సాక్షి, హైదరాబాద్: చికెన్ పకోడీలో కారం ఎక్కువైందన్నందుకు వినియోగదారుడిపై పకోడి సెంటర్ నిర్వాహకుడు కత్తితో దాడికి పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన నాగార్జున బుధవారం రాత్రి 9వ ఫేజ్‌లోని జెఎస్ చికెన్ పకోడి సెంటర్‌కు వెళ్లి పకోడి తిన్నాడు. అయితే పకోడీలో కారం ఎక్కువగా ఉందంటూ నిర్వాహకుడు జీవన్‌కు చెప్పాడు. దీంతో అతను తింటే తిను లేదంటే వెళ్లిపో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
అదే సమయంలో నాగార్జునను తీసుకెళ్లేందుకు అతని సోదరుడు ప్రణీత్ అక్కడికి వచ్చాడు. అప్పటికే ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో పకోడీ సెంటర్ నిర్వాహకుడు జీవన్ కత్తితో నాగార్జునపై దాడికి యత్నించగా అడ్డుకోబోయిన ప్రణీత్ చేతి మణికట్టు పై భాగంలో తీవ్ర గాయమైంది. స్థానికులు ప్రణీత్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: పాక్‌లో కాల్పుల్లో 8 మంది టీచర్లు మృతి
Comments
Please login to add a commentAdd a comment