పోలీసులు చేతులెత్తేశారు. కళ్లెదుటే కోడిపందాలు జరుగుతున్నా కళ్లు మూసేసుకున్నారు. అమాత్యులు, అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు బరి తెగించి బరులు నిర్వహించినా వారి జోలికెళ్లలేకపోయారు. చోద్యం చూశారే తప్ప కోడి పందాల వైపు అడుగేసే సాహసం చేయలేకపోయారు. అయితే ఎవరి అండా లేకుండా ఆడుతున్న చిన్నపాటి పందేలపై దాడులు చేసి తమ పరువు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారు. సంక్రాంతి సందర్భంగా వీధుల్లోను, పల్లెల్లోనూ సరదాగా పేకాడుకునే వారిని అరెస్టు చేసి, కేసులు నమోదు చేసి తమ ‘సత్తా’ చాటుకున్నారు.
సాక్షి, విశాఖపట్నం: నగరంలోనూ, జిల్లాలోనూ గతంలోకంటే ఈ ఏడాది కోడిపందాలు ఊపందుకున్నాయి. కోడి పందాల నిర్వహణకు వీల్లేదంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చినా తగ్గకపోగా పెరిగాయి. కత్తులు కట్టకుండా కోడిపందాలకు అనుమతించాలన్న విజ్ఞప్తిని కూడా న్యాయస్థానం అంగీకరించలేదు. అయినప్పటికీ కోడిపందాలు జోరుగా సాగాయి. చట్టసభల సభ్యులే వాటికి తిలోదకాలిచ్చారు. తొలుత జిల్లాలోని నర్సీపట్నంలో జిల్లా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కోడి పందాలకు పబ్లిగ్గా శ్రీకారం చుట్టారు. నగరంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తన నియోజకవర్గం ఆరిలోవ రామకృష్ణాపురంలో పందాలకు నడుంకట్టారు. సంక్రాంతికి కొద్దిరోజుల ముందు అక్కడ కోడిపందాలను ట్రయల్ రన్‌లా నిర్వహిస్తే ఆరిలోవ పోలీసులు ఎమ్మెల్యే వెలగపూడి అనుచరుడితో సహా మరికొందరిని అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని కూడా ప్రకటించారు.
దీంతో పోలీ సులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా బాగా స్పం దించారని నగరవాసులు భావించారు. కానీ అదంతా తాత్కాలికమేనని తేలింది. భోగి నాటి నుంచి అదే ప్రదేశంలో వెలగపూడి అండ్ కో నిర్భీతిగా పందాలు ప్రారంభించారు. వీటిని వీక్షించడానికి ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కూడా వెళ్లడం విశేషం. ఆరిలోవలో జరుగుతున్న కోడిపందాలు రూ.కోట్ల లో పందాలు కాస్తున్నారు. అయినా పోలీసులు తూతూమంత్రంగా మరో ప్రాంతంలో ఆడుతున్న పందాల వద్దకు వెళ్లి పదిమందిని అరెస్టు చేశారు. మూడు పుంజులను, పదివేల నగదును స్వాధీనం చేసుకున్నారు. గుండాటలు వంటివి ఆడుతున్న మరో 28 మందిని అరెస్టు చేశారు.
రూ.కోట్లలో బెట్టింగులు..
జిల్లావ్యాప్తంగా సంక్రాంతి పండగ పేరు చెప్పి నిర్వహించిన కోడిపందాల్లో కోట్ల రూపాయలు బెట్టింగులు కట్టారు. జిల్లావ్యాప్తంగా రూ.10 కోట్ల విలువైన పందాలు జరగ్గా ఒక్క ఆరిలోవలోనే రూ.10 కోట్లు జరిగినట్టు అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల కత్తికట్టి కోడి పందాలు ఆడించారు. ముఖ్యంగా పాయకరావుపేట, నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం, అరకు నియోజకవర్గాల్లో ఈ పందాలు సాగాయి. విశాఖ ఏజెన్సీలోనూ కోడిపందాలు నిర్వహించారు. గొలుగొండ మండలం కేడీపేట, పాయకరావుపేట మండలం పాల్మాన్‌పేట తీర ప్రాంతం, నక్కపల్లి మండలం వేంపాడు, కశింకోట మండలం వెంకుపాలెం, ఏఎస్‌పేట, కన్నూరుపాలెం, చోడవరం మండలం అడ్డూరు, బుచ్చయ్యపేట మండలం రాజాం, పెదపూడి తదితర ప్రాంతాల్లో కోడిపందాలు సాగాయి. విశాఖ రూరల్ పోలీసులు దాడులు చేస్తారన్న భయంతో కొంతమంది పందెంరాయుళ్లు పొరుగున ఉన్న ఒడిశా సరిహద్దులకు వెళ్లి కోడిపందాలు నిర్వహిస్తున్నారు. హుకుంపేట మండలానికి ఆనుకుని ఉన్న ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సోబాపుట్‌లో పందాలు జోరుగా సాగిస్తున్నారు. అక్కడ పోలీసులు దాడులు నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ భారీగా బెట్టింగులు వేస్తున్నారు.
అరెస్టులు.. కేసులు
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు 29 కోడి పందాల కేసులు నమోదు చేశారు. 145 మందిని అరెస్టు చేశారు. 77 కోడిపుంజులను, రూ. 1,48,637 లను స్వాధీనం చేసుకున్నారు. 16 గ్యాంబ్లింగ్ కేసులు నమోదు చేసి 77 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,39,018 లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నగరం మొత్తమ్మీద పోలీసులు ఆరిలోవలో రెండంటే రెండే కేసులను నమోదు చేసి కోడిపందాలాడుతున్న 10 మందిని, గుండాటలు వంటివి ఆడుతున్న మరో 28 మందిని ఆరె స్టు చేశారు. 3 కోడిపుంజులు, రూ.10 వేల నగదును మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. సబ్బ వ రం మండలం దేవీపురం, గుల్లేపల్లి తోటల్లో పం దేలు ఆడుతున్న పది మందిని అ రెస్టు చేసి రూ. లక్షా పది వేల నగదును పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment