒకే మాటపై ఉంటే ఏమి జరగాలి.. కచ్చితంగా చట్టం అమలు జరగాల్సిందే... ఆచరణలో...చట్ట‘బద్ధకం’గా పని చేయడంతో వ్యవస్థలను అవహేళన చేస్తూ ... జిల్లాలో పందేలు పరుగులు తీస్తున్నాయి.. కో...అంటే కోటి రూపాయలంటూ కాళ్లు దువ్వుతున్నారు...
సాక్షి ప్రతినిధి, కాకినాడ: బరి గీస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు. బరికి స్థలమిస్తే యజమానులపై కేసు నమోదు చేస్తామంటున్నారు. కోడి పందేలే కాదు పేకాట, గుండాట, ఆశ్లీల నృత్యాలు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని చేస్తున్న హెచ్చరికలను నిర్వాహకులు ‘డోంట్ కేర్’ అనడం పోలీసులకు సవాల్‌గా మారింది. సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలే పండక్కి ముందే పందెం కోళ్లతో ఢీకొట్టిస్తూ మీ వెనుకే కాదు ... మీతోపాటు మేం ఉన్నామంటూ అధికార పార్టీ నేతలు భరోసానివ్వడంతో ‘కో అంటే కోటి’ అంటూ కోడి పందేలు వేసేందుకు బరిలు సిద్ధమవుతున్నాయి. ఏజెన్సీ, మెట్ట, కోనసీమ అనే తేడా లేకుండా పందెం కోళ్లు రె‘ఢీ’ అవుతున్నాయి. కోనసీమలోనైతే మరింత ఎక్కువగా బరులు ఏర్పాటవుతున్నాయి. మంత్రులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా శిబిరాలు ఇలా...
ఒక్క మురమళ్లే కాదు జిల్లాలో దాదాపు 26 మండలాల్లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో జరిగిన ప్రాంతాల్లోనే మరింత హుషారుగా నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు. కపిలేశ్వపురం మండలం కపిలేశ్వరపురం, కేదారిలంక, వల్లూరు, పిఠాపురం మండలం పి.దొంతమూరు, మండపేట మండలం మండపేట, ద్వారపూడి, ఏడిద, వై.సీతానగరం, గొల్లప్రోలు మండలం కొడవలి, చెందుర్తి, తుని మండలం తేటగుంట, వి.కొత్తూరు, మల్లవరం, రాజరపేట, డి.పోలవరం, వల్లూరు, కుమ్మరిలోవ, ప్రత్తిపాడు మండలం రాచపల్లి, ఉత్తరకంచి, లంపకలోవ తోట, ధర్మవరం, మామిడికుదురు మండలం గోగన్నమఠం, పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని వేట్లపాలెం, మేడపాడు, వాలు తిమ్మాపురం, గోకవరం మండలం కృష్ణునిపాలెం, మల్లవరం, కామరాజుపేట, తంటికొండ, మలికిపురం మండలంలోని లక్కవరం, మలికిపురం, శంకరగుప్తం, గుడపల్లి, రాయవరం మండలం రాయవరం, కూర్మపురం, చెల్లూరు, మాచవరం, ఆత్రేయపురం మండలంలోని పేరవరం, తాడిపూడి, వసంతవాడ, లొల్ల, జగ్గంపేట మండలం కట్రావులపల్లి, రాజపుడి, కొత్తూరు, రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో కె.బాలాంత్రమ్, పేకేరు, మసకపల్లి, జగన్నదగిరి, కాజు లూరు, అల్లవరం మండలంలోని గోడి, గోడిలంక, కొమరిగిరిపట్నం, అల్లవరం, గుండెపుడి, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి, గొల్లవిల్లి, చల్లపల్లి, బీమనపల్లి, ఎస్.యానాం, రాజమండ్రి రూరల్ పరిధిలోని కావలగొయ్యి, పిడింగొయ్యి, కొలమూరు, బొమ్మూరు, వేమగిరి, అమలాపురం రూరల్‌లోని హిందుపల్లి, సమనస, సాకుర్రు, తొండంగి మండలం సీతారాంపురం, పి.చిన్నయ్యపాలెం, బెండపూడి, రావకంపాడు, పి.అగ్రహారం, కోన ప్రాంతాలు, బుచ్చియ్యపేట, పెరుమల్లపురం, వకడారిపేట, అద్దరిపేట, వేమవరం, రంపచోడవరం పరిధిలోని పందిరిమామిడి, బందపల్లి, జగమెట్లపాలెం, గెద్దాడ, వాడపల్లి, తామరపల్లి, ఆకూరు, ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం,కేసనకుర్రు, ఎదుర్లంక, నీలపల్లి,చెయ్యేరు, కాట్రేనికోన ప్రాంతాల్లో మళ్లీ జరుగనున్నాయి. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కోళ్ల సందడితోపాటు పేకాట, గుండాటలు కూడా భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నోట్ల ఇబ్బందులు...
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలు కన్నా పందెంగాళ్లకు నోట్ల సమస్య ఇబ్బందికరంగా మారింది. ఏటీఎంలలో నగదు రాకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో కరెన్సీ వేట మొదలైంది. ఎక్కడెక్కడ నగదు ఉందో తెలుసుకుని, వారి వద్ద నుంచి ఏదో ఓ గ్యారంటీ చూపించి డబ్బు సమీకరించేపనిలో పడ్డారు. కొందరు చెక్కుల ద్వారా, మరికొందరు ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేసేలా సిద్ధపడుతున్నారు.
భోగి నాడే రూ.కోట్లాది పందేలకు సిద్ధం
గతేడాది పోలీసులు, అధికారులు ఎన్ని ఆంక్షలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కోడి పందేలు ఆగలేదు. తొలుత కత్తుల్లేకుండా, ఆ తర్వాత కత్తులు కట్టేసి రక్తం చిందించారు. ఈసారి కూడా అదేరకంగా పావులు కదుపుతున్నారు. గత భోగి నాడు రూ.7 కోట్ల వరకూ పందేలు జరిగినట్టు అంచనా. ఈసారి రూ.10 కోట్ల వరకు పందేలు ఒక్క భోగి రోజునే జరుగుతాయని అంచనా.
మురమళ్ల వద్ద భారీ ఏర్పాట్లు
ఐ.పోలవరం మండల ముఖద్వారం మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం వెనుక శరభయ్య చెరువు సమీపంలో అధికార పార్టీ నేత కనుసన్నల్లో సుమారు 15 ఎకరాలలో కోడి పందేలకు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ వీక్షించేలా ప్రత్యేక వసతులు కూడా కల్పిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రధాన పోటీదార్లకు వాట్సాప్‌ల్లో ఆహ్వానాలు కూడా పంపించారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment