Chicken pakodi
-
Hyderabad: చికెన్ పకోడీలో కారం ఎక్కువైందన్నందుకు..
సాక్షి, హైదరాబాద్: చికెన్ పకోడీలో కారం ఎక్కువైందన్నందుకు వినియోగదారుడిపై పకోడి సెంటర్ నిర్వాహకుడు కత్తితో దాడికి పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన నాగార్జున బుధవారం రాత్రి 9వ ఫేజ్‌లోని జెఎస్ చికెన్ పకోడి సెంటర్‌కు వెళ్లి పకోడి తిన్నాడు. అయితే పకోడీలో కారం ఎక్కువగా ఉందంటూ నిర్వాహకుడు జీవన్‌కు చెప్పాడు. దీంతో అతను తింటే తిను లేదంటే వెళ్లిపో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో నాగార్జునను తీసుకెళ్లేందుకు అతని సోదరుడు ప్రణీత్ అక్కడికి వచ్చాడు. అప్పటికే ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో పకోడీ సెంటర్ నిర్వాహకుడు జీవన్ కత్తితో నాగార్జునపై దాడికి యత్నించగా అడ్డుకోబోయిన ప్రణీత్ చేతి మణికట్టు పై భాగంలో తీవ్ర గాయమైంది. స్థానికులు ప్రణీత్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పాక్‌లో కాల్పుల్లో 8 మంది టీచర్లు మృతి -
భార్య చేసిన చికెన్ పకోడ తిని.. ఆపై నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి ఆత్మహత్య
సాక్షి బెంగళూరు: చికెన్ కబాబ్ (చికెన్ పకోడా) బాగా లేదన్న వివాదం భర్త ఆత్మహత్యకు దారితీసింది. ఈ ఘటన బెంగళూరు బన్నేరుఘట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. అరెకెరె లేఔట్లో గత గురువారం జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. సురేశ్ (48) బొమ్మనహళ్లిలోని గార్మెంట్స్ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. చికెన్ కబాబ్ చేయాలని భార్య షాలిని (42)ని అడగగా, ఆమె చేసి పెట్టింది. అయితే రుచిగా లేదని అగ్రహోదగ్రుడై ఆమెను చావబాదాడు. కత్తితో తల, చేతులపై దాడిచేసి పరారయ్యాడు. షాలిని కేకలు విని ఇరుగుపొరుగు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు చేరుకుని షాలిని వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేశారు. ఇక పరారీలో ఉన్న సురేశ్ ఇంటికి సమీపంలో నిర్మానుష్య ఖాళీ ప్రాంతంలో చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: మృగంలా మారిన భర్త.. విడాకులు అడిగిన భార్యకు 30 కత్తిపోట్లు.. ‘మైండ్ బ్లాంక్ అయిందని..’ -
కోడి పకోడి.. నోరూరించేలా!
నిన్నమొన్నటి దాకా ఎండలు మండిపోయాయి. దాంతో వేపుడు కూరలు, కరకరలాడించే శ్నాక్స్ను దూరం పెట్టిన వాళ్లకు కూడా ఇప్పుడు ముసురు పట్టిన వాతావరణానికి సుయ్యి సుయ్యిమని చేసుకు తినే రకరకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలు తినాలనిపిస్తుంది. ఇంకెందుకాలస్యం... ముసురుకు మూకుడు పెట్టండి మరి! కోడి పకోడి కావలసినవి: బోన్‌లెస్ చికెన్ ముక్కలు–కేజి, శనగపిండి–150 గ్రాములు, బియ్యంపిండి–ఐదు టేబుల్ స్పూన్లు, కారం– టీస్పూను, ఎరుపురంగు ఫుడ్ కలర్ – చిటికడు, గరం మసాల– టీస్పూను, పచ్చిమిర్చి – రెండు, అల్లం – అంగుళం ముక్క, నిమ్మకాయ– ఒకటి, నువ్వుల నూనె– డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు– రుచికి తగినంత. తయారీ: ► ముందుగా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కను పేస్టులా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ► ఇప్పుడు చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో పచ్చిమిర్చి, అల్లంపేస్టు, నిమ్మరసం, కొద్దిగా ఉప్పువేసి ముక్కలకు పట్టేలా కలుపుకొని గంటపాటు మ్యారినేట్ చేసుకోవాలి. ► శనగపిండి, బియ్యంపిండి, కారం, ఫుడ్ కలర్, గరం మసాల, మ్యారినేట్ చేసిపెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పువేయాలి. ► స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వాలి. సలసల కాగిన నూనెలో చికెన్ ముక్కలు వేసి సన్నని మంటమీద వేగనివ్వాలి. ► ముక్కలు ఎర్రగా క్రిస్పీగా మారితే చికెన్ పకోడి రెడీ అయినట్లే. వీకెండ్స్‌లో ఈవినింగ్ స్నాక్స్‌గా ఈ కోడిపకోడి ఎంతో రుచిగా ఉంటుంది. చికెన్ పాప్‌కార్న్ కావలసినవి: బోన్ లెస్ చికెన్ ముక్కలు– కేజి; ఆయిల్: డీప్‌ఫ్రైకి సరిపడా , ఉప్పు: రుచికి సరిపడా. మ్యారినేషన్ కోసం... టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ పసుపు, టీస్పూను మిరియాలపొడి, వెల్లుల్లి తరుగు: రెండు టేబుల్ స్పూన్లు: నిమ్మరసం: రెండు టేబుల్ స్పూన్లు మసాలా కోటింగ్... వంద గ్రాముల బ్రెడ్ ముక్కల పొడి, టీస్పూను కారం, టీ స్పూను పసుపు, టీ స్పూను జీలకర్ర పొడి, టీస్పూను ధనియాలపొడి, టీస్పూను మిరియాల పొడి, రెండు గుడ్ల తెల్లసొన. తయారీ: ∙ చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి మ్యారినేషన్ కోసం తీసుకున్న పదార్థాలు, టేబుల్ స్పూను ఉప్పు వేసి బాగా కలపాలి. మూతపెట్టి ఒక గంటపాటు మ్యారినేట్ చేయాలి. ► మసాలా కోటింగ్ కోసం తీసుకున్న పదార్థాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ► డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ కాగాక...మ్యారినేట్ అయిన చికెన్ ముక్కలను ఒక్కోటి తీసుకుని ముందుగా గుడ్ల తెల్ల సొనలో ముంచి తరువాత మసాలా కోటింగ్ మిశ్రమంలో ముంచి ఆయిల్లో వేసి వేయించాలి. ► ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే చికెన్ పాప్‌కార్న్ రెడీ అయినట్లే. వేడివేడిగా మీకిష్టమైన సాస్‌తో కలిపి తింటే చికెన్ పాప్‌కార్న్ రుచి అద్భుతంగా ఉంటుంది. క్రిస్పి బేక్డ్ చికెన్ స్ట్రిప్స్ కావలసినవి: చికెన్ స్ట్రిప్స్ – పావు కేజి, గుడ్లు– రెండు, బ్రెడ్ తరుగు – కప్పు, మైదా – అరకప్పు, బటర్ – టేబుల్‌స్పూన్, ధనియాల పొడి – టీస్పూను, జీలకర్ర పొడి– అర టీస్పూను, గరం మసాల – అరటీస్పూన్, కారం – టీస్పూను, కొత్తిమీర, పుదీనా తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. తయారీ: బ్రెడ్‌ముక్కల తరుగును ఒక గిన్నెలో తీసుకుని దానిలో బటర్, పుదీనా, కొత్తిమీర తరుగు, మైదా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. గుడ్ల సొనను మరోగిన్నెలో గిలకొట్టి పెట్టుకోవాలి. ► చికెన్స్ట్రిప్లను ఒకగిన్నెలో వేసి జీలకర్ర పొడి, గరం మసాల, ధనియాల పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి చికెన్‌కు పట్టేలా బాగా కలపాలి. ► చికెన్స్ట్రిప్స్ను బ్రెడ్ ముక్కల తరుగు కలిపిన మిశ్రమంలో ముంచి తరువాత గుడ్ల సొనలో ముంచి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ► డీప్ ఫ్రై అయిన చికెన్స్ట్రిప్లను పదినిమిషాలు చల్లారనిచ్చి, తరువాత అవెన్‌లో ఏడు నిమిషాలు ఉంచి తీస్తే, ఎంతో క్రిస్పీగా ఉండే చికెన్ స్ట్రిప్స్ రెడీ అయినట్లే. -
చికెన్ ముక్క.. రోగం పక్కా!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంచిన నాసిరకం కోడి మాంసం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు యథేచ్ఛగా దిగుమతి అవుతోంది. ఆగస్టు 26వ తేదీన నెల్లూరులోని చికెన్ స్టాళ్లను ప్రజారోగ్య శాఖ అధికారులు తనిఖీ చేయగా.. దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కోడి లివర్, కందనకాయ, కోడి వెనుక భాగం, కాళ్ల భాగాలను పూర్తిగా తినడానికి వినియోగించరు. కొన్నేళ్ల క్రితం వరకు వాటిని డంపింగ్ యార్డుకు తరలించేవారు. ఇప్పుడు ఆయా భాగాలను పొరుగు రాష్ట్రాలకు తరలించి, సొమ్ము చేసుకుంటున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి తొలుత చెన్నై హోల్‌సేల్ మార్కెట్‌కు, అక్కడి నుంచి మినీ ఆటోల ద్వారా నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు పనికిరాని కోడి మాంసాన్ని సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చెన్నై మార్కెట్లో కిలో రూ.50కి కొనుగోలు చేసి, ఏపీలోని పలు ప్రాంతాల్లో రూ.120 నుంచి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. కోయంబత్తూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చేరేసరికి కనీసం మూడు రోజుల సమయం పడుతుండటంతో చికెన్ పాడైపోతోంది. దానిని స్థానిక వ్యాపారులు ఇక్కడ సిద్ధం చేసిన చికెన్‌లో కలిపి వినియోగదారులకు అంట గడుతున్నారు. నెల్లూరు నగరంలో మూడు చికెన్ స్టాళ్లు ఈ అక్రమ దందాకు అడ్డాగా మారినట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి ఏపీకి నిత్యం 8 టన్నుల దాకా నాసిరకం చికెన్ వస్తున్నట్లు సమాచారం. ఇలాంటి చికెన్‌ను ప్రధానంగా బార్లు, రెస్టారెంట్లు, రోడ్ల వెంబడి ఉండే చికెన్ పకోడి బండ్లకు, ధాబాలకు విక్రయించి, సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలాగటం ఆడుతున్నారు. వాస్తవానికి కోడిని కోసిన తర్వాత మూడు గంటలు దాటితే ఆ మాంసంలో ఎలాంటి పోషక విలువలు ఉండవు. అలాంటి చికెన్ తింటే రోగాలు తప్పవు. 24 గంటల పాటు ఫ్రిజ్‌లో నిల్వ చేసి చికెన్ తిన్నా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. -
చికెన్ పకోడా అడిగిందని.. చిన్నారి హత్య
చెన్నై, తిరువళ్లూరు: మద్యం మత్తులో ఉన్న యువకుడి వద్ద చికెన్ పకోడా అడిగినందుకు ఆవేశంతో చిన్నారిని బ్రిడ్జి నుండి కిందకు తోసి హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. అనంతరం బాలిక తీవ్రంగా గాయపడడంతో హత్య చేసి చిన్నారి ఇంటి సమీపంలో పడేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పకున్నాడు. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఐదేళ్ల చిన్నారి రెండు రోజుల క్రితం వెళ్లవేడు ఇటుక చాంబర్ వద్ద తీవ్ర గాయాలతో శవమై తేలిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై వెళ్లవేడు పోలీసులు చాంబర్లో పని చేసే విక్రమ్, నిలక్కర్‌తో పాటు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో నిలక్కర్‌కు మాత్రమే చిన్నారి హత్యలో ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించారు. పోలీసుల సమాచారం మేరకు, సంఘటన జరిగిన రోజు ఇంటి వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని నిలక్కర్ అనే యువకుడు వెళ్లవేడు బజారుకు తీసుకెళ్ళాడు. అక్కడ చిన్నారికి మిఠాయిలు తీసి ఇవ్వడంతో పాటు మద్యం, చికెన్ పకోడా కూడా తీసుకున్నాడు. తిరిగి వస్తూ ద్విచక్ర వాహనాన్ని బ్రిడ్జి వద్ద ఆపి మద్యం సేవించడం ప్రారంబించాడు. ఈ సమయంలో చికెన్ పకోడా తింటుడగా, తనకు కావాలని బాలిక పదేపదే అడిగింది. దీంతో విసుగు చెందిన నిలక్కర్ బ్రిడ్జిపై నుండి చిన్నారిని కిందకు తోసేశాడు. తీవ్ర గాయాల పాలయిన బాలికను హత్య చేసి చిన్నారి ఇంటికి సమీపంలో పడేసినట్టు నిలక్కర్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిలక్కర్‌ను అరెస్టు చేసి కోర్టులో హజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు. కాగా చికెన్ పకోడ అడిగిన పాపానీకి అభం శుభం తెలియనీ చిన్నారిని దారుణంగా హత్య చేసిన సంఘటన తల్లిదండ్రులను తీవ్ర శోకంలో ముంచింది. -
పందెం కోడి.. చికెన్ పకోడి!
ఓ ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటుంది...సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి బుకీలతో పాటు సామగ్రిని స్వాధీనం చేసుకుంటారు... ఓ భవనంలో కొందరు పేకాట ఆడుతూ ఉంటారు...దాడి చేసి పట్టుకునే పోలీసులు పేకాటరాయుళ్లతో పాటు నగదు తదితరాలు సీజ్ చేస్తారు... ఓ ప్రదేశంలో కోడి పందేలు జరుగుతుంటాయి...అక్కడకు వెళ్లే పోలీసులు దొరికిన పందెంరాయుళ్లతో పాటు కోళ్లనూ స్వాధీనం చేసుకుంటారు... ఇవన్నీ తరచుగా వింటున్న వార్తలే. సాధారణంగా ఏ కేసులో అయినా పోలీసులు తాము అరెస్టు చేసిన నిందితుల్ని కోర్టులో హాజరు పరిచి, వారి నుంచి స్వాధీనం చేసుకున్న వాటినీ కోర్టుకు అప్పగిస్తారు. మరి కోడి పందేల కేసుల్లో స్వాధీనం చేసుకున్న కోళ్లను ఏం చేస్తారు? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదూ...ఏమీ లేదు...కోర్టు అనుమతి తీసుకుని ఎంచక్కా పందెం కోళ్లను చికెన్ షాపుల్లో అమ్మేస్తారట. ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని, జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించిన కోళ్ల వ్యవహారంలో ఇదే జరిగిందని, పోలీసులు మొత్తం 17 కోళ్లను రూ.10వేలకు అమ్మేశారని సమాచారం. సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొందరు పందెంరాయుళ్ళు గత జనవరి 7న కోడి పందేలకు దిగారు. ఏకంగా ఓ అపార్ట్మెంట్ టెర్రస్‌నే బరిగా మార్చుకున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఎం.వెంకటకృష్ణ...తన స్నేహితుడైన టి.వెంకటప్రసాద్‌తో కలిసి శ్రీకృష్ణానగర్‌లోని ఓ ఐదంతస్తుల భవనం టెర్రస్‌పై బరికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. కోడి పందేలు ఆడే ఆసక్తి ఉన్న వారిని ఇక్కడకు పిలిపించి పందేలు నిర్వహిస్తూ కమీషన్లు తీసుకుంటున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. ఈ ఇద్దరు నిర్వాహకులతో పాటు మొత్తం 29 మందిని అరెస్టు చేసి 17 పందెం కోళ్లు, వాటికి కట్టే కత్తులు 60, 26 సెల్ఫోన్లు, రూ.80,150 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కోళ్లను ‘రెహ్మత్‌నగర్’కు తరలించి... టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్ని ఆ మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచిన జూబ్లీహిల్స్ పోలీసులు 17 పందెం కోళ్లను రికవరీ చేసిన విషయాన్నీ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళారు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలనూ సమర్పించారు. ఆ కోళ్లను సేఫ్ కస్టడీలో ఉంచాల్సిందిగా పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో అప్పటి వరకు జూబ్లీహిల్స్ ఠాణాలో ఉన్న వీటిని కాస్త సువిశాల ఖాళీ ప్రదేశం ఉన్న రెహ్మత్‌నగర్ పోలీసు ఔట్‌పోస్టుకు తరలించారు. అక్కడే కొన్ని రోజుల పాటు తమ సంరక్షణలో ఈ కోళ్లు ఉండాల్సి రావడంతో పోలీసులు తాత్కాలిక భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ వాటికి తిండి గింజలు, నీళ్లు తదితరాలు అందిస్తూ జాగ్రత్తగా కాచుకున్నారు. కోర్టు అనుమతితో విక్రయించి... నిబంధనల ప్రకారం ఈ కోళ్లు సైతం న్యాయస్థానం సొత్తు (కోర్ట్ ప్రాపర్టీ) కావడంతో పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. ఆపై కోళ్లను విక్రయించడానికి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించడంతో జూబ్లీహిల్స్ ప్రాంతంలో రూ.10 వేలకు ఆ కోళ్లను ఓ చికెన్ షాపులో అమ్మేశారని, అతను ప్రత్యేక రేటుతో ఇతరులకు చికెన్‌గా అమ్మేశాడని సమాచారం. అలా అమ్ముతున్న సమయంలో ఆ పుంజుల్ని తిరిగి పందేలకు వినియోగించకుండా కొనుగోలుదారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఆ కోణంలో కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. ఈ విషయాలన్నింటికీ కోర్టుకు విన్నవించిన జూబ్లీహిల్స్ పోలీసులు వాటిని విక్రయించగా వచ్చిన మొత్తాన్ని న్యాయస్థానానికే జమ చేశారు. పందెం రాయుళ్ళను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించిన వెంటనే టాస్క్‌ఫోర్స్ బాధ్యత తీరిపోగా... ఈ విక్రయం జరిగిన తర్వాత మాత్రమే జూబ్లీహిల్స్ పోలీసులు ఊపిరి పీల్చుకోగలిగారు. జరగరానిది జరిగితే పెద్ద తంతే... ఈ పందెం కోళ్లు తమ ఆధీనంలో ఉన్నన్ని రోజులూ జూబ్లీహిల్స్ పోలీసులు కంటిమీద కునుకు లేకుండా గడిపారనే చెప్పవచ్చు. ఈ కేసులో అరెస్టు చేసిన నిందితుల్ని మరుసటి రోజు కోర్టులో హాజరుపరచడంతో పోలీసుల బాధ్యత తీరింది. అయితే పుంజుల్ని సంరక్షణ నిమిత్తం కోర్టు పోలీసులకు అప్పగించడంతో అమ్మకం పూర్తయ్యే వరకు ప్రతి రోజూ ‘దినదిన గండం’గా గడిపారు. ఈ మధ్య కాలంలో ఆ పుంజులకు ఏమైనా జరిగితే పోలీసులదే పూర్తి బాధ్యత అయ్యేది. అనివార్య కారణాలతో ఒక్క కోడిపుంజు చనిపోయినా... దానికి సంబంధించి కేసు నమోదు చేయడం, కళేబరానికి ప్రభుత్వ పశు వైద్యుడితో పోస్టుమార్టం చేయించడం, అధికారికంగా ఖననం/దహనం చేయించడం.. వంటి తంతులతో పాటు ఈ రికార్డుల్ని కోర్టులో దాఖలు చేయడం కచ్చితం. ఈ పరిణామాల నేపథ్యంలోనే పోలీసులు పందెం పుంజుల్ని కంటికిరెప్పలా కాపాడారు. -
అచ్చమైన హైదరాబాదీ రుచి
సాక్షి, సిటీప్లస్: హైదరాబాద్ అనగానే బిర్యానీ గుర్తొస్తుంది.. బిర్యానీ అన గానే ప్యారడైజ్, బావర్చీ అని ఠక్కున మెరుస్తుంది. చాయ్ అనగానే ఆల్ఫా కేఫ్... బ్లూసీ కేఫ్ టేస్ట్ గుర్తొస్తుంది. ఇవన్నీ సరే... పిజ్జా దోశ తిన్నారా ఎప్పుడైనా..? పోనీ... ఈ పిజ్జా దోశ ఎక్కడ దొరుకుతుందో తెలుసా..? దేశీ రుచులే కాదు.. విదేశీ వింత వంటకాలు మన సిటీలో ఎక్కడెక్కడ ఎలాంటి వెరైటీలు దొరుకుతాయో అవగాహన ఉందా..? నోరూరించే ఇలాంటి ప్రశ్నలకు 20 ఏళ్ల సంకీర్త్ టేస్టీ జవాబు కనిపెట్టాడు. ‘జస్ట్ ఫుడ్- హైదరాబాద్’ పేరుతో ఈ-బుక్ లాంచ్ చేసి సిసలైన రుచి ఎక్కడ దొరుకుతుందో చిరునామాలతో సహా పొందుపరిచాడు. పసందైన చైనీ రుచుల్లో దిట్ట అయిన నాన్కింగ్లో మన దేశీ వంటకం అయిన చికెన్ పకోడీ సూపర్బ్‌గా ఉంటుందట. బల్వంత్ పావ్ భాజీలో దొరికే ఛీజ్ పావ్ భాజి టేస్ట్ చేస్తే ఆహా ఏమి రుచి అనాల్సిందే. ఇలా పసందైన మాటలెన్నో.. ఈ బుక్‌లో దొరుకుతాయి. స్వతహాగా మాంచి భోజన ప్రియుడైన సంకీర్త్.. నగరంలో ఏ ప్లేస్‌లో ఏ వెరైటీ దొరుకుతుందో తెలియక.. నాలుక చంపుకున్న సందర్భాలున్నాయి. ఈ ఇబ్బంది మరొకరికి రావొద్దని ఈ-మెనూకు శ్రీకారం చుట్టాడు. అందుకు రాజధాని నగరంలో వీధి వీధి తిరిగాడు.. పానీపూరి బండి నుంచి తాజ్ కృష్ణ వంటి స్టార్ హోటల్స్ వరకు తిరిగి పూర్తి వివరాలు సేకరించాడు. రాఫెల్స్ మిలీనియమ్ కాలేజ్‌లో మల్టీ మీడియా డిజైనింగ్ కోర్స్ చేస్తున్న సంకీర్త్.., సేకరించిన సమాచారంతో ఈ బుక్ డిజైన్ చేశాడు. ‘గల్లీలో దొరికే లోకల్ టేస్ట్ నుంచి స్టార్ హోటల్స్‌లో దొరికే ఇటాలియన్, ఫ్రెంచ్ డిషెస్ వరకు అన్నీ ఇందులో ఉన్నాయి. హైదరాబాదీలకే కాదు, హైదరాబాద్ వచ్చే విదేశీ అతిథులకు ‘జస్ట్ ఫుడ్ - హైదరాబాద్’ ఈ బుక్ మంచి గైడ్‌లా ఉపయోగపడుతుందని’ సంకీర్త్ చె బుతున్నాడు.