కోళ్ల పందెం నిర్వహిస్తున్న దృశ్యం (ఫైల్)
భద్రాద్రి కొత్తగూడెం, వైరారూరల్: ఆంధ్ర సరిహద్దులో నిర్వహించే కోడి పందేలకు తెలంగాణలోని ఖమ్మం జిల్లా వాసులు సైతం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్ ముగియడంతో ధాన్యం, పత్తి, మిర్చి తదితర పంటలు చేతికొచ్చాయి. మార్కెట్‌లో పత్తి, మిర్చి ధరలు ఆకాశాన్నంటి రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. ఇంకా ధరలు పెరగడమే తప్ప తగ్గే మార్గం లేదు. దీంతో రైతులతో పాటు అన్ని వర్గాల వారు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇదే తరుణంలో వ్యాపారాలు, పంటల దిగుబడిపై వచ్చిన మొత్తాన్ని సొమ్ము చేసుకొని ఆంధ్రలో నిర్వహించే కోడి పందేలు చూసేందుకు, పందేలు కాసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాహనాలు కిరాయికి తీసుకు వెళ్లే అవకాశాలు ఉండడంతో వాహనదారులు (కార్లు, టవెరా, బొలెరో, తుఫాన్) వంటి వాటికి గిరాకీ పెరగుతోంది.
పుంజులకు భలే గిరాకీ..
సంక్రాంతి పండుగను పురస్కరించుకోని కోడి పందేలు నిర్వహించడం అనవాయితీ. తెలంగాణలో ఇలాంటి సదుపాయం లేకపోవడంతో ఒక్క జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాల వారు కూడా కోడి పందేలను వీక్షించేందుకు ఆంధ్ర ప్రాంతాలకు వెళ్తుంటారు. కోడి పందెంలో పాల్గొనేవారు మాత్రం రూ.వేలు వెచ్చించి కోడి పుంజులను కొనుగోలు చేస్తారు. మండల పరిధిలోని పలు గ్రామాలతో పాటు వైరా పట్టణ కేంద్రం, ఇతర మండలాల్లో పలువురు పందెం కోడి పుంజులను పెంచి వాటిని పందెం వేసేందుకు సిద్ధం చేసి మరీ విక్రయిస్తుంటారు. దీంతో కోడి పుంజుల ధరలు సైతం అధికంగానే ఉంటున్నాయి. కోడి పుంజుల్లో పలు రకాల జాతులు ఉండటంతో ఒక్కో పుంజును రూ.3 నుంచి రూ.6 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారంటే వారి గిరాకీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పలువురు కోడి పందేలు వేసే ప్రదేశాల్లోనే పందెం వేసే కోడి పుంజులను విక్రయిస్తుంటారు. దీంతో పలువురు అక్కడే కొనుగోలు చేసి అక్కడే పందెం వేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
మూడు రోజులూ సందడే..
సంక్రాంతి పర్వదినం సందర్భంగా భోగి, మకర సంక్రాంతి, కనుమ మూడు రోజుల పాటు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ రోజుల పాటు కోడి పందేల నిర్వహణ ముమ్మరంగా ఉండడమే కాకుండా అర్ధరాత్రి వరకు ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు చేసి మరీ కోడి పందేల నిర్వహణ ఉంటుంది. ఆంధ్ర సరిహద్దులు, మారుమూల ప్రాంతాల్లోని మామిడి తోటలను లీజుకు తీసుకొని అక్కడ వందల రింగులను ఏర్పాటు చేసి కోడి పందేలను వేస్తారు. కోడి పందేల ప్రదేశాల్లోనే భోజనం నుంచి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తారు. దీంతో కోడి పందేలను చూసేవారు అదే విధంగా పందెం వేసే వారు ఆ మూడు రోజుల పాటు అక్కడే మకాం వేసి మరీ పందెం చూడడం, వేయడం వంటివి జరుగుతున్నాయి.
ఖర్చు అధికమే..
కోడి పందేలను వేసే వాళ్లు, చూసేవాళ్లలో అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. వారు తమ మిత్రులతో కలిసి సమూహాలుగా ఏర్పడి వాహనాలు కిరాయికి మాట్లాడుకొని వెళ్తుంటారు. దీంతో వారి ఖర్చులు అధికం కానున్నాయి. మూడు రోజుల పాటు కారు కిరాయికి తీసుకుంటే రూ.15 నుంచి రూ.20 వేల వరకు ఖర్చు వస్తుంది. పందెం వేసే వాళ్లకి అయితే దీనికి నాలుగింతలు అదనం ఖర్చు వస్తున్నట్లు తెలుస్తోంది. ఖర్చు ఎంత అయినా సరే వెనుకడగు వేయకుండా పందెంలో పాల్గొనేందుకు జిల్లా వాసులు సిద్ధమైనట్లు విశ్వనీయ సమాచారం.
వస్తే లక్షలు..పోతే వేలు..
కోడి పందేల నిర్వహణ ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’అన్న చందంగా వర్ధిల్లుతున్నట్లు తెలుస్తోంది. కోడి పందేలు వేసే వారు అధిక శాతం రైతులు, వ్యాపారులు, యువకులు ఉన్నారు. మిర్చి, పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ మరింత ధరలు పెరిగిన తర్వాత విక్రయించుకుందాంలే అని వాటిని భద్రపర్చుకొని అప్పులు చేసి మరీ కోడి పందేలు వేసేందుకు గ్రామీణ, పట్టణాల రైతులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి ఒకసారి జరుపుకునే సంబురాలు కావడంతో వ్యాపారులు సైతం పందేలు వేసేందుకు ముందు వరుసలో ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment