ఆకివీడు మండలంలో గుండాట ఆట వద్ద యువతులు
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు: సుప్రీంకోర్టు తీర్పు బేఖాతరైంది. సంప్రదాయం ముసుగులో కోడిపందేలు యథేచ్ఛగా సాగాయి. రూ.వందలకోట్లలో జూదాలు జరిగాయి. వందలాది జీవితాలు కొడిగట్టాయి. తలకిందులయ్యాయి.
మూడురోజుల్లో రూ.200 కోట్లపైనే..!
జిల్లావ్యాప్తంగా పండగ మూడురోజుల్లో రూ.కోట్లాది రూపాయలు చేతులు మారాయి. కోడిపందేల మాటున పేకాట, గుండాట, కోతాట, లోనాబయటా వంటి ఆటలు యథేచ్ఛగా సాగాయి. దిగువ, మధ్యతరగతి వ్యక్తులేకాదు సంపన్నులూ కోలుకోలేని దెబ్బతిన్నారు. భోగి నాడు మొదలైన పందేలు, పేకాటలుసంక్రాంతి రోజు తారాస్థాయికి చేరాయి. కనుమ రోజు రాత్రి వరకూ పందేలు సాగుతూనే ఉన్నాయి. ఉన్నతస్థాయి వర్గాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు పక్కకు తప్పుకోవడంతో జూదరులు బరితెగించారు. భారీగా బరులు ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు తేడా లేకుండా జూదాలు నిర్వహించారు. అక్కడే మద్యం దుకాణాలు, బెల్టు షాపులూ వెలిశాయి. రాత్రుళ్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జూదాలు కొనసాగించారు. జాతరలను బరులు తలపించాయి. జూదరులు కోడిపందేలు, పేకాటల్లో రూ.లక్షలు పోగొట్టుకుంటే గుండాట, కోతాటల్లో రూ.వేలకు వేలు చేతులు మారాయి.
230 బరులు
తొలుత పోలీసులు ఆంక్షలు విధించినా.. పందేల నిర్వాహకులు లైట్ తీసుకున్నారు. అక్కడక్కడ బరులు ధ్వంసం చేశామని, బైండోవర్ కేసులు నమోదు చేశామని పోలీసు శాఖ ప్రకటించుకున్నా.. జిల్లాలో సుమారు 230 బరుల్లో పందేలు జరిగాయంటే నిర్వాహకులు ఎంతగా రెచ్చిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఎట్టిపరిస్థితుల్లోనూ కోడిపందేలు అడ్డుకుంటామని ఉన్నతాధికారులు ప్రకటించినా మౌఖిక ఆదేశాల మేరకు పోలీసులు మాత్రం ఆయా స్టేషన్లకే పరిమితమయ్యారు. దీనికోసం భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి.
30 పెద్ద బరులు
జిల్లావ్యాప్తంగా 30 వరకూ పెద్ద బరులు ఏర్పాటవగా, 200 వరకూ చిన్న బరులు వెలిసినట్టు అంచనా. పెద్ద బరుల నుంచి పోలీసులకు ముడుపుగా ఒక్కోచోట నుంచి రూ.1.50 లక్షల నుంచి రెండున్నర లక్షల వరకూ, చిన్నబరుల నుంచి రూ.25 వేలు చొప్పున అందినట్టు సమాచారం. ఈసారి రెవెన్యూ అధికారులతోపాటు ఎన్నికల వేళ కావడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా నిర్వాహకుల నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. కోడి పందేలు జరిగే ప్రాంతాల్లో దాడులు చేస్తున్నట్లు చూపించడానికి ఒక్కో బరి నుంచి నలుగురైదుగురిపై కేసులు కట్టేలా వారి పేర్లను నిర్వాహకులే ఇవ్వాలని పోలీసులు షరతులు విధించినట్లు సమాచారం. మరోవైపు మద్యం అమ్మకాలూ విచ్చలవిడిగా జరిగాయి. ప్రతి బరి వద్ద ఒక బెల్ట్‌షాపు ఏర్పాటు చేయగా, పెద్ద బరులు ఉన్న చోట్ల నాలుగు వరకూ ఏర్పాటు చేశారు. నిర్వాహకునికి రూ.పది వేలు, ఎక్సైజ్ అధికారులకు రూ.పదివేలు చొప్పున ఇచ్చేలా ఒప్పందాలు కుదిరినట్టు తెలుస్తోంది.
తెలంగాణ నుంచి భారీగా
భీమవరం, ఉండి, పాలకొల్లు, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో భారీగా బరులు వెలిశాయి. పందేలు కొనసాగాయి. చింతలపూడి మండలంలోని సీతానగరం, చింతలపూడి , లింగపాలెం మండలంలోని ములగలంపాడు, కలరాయనగూడెం, కామవరపుకోట మండలంలో రావికంపాడు, జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాల్లో భారీగా పందేలు జరిగాయి. తెలంగాణ నుంచి భారీగా జూదరులు తరలివచ్చారు. సుమారు రూ.5 కోట్లకుపైగా చేతులు మారాయి.
♦ కామవరపుకోట మండలం రావికంపాడు అడ్డరోడ్డు వద్ద జరుగుతున్న పందేల్లో మంగళవారం రాత్రి కోతాట, గుండాట ఆడుతున్న వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఇది తోపులాటకు దారితీసింది. నిర్వాహకులు కల్పించుకుని సర్దుబాటు చేశారు.
♦ కొవ్వూరు నియోజకవర్గంలో 22 చోట్ల కోడి పందేల శిబిరాలు ఏర్పాటు చేశారు. తాళ్లపూడి మండలం గజర్జం, వేగేశ్వరపురం,పెద్దేవం గ్రామాల్లో రెండేసి శిబిరాలు ఏర్పాటు చేశారు. రావూరుపాడు, తుపాకులగూడెంలో తదితర చోట్ల పందెలు నిర్వహించారు. పెద్ద సంఖ్య లో గుండాటలు జరిగాయి.
♦ పోలవరం నియోజకవర్గంలో 7 మండలాల్లో సుమారు 45 బరులు ఏర్పాటయ్యాయి. జీలు గుమిల్లి మండలం తాటియాకులగూడెం బరిలో కొట్లాట జరిగింది. ఇద్దరికి గాయాలయ్యాయి.
♦ తాడేపల్లిగూడెం రూరల్ , పెంటపాడు మండలాల్లో పందేలు భారీగా సాగాయి. రెండు బరు ల వద్ద ఫ్లడ్‌లైట్ల కాంతిలో పందేలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో 17 బరులు వెలిశాయి.
♦ ఉంగుటూరు నియోజకవర్గంలోనూ పందేలు భారీగా జరిగాయి. 20 బరులు వెలిశాయి. రూ. 8 కోట్ల వరకు చేతులు మారినట్లు అంచనా.
♦ ఏలూరు మండలంలో 8 ప్రధాన బరులు, 40 చిన్న బరులు ఏర్పాటయ్యాయి. ఈ బరులను మాజీ ప్రజాప్రతినిధులే నిర్వహించారు. మండలంలో గుడివాక లంక, చొదిమెళ్ల, కొమడవోలు, శనివారపుపేట, జాలిపూడి, శ్రీపర్రు, ప్రత్తికోళ్లలంక, వెంకటాపురంలో పందేలు జరిగాయి.
♦ నిడదవోలు నియోజకవర్గంలో 22 బరులు వెలిశాయి. సుమారు రూ.కోటి వరకూ పందేలు జరిగినట్టు అంచనా.
♦ నరసాపురం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూలేని విధంగా విచ్చలవిడిగా కోడిపందేలు, పేకాట, గుండాట సాగాయి. 14 బరులు ఏర్పాటయ్యాయి. టీడీపీ నాయకులు దగ్గరుండి జూదాలు నిర్వహించడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు.
♦ ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర, పోడూరు, పెనుగొండ మండలాల్లో 20కిపైగా గ్రామాలలో కోడిపందేలు జోరుగా సాగాయి. మార్టేరులో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పందేలు నిర్వహించారు.
♦ గోపాలపురం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో 27 గ్రామాల్లో బరులు ఏర్పాటు చేశారు. సుమారు రూ.10కోట్లకు పైగా చేతులు మారాయి.
♦ తణుకు పట్టణంతోపాటు ఇరగవరం, అత్తిలి మండలాల్లో కోడి పందేలు తిరునాళ్లను తలపించే రీతిలో జరిగాయి. నియోజకవర్గంలో 16 చోట్ల బరులు ఏర్పాటు చేశారు.
♦ దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదపాడు, పెదవేగి మండలంలో కొప్పాక కవ్వగుంట, లక్ష్మీపురం, వేగివాడ ప్రాంతాల్లో కోడిపందేలు భారీ ఎత్తున నిర్వహించారు.
♦ ఉండి నియోజకవర్గంలో ఐ.భీమవరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు మండలాల్లో జరిగాయి. రూ.10 కోట్ల వరకు చేతులు మారాయి. మొత్తం 27 బరులు ఏర్పాటు చేశారు.
♦ పాలకొల్లు మండలంలోని పూలపల్లి, పాలకొల్లు టౌన్, వేదంగి, వడ్లవానిపాలెం తదితర ప్రాంతాల్లో పందేలు సాగాయి. మొత్తం 20 బరులు ఏర్పాటయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment