చెందుర్తిలో కోడిపందేలు
తూర్పుగోదావరి, గొల్లప్రోలు (పిఠాపురం): పందెం ప్రియుల ముందు ఖాకీల హెచ్చరికలు వెలవెలబోయాయి. గొల్లప్రోలు మండలంలోని కోడి పందేలు యథేచ్ఛగా కొనసాగాయి. మారుమూల ప్రాంతాలు, తుప్పలు, డొంకల్లో కాకుండా ఈసారి బహిరంగంగానే పందేలు మొదలయ్యాయి. తాటిపర్తిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్‌లో వెనుక కోడి పందేలు నిర్వహించారు. భారీ టెంట్‌లు, కుర్చీలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పందెం ప్రియులు మోటార్‌సైకిళ్లు, కార్లపై పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక టీడీపీ నాయకులు పందెం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చేబ్రోలులోని అడవిపుంత సమీపంలో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకులు పోటీలను ఆర్భాటంగా ప్రారంభించారు. కోళ్లకు కత్తులు కట్టి పోటీల్లో ఉత్కంఠ రేపుతున్నారు. ఇక్కడ రెండు బరుల్లో పోటీలు సాగుతున్నాయి. దుర్గాడ, చెందుర్తి, చినజగ్గంపేట, మల్ల వరం గ్రామాల్లో టీడీపీ నాయకులు పర్యవేక్షణలో భారీ ఎత్తున పందేలు సాగుతున్నాయి.
పెద్ద మొత్తాల్లో బెట్టింగ్‌లు
పందెం బరులు వద్ద పెద్ద మొత్తాల్లో బెట్టింగ్‌లు చేస్తున్నారు. ఒక్కో పందేనికి రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు బెట్టింగ్ చేస్తున్నారు. మూడు రోజులు వ్యవధిలో రూ.కోటికి పైగా బెట్టింగ్‌లు ఉంటాయని చెబుతున్నారు.
సిండికేట్‌గా ఏర్పడి..
తాటిపర్తికి చెందిన జూదరులు సిండికేట్‌గా ఏర్పడి చేబ్రోలు, తాటిపర్తి, చెందుర్తి గ్రామాల్లో గుండాట శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో ఆటకు రూ.లక్షకు పైగా పందేం సాగుతోంది. కోడి పందేల శిబిరాలు వద్ద గుండాటలు, బొమ్మా బొరుసు వంటి జూదాలు కూడా ఏర్పాటు చేశారు. గంటల వ్యవధిలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి.
పత్తా లేని పోలీసులు
కోడిపందేలు, గుండాలు, పేకాటలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ, పోలీసు అధికారుల హెచ్చరికలు నీటిమూటలుగా మిగిలిపోయాయి. అధికార పార్టీ అధినేత ఒత్తిడితో పోలీసులు మౌనం దాల్చి, స్టేషన్ విధులకే పరిమితమయ్యారు. కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు సెల్‌ఫోన్లను లిఫ్ట్ చేయడం లేదని పలువురు చెబుతున్నారు. పందేల నిర్వాహకులు పోలీసులకు భారీగా మామూళ్లు ముట్ట చెప్పారన్న విమర్శలు బాహాటంగా వినిస్తున్నాయి. మూడు రోజుల పందేలు నిర్వహణకు బరుల వారీగా మొత్తాన్ని చెల్లించారని పందెం ప్రియులు బాహాటంగా ప్రచారం చేస్తున్నారు. ఒక్కో బరికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించారని వారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment