
విజయవాడ: పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ కోడిపందేలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. విజయవాడ కమిషనరేట్‌తో పాటు జిల్లావ్యాప్తంగా ఆదివారం దాదాపు వంద బరుల్లో జరిగిన కోడి పందేలు, జూదంలో సుమారు రూ.100 కోట్లు చేతులు మారినట్లు అంచనా. టీడీపీ ప్రజాప్రతిని«ధులు, నాయకులు బహిరంగంగా కోడిపందేల్లో పాల్గొన్నారు. అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బరుల్లో సుప్రీంకోర్టు నిబంధనలకు తుంగలో తొక్కి కత్తులతోనే కోడి పందేలు నిర్వహించారు. వందలాది కోళ్లు పందేల్లో పోరాడి రక్తపు మడుగులో ప్రాణాలు వదిలాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన పోలీసు యంత్రాంగం వారికి సలామ్ కొట్టి బరుల నిర్వహణకు అనుమతి ఇచ్చేసింది.
ఏరులై పారిన మద్యం
ఎన్నడూలేని విధంగా విజయవాడ నగరంలో కోడి పందేల బరి ఏర్పాటు చేశారు. మిగతా 13 నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ ఒక్కో నియోజకవర్గానికి కనీసం ఐదారు బరుల్లో పందేలు నిర్వహించారు. ఈ బరుల్లో జూదం యథేచ్ఛగా జరగ్గా, మద్యం ఏరులై పారింది. దాదాపు అన్ని బరుల వద్ద బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలతో పాటు టీడీపీ కార్యకర్తలు రెస్టారెంట్లు కూడా నిర్వహించారు. కొందరు టీడీపీ కార్యకర్తలు బరుల వద్ద ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లను నిర్వహించి సొమ్ము చేసుకున్నారు. విజయవాడ శివారు ప్రాంతమైన ఈడ్పుగల్లులో కోడిపందేల బరికి కర్నాటక, హైదరాబాద్, తెలంగాణ నుంచి పందెపురాయుళ్లు తరలివచ్చారు. టీడీపీ నేతలు ఏర్పాటుచేసిన బరుల్లో కోడిపందేలతో పాటు కోత ముక్క జూదం, పెద్దబజార్, చిన్నబజార్, గుండు ఆటతో పాటు రకరకాలుగా జూదం నిర్వహించారు.
హోటళ్లు, లాడ్జిలు ఫుల్
కోడిపందేల నేపథ్యంలో విజయవాడలో హోటళ్లు, లాడ్జిలు కిటకిటలాడాయి. హైదరాబాద్, కర్నాటక నుంచి పందెపురాయుళ్లు ఇక్కడ మకాం పెట్టారు.
పత్తాలేని పోలీసులు
జిల్లావ్యాప్తంగా కోడిపందేలు జరిగినా పోలీస్ యంత్రాంగం పత్తా లేకుండాపోయింది. జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, సిటీ జాయింట్ పోలీస్ కమిషనర్ బీవీ రమణకుమార్‌లు కోడి పందేలు, జూదం జరగనివ్వబోమని రెండు రోజులుగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రత్యేక బలగాలను ఏర్పాటుచేశామని, 144వ సెక్షన్ కూడా అమలు చేస్తున్నామని ప్రకటించారు. అయితే, అన్ని నియోజకవర్గాల్లో బరులు నిర్వహించినా పోలీసులు పత్తా లేకుండాపోయారు.
జిల్లావ్యాప్తంగా ఇలా..
♦ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం అవుట్ ఏజెన్సీ వద్ద జాతీయ రహదారి పక్కనే టీడీపీ నేతలు మూడు ఎకరాల పొలంలో పెద్ద బరిని ఏర్పాటుచేశారు.
♦ తూర్పులోని కృష్ణలంక, రామలింగేశ్వరనగర్ రుద్రభూమి వద్ద టీడీపీ నాయకులు కోడిపందేలు ప్రారంభించారు. జూదం జోరుగా సాగింది.
♦ పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరు, పోరంకి, ఈడ్పుగల్లు, పెదపులిపాక, బోళ్లపాడు, ఉయ్యూరు పరిసర గామ్రాల్లో బరులు నిర్వహించారు. ఈడ్పుగల్లు బరిలో పొట్టేళ్లతో పందేలు జరిగాయి. వీటికి హైదరాబాద్, కర్నాటక, తెలంగాణ నుంచి పందెందారులు తరలివచ్చారు. పేకాట కోసుల్లో చట్ట వ్యతిరేక కోతముక్క ఆటను కూడా నిర్వహించారు. ఇక్కడ టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధులు ఇద్దరు పాల్గొనగా, అనుచరులు బరులు వేశారు.
♦ గన్నవరం నియోజకవర్గంలో అంపాపురం గ్రామంలో కోడిపందేల బరిని నిర్వహించారు. అధికార పార్టీ ముఖ్యనేత అనుచరగణం శిబిరాలు ఏర్పాటుచేసింది. టీడీపీ నాయకులు జూద శిబిరాలు నిర్వహించారు.
♦ గుడివాడ బైపాస్ రోడ్డు, పోలుకొండ, పుట్టగుంట, గుడ్లవల్లేరు, డోకిపర్రులో టీడీపీ నేతల ఆధ్వర్యంలో కోడిపందేలు జరిగాయి.
♦ తిరువూరు పట్టణంతో పాటు కాకర్ల, పెనుగొలను, ఊటుకూరులో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున కోడిపందేల్లో పాల్గొన్నారు.
♦ మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ వద్ద కోడిపందేల కోసం బరి ఏర్పాటుచేశారు. మైలవరం సమీపంలోని పుల్లూరు, గణపవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం మండలాల్లో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో కోడిపందేలు నిర్వహించారు.
♦ మోపిదేవి మండలం రావివారిపాలెం, ఘంటసాల మండలం, కొడాలిలో టీడీపీ నేతలు కోడిపందేలు భారీగా నిర్వహించారు.
♦ జగ్గయ్యపేటలోని షేర్‌మహ్మద్‌పేట, నందిగామ, కైకలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం రూరల్ ప్రాంతంలో, నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లిలో కోడిపందేలు జరిగాయి.
‘బరి’ తెగించిన తమ్ముళ్లు
హనుమాన్ జంక్షన్ రూరల్ (గన్నవరం): ‘సంక్రాంతి సంప్రదాయం’ పేరుతో తెలుగు తమ్ముళ్లు భారీ జూద శిబిరానికి తెరలేపారు. బాపులపాడు మండలం అంపాపురంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో సకల సదుపాయాలు, హంగామాతో జూద శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహాన్ అనుచరగణం పర్యవేక్షణలో ఈ జూదాలు సాగాయి. పేకాట, కోడిపందేలు, గుండాట, కాయ్ రాజా కాయ్ వంటి జూదాలు అడ్డూ అదుపు లేకుండా జరిగాయి. పండగ ముసుగులో ఇష్టారాజ్యంగా జూద శిబిరాన్ని నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు పత్తా లేరు. నిన్నటి వరకు కోడిపందేలు జరగనివ్వబోమని పోలీస్ పికెటింగ్, బైండోవర్ కేసులు పెట్టిన పోలీసులు ఆదివారం అడ్రస్ లేకుండా పోయారు.
రూ.లక్షల్లో పందేలు
జూద శిబిరంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. సంప్రదాయం పేరుతో అమాయకుల జేబులు గుల్ల చేసేందుకు రకరకాల జూదాలను ఏర్పాటుచేశారు. కోడి పందేలు నిర్వహించే ప్రధాన బరిలోకి పందెం నిర్వహించాలంటే రూ.లక్షకు పైమాటే. అంతకు తక్కువ ఉంటే అనుమతించరు. కానీ, పందెపురాయుళ్లు నిరుత్సాహ పడకుండా రూ.లక్ష పందెలు ఒకచోట, రూ.లక్షలోపు పందేలు మరో నిర్వహించారు. ఈ శిబిరం ఏర్పాటుచేసిన ప్రాంగణంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ప్రధాన ద్వారం దగ్గర రూ.50 ప్రవేశరుసుం చెల్లించాలి. కోడిపందేలను నిర్వహించేందుకు ప్రత్యేక బరి, వాటిని కూర్చుని తిలకించేందుకు ప్రత్యేక గ్యాలరీలు, ప్రేక్షకులకు ఏసీ కూలర్లు కూడా ఏర్పాటు చేశారు.
రేయింబవళ్లు పేకాట
అంపాపురంలోని జూద శిబిరంలో పేకాట జోరుగా సాగుతోంది. ఐదు కోతముక్క సిట్టింగ్‌లు ఏర్పాటుచేశారు. లోనా, బయట అంటూ క్షణాల్లో రూ.లక్షల్లో పేకాట ఆడుతున్నారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా 24 గంటల పాటు పేకాట ఆడేందుకు ఈ శిబిరంలో ఏర్పాట్లు చేశారు. ఫ్లడ్‌లైట్లు, తాగునీరు, మందు, బిర్యానీ వంటి సకల సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. గుండాట, కాయ్ రాజా కాయ్ అంటూ ఏర్పాటుచేసిన జూద కేంద్రాల్లోనూ అమాయకులు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. సందిట్లో సడేమియా.. అన్నట్టు జేబు దొంగలు చేతివాటం చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment