అంత సీన్ ఉందా!
అంత సీన్ ఉందా!
Published Sun, Apr 6 2014 12:16 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :మాజీ మంత్రి తోట నరసింహానికి కాకినాడ లోక్‌సభ టిక్కెట్టు ఇచ్చే విషయమై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పునరాలోచనలో పడ్డారు. ఈ అంశం ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన తోటకు మెట్ట ప్రాంతం సహా జిల్లా అంతటా గట్టి పట్టుందని చంద్రబాబు భావించారు. అందుకే ఆయనను సైకిలెక్కించారు. ఇప్పటికే ఆయన మామ, మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు టీడీపీలోనే ఉన్నారు. వారిద్దరూ కలిస్తే పార్టీ జిల్లాలో బలపడుతుందని అధిష్టానం భావించింది. ఇదే కారణంతో టీడీపీలోకి తోట వచ్చీ రాగానే, ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జగ్గంపేట అసెంబ్లీ సీటు కేటాయించాలనుకున్నారు. కానీ బాబు నిర్ణయాన్ని పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి జ్యోతుల చంటిబాబు సహా నేతలంతా మూకుమ్మడిగా వ్యతిరేకించారు. ఆ నిర్ణయాన్ని 24 గంటల్లోగా వెనక్కు తీసుకోవాలంటూ అల్టిమేటం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో తోటకు జగ్గంపేట సీటు కేటాయించడంపై చంద్రబాబు వెనకడుగు వేశారని, ఆయనకు కాకినాడ ఎంపీ టిక్కెట్టు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది.
సరిగ్గా ఇదే సమయంలో అసలు తోటను చేర్చుకోవడం పార్టీకి బలుపా, వాపా అనేదానిపై అధిష్టానం అంచనా వేసిదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో తోట చేరినపుడు ఆయనతో పాటు పలువురు అధిక సంఖ్యలో టీడీపీలోకి వలస వస్తారని అంచనా వేశారు. కానీ తోట టీడీపీలో చేరడానికి ముందే ఆయన అనుచరులు, ఇతర నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో తోట కేడర్ లేని లీడర్‌గా మారారన్న నిర్ధారణకు అధిష్టానం వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క మూడేళ్లపాటు మంత్రిగా పని చేసినా.. తాను ప్రాతినిధ్యం వహించిన జగ్గంపేటలోనే చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేదు. దీనిపై ఆయన నియోజకవర్గ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని కూడా అధిష్టానం గమనించినట్టు చెబుతున్నారు.
మొత్తం పరిస్థితులను విశ్లేషించిన తరువాత కాకినాడ ఎంపీ టిక్కెట్టును తోటకు కేటాయించడంపై చంద్రబాబు పునరాలోచనలో పడినట్టు ఆ పార్టీ నేతలు అంటున్నారు. అలాకాకుంటే కాకినాడ నుంచి పార్లమెంటు అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు తోట ప్రకటించుకున్నప్పుడే బాబు నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చి ఉండేదని వారంటున్నారు. కానీ అధిష్టానం నుంచి అటువంటి సంకేతాలేవీ జిల్లా నేతలకు ఇంతవరకూ రాలేదు. కాకినాడ ఎంపీ సీటుపై ఆశలు పెంచుకున్న కైట్ విద్యా సంస్థల చైర్మన్ పోతుల విశ్వం అనుచరులు ఇటీవల రోడ్డెక్కి ఆందోళన చేసిన సందర్భంలో, కాకినాడ ఎంపీ టిక్కెట్టు విషయంలో ఎవ్వరికీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప చెప్పడం కూడా ఇక్కడ గమనార్హం. కాగా, బీజేపీ గట్టిగా పట్టుబడుతున్నందున అవసరమైతే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంతో పాటు కాకినాడను కూడా వదులుకుంటే కొంత తలపోటు తగ్గించుకున్నట్టు అవుతుందనే అభిప్రాయం టీడీపీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
అభివృద్ధిపై అలక్ష్యం
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2008లో జగ్గంపేటకు డిగ్రీ కళాశాల మంజూరు చేశారు. కానీ నేటికీ భూ సేకరణను తోట చేపట్టలేకపోయారు. నిధులు సద్వినియోగంలోకి తేలేకపోయారన్న అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందని జె.కొత్తూరు సమీపంలో జటాద్రి కొండపై డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణానికి హడావిడిగా శంకుస్థాపన చేశారు. జనసంచారం, రవాణా మార్గం లేని ప్రాంతంలో కళాశాల ఏర్పాటుకు అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. కానీ దీనిని తోట పట్టించుకోలేదు.
కిర్లంపూడి మండలం వీరవరం, ముక్కొల్లు, జగపతినగరం పంచాయతీల్లోని ఎస్సీ ప్రాంతాల్లో సుమారు రూ.5 కోట్ల ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్లకు రెండేళ్ల క్రితమే శంకుస్థాపన చేశారు. ఇంతవరూ పనులు చేపట్టలేదు.
3 వేల ఎకరాల ఆయకట్టుకు నీరే లేదు
పుష్కర ద్వారా మురారి, గండేపల్లి, మల్లేపల్లి, రామయ్యపాలెం, ఎన్టీ రాజాపురం తదితర గ్రామాల్లో మూడు వేల ఎకరాలకు నీరందడం లేదు. పిల్ల కాలువలు నిరుపయోగమయ్యాయి. మరో పంప్‌హౌస్ నిర్మిస్తామన్న నరసింహం చివరకు ఆ మాట నిలుపుకోలేదు.
- ముళ్లంగి వెంకట రమణారెడ్డి, రైతు, గండేపల్లి
రోడ్డు సమస్య పరిష్కారం కాలేదు
తిరుమలాయపాలెం - రంపయర్రంపాలెం గ్రామాల మధ్య ప్రధాన రహదారి అధ్వానంగా ఉంది. దీనిని పునర్నిర్మించాలని ఎన్నిసార్లు కోరినా తోట నరసింహం పట్టించుకోలేదు. రోడ్డు ఛిద్రమవడంతో ఆర్టీసీ బస్సు సేవలు కూడా నిలిచిపోయాయి. గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
- డోకుబుర్ర కల్యాణ్,
తిరుమలాయపాలెం, గోకవరం మండలం
Advertisement
Advertisement