పోలీసులు దాడి చేసి పట్టుకున్న పందెం కోడి
ఓ ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటుంది...సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి బుకీలతో పాటు సామగ్రిని స్వాధీనం చేసుకుంటారు...
ఓ భవనంలో కొందరు పేకాట ఆడుతూ ఉంటారు...దాడి చేసి పట్టుకునే పోలీసులు పేకాటరాయుళ్లతో పాటు నగదు తదితరాలు సీజ్ చేస్తారు...
ఓ ప్రదేశంలో కోడి పందేలు జరుగుతుంటాయి...అక్కడకు వెళ్లే పోలీసులు దొరికిన పందెంరాయుళ్లతో పాటు కోళ్లనూ స్వాధీనం చేసుకుంటారు...
ఇవన్నీ తరచుగా వింటున్న వార్తలే. సాధారణంగా ఏ కేసులో అయినా పోలీసులు తాము అరెస్టు చేసిన నిందితుల్ని కోర్టులో హాజరు పరిచి, వారి నుంచి స్వాధీనం చేసుకున్న వాటినీ కోర్టుకు అప్పగిస్తారు. మరి కోడి పందేల కేసుల్లో స్వాధీనం చేసుకున్న కోళ్లను ఏం చేస్తారు? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదూ...ఏమీ లేదు...కోర్టు అనుమతి తీసుకుని ఎంచక్కా పందెం కోళ్లను చికెన్ షాపుల్లో అమ్మేస్తారట. ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని, జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించిన కోళ్ల వ్యవహారంలో ఇదే జరిగిందని, పోలీసులు మొత్తం 17 కోళ్లను రూ.10వేలకు అమ్మేశారని సమాచారం.
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొందరు పందెంరాయుళ్ళు గత జనవరి 7న కోడి పందేలకు దిగారు. ఏకంగా ఓ అపార్ట్‌మెంట్ టెర్రస్‌నే బరిగా మార్చుకున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఎం.వెంకటకృష్ణ...తన స్నేహితుడైన టి.వెంకటప్రసాద్‌తో కలిసి శ్రీకృష్ణానగర్‌లోని ఓ ఐదంతస్తుల భవనం టెర్రస్‌పై బరికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. కోడి పందేలు ఆడే ఆసక్తి ఉన్న వారిని ఇక్కడకు పిలిపించి పందేలు నిర్వహిస్తూ కమీషన్లు తీసుకుంటున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. ఈ ఇద్దరు నిర్వాహకులతో పాటు మొత్తం 29 మందిని అరెస్టు చేసి 17 పందెం కోళ్లు, వాటికి కట్టే కత్తులు 60, 26 సెల్‌ఫోన్లు, రూ.80,150 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.
కోళ్లను ‘రెహ్మత్‌నగర్’కు తరలించి...
టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్ని ఆ మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచిన జూబ్లీహిల్స్ పోలీసులు 17 పందెం కోళ్లను రికవరీ చేసిన విషయాన్నీ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళారు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలనూ సమర్పించారు. ఆ కోళ్లను సేఫ్ కస్టడీలో ఉంచాల్సిందిగా పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో అప్పటి వరకు జూబ్లీహిల్స్ ఠాణాలో ఉన్న వీటిని కాస్త సువిశాల ఖాళీ ప్రదేశం ఉన్న రెహ్మత్‌నగర్ పోలీసు ఔట్‌పోస్టుకు తరలించారు. అక్కడే కొన్ని రోజుల పాటు తమ సంరక్షణలో ఈ కోళ్లు ఉండాల్సి రావడంతో పోలీసులు తాత్కాలిక భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ వాటికి తిండి గింజలు, నీళ్లు తదితరాలు అందిస్తూ జాగ్రత్తగా కాచుకున్నారు.
కోర్టు అనుమతితో విక్రయించి...
నిబంధనల ప్రకారం ఈ కోళ్లు సైతం న్యాయస్థానం సొత్తు (కోర్ట్ ప్రాపర్టీ) కావడంతో పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. ఆపై కోళ్లను విక్రయించడానికి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించడంతో జూబ్లీహిల్స్ ప్రాంతంలో రూ.10 వేలకు ఆ కోళ్లను ఓ చికెన్ షాపులో అమ్మేశారని, అతను ప్రత్యేక రేటుతో ఇతరులకు చికెన్‌గా అమ్మేశాడని సమాచారం. అలా అమ్ముతున్న సమయంలో ఆ పుంజుల్ని తిరిగి పందేలకు వినియోగించకుండా కొనుగోలుదారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఆ కోణంలో కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. ఈ విషయాలన్నింటికీ కోర్టుకు విన్నవించిన జూబ్లీహిల్స్ పోలీసులు వాటిని విక్రయించగా వచ్చిన మొత్తాన్ని న్యాయస్థానానికే జమ చేశారు. పందెం రాయుళ్ళను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించిన వెంటనే టాస్క్‌ఫోర్స్ బాధ్యత తీరిపోగా... ఈ విక్రయం జరిగిన తర్వాత మాత్రమే జూబ్లీహిల్స్ పోలీసులు ఊపిరి పీల్చుకోగలిగారు.
జరగరానిది జరిగితే పెద్ద తంతే...
ఈ పందెం కోళ్లు తమ ఆధీనంలో ఉన్నన్ని రోజులూ జూబ్లీహిల్స్ పోలీసులు కంటిమీద కునుకు లేకుండా గడిపారనే చెప్పవచ్చు. ఈ కేసులో అరెస్టు చేసిన నిందితుల్ని మరుసటి రోజు కోర్టులో హాజరుపరచడంతో పోలీసుల బాధ్యత తీరింది. అయితే పుంజుల్ని సంరక్షణ నిమిత్తం కోర్టు పోలీసులకు అప్పగించడంతో అమ్మకం పూర్తయ్యే వరకు ప్రతి రోజూ ‘దినదిన గండం’గా గడిపారు. ఈ మధ్య కాలంలో ఆ పుంజులకు ఏమైనా జరిగితే పోలీసులదే పూర్తి బాధ్యత అయ్యేది. అనివార్య కారణాలతో ఒక్క కోడిపుంజు చనిపోయినా... దానికి సంబంధించి కేసు నమోదు చేయడం, కళేబరానికి ప్రభుత్వ పశు వైద్యుడితో పోస్టుమార్టం చేయించడం, అధికారికంగా ఖననం/దహనం చేయించడం.. వంటి తంతులతో పాటు ఈ రికార్డుల్ని కోర్టులో దాఖలు చేయడం కచ్చితం. ఈ పరిణామాల నేపథ్యంలోనే పోలీసులు పందెం పుంజుల్ని కంటికిరెప్పలా కాపాడారు.
Comments
Please login to add a commentAdd a comment