జర్నలిస్ట్‌ శంకర్‌పై దాడి | Attack on Journalist Shankar | Sakshi
Sakshi News home page

జర్నలిస్ట్‌ శంకర్‌పై దాడి

Published Sat, Feb 24 2024 4:45 AM | Last Updated on Sat, Feb 24 2024 4:45 AM

Attack on Journalist Shankar - Sakshi

నాగోలు(హైదరాబాద్‌): జర్నలిస్టు శంకర్‌పై కొందరు రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటన ఎల్‌బీనగర్‌ పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌బీనగర్‌ సీరిస్‌ రోడ్డులో చెలమల శంకర్‌ అలియాస్‌ జర్నలిస్ట్‌ శంకర్‌ న్యూస్‌లైన్‌ తెలుగు చానల్‌తోపాటు ‘తెలంగాణం’పేపర్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాడు. గురువారం రాత్రి తన కార్యాలయం మూసివేసి రాత్రి 10:40 గంటల సమయంలో తోటి జర్నలిస్టులు దండిగ నర్సింహ, పుల్కారం శివతో కలసి తుర్కయాంజాల్‌కు కారులో బయలుదేరారు.

కొద్దిదూరం ప్రయాణించగానే ఓ వ్యక్తి అడ్డుగా వచ్చాడు. దీంతో శంకర్‌ తన కారును స్లో చేశాడు. యాక్టివాపై ఇద్దరు యువతులు వస్తూ వెనుక నుంచి ఆ కారు ఢీకొట్టారు. వెంటనే శంకర్‌ కారులో నుంచి దిగి యువతులను ప్రశ్నిస్తుండగానే, వారు అసభ్యపదజాలంతో దూషణలకు దిగారు. తప్పు చేసింది మీరే కదా అని అంటుండగానే ఆ యువతులకు తెలిసిన కొందరు యువకులు బైకులపై అక్కడకు చేరుకొని శంకర్‌ను చేతులు, రాళ్లతో కొట్టారు. వారిని అడ్డుకునేందుకు ప్రయతి్నంచిన దండిగ నర్సింహ, శివపై కూడా దాడికి పాల్పడ్డారు.

ఈ సంఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్న శివను ఆ యువకులు అడ్డుకుని సెల్‌ఫోన్‌ పగులగొట్టారు. ఈ క్రమంలోనే శంకర్‌కు చెందిన రెండు సెల్‌ఫోన్లు తీసుకొని, మూకుమ్మడి దాడి చేయడంతో అక్కడినుంచి ప్రాణభయంతో శంకర్‌ ఓ ఇంట్లోకి వెళ్లాడు. రోడ్డుపై గొడవ పెద్దది కావడంతో స్థానికులు 100 సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. గాయపడిన శంకర్‌ను చికిత్స నిమిత్తం సోమాజిగూడలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. బాధితుడు దండిగ నర్సింహ ఇచి్చన ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు.

కాలనీలో ఉన్న సీసీటీవీ పుటేజీలను పరిశీలించి జర్నలిస్ట్‌లు శంకర్, శివపై దాడి చేసిన కవాడిగూడకు చెందిన ప్రవీణ్, హయత్‌నగర్లోని ఎల్లారెడ్డి కాలనీకి చెందిన మహేష్, ఎల్‌బీనగర్‌ హాస్టల్‌లో ఉండే శ్రీదుర్గ, హేమలతను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ తరలించారు. దాడికి పాల్పడిన మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులే తమను అసభ్య పదజాలంతో దూషించారంటూ నల్లగొండలోని ఎస్‌ఎల్‌ఎన్‌ స్వామి కాలనీ చెందిన శ్రీదుర్గ ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

దాడి వెనుక కాంగ్రెస్‌ పార్టీ నాయకుల హస్తం ఉంది 
జర్నలిస్టు శంకర్, శివతో పాటు తనపై జరిగిన దాడిలో కుట్రకోణం ఉందని, జర్నలిస్టు దండిగ నర్సింహ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆరాచకాలు, తప్పిదాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే అక్కసుతో కాపు కాసి దాడి చేశారన్నారు. కాంగ్రెస్‌ నాయకులు కొండగల్‌లో పేదల అసైన్డ్‌ భూములు లాక్కుంటున్నారనే విషయంపై ఇటీవల తాము ప్రసారం చేశామని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ పారీ్టకి చెందిన వారే తమపై దాడులకు పాల్పడ్డారని, ఇందుకు కావాల్సిన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు.  

తెలంగాణలో ఫ్యాక్షన్‌ దాడుల సంస్కృతి: కేటీఆర్‌  
తెలంగాణలో ఫ్యాక్షన్‌ దాడుల సంస్కృతి మొదలైందని, మీడియాపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపైనే దాడి అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శంకర్‌పై దాడి ఘటనను ‘ఎక్స్‌’వేదికగా ఆయన ఖండించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

ప్రశ్నిస్తే దాడులా: హరీశ్‌రావు  
ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారనే ముద్ర వేసి భౌతిక దాడులకు పాల్పడటం హేయ మైన చర్య అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల గొంతు నొక్కడమే అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement