
రామ్‌నాథ్ (ఫైల్)
సాక్షి, దుండిగల్(హైదరాబాద్): అసభ్య పదజాలంతో మేస్త్రీ దూషించడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ మున్సిపాలిటీ సాయి పూజా కాలనీకి చెందిన రామ్‌నాథ్(32) లేబర్ పని చేస్తుంటాడు. ఆయన గాజులరామారం ప్రాంతానికి చెందిన శేఖర్ మేస్త్రీ వద్ద గత 12 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు.
కాగా ఈ నెల 16న ఆలస్యంగా పనికి వచ్చిన రామ్‌నాథ్‌పై శేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బూతులు తిడుతూ చెప్పుతో కొట్టాడు. దీంతో ఇంటికి వచ్చిన రామ్‌నాథ్ జరిగిన విషయాన్ని భార్యకు చెప్పి బాధపడ్డారు. 17వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులు అన్నం తిని నిద్రపోయారు. 18వ తేదీ ఉదయం 6 గంటలకు నిద్రలేచి చూడగా రామ్‌నాథ్ ఇంటి పైకప్పు రేకులకు లుంగీతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు.
అతన్ని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. మేస్త్రీ అసభ్యంగా తిట్టి, కొట్టడంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment