Thota Narasimha
-
జ్యోతుల X తోట
సాక్షి ప్రతినిధి, తూర్పు గోదావరి, కాకినాడ : ఎంపీ తోట నరసింహం దత్తత గ్రామమది. ఆ పార్టీకి చెందిన సర్పంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాకపోతే, ఎంపీ తోట నరసింహం అనుచరునిగా ఉంటున్నారు. ఇప్పుడదే కొంప ముంచింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కంటగింపుగా మారింది. ఎంపీ వెంట తిరుగుతున్నారని సర్పంచిపై కక్షగట్టారు. టీడీపీలోకి వచ్చిన దగ్గరి నుంచి అణగదొక్కుతున్నారు. ప్రతి పనికీ ఆటంకం కలిగిస్తున్నారు. గ్రామాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మంజూరైన అభివృద్ధి పథకాలు అమలు కాకుండా అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. ఇళ్లు, పింఛన్లు, రుణాలు తదితర సంక్షేమ పథకాలు ఎంపీ అనుచరులకు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. గత రెండున్నరేళ్లుగా జరుగుతున్న వివక్షను భరించలేక బూరుగుపూడి సర్పంచి పాఠంశెట్టి సూర్యచంద్ర ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. జ్యోతుల నెహ్రూ తీరుకు నిరసనగా ఆరు రోజులపాటు దీక్ష చేశారు. చివరికి పోలీసులు భగ్నం చేశారే తప్ప ఎమ్మెల్యే కనీసం స్పందించలేదు. ♦ జగ్గంపేటకు చెందిన టీడీపీ నాయకుడు బండారు రాజా పరిస్థితి కూడా ఇంతే. ఎంపీ తోట నరసింహం అనుచరునిగా ఉన్న పాపానికి అడుగడుగునా వివక్ష చూపిస్తున్నారు. రెండున్నరేళ్లుగా వీరికి ఎమ్మెల్యే ఒక్క పని కూడా చేయలేదు. సరికదా పార్టీ వ్యవహారాల్లో కూడా దూరంగా ఉంచుతున్నారు. ♦ టీడీపీకి చెందిన మరో నేత తోట అయ్యన్న దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎంపీ అనుచరునిగా నియోజకవర్గంలో కొనసాగుతుండటంతో సంక్షేమ, అభివృద్ధి పథకాల విషయంలో ప్రాధాన్యం ఇవ్వకపోగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా పెడుతున్నారు. వీరికెటువంటి సమాచారం ఇవ్వలేదు. రాజకీయంగా అణగదొక్కుతూనే ఉన్నారు. ♦ ఇలా చెప్పుకుని పోతే ఎంపీ తోట నరసింహం అనుచరులు అనేక మంది ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బాధితులుగా మిగిలిపోయారు. ఆయన పార్టీ ఫిరాయించిన దగ్గర నుంచి ఎంపీ అనుచరులకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. చివరికీ, ఎమ్మెల్యే తీరుతో నిలబడలేక కొందరు వర్గాన్ని మార్చేశారు. మరికొందరు చెల్లాచెదురై మౌనంగా ఉన్నారు. సమయం కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. ♦ గడిచిన ఎన్నికల్లో టీడీపీకి పెద్ద దిక్కుగా ఎంపీ తోట నరసింహం నిలిచారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున జ్యోతుల నెహ్రూ ఎన్నికయ్యారు. ఆ తర్వాత స్వప్రయోజనాల కోసం ఎమ్మెల్యేగా గెలిపించిన వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి జ్యోతుల నెహ్రూ జంపయ్యారు. ఒప్పందాలు, ప్రలోభాల నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి వచ్చాక అప్పటికే టీడీపీలో ఉన్న అనేక మంది ఇబ్బందులకు గురయ్యారు. తనతోపాటు టీడీపీలోకి వచ్చిన వారికి పెద్దపీట వేసి, టీడీపీ పాత నేతలను దూరం పెట్టడం మొదలు పెట్టారు. ఇప్పటికే అనేక మంది టీడీపీకి దూరమై వైఎస్సార్సీపీలోకి చేరారు. మరికొందరు ఎంపీ తోట నరసింహం అనుచరులుగా కొనసాగుతూ వస్తున్నారు. ఆ పంథా ఎమ్మెల్యేకు నచ్చలేదు. ఉంటే తనతో ఉండాలి...లేదంటే చుక్కలే అన్నట్టుగా రాజకీయాలు నెరిపారు. ఇంకేముంది తోట నర్సింహం అనుచరులంతా టార్గెటయ్యారు. రెండున్నరేళ్లుగా పాత నేతలకే ఇక్కట్లు గడిచిన ఎన్నికల్లో టీడీపీకి కష్టపడి పనిచేసిన వారందరికీ జ్యోతుల నెహ్రూ పార్టీలోకి వచ్చాక ఇబ్బందులు మొదలయ్యాయి. తన అనుకూల వ్యక్తులకు తప్ప పార్టీ కోసం పనిచేసినవారికి మేలు చేయడం లేదన్న వాదనలున్నాయి. రానున్న ఎన్నికల నాటికి తాను మాత్రమే ఉండాలని, మరొకరికి నియోజకవర్గంలో పట్టు ఉండకూడదని, తనకు ఎదురు నిలిచే నాయకుడు లేకుండా చూసుకోవాలన్న ధోరణితో పక్షపాత రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇంకేముంది టీడీపీలో ఉన్న పాత వారందరికీ ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. తనకు భవిష్యత్‌లో ఇబ్బందిగా తయారయ్యే అవకాశం ఉందన్న దూరదృష్టితో ఎంపీ తోట నరసింహం అనుచరుల్ని టార్గెట్ చేసినట్టు ఆ పార్టీలో చర్చ నడిచింది. అనుకున్నట్టుగా ఎంపీ కేడర్‌ను చెల్లాచెదురు చేయడంలో విజయం సాధించారన్న వాదనలున్నాయి. ఇక, కరుడుగట్టిన ఎంపీ అనుచరులు మాత్రం జ్యోతులకు సరెండర్ కాకుండా కొనసాగుతున్నారు. అలాంటి వారందరికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందకుండా కట్ చేశారన్న విమర్శలున్నాయి. ఏ ఒక్కరికీ ప్రాధాన్యత ఇవ్వకుండా మొండి చేయి చూపుతూ వస్తున్నారు. ఇళ్లు, పింఛన్లు, రుణాలు తదితర వాటిలో వివక్ష చూపిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నారని చెబుతున్నారు. నియోజకవర్గంలో ఎంపీకి విలువ లేకుండా చేశారన్న చర్చ కూడా సాగుతోంది. ఈ విషయంలో ఎంపీ తోట నరసింహం ఎక్కడా బయట పడకుండా మౌనంగా ఉంటున్నారు. తన వర్గీయులకు జరుగుతున్న అన్యాయంపై బాధపడుతూ అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారే తప్ప జ్యోతులతో పోరాడేందుకు సాహసించడం లేదు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన జగ్గంపేట నియోజకవర్గంలో క్యాడర్ చెల్లాచెదురు అవుతున్నా మౌనమే సమాధానంగా వ్యవహరిస్తున్నారు. మరీ, మున్ముందు బయటపడతారో...రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారో ఏమో గాని ప్రస్తుతానికి మాత్రం ఎంపీ అనుచరులంతా తీవ్ర ఆవేదనతో, అవమానంతో పార్టీలో కొనసాగుతున్నారు. -
కో అంటే కోటి...
ఈ చిత్రం చూశారు కదా...కోళ్లను చేతుల్లోకి తీసుకొని ఢీ కొట్టిస్తున్నవారు ఎవరో కాదు ... ఒకరు కాకినాడ ఎంపీ తోట నరసింహం...ఇంకొకరు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ. ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలే. ఈ ఘటన జరిగి ఇరవై నాలుగ్గంటలైనా ‘చట్టం తన పని తాను’ ఎందుకు చేసుకుపోలేదు. ప్రసార మాద్యమాల్లో హల్చల్ చేసినా...పత్రికల్లో ఫొటోలతో ప్రచురితమైనా జిల్లా అధికారులు ఎందుకు స్పందించలేదన్నదే ప్రశ్న. కోడి పందేల నిర్వహణపై కోర్టులు... కన్నెర్ర చేస్తున్నాయి జిల్లా కలెక్టర్... ససేమిరా అంటున్నారు జిల్లా ఎస్పీ... చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్నారు...చట్టానికి ప్రతినిధులైన వీరంతా ఒకే మాటపై ఉంటే ఏమి జరగాలి.. కచ్చితంగా చట్టం అమలు జరగాల్సిందే... ఆచరణలో...చట్ట‘బద్ధకం’గా పని చేయడంతో వ్యవస్థలను అవహేళన చేస్తూ ... జిల్లాలో పందేలు పరుగులు తీస్తున్నాయి.. కో...అంటే కోటి రూపాయలంటూ కాళ్లు దువ్వుతున్నారు... సాక్షి ప్రతినిధి, కాకినాడ: బరి గీస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు. బరికి స్థలమిస్తే యజమానులపై కేసు నమోదు చేస్తామంటున్నారు. కోడి పందేలే కాదు పేకాట, గుండాట, ఆశ్లీల నృత్యాలు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని చేస్తున్న హెచ్చరికలను నిర్వాహకులు ‘డోంట్ కేర్’ అనడం పోలీసులకు సవాల్‌గా మారింది. సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలే పండక్కి ముందే పందెం కోళ్లతో ఢీకొట్టిస్తూ మీ వెనుకే కాదు ... మీతోపాటు మేం ఉన్నామంటూ అధికార పార్టీ నేతలు భరోసానివ్వడంతో ‘కో అంటే కోటి’ అంటూ కోడి పందేలు వేసేందుకు బరిలు సిద్ధమవుతున్నాయి. ఏజెన్సీ, మెట్ట, కోనసీమ అనే తేడా లేకుండా పందెం కోళ్లు రె‘ఢీ’ అవుతున్నాయి. కోనసీమలోనైతే మరింత ఎక్కువగా బరులు ఏర్పాటవుతున్నాయి. మంత్రులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా శిబిరాలు ఇలా... ఒక్క మురమళ్లే కాదు జిల్లాలో దాదాపు 26 మండలాల్లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో జరిగిన ప్రాంతాల్లోనే మరింత హుషారుగా నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు. కపిలేశ్వపురం మండలం కపిలేశ్వరపురం, కేదారిలంక, వల్లూరు, పిఠాపురం మండలం పి.దొంతమూరు, మండపేట మండలం మండపేట, ద్వారపూడి, ఏడిద, వై.సీతానగరం, గొల్లప్రోలు మండలం కొడవలి, చెందుర్తి, తుని మండలం తేటగుంట, వి.కొత్తూరు, మల్లవరం, రాజరపేట, డి.పోలవరం, వల్లూరు, కుమ్మరిలోవ, ప్రత్తిపాడు మండలం రాచపల్లి, ఉత్తరకంచి, లంపకలోవ తోట, ధర్మవరం, మామిడికుదురు మండలం గోగన్నమఠం, పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని వేట్లపాలెం, మేడపాడు, వాలు తిమ్మాపురం, గోకవరం మండలం కృష్ణునిపాలెం, మల్లవరం, కామరాజుపేట, తంటికొండ, మలికిపురం మండలంలోని లక్కవరం, మలికిపురం, శంకరగుప్తం, గుడపల్లి, రాయవరం మండలం రాయవరం, కూర్మపురం, చెల్లూరు, మాచవరం, ఆత్రేయపురం మండలంలోని పేరవరం, తాడిపూడి, వసంతవాడ, లొల్ల, జగ్గంపేట మండలం కట్రావులపల్లి, రాజపుడి, కొత్తూరు, రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో కె.బాలాంత్రమ్, పేకేరు, మసకపల్లి, జగన్నదగిరి, కాజు లూరు, అల్లవరం మండలంలోని గోడి, గోడిలంక, కొమరిగిరిపట్నం, అల్లవరం, గుండెపుడి, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి, గొల్లవిల్లి, చల్లపల్లి, బీమనపల్లి, ఎస్.యానాం, రాజమండ్రి రూరల్ పరిధిలోని కావలగొయ్యి, పిడింగొయ్యి, కొలమూరు, బొమ్మూరు, వేమగిరి, అమలాపురం రూరల్‌లోని హిందుపల్లి, సమనస, సాకుర్రు, తొండంగి మండలం సీతారాంపురం, పి.చిన్నయ్యపాలెం, బెండపూడి, రావకంపాడు, పి.అగ్రహారం, కోన ప్రాంతాలు, బుచ్చియ్యపేట, పెరుమల్లపురం, వకడారిపేట, అద్దరిపేట, వేమవరం, రంపచోడవరం పరిధిలోని పందిరిమామిడి, బందపల్లి, జగమెట్లపాలెం, గెద్దాడ, వాడపల్లి, తామరపల్లి, ఆకూరు, ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం,కేసనకుర్రు, ఎదుర్లంక, నీలపల్లి,చెయ్యేరు, కాట్రేనికోన ప్రాంతాల్లో మళ్లీ జరుగనున్నాయి. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కోళ్ల సందడితోపాటు పేకాట, గుండాటలు కూడా భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నోట్ల ఇబ్బందులు... పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలు కన్నా పందెంగాళ్లకు నోట్ల సమస్య ఇబ్బందికరంగా మారింది. ఏటీఎంలలో నగదు రాకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో కరెన్సీ వేట మొదలైంది. ఎక్కడెక్కడ నగదు ఉందో తెలుసుకుని, వారి వద్ద నుంచి ఏదో ఓ గ్యారంటీ చూపించి డబ్బు సమీకరించేపనిలో పడ్డారు. కొందరు చెక్కుల ద్వారా, మరికొందరు ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేసేలా సిద్ధపడుతున్నారు. భోగి నాడే రూ.కోట్లాది పందేలకు సిద్ధం గతేడాది పోలీసులు, అధికారులు ఎన్ని ఆంక్షలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కోడి పందేలు ఆగలేదు. తొలుత కత్తుల్లేకుండా, ఆ తర్వాత కత్తులు కట్టేసి రక్తం చిందించారు. ఈసారి కూడా అదేరకంగా పావులు కదుపుతున్నారు. గత భోగి నాడు రూ.7 కోట్ల వరకూ పందేలు జరిగినట్టు అంచనా. ఈసారి రూ.10 కోట్ల వరకు పందేలు ఒక్క భోగి రోజునే జరుగుతాయని అంచనా. మురమళ్ల వద్ద భారీ ఏర్పాట్లు ఐ.పోలవరం మండల ముఖద్వారం మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం వెనుక శరభయ్య చెరువు సమీపంలో అధికార పార్టీ నేత కనుసన్నల్లో సుమారు 15 ఎకరాలలో కోడి పందేలకు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ వీక్షించేలా ప్రత్యేక వసతులు కూడా కల్పిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రధాన పోటీదార్లకు వాట్సాప్‌ల్లో ఆహ్వానాలు కూడా పంపించారని తెలిసింది. -
అంత సీన్ ఉందా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ :మాజీ మంత్రి తోట నరసింహానికి కాకినాడ లోక్‌సభ టిక్కెట్టు ఇచ్చే విషయమై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పునరాలోచనలో పడ్డారు. ఈ అంశం ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన తోటకు మెట్ట ప్రాంతం సహా జిల్లా అంతటా గట్టి పట్టుందని చంద్రబాబు భావించారు. అందుకే ఆయనను సైకిలెక్కించారు. ఇప్పటికే ఆయన మామ, మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు టీడీపీలోనే ఉన్నారు. వారిద్దరూ కలిస్తే పార్టీ జిల్లాలో బలపడుతుందని అధిష్టానం భావించింది. ఇదే కారణంతో టీడీపీలోకి తోట వచ్చీ రాగానే, ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జగ్గంపేట అసెంబ్లీ సీటు కేటాయించాలనుకున్నారు. కానీ బాబు నిర్ణయాన్ని పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబు సహా నేతలంతా మూకుమ్మడిగా వ్యతిరేకించారు. ఆ నిర్ణయాన్ని 24 గంటల్లోగా వెనక్కు తీసుకోవాలంటూ అల్టిమేటం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో తోటకు జగ్గంపేట సీటు కేటాయించడంపై చంద్రబాబు వెనకడుగు వేశారని, ఆయనకు కాకినాడ ఎంపీ టిక్కెట్టు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. సరిగ్గా ఇదే సమయంలో అసలు తోటను చేర్చుకోవడం పార్టీకి బలుపా, వాపా అనేదానిపై అధిష్టానం అంచనా వేసిదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో తోట చేరినపుడు ఆయనతో పాటు పలువురు అధిక సంఖ్యలో టీడీపీలోకి వలస వస్తారని అంచనా వేశారు. కానీ తోట టీడీపీలో చేరడానికి ముందే ఆయన అనుచరులు, ఇతర నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో తోట కేడర్ లేని లీడర్‌గా మారారన్న నిర్ధారణకు అధిష్టానం వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క మూడేళ్లపాటు మంత్రిగా పని చేసినా.. తాను ప్రాతినిధ్యం వహించిన జగ్గంపేటలోనే చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేదు. దీనిపై ఆయన నియోజకవర్గ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని కూడా అధిష్టానం గమనించినట్టు చెబుతున్నారు. మొత్తం పరిస్థితులను విశ్లేషించిన తరువాత కాకినాడ ఎంపీ టిక్కెట్టును తోటకు కేటాయించడంపై చంద్రబాబు పునరాలోచనలో పడినట్టు ఆ పార్టీ నేతలు అంటున్నారు. అలాకాకుంటే కాకినాడ నుంచి పార్లమెంటు అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు తోట ప్రకటించుకున్నప్పుడే బాబు నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చి ఉండేదని వారంటున్నారు. కానీ అధిష్టానం నుంచి అటువంటి సంకేతాలేవీ జిల్లా నేతలకు ఇంతవరకూ రాలేదు. కాకినాడ ఎంపీ సీటుపై ఆశలు పెంచుకున్న కైట్ విద్యా సంస్థల చైర్మన్ పోతుల విశ్వం అనుచరులు ఇటీవల రోడ్డెక్కి ఆందోళన చేసిన సందర్భంలో, కాకినాడ ఎంపీ టిక్కెట్టు విషయంలో ఎవ్వరికీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప చెప్పడం కూడా ఇక్కడ గమనార్హం. కాగా, బీజేపీ గట్టిగా పట్టుబడుతున్నందున అవసరమైతే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంతో పాటు కాకినాడను కూడా వదులుకుంటే కొంత తలపోటు తగ్గించుకున్నట్టు అవుతుందనే అభిప్రాయం టీడీపీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. అభివృద్ధిపై అలక్ష్యం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2008లో జగ్గంపేటకు డిగ్రీ కళాశాల మంజూరు చేశారు. కానీ నేటికీ భూ సేకరణను తోట చేపట్టలేకపోయారు. నిధులు సద్వినియోగంలోకి తేలేకపోయారన్న అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందని జె.కొత్తూరు సమీపంలో జటాద్రి కొండపై డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణానికి హడావిడిగా శంకుస్థాపన చేశారు. జనసంచారం, రవాణా మార్గం లేని ప్రాంతంలో కళాశాల ఏర్పాటుకు అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. కానీ దీనిని తోట పట్టించుకోలేదు. కిర్లంపూడి మండలం వీరవరం, ముక్కొల్లు, జగపతినగరం పంచాయతీల్లోని ఎస్సీ ప్రాంతాల్లో సుమారు రూ.5 కోట్ల ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్లకు రెండేళ్ల క్రితమే శంకుస్థాపన చేశారు. ఇంతవరూ పనులు చేపట్టలేదు. 3 వేల ఎకరాల ఆయకట్టుకు నీరే లేదు పుష్కర ద్వారా మురారి, గండేపల్లి, మల్లేపల్లి, రామయ్యపాలెం, ఎన్టీ రాజాపురం తదితర గ్రామాల్లో మూడు వేల ఎకరాలకు నీరందడం లేదు. పిల్ల కాలువలు నిరుపయోగమయ్యాయి. మరో పంప్‌హౌస్ నిర్మిస్తామన్న నరసింహం చివరకు ఆ మాట నిలుపుకోలేదు. - ముళ్లంగి వెంకట రమణారెడ్డి, రైతు, గండేపల్లి రోడ్డు సమస్య పరిష్కారం కాలేదు తిరుమలాయపాలెం - రంపయర్రంపాలెం గ్రామాల మధ్య ప్రధాన రహదారి అధ్వానంగా ఉంది. దీనిని పునర్నిర్మించాలని ఎన్నిసార్లు కోరినా తోట నరసింహం పట్టించుకోలేదు. రోడ్డు ఛిద్రమవడంతో ఆర్టీసీ బస్సు సేవలు కూడా నిలిచిపోయాయి. గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. - డోకుబుర్ర కల్యాణ్, తిరుమలాయపాలెం, గోకవరం మండలం