కోజను శుభ్రం చేస్తున్న యువకుడు , ఐదు కేజీల కోజ
పశ్చిమగోదావరి, నిడదవోలు : కోజకు యమ డిమాండ్ పలికింది. కోడి పందేల్లో ఓడిపోయిన కోడిని కోజ అంటారు. బరుల్లో రెండు పుంజులకు కత్తులు కట్టి పోరుకు దింపిన తరువాత పోటీల్లో ఓడిన కోడిని గెలిచిన కోడికి సంబంధించిన పందెం రాయుడు తీసుకుపోతాడు. పందెంలో ఓడిన కోడితో పాటు కాసిన పందెం సొమ్ములు కూడా పొగొట్టుకుంటుంటారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయంగా పెద్దలు చెబుతున్నారు. సంక్రాంతి సీజన్‌కు ముందు కోడికి మూడు నెలల నుంచి ఎన్నో పోషక విలువలున్న ఆహారాన్ని పెట్టి దట్టంగా మేపుతారు.
ఒక్కో పుంజు 3 కేజీల నుంచి 10 కేజీల వరకు బరువు ఉండి మంచి దట్టంగా తయారైన తర్వాత బరుల్లో దింపుతారు. పందేల్లో చనిపోయిన కోజాలకు డిమాండ్ ఉండటంతో 5 కేజీల కోజాను రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయించారు. వీటికి ఎంత రేటయినా కోజను కొనేందుకు జనాలు ఎగబడ్డారు. బరుల్లో చాలామంది పందాలు కాయడానికి వస్తే మరికొందరు కోజ కోసం ఎంతైనా చెల్లించి కొనాలని చాలామంది బరుల వెంట తిరిగారు. భోజనప్రియులకు కోజ పసందైన కూర.
Comments
Please login to add a commentAdd a comment