Cricket bettings
-
పక్కాగా ప్లాన్ చేసిన దొరికిపోయాడు!....కథ మొత్తం కారు నుంచే..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సింథి కాలనీకి చెందిన పడాల మహేష్ బాబు ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ కోసం కొత్త పంథా అనుసరించాడు. తన ఎంజీ హెక్టర్ వాహనాన్నే అడ్డాగా చేసుకుని అందులోనే అవసరమైన పరికరాలు ఏర్పాటు చేసుకున్నాడు. పోలీసుల నిఘా తప్పించుకోవడానికి ఇంత పక్కాగా ప్లాన్ చేసినా... మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌కు ఏడుగురు ముఠా సభ్యులతో సహా చిక్కాడు. అదనపు డీసీపీ పి.శ్రీనివాస్ రెడ్డి మంగళవారం వివరాలు వెల్లడించారు. తన 19 ఏళ్ల కుమారుడినీ కలెక్షన్ ఏజెంట్‌గా మార్చుకోవడం గమనార్హం. సింథికాలనీకి చెందిన పడాల మహేష్ బాబు వృత్తి కన్స్ట్రక్షన్ వ్యాపారం. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో వ్యవస్థీకృతంగా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహించడాన్ని ప్రవృత్తిగా మార్చుకుని ప్రధాన బుకీగా మారాడు. డెన్ ఏర్పాటు చేస్తే పోలీసులకు చిక్కుతామని తన ఎంజీ హెక్టర్ వాహనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. అందులోనే ప్రత్యేకంగా బ్యాటరీతో పాటు వైఫై రూటర్లు అమర్చుకున్నాడు. ల్యాప్‌టాప్, కాల్ కనెక్టర్ బాక్స్, రికార్డర్లు, టీవీ, అకౌంట్ పుస్తకాలు.. ఇలా బెట్టింగ్ నిర్వహణకు అవసరమైన సమస్తం కారులోనే ఉండేలా చూసుకున్నాడు. తన కుమారుడైన జతిన్‌ను కలెక్షన్ ఏజెంట్‌గా మార్చుకున్నాడు. నగరానికి చెందిన శ్యామ్ సుందర్ (సబ్ బుకీ), నవాజ్ ఖాన్ (ఏజెంట్), మహేంద్ర కుమార్ అగర్వాల్ (లైన్ ఆపరేటర్), ఆనంద్ (ల్యాప్‌టాప్ ఆపరేటర్), నవీన్ (అకౌంటెంట్), గోవింద్ యాదవ్‌లు (కలెక్షన్ బాయ్) మహేష్ వద్ద నెల జీతానికి పని చేస్తున్నారు. వీరిలో కొందరు మహేష్‌తో పాటు అతడి వాహనంలో సంచరిస్తూ ఫోన్ కాల్స్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌ల బెట్టింగ్స్ అంగీకరిస్తున్నారు. కాల్ కనెక్టర్‌కు వచ్చే ప్రతి కాల్‌ను రికార్డు చేసుకుంటున్నారు. తెలిసిన వారు, వారి సిఫార్సుతో వచ్చిన వారిని మాత్రమే పంటర్లుగా అంగీకరిస్తున్నారు. పందాల నిర్వహణలో క్రెడిట్ సౌకర్యాన్నీ కల్పించేవాడు. ఇతడి పంటర్లు వారం రోజుల పాటు ఎలాంటి మొత్తం చెల్లించకుండా బెట్టింగ్‌లో పాల్గొనవచ్చు. ఆపై అకౌంటెంట్ లెక్కలు చూస్తాడు. దాని ప్రకారం డబ్బు తీసుకోవడమో, చెల్లించడమో ఏజెంట్ల ద్వారా చేస్తుంటాడు. ఇతడి ముఠాపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్, ఎస్సైలు సీహెచ్.నవీన్ కుమార్, ఎస్.సాయి కిరణ్ రామ్‌గోపాల్‌పేట పోలీసులతో కలిసి వలపన్నారు. సింథికాలనీలోని ఓ అపార్ట్మెంట్ సమీపంలో మహేష్, అతడి కుమారుడు జతిన్లతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.4.5 లక్షల నగదు, వాహనం తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్‌ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు) -
IPL 2022: ఇక్కడ బంతి బంతికో రేటు..!
విజయనగరం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–15 సీజన్ శనివారం మొదలైంది. బెట్టింగ్ రాయుళ్లు బంతికో రేటు కట్టి జూదమాడేందుకు సిద్ధమైపోయారు. ఫోర్లు, సిక్సర్ల హోరుతో స్కోర్ బోర్డు ఎలా పరుగులు పెడుతుందో... బెట్టింగ్ కూడా రూ.వందలు.. రూ.వేలు... రూ.లక్షలు.. దాటి రూ.కోట్లు కట్టేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. బెట్టింగ్‌లను నియంత్రిస్తామని పోలీస్ యంత్రాంగం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో ఈ వ్యవహారం బాహాటంగానే సాగిపోతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసుల నమోదు తక్కువే.. గడిచిన ఏడేళ్లలో జిల్లాలో 6 కేసులు నమోదు కాగా, 40 మంది బెట్టింగ్ రాయళ్లను మాత్రమే అరెస్టు చేశారు. కంప్యూటర్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. 2016లో క్రికెట్ బెట్టింగ్‌లపై 3 కేసులు నమోదుచేసి 23 మందిని, 2017లో 2 కేసుల్లో 10 మందిని, 2018లో ఒక కేసులో ఏడుగురిని అరెస్టు చేశారు. రెండున్నర నెలల పాటు అదే హీటు.. ఐపీఎల్–15 సీజన్ దాదాపు రెండు నెలల పాటు సాగనుంది. ఈ సమయంలో బుకీలు బెట్టింగ్ నడిపే తీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే. టాస్ ఏ జట్టు గెలుస్తుందని బెట్టింగ్ కాస్తారు. ఆపై మొదటి ఓవర్లో బౌండరీ వెళుతుందా? లేదా ? వికెట్ పడే అవకాశం ఉందా? లేదా? పవర్ ప్లేలో ఎంత స్కోర్ చేస్తుంది? ప్రత్యర్థి జట్టు ఎన్ని వికెట్లు తీస్తుంది?... ఇలా పలు రకాలుగా బెట్టింగ్ వేస్తారు. ఇంకా కొందరు ప్రతి బంతికీ బెట్టింగ్ ఇస్తారు. ఓడిపోతే రూ.15వేలు పోతుంది. ఐపీఎల్ సీజన్లో జిల్లాలో రోజుకు రూ.3 కోట్ల మేర బెట్టింగ్‌లు సాగుతాయన్నది సమాచారం. ఫేవరెట్ జట్లపై అయితే బెట్టింగ్ మరోలా నిర్వహిస్తారు. ఉదాహరణకు బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంటే... ఫేవరెట్! బెంగళూరుపై రూ. 10వేలు బెట్టింగ్ కాయాలంటే సబ్ బుకీలకు రూ. 13వేలు చెల్లించాలి. బెంగళూరు గెలిస్తే రూ.10 వేలు ఇస్తారు. ఓడిపోతే రూ.13వేలు పోయినట్లే!. జిల్లాలో బుకీల తిష్ట...! జిల్లాలో బుకీలు ఇప్పటికే తిష్టవేసినట్టు బోగట్టా. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సబ్‌బుకీలు, ఏజెంట్లను కమీషన్ ప్రాతిపదికన నియమించుకున్నారు. మ్యాచ్‌కు రెండు గంటల ముందు బెట్టింగ్ తీరును చెప్పేస్తారు. ఫేవరెట్ జట్టు, బెట్టింగ్ రేషియా నిర్థారిస్తారు. ఈ మేరకు బెట్టింగ్ రాయుళ్లు ఏజెంట్లకు డబ్బులిస్తారు. వీరు సబ్ బుకీలకు చేరుస్తారు. మ్యాచ్ ముగిసిన తరువాత బెట్టింగ్ డబ్బులు ఇచ్చేస్తారు. ఈ పందాల వల్ల ఏటా చాలా మంది నష్టపోతున్నారు. యువత, విద్యార్థులే టార్గెట్.. యువత, విద్యార్థులను ఉచ్చులో దించుతున్నారు. వేలాది మందిని బెట్టింగ్‌లో దించి రూ.కోట్లు దోచుకుంటున్నారు. కొందరు వ్యాపారులతో పాటు ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు కూడా డబ్బు ఆశతో బెట్టింగ్‌కు సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఆన్లైన్లో ఉన్న కొన్ని యాప్‌ల ద్వారా కూడా బెట్టింగ్ వ్యవహారం జోరుగా సాగుతోంది. బెట్టింగ్ నిర్వహించేవారి వివరాలు స్థానిక పోలీసుల్లో కొందరికి తెలుసునని, వారితో ఉన్న సన్నిహిత సంబ«ంధాలతో చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని పోలీస్ వర్గాలే బహిరంగంగా చెబుతుండడం గమనార్హం. పోలీసుల ప్రత్యేక దృష్టి ఐపీఎల్ సీజన్లో సాగే బెట్టింగ్‌లపై జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పందెం ఎలా కాసినా పట్టుకునేందుకు సిద్ధమైంది. గతంలో బెట్టింగ్‌లు పెట్టిన వారి వివరాలను సేకరించి ప్రస్తుతం వారి కార్యకలాపాలపై నిఘా పెట్టింది. యువత, విద్యార్థులు బుకీల మాయలో పడొద్దని హెచ్చరిస్తోంది. కేసులు నమోదైతే అంతే.. ►బెట్టింగ్‌ల్లో పట్టుబడితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. పోలీసుల రికార్డులో పేరు, చిరునామా ఉంటుంది. ►ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా లేదా విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు పడక తప్పదు. ►ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎక్కడ బెట్టింగ్ జరిగినా వీరిపై నిఘా ఉంటుంది. ►బెట్టింగ్ ఆడుతూ లేదా నిర్వహిస్తూ మరోసారి పట్టుబడితే కఠిన చర్యలుంటాయి బెట్టింగ్‌ల నియంత్రణకు ప్రత్యేక టీమ్.. ఐపీఎల్–15 సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్‌ల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం. బుకీలతో పాటు బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు. బెట్టింగ్‌లు నిర్వహించడం, పాల్గొనడం చట్టరీత్యా నేరం. అనవసరంగా బెట్టింగ్‌ల పేరుతో డబ్బులు కట్టి జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఎక్కడైనా బెట్టింగ్‌లు జరిగే సమాచారం అందించవచ్చు. వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. పాత నేరస్తులపై నిఘా పెట్టాం. – అనిల్‌కుమార్ పులిపాటి, ఏఎస్పీ, విజయనగరం -
బెట్టింగ్స్ కోసం ప్రత్యేక యాప్
సాక్షి, సిటీబ్యూరో: క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహించడానికి ప్రత్యేకంగా ఓ యాప్‌ను తయారు చేయించారు వ్యవస్థీకృత బుకీలు... దీని లింకును నిర్వాహకులకు షేర్ చేయడం ద్వారా ప్రతి పందెం పైనా 3 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. దీంతో పందేలన్నీ యాప్ ద్వారా జరుగుతుండగా, నగదు మార్పిడి మాత్రం హవాలా మార్గంలో సాగుతున్నాయి. ఇలా హైటెక్ పంథాలో పందాలు నిర్వహిస్తున్న ఈ ముఠా గుట్టును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధా కిషన్‌రావు గురువారం తెలిపారు. బెట్టింగ్స్‌లో పందేలు నిర్వహించే వారిని బుకీ అని, వాటిని కాసే వారిని పంటర్ అని అంటారు. నగరంలోని బహదూర్‌పుర ప్రాంతానికి చెందిన ప్రవీణ్ అగర్వాల్, గౌలిగూడకు చెందిన లఖన్ శ్రద్ధ్ క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహించే బుకీలుగా పని చేస్తున్నారు. తొలినాళ్ళల్లో బుకీలు పరిచయస్తులైన పంటర్ల నుంచి పందేలు అంగీకరిస్తూ ఆ లెక్కల్ని మాన్యువల్‌గా రికార్డుల్లో నోట్ చేసుకునే వారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత పందెం ఓడిన వారి నుంచి డబ్బు వసూలు, గెలిచిన వారికి చెల్లింపులు చేసేవారు. అప్పట్లో మ్యాచ్ వివరాలను టీవీలో చూస్తూ, బెట్టింగ్ రేష్యోను సూత్రధారుల నుంచి ఫోన్లో తెలుసుకునే వారు. ఎప్పటికప్పుడు క్రికెట్ అప్డేట్ను పంటర్లకు ఫోన్ ద్వారా వివరిస్తూ ఉండేవారు. ఇలా అవసరం లేకుండా అంతా ఆన్లైన్లో సాగే మాదిరిగా అంతర్జాతీయ బుకీలు ప్రత్యేకంగా ‘రాయల్ ఎక్ఛ్సేంజ్’ పేరుతో ఓ యాప్‌ను సృష్టించారు. రాజస్థాన్‌కు చెందిన సంకేత్ అనే కీలక బుకీ అనేక మంది చిన్న బుకీలకు దీనికి సంబంధించిన వివరాలు అందిస్తూ ఉండటాడు. కొన్నాళ్ళ క్రితం ప్రవీణ్, లఖన్‌లకు ఇతడితో పరిచయం ఏర్పడింది. అతడు అందించిన వివరాల ఆధారంగా దీన్ని ప్రత్యేక పద్ధతిలో తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకున్నారు. దానిలోకి లాగిన్ కావడానికి అవసరమైన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను సంకేత్ రహస్యంగా అందిస్తాడు. ఇలా ఇచ్చినందుకు అతడు ఆ యాప్ ద్వారా జరిగే లావాదేవీల్లో 3 శాతం కమీషన్ తీసుకుంటారు. ప్రవీణ్, లఖన్ సైతం తమ పంటర్లకు ఈ యాప్ లింకు పంపడం ద్వారా తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేయిస్తున్నారు. ఆ యాప్స్‌లోకి ప్రవేశించిన పంటర్లకు మ్యాచ్ వివరాలు, బెట్టింగ్ రేష్యో తదితరాలు అక్కడే కనిపిస్తాయి. ఒక్క దేశీయ క్రికెట్‌కే కాకుండా ప్రపంచంలో ఏ మూలన జరిగే, ఏ క్రీడకైనా పందాలు కాసేకోవచ్చు. ఇలా ఈ యాప్‌లోకి ప్రవేశించిన పంటర్ల వివరాలు, ఏ జట్టుపై ఎంత పందెం కాశారనేది వాటిలో రికార్డు అయిపోతాయి. గెలిచిన, ఓడిన వారు మాత్రం నేరుగా లేదా ఆన్లైన్లో డబ్బు చెల్లించడం, తీసుకోవడం చేస్తుంటారు. ఏదైనా సందేశాలు, సమస్యలు ఉండే అతడితో ఇక్కడి బుకీలు వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరపాలి. ఇప్పటికే అనేక మ్యాచ్‌లకు బెట్టింగ్ నిర్వహించిన ప్రవీణ్, లఖన్లు తాజాగా జరుగుతున్న టెస్ట్, టీ20 మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.పర్మేశ్వర్ దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించిన అధికారులు పరారీలో ఉన్న సంకేత్‌ను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
బంతి బంతికీ బెట్టింగ్..
సాక్షి, దత్తిరాజేరు(విజయనగరం) : ఇంతవరకు పట్టణాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్ నేడు గ్రామాలకూ చేరుకుంది. ప్రపంచ కప్ సీజన్లో దాదాపు సగభాగం పూర్తయింది. దీంతో బెట్టింగ్‌రాయుళ్లు కూడా జోరందుకున్నారు. పట్టణ ప్రాంతాలకు చెందిన పలువురు క్రికెట్ బుకీలు నియోజకవర్గంలోని పలు గ్రామలకు చేరుకుని తిష్ట వేశారు. క్రికెట్ అంటే పిచ్చి అభిమానం ఉన్న యువతను టార్గెట్ చేసుకుని బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. బుకీలు ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేసి ఏ టీమ్ మీద బెట్టింగ్ కడుతున్నామో చెబితే చాలు.. ఆ టీమ్ గెలిస్తే బుకీ నేరుగా డబ్బులు తీసుకువచ్చి ఇస్తాడు. ఒకవేళ టీమ్ ఓడిపోతే బెట్టింగ్ కట్టిన వారు వారున్న ప్రదేశానికి వెళ్లి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. బెట్టింగ్ కట్టేటప్పుడు కూడా బుకీలు పలు జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. ఎవరు పడితే వారితో కాకుండా... తమ అనుచరులు పరిచయం చేసిన వారితో బెట్టింగ్‌లకు పాల్పడుతుంటారు. నియోజకవర్గంలోని గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు, గంట్యాడ మండలాలలో పలు హోటళ్లు.. దాబాల వద్ద బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. చాలా గ్రామాలలో యువత సరదాగా పందాలకు అలవాటు పడి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని దుబారా చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొత్త పుంతలు బెట్టింగ్‌రాయుళ్లు వివిధ రకాల్లో బెట్టింగ్‌లు కడుతున్నారు. ఏ మ్యాచ్ గెలుస్తుందో అంచనా వేసి సాధారణంగా బెట్టింగ్‌లు కడుతుంటారు. అయితే తాజాగా టీమ్ ఎన్ని పరుగులు చేస్తుంది.. ఏ క్రికెటర్ హాఫ్/సెంచరీ చేస్తాడు.. మొత్తం పరుగుల సరి సంఖ్య అవుతుందా.. బేసి సంఖ్య అవుతుందా... ఫస్ట్/ లాస్ట్ బాల్ బౌండరీ కొడతారా.. లేదా.. తదితర విధానాల్లో బెట్టింగ్ జరుగుతోంది. చితికిపోతున్న యువత బెట్టింగ్‌ల వల్ల యువత ఆర్థికంగా చితికిపోతోంది. డబ్బులు పోయిన సందర్భాల్లో చాలా మంది ఇళ్లల్లో డబ్బులు దొంతనం చేస్తున్నారు. అయితే పరువు పోతుందనే ఉద్దేశంతో బయటకు చెప్పలేకపోతున్నారు. మరికొంత మంది యువకులు తల్లిదండ్రుల కష్టార్జితాన్ని పోగొట్టుకుని ఆత్మన్యూనతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రపంచ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించి ప్రతి రోజూ రూ. లక్షల్లో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. పోలీసులు స్పందించి క్రికెట్ బెట్టింగ్‌లపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
కాయ్.. రాజా కాయ్..!
కామారెడ్డి క్రైం: క్రీడాకారులకు రూ.కోట్లు కుమ్మరిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఐపీఎల్–12 క్రికెట్ మ్యాచ్‌లు అదే స్థాయిలో బెట్టింగ్ రాయుళ్ల జీవితాల్లో చీకట్లను నింపుతున్నాయి. బెట్టింగ్‌లు నేరమని చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిసినా యువత అటువైపు మొగ్గు చూపుతోంది. ప్రస్తుత వేసవిలో కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్‌లపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ముఖ్యంగా యువకులు బెట్టింగ్ మాయలో పడి తమ డబ్బును, సెల్ఫోన్లను, మోటర్ బైకులను అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో అనధికారిక అంచనా ప్రకారం ప్రతిరోజు రూ.లక్షల్లో బెట్టింగ్ కొనసాగుతోంది. నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల్లో బెట్టింగులు నడుస్తున్నట్లు తెలిసింది. కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు లక్షల్లో చేతులు మారుతున్నాయని తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఐపీఎల్ మ్యాచ్‌లపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఒక్క బాన్సువాడ పట్టణంలోనే ప్రతీ రోజు రూ.500 నుంచి రూ. వేలు, లక్ష నుంచి రూ.2 లక్షల వరకు బెట్టింగ్‌లకు పాల్పడుతూ తమ ఆస్తులను కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. పలువురు పారిశ్రామికేవేత్తల మధ్య రూ.లక్ష చొప్పున బెట్టింగ్ సాగినట్లు తెలిసింది. ఇలా వందలాది మంది ఐపీఎల్ జట్లపై నమ్మకంతో గెలుపు, ఓటములను చూపుతూ బెట్టింగులకు పాల్పడుతున్నారని తెలిసింది. పోలీసుల నిఘా అవసరం ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న బెట్టింగులపై పోలీసుల నిఘా కొరవడింది. బెట్టింగులకు పాల్పడుతున్న వారు సెల్ఫోన్లు వినియోగిస్తూ కేవలం ఫోన్లలోనే లావాదేవీలు కొనసాగిస్తుండడంతో పోలీసులకు సమాచారం అందడం లేదు. ఎవరు బెట్టింగులకు పాల్పడుతున్నారనే విషయమై పక్కా సమాచారం లేక వారు మిన్నకుండిపోతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో బెట్టింగులపై ప్రత్యేకంగా సమాచారాన్ని రాబట్టి, కొందరిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటే, బెట్టింగులను నియంత్రించేందుకు వీలవుతుందని పరిశీలకులు అంటున్నారు. అనేక కుటుంబాలు బెట్టింగ్ జాడ్యం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, బెట్టింగులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొంటున్నారు. సెల్ఫోన్లలోనే చర్చలు.. ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభానికి ముందే బెట్టింగులకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులు మధ్యవర్తులుగా అవతారమెత్తి బెట్టింగ్ డబ్బులపై సెల్ఫోన్లలో బేరమాడుతున్నారు. నేటి మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుంది? ఏ జట్టు ఓడి పోతుందనే? అంశంపై బేరమాడుతూ డబ్బులను ఫిక్స్ చేస్తున్నారు. మ్యాచ్‌లు కొనసాగిన తర్వాత గెలుపు/ఓటములపై ఫలితాలు రాగానే డబ్బుల కలెక్షన్ ప్రారంభిస్తున్నారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రధానంగా ఇండ్లలో, దుకాణాల్లో కూర్చొని బెట్టింగ్ బేరాలను నడిపిస్తున్నారు. ఒకవేళ ఓడిపోయిన పక్షంలో డబ్బులు లేకపోతే తమ సెల్ఫోన్లు, మోటర్ బైకులను ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల్ల యువకులే బెట్టింగుల్లో అధికంగా పాల్గొంటున్నారు. చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు, కూలీ పనులు చేసుకొనేవారు త్వరగా డబ్బులు సంపాధించవచ్చనే దురాశతో ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగులకు దిగుతున్నారు. కొన్నిసార్లు బెట్టింగుల్లో గెలుపొందడంతో ముందు, వెనకా చూడకుండా తమ డబ్బులను బెట్టింగుల కోసం వెచ్చిస్తున్నారు. దీంతో కొందరు సర్వం కోల్పోతుండగా, మరి కొందరు డబ్బులు సంపాదిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. బెట్టింగుల కారణంగా ఆయా కుటుంబాలపై ప్రభావం చూపుతోంది. బెట్టింగ్‌లకు ఆకర్షితులవుతూ... నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతోపాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ఏరియాల్లో కూడా బెట్టింగ్ దందా జరుగుతున్నట్లు సమాచారం. మండల కేంద్రాల్లో సైతం చాలా మంది వీటిపై ఆసక్తిని చూపుతున్నారు. టాస్‌తోనే బెట్టింగ్ దందా ప్రారంభం కాగా, పేవరేట్ జట్టు, నాన్ ఫేవరేట్ జట్ల పేరుతో బెట్టింగ్‌లు కడుతున్నారు. జట్లతో పాటు మ్యాచ్ సమయంలో రన్లు, సింగిల్‌లు, డబుల్, ఫోర్లు, సిక్స్‌లు, రనౌట్లు, స్టంప్‌లు ఇలా ప్రతి దానికి బెట్టింగ్ కడుతున్నారు. బెట్టింగ్‌ల కోసం ఆండ్రాయిడ్ ఫోన్లను వాడుతున్నారు. ఇటీవలి కాలంలో అందుబాటు లోకి వచ్చిన యాప్‌ల ద్వారా బ్యాంక్ లావాదేవీలను కూడా నిర్వహిస్తున్నారు. డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేందుకు ఫోన్ పే, తేజ్, పేటీఎం యాప్‌లను వాడుతున్నారు. వీటి ద్వారా సులభంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. 1:2, 1:4, 1:5 అంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు. బెట్టింగ్‌లు కాస్తూ యువత దానికి బానిసలుగా మారి ప్రతిరోజు ఆర్థికంగా నష్టపోగా వారి కుటుంబాలు చిధ్రమవుతున్నాయి. బెట్టింగ్‌లకు ఆకర్షితులవుతూ... నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతోపాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ఏరియాల్లో కూడా బెట్టింగ్ దందా జరుగుతున్నట్లు సమాచారం. మండల కేంద్రాల్లో సైతం చాలా మంది వీటిపై ఆసక్తిని చూపుతున్నారు. టాస్‌తోనే బెట్టింగ్ దందా ప్రారంభం కాగా, పేవరేట్ జట్టు, నాన్ ఫేవరేట్ జట్ల పేరుతో బెట్టింగ్‌లు కడుతున్నారు. జట్లతో పాటు మ్యాచ్ సమయంలో రన్లు, సింగిల్‌లు, డబుల్, ఫోర్లు, సిక్స్‌లు, రనౌట్లు, స్టంప్‌లు ఇలా ప్రతి దానికి బెట్టింగ్ కడుతున్నారు. బెట్టింగ్‌ల కోసం ఆండ్రాయిడ్ ఫోన్లను వాడుతున్నారు. ఇటీవలి కాలంలో అందుబాటు లోకి వచ్చిన యాప్‌ల ద్వారా బ్యాంక్ లావాదేవీలను కూడా నిర్వహిస్తున్నారు. డబ్బులను ట్రాన్స్ఫర్ చేసేందుకు ఫోన్ పే, తేజ్, పేటీఎం యాప్‌లను వాడుతున్నారు. వీటి ద్వారా సులభంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. 1:2, 1:4, 1:5 అంటూ బెట్టింగ్‌లు కాస్తున్నారు. బెట్టింగ్‌లు కాస్తూ యువత దానికి బానిసలుగా మారి ప్రతిరోజు ఆర్థికంగా నష్టపోగా వారి కుటుంబాలు చిధ్రమవుతున్నాయి. సమాచారమిస్తే చర్యలు తీసుకుంటాం బెట్టింగ్‌లకు పాల్పడడం చట్ట రీత్యా నేరం. ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగులు జరుగుతున్నట్లు సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. నిఘా పెంచుతాం. బెట్టింగులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొంటాం. మాకు సమాచారం అందించాలి. –మహేష్‌గౌడ్, సీఐ, బాన్సువాడ. -
దారితప్పుతున్న యువత
పెళ్లకూరు : జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన బెట్టింగ్ సంస్కృతి పల్లెలకు సైతం పా కింది. యువతను లక్ష్యంగా చేసుకుని బుకీలు బెట్టింగులు నిర్వహిస్తున్నారు. నగదు సంపాదించవచ్చనే ఆశతో యువత బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని గాడి తప్పుతున్నారు. నగదు కోసం చోరీలకు సైతం పాల్పడుతూ తల్లిదండ్రులకు తలవంపులు తెస్తున్నారు. బెట్టింగ్‌ల నిర్వహణ ఇలా.. ప్రస్తుతం ఐపీఎల్ టీ 20 క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. రాత్రి వేళ మ్యాచ్‌లు జరిగే సమయంలో యువత టీవీల ముందు కూర్చుని బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఓవర్లో బ్యాట్స్‌మెన్ సిక్స్, ఫోర్లు కొడతాడా..అవుటవుతాడా, సెంచరీ చేస్తాడా.. బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తాడు..మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారు..తదితర అంశాలపై వేల రూపాయల బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. నగదు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్‌ల ఉచ్చులో చిక్కుకుని అప్పుల పాలవుతున్నారు. చోరీలకు సైతం పాల్పడుతూ బెట్టింగ్‌లు కాస్తున్నట్లుగా సమాచారం. దారితప్పుతున్న యువత పెళ్లకూరు మండలంలోని శిరసనంబేడు, రాజుపాళెం గ్రామాల్లో సుమారు నాలుగు వందలకుపైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వ్యవసాయం, మూగజీవాల పోషణపై ఎక్కువ మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ పల్లెల్లో కొందరు యువకులు బెట్టింగులు నిర్వహిస్తున్నారు. యువత క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి నగదు కోసం చోరీలకు పాల్పడుతున్నారు. పెద్దలకు తెలియకుండా మూగజీవాలను విక్రయించి తద్వారా వచ్చే సొమ్ముతో బెట్టింగులు కాస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఏమి చేయాలో తోచక ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డలు ఉన్నత చదువులు చదువుతున్నారని రోజంతా కాయకష్టం చేసి కూడబెట్టిన డబ్బును అందిస్తున్న తల్లిదండ్రులకు యువత తీరు వేదన కలిగిస్తోంది. ఒకరిని చూసి ఒకరు క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి చదువును నిర్లక్ష్యం చేస్తుండడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ యువకుడు తన ఇంట్లో దాచిన నగదును అదే గ్రామానికి చెందిన మరొకరితో కలిసి బెట్టింగుల కోసం చోరీ చేశాడు. విషయం తెలుసుకుని యువకుని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా పరారయ్యాడు. భవిష్యత్తుపై అవగాహన లేని యువకులు బెట్టింగ్‌ల కోసం చోరీలకు పాల్పడడం, ఆపై పరారవడంతో తమ బిడ్డల భవిష్యత్తు ఏమిటంటూ పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి బెట్టింగ్‌లు నిర్వహించే వారిపై చర్యలు తీసుకుని గాడితప్పుతున్న యువతకు జీవితం అవగాహన కల్పించి సరైన మార్గంలో వెళ్లేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తల్లిదండ్రులే బిడ్డలను మార్చుకోవాలి క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడిన యువకులను తల్లిదండ్రులే మార్చుకోవాలి. చదువుల కోసం పట్టణాలకు వెళుతున్న బిడ్డలు ఏమి చేస్తున్నారు..ఎలా చదువుతున్నారని తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. –కే గోపి, రాజుపాళెం క్రమశిక్షణతో ఎదగాలి పిల్లలు చిన్నతనం నుంచి క్రమశిక్షణతో మెలగాలి. బిడ్డలు చేస్తున్న చిన్నపాటి తప్పులను తల్లిదండ్రులు గుర్తించి వాటిని ప్రాథమిక దశలోనే ఖండించి వారిని సక్రమమైన మార్గంలో నడిపించాలి. -రమణయ్య రాజుపాళెం బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు గ్రామీణ ప్రాంతాల్లోని యువతపై తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. యువత దారితప్పి ప్రవర్తిస్తే వారిని సరైన మార్గంలో పెట్టుకోవాలి. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. –మల్లికార్జున్‌రావు, నాయుడుపేట సీఐ -
కాయ్ రాజా కాయ్..జేబులన్నీ ఖాళీ చేయ్..!
కామారెడ్డి క్రైం: ప్రపంచ క్రీడా పటంలో అత్యధిక ఆదరణ పొందింది క్రికెటే. ఇక ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ ప్రేమికులకు పండు గే. అంతవరకైతే మంచిదే. అయితే నేటి కాలంలో ఆటమీదుండే మోజు రూటుమార్చుకుంది. ఆటను ఆస్వాదించడం పోయి బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు బెట్టింగ్‌లకు పాల్పడుతూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. క్రికెట్ బెట్టింగ్ మూలంగా ఎందరో యువత రూ.లక్షల్లో అప్పుల పాలవుతుండటం అనర్థాలకు దారితీస్తోంది. ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు యువతను ఆత్మహత్యలవైపు పోతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నా పోలీసులు నిఘా పెట్టడంలేదనే ఆరోపణలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా యువతపైనే ప్రభావం.. బెట్టింగ్ ప్రభావం నూటికి 90 శాతం యువతపైనే పడుతోంది. ముక్కుపచ్చలారని వయసులో బెట్టింగ్‌వైపు ఆకర్శితులవుతున్నారు. వేసవి సెలవులు కావడంతో ఇంటర్, డిగ్రీ విద్యార్ధులు తమ ఇళ్ల వద్దే ఉంటూ స్నేహితులతో కలిసి సరదాగా గడపాలనుకుంటారు. ఇదే సమయంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఉండటంలో చాలా మంది కళాశాల స్ధాయి యువకులు సైతం బెట్టింగ్‌లో పాల్గొంటూ కష్టాల బారిన పడుతున్నారు. పొద్దంతా పనిచేసి కుటుంబాలను పోషించుకునే మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులు క్రికెట్ బెట్టింగ్‌ల కారణంగా జేబులు గుల్ల చేసుకుంటున్నారు. కొన్ని కుటుంబాల్లో తలిదండ్రులు, పిల్లలకు మధ్య డబ్బుల విషయంలో విభేదాలకు క్రికెట్ బెట్టింగే పరోక్షంగా కారణమవుతోంది. ప్రత్యేకంగా అడ్డాలు.. తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు బెట్టిం గ్ నిర్వహించే వ్యక్తులు ప్రత్యేకంగా అడ్డాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇదివరకు హోటళ్లు, లాడ్జిల్లో నడిపేవారు. నిఘా ఉందనే కా రణంగా ఎక్కువగా ఖాళీ ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. మరికొందరు శివా రు ప్రాంతాల్లోని ఖాళీగా ఉన్న ఇండ్లను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాలతోపాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, బోధన్, ఆర్మూర్ వంటి పట్టణాలు, మండల కేంద్రాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బెట్టింగ్ ఊపందుకుంది. సాయంత్రం మ్యాచ్ సమయమైందంటే చాలు నిర్వాహకులు చెప్పే అడ్డాకు బెట్టింగ్ రాయుళ్లంతా చేరుకుంటారు. రెండు జిల్లా కేంద్రాల్లో బెట్టింగ్ అడ్డాలు వందకుపైగా ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. కామారెడ్డిలోని రైల్వేప్టేషన్, హైదరాబాద్ రోడ్, సిరిసిల్లా రోడ్, దేవునిపల్లి కల్లు దుకాణానికి, నిజామాబాద్‌లోని ప్రధాన కూడళ్లు, కొత్తగా రియల్ వెంచర్లు వెలుస్తున్న ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, పోలీసులు సంచరించని ప్రాంతాల్లో బెట్టింగ్ ముఠాలు తమ కార్యకలాపాలను జోరుగా సాగిస్తున్నాయనే ఫిర్యాదులున్నాయి. కామారెడ్డిలోని ఒక్క దేవునిపల్లిలోనే రోజుకు రూ.లక్షల్లో బెట్టింగ్ జరుగుతుంది. పోలీసుల చర్యలు శూన్యం.. ఎక్కడపడితే అక్కడ బెట్టింగ్ జరుగుతున్నా పోలీసుశాఖ చర్యలు మాత్రం కనిపించడం లేదు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో బెట్టింగ్ సాగుతోంది. జిల్లాకేంద్రంలో గతేడాది బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఓ ప్రధాన నిందితుడిని కావాలనే కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు వచ్చాయి. పాత నేరస్తులతో పాటు మరికొంతమంది బెట్టింగ్ నిర్వహణలో ఆరితేరిన వారు ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ను టార్గెట్ చేసి జోరుగా వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రికెట్ బెట్టింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. బెట్టింగ్ నిర్వాహకులపై నిఘా వేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రూ.లక్షల్లో బెట్టింగ్‌లు.. సరదాగా మొదలైన బెట్టింగ్ సంస్కృతి కాస్త చీకటి వ్యాపారంలా మారింది. నిర్వాహకులు అమాయక యువతను ఆకర్శిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయం 10 గంటలకు బ్యాంకులు తెరుస్తారు డబ్బులు సర్దుకుని ప్రతిరోజూ ఉదయం 11 గంటల సమయంలో బెట్టింగ్‌లో పాల్గోనేవారంతా నిరాహకులు చెప్పిన చోటుకు చేరాల్సి ఉంటుంది. అంతకు ముందు రోజు రాత్రి జరిగిన మ్యాచ్ ఫలితానికి సంబంధించిన లావాదేవీలు, వసూళ్లు చేపడుతారు. ఆ వెంటనే తరువాతి మ్యాచ్‌పై పందాలు కాస్తారు. ఆ తరువాత వ్యవహారం మొత్తం ఫోన్లలోనే సాగిస్తారు. ఏ జట్టుపై ఎవరు ఎంత పందెం కాస్తున్నారనే విషయాలు నిర్వాహకులు చూస్తారు. ఇందుకోసం లావాదేవీలపై 10 శాతం ఫీజు తీసుకుంటారు. ఇరువైపుల నుంచి వాటాలు తీసుకుంటూ రూ.లక్షల్లో దండుకుంటారు. వారి వద్ద ఒక్కొక్కరు రోజుకు రూ. 500 నుంచి మొదలుకుని రూ.50 వేల వరకు పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో నిర్వాహకుడికి 50 నుంచి వంద మంది కస్టమర్లు ఉంటారు. బలహీనంగా ఉన్న జట్టు బలమైన జట్టుతో ఆడుతున్నపుడు బెట్టింగ్ విధానం మరొలా ఉంటుంది. ఒకటికి రెండింతలు, మూడింతల చొప్పున బేరాలు చేస్తారు. ఇలా వందల మంది యువత నిత్యం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పెడదారిన పడుతున్నారు. మ్యాచ్ జరిగే పమయంలో స్మార్ట్ఫోన్లలో క్రికెట్ పెట్టుకుని ఒకేచోట గుమిగూడి కనిపిస్తుంటారు. జిల్లాలో ఇదివరకు ఇలా బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి అప్పులు కావడంతో కొందరు మువకులు ఆత్మహత్యల వరకు వెళ్లిన ఘటనలు చూశాం. -
బెట్..ఫట్
అతడొక చిరుద్యోగి. మహాపొదుపరి. క్రికెటంటే పిచ్చి.చిరుద్యోగిగా చేస్తూనే, ఇతరత్రా చిన్నాచితకా పనులు కూడా చేసేవాడు. ఇలా పదేళ్లలో దాదాపుగా పదిలక్షలు కూడబెట్టాడు. ఇంకా ఎక్కువ సంపాదించేందుకు మార్గాలను అన్వేషిస్తుండగా, బెట్టింగ్ గురించి తెలిసింది. చిన్న మొత్తంతో బెట్టింగ్‌లోకి దిగాడు. మొదట బాగానే కలిసొచ్చింది. ఆశ పుట్టింది. ‘ఇంత తేలిగ్గా డబ్బు సంపాదించొచ్చా..!’ అనుకున్నా డు. ఈ జూదంపై మోజు పెరిగింది. ‘వచ్చేది తక్కువ.. పోయేది ఎక్కువ’గా ఉంది అతని పరిస్థితి. ఇటీవల అత్యాశతో పెద్ద మొత్తాన్ని బెట్టింగ్‌లో పెట్టాడు. ఇక పెట్టడానికి అతని వద్ద ఏమీ లేదు. పదేళ్లపాటు కష్టించి, కోరికలన్నీ చంపుకుని.. తినీతినక కూడబెట్టిన పదిలక్షల రూపాయలను పోగుట్టుకు న్నాడు. ‘తేలిగ్గా సంపాదించొచ్చన్న’ మైకం వీడేసరికి బజారున పడ్డాడు..! ఇలాంటి వారు ఎందరో..!! వైరారూరల్:ఒకప్పుడు నగరాలకే పరిమితమైన బెట్టింగ్ భూతం.. ఇప్పుడు పల్లెలకూ పాకింది. ఐపీఎల్ సీజన్‌తో జోరందుకుంది. బెట్టింగ్ ఇలా.. మ్యాచ్‌కు ముందు టాస్ వేస్తారు. టాస్ గెలిచిన జట్టు, బ్యాటింగో.. ఫీల్డింగో ఎంచుకుంటుంది. అక్కడ టాస్ వేయడానికి ముందే.. ఇక్కడ బెట్టింగ్ మొదలవుతుంది. అక్కడ ఆ ఆట.. ఇక్కడ ఈ ‘ఆట’ (బెట్టింగ్)కు తెర లేస్తుంది. అనుకున్న జట్టు టాస్ గెలిస్తే.. పెట్టిన మొత్తానికి 70 నుంచి 80 శాతం అదనంగా వస్తాయి. అంటే.. అనుకున్న జట్టు టాస్ గెలుస్తుందని రూ.100 బెట్టింగ్ వేశారనుకుందాం. నెగ్గితే, దానికి రూ.70–80 కలిపి రూ.170–180 ఇస్తారు. అనుకున్న జట్టు టాస్ ఓడిపోతే.. బెట్టింగ్ కాసిన నగదంతా మధ్యవర్తులకు దక్కుతుంది. సెషన్ల రూపంలో కూడా బెట్టింగ్ నడుస్తుంది. ముందు ఆరు, పది, పదిహేను ఓవర్ల సెషన్‌గా చెప్పుకుంటారు. ఈ మూడు సెషన్లలో వచ్చే పరుగులపై బెట్టింగ్ కడతారు. ఉదాహరణకు.. రూపాయి పెడితే రూపాయిన్నర నుంచి రెండ్రూపాయాల వరకు వస్తాయి. అంటే.. బెట్టింగ్ పెట్టిన మొత్తానికి 70 నుంచి 80 శాతం వరకు కష్టపడకుండానే డబ్బొస్తుందన్నమాట. చాలామంది ఇక్కడే బుట్టలో పడిపోతున్నారు. మధ్యవర్తులు (బుకీలు) కూడా ఇలా ఆశ పెట్టి అనేకమందిని ఈ బెట్టింగ్‌లోకి దింపుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు... వీరూ–వారూ అనేది లేదు. అన్ని వర్గాల వారు ఈ బెట్టింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. కూలీలైతే రోజంతా చెమటోడ్చి సంపాదించినదంతా, విద్యార్థులైతే ఇంట్లో అమ్మానాన్న ఇచ్చిన డబ్బును, ఉద్యోగులు–వ్యాపారులు తమ ఆర్జననను తీసుకొచ్చి పెడుతున్నారు. మొత్తం పోగొట్టుకుంటున్నారు. పదిమంది పోగుట్టుకుంటే... ఇద్దరో ముగ్గురో గెలుచుకుంటారని అనుకుందాం. ఆ పోగొట్టుకున్నవారు.. ఇకనైనా ఈ జూదానికి దూరానికి దూరం ఉందామని అనుకోవడం లేదు. ‘నా తోటోళ్లు గెలుచుకున్నారుగా...! ఈసారి నాకు రాకపోయతాయా..?!’ అనే ‘ఆశ’తో ఈ బెట్టింగ్ ఊపి నుంచి బయటకు రాలేకపోతున్నారు. పోయిన మొత్తాన్ని తిరిగి సంపాందించుకోవాలన్న కసితో, సంపాదించగలమన్న నమ్మకంతో ఉన్నదంతా ఊడ్చేసి, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెడుతున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి అనేకమంది, చివరికి అప్పుల ఊబిలో కూరుకుపోయి, బయటకు రాలేక.. లోపల ఉండలేక.. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒక్క ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మాత్రమే కాదు. వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, ప్రీమియర్ లీగ్, బీపీల్ లీగ్, వన్డే, 20–20, టెస్ట్ మ్యాచ్.. చివరికి ప్రో కబడ్డీపై కూడా బెట్టింగ్ పెడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... తాగుడుకు బానిసగా మారిన వారు, దాని నుంచి ఎలా దూరంగా ఉండలేరో.. బెట్టింగ్ బాబులు కూడా అంతే...! ఎన్నెన్నో మార్గాలు... బెట్టింగ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో, బుకీలు, బెట్టింగ్ బాబులు వేర్వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు ఫోన్లలో బెట్టింగ్ లావాదేవీలు నడిచేవి. ఫోన్ ట్యాపింగ్‌తో ద్వారా బెట్టింగ్ బాబులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో, బుకీలు మరో మార్గం ఎంచుకున్నారు. చిన్న చిన్న గ్రూపులుగా బెట్టింగ్ లావాదేవీలు జరుపుతున్నారు. ఇంకొందరు స్మార్ట్ ఫోన్ల ద్వారా ఆన్లైన్లో బెట్టింగ్ కాస్తున్నారు. లైవ్‌లో మ్యాచ్ చూస్తూ, చేతిలోని స్మార్ట్ ఫోన్ ద్వారా బెట్టింగ్ కాస్తున్నారు. దీనిని అడ్డుకోవడం పోలీసులకు దాదాపు అసాధ్యమవుతోంది. అప్పులు... హత్యలు.. ఈ బెట్టింగ్ వ్యసనం.. అనేకమందిని బికారీలుగా మారుస్తోంది. అప్పుల ఊబిలోకి దింపుతోంది. కుటుంబాలను వీధిన పడేస్తోంది. గొడవలు, కక్షలు సృష్టిస్తోంది. దాడులకు.. దౌర్జన్యాలకు దారితీస్తోంది. చివరికి హత్యలకు కూడా పురిగొల్పుతోంది. ఇటీవల, బెట్టింగ్ నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గంలో ఓ వ్యక్తి హత్య జరిగింది. వైరా మండలంలోని ఓ యువకుడు బెట్టింగ్ మోజులో పడి తన రెండెకరాల పొలాన్ని, ఒక ఫ్లాట్‌ను అమ్ముకున్నాడు. చివరికి, తన బైక్‌ను కూడా తాకట్టుపెట్టాడు. ఇలాంటి వారు ఎంతోమంది. బెట్టింగ్ కలిసొచ్చి కుబేరులైన వారు కేవలం కొంతమందే. ఆ కొంతమందిని చూసి, మిగిలినవారంతా.. ‘మాకు కూడా ఎప్పుడో ఒకప్పుడు అలా కలిసిరాక పోతుందా’ అనే ఆశతో.. భ్రమలతో ఊహాలోకంలో తిరుగుతున్నారు. బయటికొచ్చేసరికి బికారీలుగా మిగులుతున్నారు. చివరికి ఈ బెట్ (బెట్టింగ్).. వారి జీవితాలను ఫట్ (నాశనం)మంటూ దెబ్బతీస్తోంది. -
బంతి బంతికీ బెట్టింగ్!
వీరఘట్టం/ శ్రీకాకుళం సిటీ: ఐ.పి.ఎల్ సీజన్ ప్రారంభం కావడంతో బెట్టింగ్‌రాయుళ్లు రంగంలోకి దిగారు. పెద్ద మొత్తం సొమ్ము వస్తుందని ఆశ చూపుతూ అమాయక యువతను ముగ్గులోకి దింపుతున్నారు. గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బెట్టింగ్‌లు నేడు గ్రామీణ ప్రాంతాలకు పాకడంతో రూ.లక్షల బెట్టింగ్‌లు కాస్తూ కొందరు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టిన చాపకింద నీరులా బెట్టింగ్ జోరు కొనసాగుతునే ఉంది. ముఖ్యంగా వీరఘట్టంలో రోజూ రూ.10 లక్షల మేర బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. వీరఘట్టం అంబేడ్కర్ జంక్షన్లో ఉదయం 7 నుంచి 9గంటల వరకూ ఇవే చర్చలు. వెయ్యి, మూడు వేలకు పందాలు కాస్తూ బెట్టింగ్ బంగార్రాజులు చెలరేగిపోతున్నారు. చిన్నచిన్న కిరాణషాపులు, పకోడి బడ్డీలు, బంగారం షాపులు, పాన్‌షాపుల వద్ద ఈ తతంగం జరుగుతోంది. ఒక్క వీరఘట్టంలోనే కాకుండా దాదాపు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అరెస్టులు చేసినా.. ఎస్పీగా జె.బ్రహ్మారెడ్డి ఇక్కడ విధులు నిర్వహించిన సమయంలో బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బెట్టింగ్‌లతో సంబంధాలు ఉన్న వ్యక్తి జిల్లాకు చెందిన వాడు కావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆన్లైన్ల్ దారా రూ.కోట్లల్లో బెట్టింగ్‌లకు పాల్పడినట్లుగా ఈ ముఠా పోలీసులు గుర్తించారు. పట్టణంలో పుప్పాలవారివీధిలో ఓ వ్యక్తి నివాసంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారి బెట్టింగ్ కిరణ్‌తో పాటు మరో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.18 లక్షల నగదు, 11 తులాల బంగారం, కేజీ వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతా ఆన్లైన్లోనే.. గతంలో ముఖాముఖిగా బెట్టింగ్‌లు కాసేవారు. కంప్యూటర్ పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఆండ్రాయిడ్ ఫోన్లతో ఆన్లైన్ బెట్టింగ్‌కు తెర తీశారు. పాలకొండ, తోటపల్లి, పార్వతీపురం, విశాఖపట్నం, బరంపురం తదితర పట్టణాల్లో క్రికెట్ మాఫియాతో కొంతమందికి సంబంధాలు ఉండడంతో బెట్టింగులు జోరందుకున్నాయి. చర్యలు తప్పవు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు చేపడతాం. యువత ఇటువంటి బెట్టింగ్‌ల జోలికి వెళ్లి భవిష్యత్ నాశనం చేసుకోవద్దు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో నిఘా వేసి బెట్టింగ్ రాయుళ్లను అడ్డుకుంటాం. – స్వరూపారాణి, డీఎస్పీ, పాలకొండ డయల్ 100కు సమాచారం ఇవ్వండి బెట్టింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవు. ఆధారాలు లేవనుకుంటే పొరపాటే. మొబైల్ ఫోన్, ఆన్లైన్ ద్వారా ఇటువంటి బెట్టింగ్‌లకు పాల్పడితే ఆ సమాచారం క్షణాల్లో ముందుంటుంది. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినట్లు తెలిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. – టి.పనసారెడ్డి, అడిషనల్ ఎస్పీ, శ్రీకాకుళం -
రాత్రికి రాత్రే కింగ్‌లా మారాలనుకుని...
వ్యాపారంలో అప్పులపాలైనవారు దురదృష్టం వెంటాడి ఉన్నదంతా కోల్పోయినవారు రాత్రికి రాత్రే కింగ్‌లా మారాలనుకొనేవారు పైలాపచ్చీసుగా తిరిగేవారు జల్సాలకు అలవాటుపడిన విద్యార్థులు... వీరందరికీ ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ పెద్ద లాటరీ టికెట్లా కనిపిస్తోంది ఉన్న కాస్త డబ్బులను పందేల్లో పెడుతూ మరిన్ని కష్టాల్లో కూరుకు పోతున్నారు... కందుకూరు రూరల్: ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ పట్టుకుంది. వాస్తవానికి దీనిపై క్రీడాభిమానులు పెద్దగా ఆసక్తి చూపరు. అయితే ఎక్కడైనా టీవీ ముందు నలుగురు కూర్చొని ఆసక్తిగా చూస్తున్నారంటే కచ్చితంగా అక్కడ బెట్టింగ్ రాజులు ఉన్నట్లే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా వందలు వేలు దాటి కోట్లలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. యువత లక్ష్యంగా కొందరు మధ్య వర్తులు సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై పోలీస్, ఇంటిలిజెన్స్ ని«ఘా వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయనే చెప్పాలి. తీవ్ర స్థాయికి.. గతంలో క్రికెట్ గెలుపోటములపై బెట్టింగులు పెట్టేవారు. గెలిచినవారు సొమ్ము చేసుకొని ఆనందించే వారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పోయింది. వెంటనే నగదు కావాలనే ఆతృతతో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరింది. ఒక క్రీడాకారుడు ఐపీఎల్ మ్యాచ్‌లో 50 పరుగులు చేస్తాడని, ఒక ఓవర్లలో ఇన్ని పరుగులు చేస్తారని, ఈ బాల్ కచ్చితంగా ఫోర్ పోతుందని, సిక్స్ కొడతారని, రెండు పరుగులు మాత్రమే వస్తాయని ఇలా మధ్య వర్తులు రెచ్చగొట్టి మరీ పందెం పెట్టిస్తున్నారు. అదే విధంగా మ్యాచ్ చివర మూడు, నాలుగు ఓవర్ల నుంచి బెట్టింగ్స్ అధికంగా జరుగుతున్నాయి. రూ. 100కి రూ. 200, రూ. 100కి రూ. 150 ఇలా కోట్లమేర లావాదేవీలు జరుగుతున్నాయి. 5 నుంచి 10 శాతం వరకు కమీషన్లు తీసుకుంటున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, రూమ్‌లు, గెస్ట్ హౌస్‌లలో ఈ బెట్టింగ్ వ్యవహారం జోరుగా సాగుతోంది. కొన్ని దుకాణాల్లో టీవీలు పెట్టుకొని బెట్టింగ్ సాగిస్తున్నారు. కందుకూరులో ఐదుగురు బుకీలు? ఆన్లైన్, ఫోన్ల ద్వారా బెట్టింగులు కొనసాగిస్తున్నారు. కందుకూరులో పెద్ద మొత్తంలో వ్యాపారం నడిపించే బుకీలు సుమారు ఐదుగురికి పైగా ఉన్నట్లు సమాచారం. వీరు లక్షల్లో పెందేలు వేస్తున్నారు. మొత్తం మీద 15 బుకీ కేంద్రాలున్నట్లు తెలుస్తోంది. కొందరిని రంగంలోకి దించి వారికి ఆకర్షణీయమైన కమీషన్లు ఇచ్చి దందా కొనసాగిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్స్ అయితే బెట్టింగ్ పాయింట్ నిర్వహిస్తున్న వారి ఖాతాతో ముందుగా నగదును జమ చేసి ఆన్లైన్ అకౌంట్లు ద్వారా లావాదేవీలు నడుపుతున్నారు. కొందరు బెట్టంగ్ నిర్వాహకులు కార్లు, ఆటోల్లో తిరుగుతూ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిబారిన పడిన బాధిత కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వడ్డీ వ్యాపారులు.. తండావ్యాపారుల హవా క్రికెట్ బెట్టింగ్‌ల వద్ద వడ్డీ వ్యాపారులు, తండా వ్యాపారులు తిష్ట వేస్తున్నారు. బెట్టింగ్‌లో చేయి తిరిగిన వారికి వెంటనే డబ్బులు ఇచ్చి గెలిస్తే అధిక మొత్తంలో వడ్డీ వస్తూలు చేస్తున్నారు. ఒకవేళ ఓడిపోయి నగదు పోతే వెంటనే ప్రామిసరీ నోట్ రాయించుకుంటున్నారు. ఇలా వడ్డీకి తిప్పేవారి వ్యాపారం విరాజిల్లుతోంది. చిత్తవుతున్న యువత బెట్టింగ్ మోజులో పడిన యువతి చిత్తవుతోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఎంబీఏ, డిగ్రీ చదివే విద్యార్థులు బెట్టింగ్‌లకు బానిసలవుతున్నారు. చేతి ఖర్చులకు తల్లిదండ్రులు ఇచ్చిన నగదుతో పాటు, బంగారు ఆభరణాలు, స్నేహితుల వద్ద అప్పులు తీసుకొని మరీ బెట్టింగ్‌లు పెడుతున్నారు. ఒక్కసారి పోయిన నగదును తిరిగి తెచ్చుకునేందుకు నానా తంటాలు పడుతూ చెడు అలవాట్లకు లోనవుతున్నారు. ఇలాంటివారే దొంగతనాలు, చైన్ స్నాచింగ్, బైక్‌లు దొంగతనాలు వంటి కేసుల్లో చిక్కుకుంటున్నారు. బెట్టింగ్స్‌లో తేడాలు వచ్చి సమయంలో ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. వీటిపై నిఘా ఉంచాల్సిన పోలీస్, ఇంటిలిజెన్స్ నిఘా వర్గం పూర్తిగా విఫలమయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం ఎవరైన సమాచారం ఇచ్చినప్పుడు దాడులు చేయడం ఆ తర్వాత వారి వద్ద ఎంతో కొంత వసూళ్లు చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. -
భారీ స్కెచ్
ప్రొద్దుటూరు క్రైం :మరో ఐదు రోజుల్లో క్రికెట్ సందడి ప్రారంభం కానుంది. ఈ నెల 7 నుంచి 50 రోజుల పాటు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ సీజన్ అంటే క్రికెట్ అభిమానులతోపాటు బుకీలకూ పండగే. ఇరు జట్ల గెలుపోటములతోపాటు.. స్టేడియంలో పరుగులు తీసే ప్రతి బంతికి రూ. కోట్లలో పందాలు జరుగుతాయి. ఇందుకోసం బుకీలు తమ స్థావరాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒకే చోట ఉండి పందాలు నిర్వహిస్తే పోలీసులకు పట్టుబడే అవకాశం ఉన్నందున రోజుకో ప్రాంతంలో ఉండేలా బుకీలు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ఇందుకోసం మూడు, నాలుగు రాష్ట్రాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రొద్దుటూరు, కడప, రాయచోటి, చెన్నూ రు, రాజంపేట, జమ్మలమడుగు, దువ్వూరు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున క్రికెట్ పందాలు కూడా జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ జాడ్యం పాకడంతో పోలీసులు గ్రా మాలపై కన్నేశారు. తెరపైకి కొత్త ముఖాలు జెంటిల్మెన్ గేమ్‌గా పేరొందిన క్రికెట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న కొందరు పందెం రాయుళ్లు కూడా జెంటిల్మెన్లుగా చలామణి అవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బెట్టింగ్ నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. రెండేళ్ల నుంచి జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. అప్పటి ఎస్పీ రామకృష్ణ తీసుకున్న చర్యల వల్ల జిల్లాలోని చాలా మంది బుకీలు తోక ముడిచారని చెప్పవచ్చు. తర్వాత వచ్చిన ఎస్పీ అట్టడ బాబూజీ కూడా అదే పం««థాను కొనసాగిస్తుండటంతో జిల్లాలో బెట్టింగ్ సుమారు 60 శాతం మేర తగ్గింది. కారణం తెలియదు కానీ ఇటీవల పోలీసుల దాడులు తగ్గడంతో బెట్టింగ్ మళ్లీ పురుడు పోసుకుంటున్నట్లు కనిపిస్తోంది. పోలీసుల భయంతో సీనియర్ బుకీలు కొందరు పందాలకు స్వస్తి చెప్పినా.. కొత్త బుకీలు మాత్రం చెలరేగి పోతున్నట్లు సమాచారం. ఇటీవల కొత్తగా కొందరు యువ బుకీలు కూడా తెరపైకి వచ్చారు. వీరిపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్కో రోజు ఒక్కో రాష్ట్రంలో.. బుకీలు 50 రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఒకే చోట స్థావరం ఏర్పరుచుకొని పందాలు నిర్వహిస్తే పోలీసుల నుంచి కష్టాలు తప్పవని భావించి.. ఒక్కో రోజు ఒక్కో రాష్ట్రంలో ఉండేలా రూట్ మ్యాప్‌ను తయారు చేసుకున్నట్లు సమాచారం. గతంలో బెంగళూరు, హైదరాబాద్‌లో ఉంటూ బెట్టింగ్ నిర్వహించే వాళ్లు, అయితే ఇటీవల ఈ రెండు నగరాల్లో పోలీసులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ రెండు సిటీలు క్రికెట్ పందాలకు సురక్షితం కాదని బుకీలు గ్రహించారు. చెన్నై, గోవా, మహారాష్ట్రలోని ముంబై, ఒడిస్సా తదితర ప్రాంతాలను ఎంచుకున్నట్లు తెలిసింది. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గుర్తు పట్టే అవకాశం ఉన్నందున రోజుకో ప్రాంతానికి వెళ్లడం శ్రేయస్కరమని బుకీలు భావిస్తున్నట్లు తెలిసింది. వేధిస్తున్న సిబ్బంది కొరత గతేడాది ప్రొద్దుటూరు సబ్‌డివిజన్ పరిధిలో పోలీసులు 15 క్రికెట్ బెట్టింగ్ కేసులను నమోదు చేసి.. బుకీల నుంచి రూ.11 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో దాడులు నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి స్థానిక పోలీసులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. అన్ని స్టేషన్లలో సిబ్బంది కొరత పోలీసు శాఖను వేధిస్తోంది. సబ్‌డివిజన్‌లోని 72 మంది పోలీసులను ప్రొద్దుటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ అంట్ కంట్రోల్ సెంటర్‌కు మార్చారు. దీంతో ప్రధాన స్టేషన్లలో సిబ్బంది అరకొరగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా దాడులు నిర్వహించాలని పోలీసు అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి పోలీసులు బుకీలను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే. -
పందెం కోడి.. చికెన్ పకోడి!
ఓ ప్రాంతంలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటుంది...సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి బుకీలతో పాటు సామగ్రిని స్వాధీనం చేసుకుంటారు... ఓ భవనంలో కొందరు పేకాట ఆడుతూ ఉంటారు...దాడి చేసి పట్టుకునే పోలీసులు పేకాటరాయుళ్లతో పాటు నగదు తదితరాలు సీజ్ చేస్తారు... ఓ ప్రదేశంలో కోడి పందేలు జరుగుతుంటాయి...అక్కడకు వెళ్లే పోలీసులు దొరికిన పందెంరాయుళ్లతో పాటు కోళ్లనూ స్వాధీనం చేసుకుంటారు... ఇవన్నీ తరచుగా వింటున్న వార్తలే. సాధారణంగా ఏ కేసులో అయినా పోలీసులు తాము అరెస్టు చేసిన నిందితుల్ని కోర్టులో హాజరు పరిచి, వారి నుంచి స్వాధీనం చేసుకున్న వాటినీ కోర్టుకు అప్పగిస్తారు. మరి కోడి పందేల కేసుల్లో స్వాధీనం చేసుకున్న కోళ్లను ఏం చేస్తారు? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదూ...ఏమీ లేదు...కోర్టు అనుమతి తీసుకుని ఎంచక్కా పందెం కోళ్లను చికెన్ షాపుల్లో అమ్మేస్తారట. ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని, జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించిన కోళ్ల వ్యవహారంలో ఇదే జరిగిందని, పోలీసులు మొత్తం 17 కోళ్లను రూ.10వేలకు అమ్మేశారని సమాచారం. సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొందరు పందెంరాయుళ్ళు గత జనవరి 7న కోడి పందేలకు దిగారు. ఏకంగా ఓ అపార్ట్మెంట్ టెర్రస్‌నే బరిగా మార్చుకున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఎం.వెంకటకృష్ణ...తన స్నేహితుడైన టి.వెంకటప్రసాద్‌తో కలిసి శ్రీకృష్ణానగర్‌లోని ఓ ఐదంతస్తుల భవనం టెర్రస్‌పై బరికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. కోడి పందేలు ఆడే ఆసక్తి ఉన్న వారిని ఇక్కడకు పిలిపించి పందేలు నిర్వహిస్తూ కమీషన్లు తీసుకుంటున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. ఈ ఇద్దరు నిర్వాహకులతో పాటు మొత్తం 29 మందిని అరెస్టు చేసి 17 పందెం కోళ్లు, వాటికి కట్టే కత్తులు 60, 26 సెల్ఫోన్లు, రూ.80,150 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కోళ్లను ‘రెహ్మత్‌నగర్’కు తరలించి... టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్ని ఆ మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచిన జూబ్లీహిల్స్ పోలీసులు 17 పందెం కోళ్లను రికవరీ చేసిన విషయాన్నీ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళారు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలనూ సమర్పించారు. ఆ కోళ్లను సేఫ్ కస్టడీలో ఉంచాల్సిందిగా పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో అప్పటి వరకు జూబ్లీహిల్స్ ఠాణాలో ఉన్న వీటిని కాస్త సువిశాల ఖాళీ ప్రదేశం ఉన్న రెహ్మత్‌నగర్ పోలీసు ఔట్‌పోస్టుకు తరలించారు. అక్కడే కొన్ని రోజుల పాటు తమ సంరక్షణలో ఈ కోళ్లు ఉండాల్సి రావడంతో పోలీసులు తాత్కాలిక భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ వాటికి తిండి గింజలు, నీళ్లు తదితరాలు అందిస్తూ జాగ్రత్తగా కాచుకున్నారు. కోర్టు అనుమతితో విక్రయించి... నిబంధనల ప్రకారం ఈ కోళ్లు సైతం న్యాయస్థానం సొత్తు (కోర్ట్ ప్రాపర్టీ) కావడంతో పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. ఆపై కోళ్లను విక్రయించడానికి అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించడంతో జూబ్లీహిల్స్ ప్రాంతంలో రూ.10 వేలకు ఆ కోళ్లను ఓ చికెన్ షాపులో అమ్మేశారని, అతను ప్రత్యేక రేటుతో ఇతరులకు చికెన్‌గా అమ్మేశాడని సమాచారం. అలా అమ్ముతున్న సమయంలో ఆ పుంజుల్ని తిరిగి పందేలకు వినియోగించకుండా కొనుగోలుదారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఆ కోణంలో కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. ఈ విషయాలన్నింటికీ కోర్టుకు విన్నవించిన జూబ్లీహిల్స్ పోలీసులు వాటిని విక్రయించగా వచ్చిన మొత్తాన్ని న్యాయస్థానానికే జమ చేశారు. పందెం రాయుళ్ళను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించిన వెంటనే టాస్క్‌ఫోర్స్ బాధ్యత తీరిపోగా... ఈ విక్రయం జరిగిన తర్వాత మాత్రమే జూబ్లీహిల్స్ పోలీసులు ఊపిరి పీల్చుకోగలిగారు. జరగరానిది జరిగితే పెద్ద తంతే... ఈ పందెం కోళ్లు తమ ఆధీనంలో ఉన్నన్ని రోజులూ జూబ్లీహిల్స్ పోలీసులు కంటిమీద కునుకు లేకుండా గడిపారనే చెప్పవచ్చు. ఈ కేసులో అరెస్టు చేసిన నిందితుల్ని మరుసటి రోజు కోర్టులో హాజరుపరచడంతో పోలీసుల బాధ్యత తీరింది. అయితే పుంజుల్ని సంరక్షణ నిమిత్తం కోర్టు పోలీసులకు అప్పగించడంతో అమ్మకం పూర్తయ్యే వరకు ప్రతి రోజూ ‘దినదిన గండం’గా గడిపారు. ఈ మధ్య కాలంలో ఆ పుంజులకు ఏమైనా జరిగితే పోలీసులదే పూర్తి బాధ్యత అయ్యేది. అనివార్య కారణాలతో ఒక్క కోడిపుంజు చనిపోయినా... దానికి సంబంధించి కేసు నమోదు చేయడం, కళేబరానికి ప్రభుత్వ పశు వైద్యుడితో పోస్టుమార్టం చేయించడం, అధికారికంగా ఖననం/దహనం చేయించడం.. వంటి తంతులతో పాటు ఈ రికార్డుల్ని కోర్టులో దాఖలు చేయడం కచ్చితం. ఈ పరిణామాల నేపథ్యంలోనే పోలీసులు పందెం పుంజుల్ని కంటికిరెప్పలా కాపాడారు. -
మ్యాచ్ సిడ్నీలో.. బెట్టింగ్ సిటీలో
సాక్షి, హైదరాబాద్: గోవాను అడ్డాగా చేసుకుని హైదరాబాద్ కేంద్రంగా వ్యవస్థీకృత పంథాలో క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గురువారం ఏక కాలంలో మూడు చోట్ల దాడులు చేసిన ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ టీమ్స్ 11 మంది సబ్– బుకీలు, ఏజెంట్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.44.3 లక్షల నగదు, హాట్‌లైన్ బాక్స్ తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు నగర ఇన్చార్జ్ కొత్వాల్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ముఠానే నగరంలో 70 శాతం బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ట్లు గుర్తించామన్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్ రావుతో కలసి వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్త నెట్‌వర్క్‌లో భాగంగా... దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెట్వర్క్స్ ఏర్పాటు చేసుకుంటున్న బెట్టింగ్ గ్యాంగ్స్ ఎక్కడికక్కడ బడా బుకీల్ని ఏర్పాటు చేసుకుం టున్నాయి. ఇలాంటి ప్రధాన బుకీల్లో బేగం బజార్‌కు చెందిన విశాల్ లోథియా ఒకరు. ఇతడు గోవాను అడ్డాగా చేసుకుని బెట్టింగ్ దందా నడిపిస్తున్నాడు. అబిడ్స్ ప్రాంతంలో మనోజ్‌కుమార్ అగర్వాల్, బంజారాహిల్స్‌లో చిన్ని రాజేందర్, నారాయణగూడలో ముఖేశ్ కుమార్... ఇతడికి సబ్–బుకీలుగా వ్యవహరి స్తున్నారు. ప్రతి సబ్–బుకీ కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. పంటర్ల వాయిస్ రికార్డులు సైతం... బెట్టింగ్ కాసే వ్యక్తి (పంటర్) నుంచి ఫోన్‌ను సబ్–బుకీ హాట్‌లైన్ బాక్సుకు మళ్లిస్తాడు. ఈ ఫోన్‌కాల్ అక్కడ రికార్డు అవుతుంది. పందెం ఓడిపోయిన తర్వాత తాను అలా బెట్టింగ్ కాయలేదని చెప్పకుండా ఇలా చేస్తుంటారు. మరోపక్క ప్రత్యేక పుస్తకాలు ఏర్పాటు చేసే సబ్–బుకీలు ప్రతి పంటర్‌కు ఓ పేజీ కేటాయిస్తూ డబ్బు చెల్లించాలా? వసూలు చేయాలా? అనేది అక్కడ నమోదు చేస్తుం టారు. ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు ప్రధాన బుకీకి చేరవేస్తూ ఉంటారు. ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో సబ్–బుకీ రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు పందాలు అంగీకరిస్తుంటాడు. ఏకకాలంలో మూడు చోట్ల దాడులు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ టీ–20 మ్యాచ్ నేపథ్యంలో విశాల్.. సబ్–బుకీలైన మనోజ్, రాజేందర్, ముఖేశ్‌లతో బెట్టింగ్స్ అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ తమ బృందాలతో అబిడ్స్, బంజారాహిల్స్, నారాయణగూడల్లోని స్థావరాలపై గురువారం ఏకకాలంలో దాడులు చేశారు. ముగ్గురు సబ్–బుకీలు, ఎనిమిది మంది ఏజెంట్లను పట్టుకున్నారు. ప్రధాన బుకీ విశాల్ కోసం గాలిస్తున్నామని, అతడిని విచారిస్తే భారీ నెట్వర్క్ గుట్టురట్టవుతుందని వీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అంతా హాట్‌లైన్ ద్వారానే... బెట్టింగ్‌ల కోసం విశాల్ హాట్‌లైన్ బాక్సులు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కో బాక్సుకు 36 ఫోన్లను కనెక్ట్ చేసే అవకాశ ముంటుంది. సబ్–బుకీ నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను తొలుత హోల్డ్‌లో పెడతాడు. ఇదే బాక్సుకి అనుసంధానించి ఓ బ్రాడ్ కాస్టింగ్ ఫోన్ కూడా ఉంటుంది. మ్యాచ్ కు, టీవీలైవ్కు మధ్య కొంత సమయ ముంటుంది. దీన్ని ఆసరాగా చేసుకో వడా నికి ఓ ముఠా సభ్యుడు గ్రౌండ్‌లోనే ఉం టాడు. ఫోర్లు, సిక్స్‌లు కొట్టిన ప్పుడు, వికెట్ పడినప్పుడు వెంటనే బ్రాడ్‌కాస్టింగ్ ఫోన్ ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రధానబుకీలకు ఏకకాలంలో సమాచారం ఇస్తాడు. అతడు దీని ఆధారంగా హోల్డ్‌లో ఉన్న కాల్స్ నుంచి అనువైనవి ఎంపిక చేసుకుని లాభాలు పొందుతాడు. క్రెడిట్ దాటితే బ్లాక్‌లిస్ట్... ఈ వ్యవహారంలో నేరుగా డబ్బు తీసుకువచ్చి పందాలు కాయరు. ప్రతి పంటర్‌కు కొంత క్రెడిట్ లిమిట్ ఉంటుంది. అది దాటితే మాత్రం ఏజెంట్లను పంటర్ల వద్దకు పంపి నగదు వసూలు చేయిస్తుంటారు. ఎవరైనా పంటర్ పందెం కాసిన సొమ్ము చెల్లించకపోతే అతడిని బ్లాక్ లిస్ట్‌లో పెడతారు. సాధారణంగా పంటర్లు కొన్ని వెబ్సైట్లలో వచ్చే విశ్లేషణల ఆధారంగా పందాలు కాస్తుంటారు. దీంతో ప్రధాన బుకీలు వెబ్‌సైట్లతోనూ మిలాఖత్ అయి తమకు అనుకూలంగా విశ్లేషణలు చేయిస్తున్నారు. -
హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ కలకలం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ కలకలం రేపింది. భాగ్యనగరాన్ని తమ అడ్డాగా చేసుకుని క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గత కొంతకాలం నుంచి కొంతమంది వ్యక్తులు క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ లు వేస్తున్నారు. దీనిపై నిఘా ఉంచిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. నారాయణగూడ, అబిడ్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో బెట్టింగ్ ముఠా సభ్యులు 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బెట్టింగ్ రాయుళ్ల వద్ద నుంచి రూ. 45 లక్షల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. క్యాష్ కౌంటింగ్ మిషన్, టీవీలు, ల్యాప్ టాప్, సెల్ ఫోన్లు, వాయిస్ రికార్డర్స్, బెట్టింగ్ వస్తువులు స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అరెస్టయిన వారిలో మనోజ్ కుమార్ అగర్వాల్, మహెందర్ కుమార్ కర్వా, రియాజుద్దీన్, యాళ్ల సరేష్ సహా మరికొంత మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
పోలీసుల ఆకస్మిక దాడి.. క్రికెట్ బుకీల అరెస్ట్
సాక్షి, కడప: కడప జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో క్రికెట్ బుకీలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. బుకీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలివీ.. కడప బాలాజీ నగర్‌లోని ఓ ఇళ్లు కేంద్రంగా బెట్టింగ్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో నిఘా ఉంచిన పోలీసులు సోమవారం సాయంత్రం ఆ ఇంటిపై ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర బుకీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుల వద్ద నుంచి రూ.14.11 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నామని సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వర రెడ్డి వివరించారు. -
‘హైటెక్’ బెట్టింగ్‌కు చెక్
ఇంట్లో షోకేసు వెనుక బెట్టింగ్ డెన్ గుట్టు రట్టు చేసిన పోలీసులు క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తూ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన రాజేష్ అగర్వాల్, పవన్ గుప్తాలు కొత్త పంథాలో కార్యకలాపాలు సాగించారు. వీరిద్దరూ మరో ఐదుగురితో కలిసి హైటెక్ పద్ధతిలో ఈ దందా ప్రారంభించారు. మంగళ్‌హాట్ ఠాణా పరిధిలోని న్యూ ఆగాపురలో అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో బెట్టింగ్ డెన్ ఏర్పాటు చేశారు. పోలీసు నిఘాకు చిక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అనుకోని పరిస్థితుల్లో పోలీసులకు ఉప్పంది ఇంటిపై దాడి చేసినా.. దొరక్కుండా జాగ్రత్తపడ్డారు. ఇంటి హాలుకు అనుబంధంగా ఉన్న గదిలో డెన్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి తలుపు స్థానంలో ఓ షోకేస్‌ను ఏర్పాటు చేశారు. అద్దాలతో కూడిన దానికి ఎలాంటి హ్యాండిల్స్ సైతం లేకపోవడంతో అది తలుపని గుర్తించడం సాధ్యం కాదు. ఈ ఇంటిపై దాడి చేసిన ఈస్ట్‌జోన్ పోలీసులూ తొలుత అలానే భావించారు. అయితే అద్దాలతో చేసిన ఆ షోకేస్‌లో ఎలాంటి అలంకరణ వస్తువులు, బొమ్మలు లేకుండా ఖాళీగా ఉండటంతో అనుమానించి క్షుణ్నంగా పరిశీలించారు. దీంతో అది తలుపని గుర్తించి లోపలకు ప్రవేశించగా... ఏసీ, పరుపులు, దివాన్ దిళ్లు, ల్యాప్‌టాప్, హాట్‌లైన్ బాక్సులు, టీవీ తదితరాలు బయటపడ్డాయి. ఈ డెన్ నుంచి టాస్క్‌ఫోర్స్ టీమ్ ఉపకరణాలతో పాటు రూ.12.05 లక్షలు స్వాధీనం చేసుకుంది. - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: టీ-20 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో హైటెక్ పంథాలో బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు ముఠాలు చిక్కాయి. నలుగురు నిందితుల్ని పట్టుకున్నామని, మరో ఆరుగురు పరారీలో ఉన్నారని ఇన్చార్జి పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. వీరి నుంచి రూ.20.07 లక్షల నగదు, ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డితో కలిసి కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా శృంగవరానికి చెందిన పీఎస్పీఆర్ఎస్ సోమరాజు, వి.వినోద్‌కుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వీరిద్దరూ విజయవాడకు చెందిన కుమార్‌తో కలిసి బెట్టింగ్ దందా ప్రారంభించారు. బుకీలుగా మారిన ఈ ముగ్గురూ సోమాజిగూడలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని పంటర్ల నుంచి ఫోన్ల ద్వారా పందేలు అంగీకరిస్తున్నారు. అలాగే నగరంలోని గోషామహల్, హుస్సేనిఆలం ప్రాంతాలకు చెందిన రాజేష్ అగర్వాల్, పవన్ గుప్తా మంగళ్‌హాట్‌లోని న్యూ ఆగాపురలో డెన్ ఏర్పాటు చేసుకున్నారు. బేగంజార్కు చెందిన మున్నా ధూట్, సుధీర్, అరుణ్‌రెడ్డి, ధర్మలతో పాటు మహారాష్ట్రకు చెందిన గోపాల్ వీరికి సహకరిస్తున్నాడు. ఓ పక్క బాక్సులు.. మరోపక్క రికార్డర్లు... కొన్నేళ్ళుగా ‘ఇదే వృత్తి’లో కొనసాగుతున్న ఈ బుకీలు నాలుగు హాట్‌లైన్ బాక్సులు సమీకరించుకున్నారు. ఒక్కో హాట్‌లైన్ బాక్సునూ కనిష్టంగా 16 నుంచి గరిష్టంగా 24 సెల్ఫోన్లకు అనుసంధానించే అవకాశం ఉంటుంది. ఆ ఫోన్లలో కేవలం పంటర్లతో మాట్లాడటానికి వినియోగించే సిమ్‌కార్డుల్ని మాత్రమే వేస్తారు. ఈ సిమ్‌కార్డుల్నీ బోగస్ పేర్లతో వివిధ ప్రాంతాల నుంచి సమీకరించారు. వీటిని ఓ స్పీకర్‌కు అనుసంధానించారు. ఒక్కోఫోన్ వస్తే అక్కడ ఉండే ఆపరేటర్ దీని ద్వారా సంభాషిస్తాడు. అన్ని సెల్ఫోన్లకూ ఒకేసారి ఫోన్లు వచ్చినా...సంభాషణలన్నీ హాట్‌లైన్ బాక్సులో రికార్డు అయిపోతాయి. ఎంత పందెం కాశారు? ఏ జట్టు వైపు కాశారు? అనేవి తెలుసుకోవడానికి, ఆట ముగిసిన తరవాత లావాదేవీల్లో ఆధారంగానూ ఆ రికార్డింగ్స్ ఉపకరిస్తాయని నిందితులు వెల్లడించారు. దీంతో పాటు వీరు ప్రముఖ కంపెనీకి చెందిన ఓ వాయిస్ రికార్డర్‌ను వాడుతున్నారు. పాత, కొత్త పంటర్ల నుంచి పందేలు అంగీకరిస్తున్న ఈ గ్యాంగ్ వారికి కొన్ని కోడ్‌వర్డ్స్ చెప్తుంది. దానికి సంబంధించిన కాల్స్‌ను రికార్డు చేయడానికి దీన్ని వినియోగిస్తున్నారు. ఈ వాయిస్ రికార్డర్‌ను కేవలం ఒక ఫోన్‌కు మాత్రమే కనెక్ట్ చేసే అవకాశం ఉంది. దాని ద్వారానే పంటర్లకు కాల్ చేస్తూ, వారి నుంచి వచ్చే ఫోన్లు రిసీవ్ చేసుకుంటూ ఆధారాలు భద్రపరుచుకోవడం ప్రారంభించారు. ఈ రెండు ముఠాలకూ మరో ప్రత్యేకత కూడా ఉంది. వీరు పంటర్ల (పందేలు కాసే వ్యక్తులు) జాబితాను భద్రపరచడానికి, లావాదేవీలు చేయడానికి ల్యాప్టాప్స్ వినియోగిస్తున్నారు. ఆట ముగిసిన తరవాత నగదు వసూలు, చెల్లింపులప్పుడు వీటి ఆధారంగానే లెక్కలు తేలుస్తున్నారు. ఈ రెండు గ్యాంగ్‌లపై టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. దీంతో ఈస్ట్‌జోన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలోని బృందం రాజేష్, పవన్‌లను, సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎ.యాదగిరి నేతృత్వంలోని బృందం సోమరాజు, వినోద్‌కుమార్‌లను అరెస్టు చేసింది. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. కుషాయిగూడలో... కుషాయిగూడ: బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును ఎస్ఓటీ, కుషాయిగూడ పోలీసులు రట్టు చేశారు. స్థానిక వాసవీ శివనగర్‌లో కొంతమంది యువకులు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం తెల్లవారుజామునఆకస్మిక దాడులు జరిపి బుకీలు సచిన్, జగన్‌రెడ్డితో పాటుగా కలెక్షన్ ఎజెంట్ రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ: 1.15 లక్షల నగదు, 15 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారితో పాటుగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న టి. సాయికిరణ్‌రెడ్డి, ఎం.శ్రీకాంత్‌రెడ్డి, సి.మణిశంకర్, ఎం.విశాల్, ఎం.దావల్, ఎం.జయరాజ్రెడ్డి, ఎ.కరణ్, ఎం.నర్సింగ్ అనే యువకులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
చిక్కడు..దొరకడు!
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో సంచలనం సృష్టించిన ఏటీఎంలలో నగదు మాయం కేసు నిందితుడు ఏ ఒక్కచోటా రెండు రోజులకు మించి ఉండకుండా పోలీసులకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. రాష్ట్రాల సరిహద్దులు దాటి తలదాచుకుంటున్నాడు. ఈనెల 17న ఒంగోలులో పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో నగదు మాయమైన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నగదు మాయం సూత్రధారి పూరిమిట్ల రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ తెలుసుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలన్న పోలీసులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. తొలుత రవి బాబాయి పూరిమిట్ల శ్రీనివాసరావును పోలీసులు విచారించారు. దీనికి మనస్తాపం చెందిన శ్రీనివాసరావు రెండో రోజు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కేసు విచారణ విషయంలో పోలీసులు కొంత స్పీడు తగ్గించారు. అతని ఆత్మహత్యకు పోలీసుల విచారణ కారణం కాదని, తన అన్న కొడుకు ప్రజల సొమ్ము కాజేశాడని తెలిసినవాళ్లంతా అడుగుతుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్న విషయం విదితమే. అప్పటి వరకూ రాష్ట్ర సరిహద్దుల్లో సంచరించిన రవి.. ఆ తర్వాత రాష్ట్రాల సరిహద్దులు దాటిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. సాంకేతిక పరిజ్ఞానంపై రవికి పట్టు రవి సాఫ్ట్వేర్ ఇంజినీర్. సాంకేతిక పరిజ్ఞానంపై మంచి పట్టుంది. తన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అక్రమాలకు పాల్పడటం అలవాటు చేసుకున్నాడు. ఏటీఎంలలో రెండో పాస్‌వర్డ్‌ను సైతం తస్కరించి గుట్టుచప్పుడు కాకుండా 40 లక్షలు కాజేసాడంటేనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అతడు ఏ విధంగా వినియోగించుకున్నాడో అర్థమవుతోంది. క్రికెట్ బెట్టింగుల్లో కూడా చాలా నగదు పోగొట్టుకున్నట్లు సమాచారం. రవి వద్ద ఇంకా నగదు దండిగానే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్రికెట్ బెట్టింగుల్లో లక్షలకు లక్షలు పోగొట్టుకున్న విషయం బాబాయి శ్రీనివాసరావుకు కూడా తెలుసని పోలీసుల వద్ద సమాచారం ఉంది. క్రికెట్ బుకీలు, మధ్యవర్తుల సమాచారాన్ని కూడా పోలీసులు ఒక్కొక్కటిగా రాబడుతున్నారు. నిందితుడు ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉన్నట్లు పోలీసులకందిన సమాచారం. తరచూ సెల్ఫోన్లు, సిమ్ కార్డులు మారుస్తూ రెండు రోజులకు మించి ఎక్కడా ఉండటం లేదు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు పట్టుకుంటారని ముందే పసిగట్టి తరచూ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నాడు. దీంతో అతని ఆచూకీ తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. ఒంగోలు ఒన్‌టౌన్ సీఐ కేశన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుని కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇతరుల పాత్రపైనా అనుమానాలు ప్రధాన సూత్రధారి రవి పోలీసులకు దొరికితేగానీ ఇతరుల పాత్ర ఏ మేరకు ఉందో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకరిద్దరికి ఈ నగదు మాయంతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. రవితో పాటు కస్టోడియన్‌గా పనిచేస్తున్న అశోక్ ప్రమేయంపై కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది. అందుకే ప్రధాన సూత్రధారి కోసం వేట ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణతో క్రికెట్ బుకీల బండారం కూడా బయట పడే అవకాశం లేకపోలేదు.