కొల్లిపర మండలం కొత్తబొమ్మువానిపాలెంలో బరిలోకి దించేందుకు కోళ్లను సిద్ధంగా ఉంచిన యువకులు
అధికార పార్టీ నాయకులు బరి తెగించారు. సంక్రాంతి సంప్రదాయం పేరిట సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా కోడిపందేలు నిర్వహించారు. పందేల నిర్వహణకు ప్రత్యేకంగా బరులను సిద్ధం చేశారు. ఆ బరుల వద్దకు చేరుకునేందుకు రోడ్లను సైతం ఏర్పాటు చేశారు. కోడిపందేలతోపాటు కోతముక్క, గ్యాంబ్లింగ్ వంటి జూద క్రీడల నిర్వహణకు చర్యలు చేపట్టారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు సైతం ఏర్పాటు చేశారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకుల కనుసన్నల్లో జరుగుతున్న పందేలు కావడంతో పోలీసులు అడ్డుకునేందుకు జంకుతున్నారు. – సాక్షి, గుంటూరు
సాక్షి, గుంటూరు: సంక్రాంతికి సంప్రదాయాల పేరిట జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. కోడిపందేల నిర్వాహకులు బరుల వద్ద రూ.లక్షలు ఖర్చు చేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు స్వాగతం పలుకుతూ బ్యానర్లు సైతం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రేపల్లె నియోజకవర్గంలో కోళ్లు కత్తులు దూశాయి. పందేల నిర్వాహకులు నిర్మానుష్య ప్రదేశాల్లో బరులను ఏర్పాటు చేశారు. నిజాంపట్నం మండలం దిండి గ్రామ పరిధిలోని మడ అడవుల్లో కోడిపందేలు నిర్వహించేందుకు అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ అనుచరుడు 15 రోజుల ముందు నుంచి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి పందేలు జరుపుతున్నారు. స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం రేపల్లె రూరల్ మండలం మూళ్లకుంట గ్రామ పరిధి, చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో గతంలో పందేలు నిర్వహించిన టీడీపీ నాయకుడి నేతృత్వంలోనే తాజాగా బరులు ఏర్పాటయ్యాయి. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం కొత్తబొమ్మువాని పాలెం పుష్కరఘాట్ వద్ద మండల, గ్రామస్థాయి టీడీపీ నాయకులు ఎమ్మెల్యే అండదండలతో కోడి పందేలు జోరుగా నిర్వహించారు. కూలీలను నియమించి ఖాళీస్థలాల్లో బారికేడ్లు ఏర్పాటుచేసి, అధికారపార్టీ జెండాలతో స్టేజీ వేసి ఆగమేఘాల మీద బరులను సిద్ధం చేశారు. ఈ సమాచారం అందుకున్న పందెంగాళ్లు కోళ్లతో వాలిపోయారు. కత్తులు కట్టి కోళ్లను బరిలోకి దించారు. రూ.లక్షల్లో పందేలు కాస్తున్న పందెంరాయుళ్లకు అవసరమైన సకల ఏర్పాట్లను నిర్వహకులు అందుబాటులో ఉంచారు. ఏకంగా తమ పార్టీ ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తూ బరుల వద్ద ఫ్లెక్సీలను సైతం ఏర్పాటుచేశారు. అంతే కాకుండా గ్యాంబ్లిగ్, పేకాట కూడా యథేచ్ఛగా సాగింది.
ప్రేక్షక పాత్రలో పోలీసులు
కోడిపందేల నిర్వహణ సమాచారం ఆయా ప్రాంతాల డివిజన్‌స్థాయి అధికారి నుంచి మండల స్థాయి అధికారి వరకు తెలిసినా, పందేలను అడ్డుకోవాలని ఎస్పీ నుంచి ఆదేశాలు అందినా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల మద్దతు ఉండటంతో కోడిపందేలకు పోలీసులే పరోక్ష సహకారం అందించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ జిల్లా రూరల్, అర్బన్ ఎస్పీలు చేస్తున్న ప్రకటనలను పట్టించుకోకుండా పెద్ద ఎత్తును కోడి పందేలు నిర్వహించారు. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా రేపల్లె, తెనాలి నియోజకవర్గాల్లో కోడిపందేలు జరగకుండా అడ్డుకోలేరనే విషయం తేటతెల్లమైంది. కోడి పందేలకు అనుబంధంగా పేకాట(కోతముక్క), డబ్బా, చక్రం ఆటలతో పాటు మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. బహిరంగంగానే కోడి పుంజులకు కత్తులుకట్టి ఒక్కొక్క కోడి జతపై లక్షల రూపాయల పందాలు కాస్తూ జూదరులు విజృంభించిన తీరు చట్టానికి తూట్లు పొడిచాయి.
సుప్రీం ఆదేశాలు బేఖాతరు
గతంలో మాదిరిగానే సుప్రీం కోర్టు ఆదేశాలు, పోలీసు ఉన్నతాధికారుల హెచ్చరికలను కోడిపందేల నిర్వహకులను కట్టడి చేయలేకపోతున్నాయి. ఇదంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుండటంతో అక్కడి పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు సైతం కిక్కురు మనడం లేదు. రూ.లక్షల్లో ఖర్చు చేసి ఏర్పాటు చేసిన కోడిపందేల బరి వద్ద కోత ముక్క, గ్యాంబ్లింగ్ వంటి జూద క్రీడలు నిర్వహించుకునేందుకు కూడా కోడిపందేల నిర్వాహకులు లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా అక్కడి పోలీసు అధికారులు తమకేమీ పట్టనట్లు ఉండిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే బంధువు దగ్గరుండి మరీ కోడిపందేలు జరిపిం చారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాప్రతినిధులకు చట్టాలు, న్యాయస్థానాలంటే లెక్కలేకుండాపోతోంది. అనేక సందర్భాల్లో కోర్టు ఆదేశాలను సైతం దిక్కరిస్తూ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. కోడిపందేలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కోడిపందేలు నిర్వహించారంటే వీరు ఏ స్థాయిలో బరి తెగించారో అర్ధం చేసుకోవచ్చు.
కోడిపందాలను అడ్డుకున్నఅర్బన్ పోలీసులు
గుంటూరు అర్బన్ జిల్లాలో కోడిపందేలు జరగకుండా ఎస్పీ సీహెచ్ విజయారావు కొంత వరకు అడ్డుకోగలిగారు. పదిహేను రోజులుగా కోడిపందేల నిర్వాహకులపై నిఘా ఉంచి వారి వద్ద ఉన్న కత్తులు, పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
బరుల తొలగింపు
రేపల్లె(నగరం): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపల్లె మండలం గుడ్డికాయలంక గ్రామంలో కోడి పందేలు నిర్వహించేందుకు ఏర్పాటుచేసిన బరిని పోలీసులు ఆదివారం తొలగించారు. బరికి సిద్ధం చేసిన ప్రాంతంలో సిమెంట్ స్తంభాలను తొలగించారు. రేపల్లె పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ పెంచలరెడ్డి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment