కలర్‌ఫుల్‌ పందెం | Hen Fights In krishna District | Sakshi
Sakshi News home page

కోట్లాట

Published Thu, Jan 17 2019 1:36 PM | Last Updated on Thu, Jan 17 2019 1:36 PM

Hen Fights In krishna District - Sakshi

కలర్‌ఫుల్‌ పందెం

ఏటా జరిగినట్టే.. కోడి గెలిచింది.. ఖాకీ ఓడింది. హెచ్చరికలు, ఆంక్షలు నీటి బుడగలయ్యాయి.సంప్రదాయం ముసుగులో పందెం కోడి కదం తొక్కింది. కాళ్లకు కట్టిన కత్తితో బరిలో దిగి హల్‌చల్‌ చేసింది. అనుబంధంగా కాయ్‌ రాజా.. కాయ్‌ అంటూ పందెం రాయుళ్లు రెచ్చిపోయారు. పందేలకు తోడు పేకాట, గుండాట తదితర జూద క్రీడలు యథేచ్ఛగా సాగిపోయాయి. వెరసి భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో దాదాపు రూ. 1000 కోట్లకు పైగా చేతులు మారాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు బరుల వైపు కన్నెత్తి చూడలేదు.

సాక్షి, అమరావతిబ్యూరో : జిల్లాలో పందెంకోడి కాలు దువ్వింది. పోలీసుల హడావుడిని తోసిరాజని కూత పెట్టింది. ఏ ప్రాంతంలో చూసినా కోడిపందేలు, గుండాట, పేకాట యథేచ్ఛగా జరిగాయి. కంకిపాడు మండలం ఈడుపుగల్లు, గొడవర్రు, ఉయ్యూరు మండలంలోని గండిగుంట, కాటూరు, బోళ్లపాడు, ఆకునూరు తదితర ప్రాంతాల్లో పందేలు భారీగా సాగాయి. నందిగామ మండలం కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడులో జరిగాయి.  కైకలూరు నియోజకవర్గంలోని కైకలూరు, ఆటపాక, కలిదిండి, కోరుకొల్లు, ముదినేపల్లి మండలంలో ముదినేపల్లి వైవాకలో పెద్ద ఎత్తున పందేలు జరిగాయి. మైలవరం నియోజకవర్గ పరిధిలోని నాగలూరు, బాపులపాడు మండలంలో అంపాపురం, ఉంగుటూరు మండలంలో ఇందుపల్లి, జగ్గయ్యపేట మండలంలోని చిల్లకల్లు, షేర్‌మహ్మద్‌పేటల్లో పందేలు వేశారు. పెనమలూరు మండలం పోరంకి, మచిలీపట్నం మండల పరిధిలోని గోపువానిపాలెం, శ్రీనివాసనగర్, మేకావానిపాలెం తదితర ప్రాంతాల్లో పందేలు జోరుగా సాగాయి. ఆయా ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఆటంకం లేకుండా ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు. భారీ షామియానాలు వేసి, ఇనుప చట్రాలతో బరులు నిర్మించారు. పలుగ్రామాల్లో పేకాట శిబిరాలు నిర్వహించారు.

కోడిపందేల మాటున కోతముక్క, గుండాట
ఏటా తరహాలోనే ఈ ఏడాది కూడా సరిగ్గా భోగి ముందురోజున పందేలకు అనధికార అనుమతులు వచ్చాయి. అప్పటి వరకూ అక్కడక్కడా కఠినంగా వ్యవహరించిన పోలీసులు చల్లబడ్డారు. దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ కోళ్లు రంగంలోకి దిగాయి. సంప్రదాయ విధానంలో కోడిపందేలు నిర్వహించవచ్చునంటూ కొంతమంది నాయకులు ప్రకటనలిచ్చారు. అయితే మూడు రోజులపాటు నిర్వహించిన పందేల్లో ఎక్కడా సంప్రదాయ కోడిపందేలు జరగలేదనే చెప్పాలి. కోడిపందేల మాటున గుండాట, కోతాట భారీగా జరిగాయి. పందేల కంటే వీటి వద్దే జనం ఎక్కువగా ఉన్నారనే చెప్పాలి. జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి ఈ మూడు రోజుల్లో రూ. 800 కోట్లు చేతులుమారి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

విజయవాడలో చేతులెత్తేసిన పోలీసులు
ఈ ఏడాది గతంలో ఎప్పుడూ లేని విధంగా విజయవాడ నగరంలో కోడిపందేలు, కోతముక్క, పేకాటను విచ్ఛలవిడిగా నిర్వహించారు. భవానీపురం జాతీయ రహదారి పక్కన ఎట్కిన్‌సన్‌ స్కూల్‌ సమీపంలో అధికారపార్టీకి చెందిన ఓ టీడీపీ నేత నేతృత్వంలో నిర్వహించిన కోడిపందేల్లో పాల్గొనేందుకు దూరప్రాంతాల నుంచి సైతం తరలివచ్చి రూ.లక్షల్లో పందేలు కాశారు. ఇక టీడీపీ పార్టీ ముఖ్యనేతలు ఎవరూ కోడిపందేల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినప్పటికీ.. వారి ఆధ్వర్యంలో నగరంలోని స్టార్‌ హోటళ్లలో నిర్వహించిన కోతముక్క పేకాటలో మూడు రోజులుగా బిజీబిజీగా గడపటం గమనార్హం. రామవరప్పాడు రింగ్‌ సమీపంలో రెండు స్టార్‌ హోటళ్లు, టిక్కిల్‌ రోడ్డులోని ఓ స్టార్‌ హోటల్‌లో ప్రత్యేక గదుల్లో ఏర్పాటు చేసిన కోతముక్క ఆటలో కోసుకు రూ. లక్ష చొప్పున పందేలు జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 200 కోట్లకు పైగా చేతులు మారినట్లు అంచనా.

నామమాత్రంగా దాడులు..
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీస్‌ శాఖ పరంగా అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జూదక్రీడల నిర్వహణతో సంబంధం ఉన్న దాదాపు 567 మందిని బైండోవర్‌ చేశారు. గతంలో నిర్వహించిన బరులకు సంబంధించిన యజమానులకు ఇప్పుడు పందేలు నిర్వహించకుండా నోటీసులు జారీ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మచిలీపట్నం, గూడూరు, ముసునూరు, ఘంటసాల మండలాల పరిధిలో దాడులు చేసి బరులను ధ్వంసం చేశారు. అయినా అదే ప్రాంతాల్లో నిర్వాహకులు పందేలు నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గంలోనూ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చిన్న శిబిరాలపై దాడులు నిర్వహించి అధికార టీడీపీ నేతలను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం రైల్వేస్టేషన్‌ సమీపంలో బహిరంగంగా పక్కా ఏర్పాట్లతో కోతముక్క సాగినా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.

మామూళ్ల మత్తులో యంత్రాంగం
ఈ దందాలకు అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించిందన్న విమర్శలున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలే నిర్వాహకులు కావడంతో చోద్యం చూశాయి. కత్తులు కట్టి కోడిపందేలతోపాటు మద్యం, జూదం దందాలవైపు కనీసం కన్నెత్తి చూడనేలేదు. టీడీపీ నేతలు ఎక్కడికక్కడ పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్‌ యంత్రాంగాలను అదుపు చేసినట్లు తెలుస్తోంది.

వందల కోట్లు కొల్లగొట్టిన టీడీపీ నేతలు..
ఈ కోడిపందేలను వెనుకుండి ప్రజాప్రతినిధులే ఆడించిన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, పందెంరాయుళ్లకు ప్రజాప్రతినిధులే మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. ప్రతి బరి వద్ద ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం గమనార్హం. పందేల మాటున వసూలు చేసిన కమీషన్ల రూపంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు రూ. 300 కోట్లు జేబుల్లో వేసుకున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement