సాక్షి ప్రతినిధి, తూర్పు గోదావరి, కాకినాడ : ఎంపీ తోట నరసింహం దత్తత గ్రామమది. ఆ పార్టీకి చెందిన సర్పంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాకపోతే, ఎంపీ తోట నరసింహం అనుచరునిగా ఉంటున్నారు. ఇప్పుడదే కొంప ముంచింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కంటగింపుగా మారింది. ఎంపీ వెంట తిరుగుతున్నారని సర్పంచిపై కక్షగట్టారు. టీడీపీలోకి వచ్చిన దగ్గరి నుంచి అణగదొక్కుతున్నారు. ప్రతి పనికీ ఆటంకం కలిగిస్తున్నారు. గ్రామాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మంజూరైన అభివృద్ధి పథకాలు అమలు కాకుండా అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. ఇళ్లు, పింఛన్లు, రుణాలు తదితర సంక్షేమ పథకాలు ఎంపీ అనుచరులకు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. గత రెండున్నరేళ్లుగా జరుగుతున్న వివక్షను భరించలేక బూరుగుపూడి సర్పంచి పాఠంశెట్టి సూర్యచంద్ర ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. జ్యోతుల నెహ్రూ తీరుకు నిరసనగా ఆరు రోజులపాటు దీక్ష చేశారు. చివరికి పోలీసులు భగ్నం చేశారే తప్ప ఎమ్మెల్యే కనీసం స్పందించలేదు.
♦ జగ్గంపేటకు చెందిన టీడీపీ నాయకుడు బండారు రాజా పరిస్థితి కూడా ఇంతే. ఎంపీ తోట నరసింహం అనుచరునిగా ఉన్న పాపానికి అడుగడుగునా వివక్ష చూపిస్తున్నారు. రెండున్నరేళ్లుగా వీరికి ఎమ్మెల్యే ఒక్క పని కూడా చేయలేదు. సరికదా పార్టీ వ్యవహారాల్లో కూడా దూరంగా ఉంచుతున్నారు.
♦ టీడీపీకి చెందిన మరో నేత తోట అయ్యన్న దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎంపీ అనుచరునిగా నియోజకవర్గంలో కొనసాగుతుండటంతో సంక్షేమ, అభివృద్ధి పథకాల విషయంలో ప్రాధాన్యం ఇవ్వకపోగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా పెడుతున్నారు. వీరికెటువంటి సమాచారం ఇవ్వలేదు. రాజకీయంగా అణగదొక్కుతూనే ఉన్నారు.
♦ ఇలా చెప్పుకుని పోతే ఎంపీ తోట నరసింహం అనుచరులు అనేక మంది ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బాధితులుగా మిగిలిపోయారు. ఆయన పార్టీ ఫిరాయించిన దగ్గర నుంచి ఎంపీ అనుచరులకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. చివరికీ, ఎమ్మెల్యే తీరుతో నిలబడలేక కొందరు వర్గాన్ని మార్చేశారు. మరికొందరు చెల్లాచెదురై మౌనంగా ఉన్నారు. సమయం కోసం వారంతా ఎదురు చూస్తున్నారు.
♦ గడిచిన ఎన్నికల్లో టీడీపీకి పెద్ద దిక్కుగా ఎంపీ తోట నరసింహం నిలిచారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున జ్యోతుల నెహ్రూ ఎన్నికయ్యారు. ఆ తర్వాత స్వప్రయోజనాల కోసం ఎమ్మెల్యేగా గెలిపించిన వైఎస్సార్‌సీపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి జ్యోతుల నెహ్రూ జంపయ్యారు. ఒప్పందాలు, ప్రలోభాల నేపథ్యంలో జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి వచ్చాక అప్పటికే టీడీపీలో ఉన్న అనేక మంది ఇబ్బందులకు గురయ్యారు. తనతోపాటు టీడీపీలోకి వచ్చిన వారికి పెద్దపీట వేసి, టీడీపీ పాత నేతలను దూరం పెట్టడం మొదలు పెట్టారు. ఇప్పటికే అనేక మంది టీడీపీకి దూరమై వైఎస్సార్‌సీపీలోకి చేరారు. మరికొందరు ఎంపీ తోట నరసింహం అనుచరులుగా కొనసాగుతూ వస్తున్నారు. ఆ పంథా ఎమ్మెల్యేకు నచ్చలేదు. ఉంటే తనతో ఉండాలి...లేదంటే చుక్కలే అన్నట్టుగా రాజకీయాలు నెరిపారు. ఇంకేముంది తోట నర్సింహం అనుచరులంతా టార్గెటయ్యారు.
రెండున్నరేళ్లుగా పాత నేతలకే ఇక్కట్లు
గడిచిన ఎన్నికల్లో టీడీపీకి కష్టపడి పనిచేసిన వారందరికీ జ్యోతుల నెహ్రూ పార్టీలోకి వచ్చాక ఇబ్బందులు మొదలయ్యాయి. తన అనుకూల వ్యక్తులకు తప్ప పార్టీ కోసం పనిచేసినవారికి మేలు చేయడం లేదన్న వాదనలున్నాయి. రానున్న ఎన్నికల నాటికి తాను మాత్రమే ఉండాలని, మరొకరికి నియోజకవర్గంలో పట్టు ఉండకూడదని, తనకు ఎదురు నిలిచే నాయకుడు లేకుండా చూసుకోవాలన్న ధోరణితో పక్షపాత రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇంకేముంది టీడీపీలో ఉన్న పాత వారందరికీ ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. తనకు భవిష్యత్‌లో ఇబ్బందిగా తయారయ్యే అవకాశం ఉందన్న దూరదృష్టితో ఎంపీ తోట నరసింహం అనుచరుల్ని టార్గెట్ చేసినట్టు ఆ పార్టీలో చర్చ నడిచింది. అనుకున్నట్టుగా ఎంపీ కేడర్‌ను చెల్లాచెదురు చేయడంలో విజయం సాధించారన్న వాదనలున్నాయి. ఇక, కరుడుగట్టిన ఎంపీ అనుచరులు మాత్రం జ్యోతులకు సరెండర్ కాకుండా కొనసాగుతున్నారు.
అలాంటి వారందరికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందకుండా కట్ చేశారన్న విమర్శలున్నాయి. ఏ ఒక్కరికీ ప్రాధాన్యత ఇవ్వకుండా మొండి చేయి చూపుతూ వస్తున్నారు. ఇళ్లు, పింఛన్లు, రుణాలు తదితర వాటిలో వివక్ష చూపిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నారని చెబుతున్నారు. నియోజకవర్గంలో ఎంపీకి విలువ లేకుండా చేశారన్న చర్చ కూడా సాగుతోంది. ఈ విషయంలో ఎంపీ తోట నరసింహం ఎక్కడా బయట పడకుండా మౌనంగా ఉంటున్నారు. తన వర్గీయులకు జరుగుతున్న అన్యాయంపై బాధపడుతూ అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారే తప్ప జ్యోతులతో పోరాడేందుకు సాహసించడం లేదు. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన జగ్గంపేట నియోజకవర్గంలో క్యాడర్ చెల్లాచెదురు అవుతున్నా మౌనమే సమాధానంగా వ్యవహరిస్తున్నారు. మరీ, మున్ముందు బయటపడతారో...రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారో ఏమో గాని ప్రస్తుతానికి మాత్రం ఎంపీ అనుచరులంతా తీవ్ర ఆవేదనతో, అవమానంతో పార్టీలో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment