మ్యాచ్‌ సిడ్నీలో.. బెట్టింగ్‌ సిటీలో | Cricket betting rackets busted in Hyderabad | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌ సిడ్నీలో.. బెట్టింగ్‌ సిటీలో

Published Fri, Jan 19 2018 3:21 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Cricket betting rackets busted in Hyderabad - Sakshi

గురువారం హైదరాబాద్‌లో పట్టుబడిన నిందితులు, జప్తు చేసిన నగదు, సెల్‌ఫోన్లను మీడియాకు చూపుతున్న సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు

సాక్షి, హైదరాబాద్‌: గోవాను అడ్డాగా చేసుకుని హైదరాబాద్‌ కేంద్రంగా వ్యవస్థీకృత పంథాలో క్రికెట్‌ బెట్టింగ్స్‌ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గురువారం ఏక కాలంలో మూడు చోట్ల దాడులు చేసిన ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ టీమ్స్‌ 11 మంది సబ్‌– బుకీలు, ఏజెంట్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.44.3 లక్షల నగదు, హాట్‌లైన్‌ బాక్స్‌ తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు నగర ఇన్‌చార్జ్‌ కొత్వాల్‌ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ముఠానే నగరంలో 70 శాతం బెట్టింగ్స్‌ నిర్వహిస్తున్న ట్లు గుర్తించామన్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌ రావుతో కలసి  వివరాలు వెల్లడించారు.

దేశవ్యాప్త నెట్‌వర్క్‌లో భాగంగా...
దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెట్‌వర్క్స్‌ ఏర్పాటు చేసుకుంటున్న బెట్టింగ్‌ గ్యాంగ్స్‌ ఎక్కడికక్కడ బడా బుకీల్ని ఏర్పాటు చేసుకుం టున్నాయి. ఇలాంటి ప్రధాన బుకీల్లో బేగం బజార్‌కు చెందిన విశాల్‌ లోథియా ఒకరు. ఇతడు గోవాను అడ్డాగా చేసుకుని బెట్టింగ్‌ దందా నడిపిస్తున్నాడు. అబిడ్స్‌ ప్రాంతంలో మనోజ్‌కుమార్‌ అగర్వాల్, బంజారాహిల్స్‌లో చిన్ని రాజేందర్, నారాయణగూడలో ముఖేశ్‌ కుమార్‌... ఇతడికి సబ్‌–బుకీలుగా వ్యవహరి స్తున్నారు. ప్రతి సబ్‌–బుకీ కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు.

పంటర్ల వాయిస్‌ రికార్డులు సైతం...
బెట్టింగ్‌ కాసే వ్యక్తి (పంటర్‌) నుంచి ఫోన్‌ను సబ్‌–బుకీ హాట్‌లైన్‌ బాక్సుకు మళ్లిస్తాడు. ఈ ఫోన్‌కాల్‌ అక్కడ రికార్డు అవుతుంది. పందెం ఓడిపోయిన తర్వాత తాను అలా బెట్టింగ్‌ కాయలేదని చెప్పకుండా ఇలా చేస్తుంటారు. మరోపక్క ప్రత్యేక పుస్తకాలు ఏర్పాటు చేసే సబ్‌–బుకీలు ప్రతి పంటర్‌కు ఓ పేజీ కేటాయిస్తూ డబ్బు చెల్లించాలా? వసూలు చేయాలా? అనేది అక్కడ నమోదు చేస్తుం టారు. ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు ప్రధాన బుకీకి చేరవేస్తూ ఉంటారు. ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో సబ్‌–బుకీ రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు పందాలు అంగీకరిస్తుంటాడు.

ఏకకాలంలో మూడు చోట్ల దాడులు
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరుగుతున్న బిగ్‌ బాష్‌ లీగ్‌ టీ–20 మ్యాచ్‌ నేపథ్యంలో విశాల్‌.. సబ్‌–బుకీలైన మనోజ్, రాజేందర్, ముఖేశ్‌లతో బెట్టింగ్స్‌ అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కేఎస్‌ రవి, కె.శ్రీకాంత్‌ తమ బృందాలతో అబిడ్స్, బంజారాహిల్స్, నారాయణగూడల్లోని స్థావరాలపై గురువారం ఏకకాలంలో దాడులు చేశారు. ముగ్గురు సబ్‌–బుకీలు, ఎనిమిది మంది ఏజెంట్లను పట్టుకున్నారు. ప్రధాన బుకీ విశాల్‌ కోసం గాలిస్తున్నామని, అతడిని విచారిస్తే భారీ నెట్‌వర్క్‌ గుట్టురట్టవుతుందని వీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అంతా హాట్‌లైన్‌ ద్వారానే...
బెట్టింగ్‌ల కోసం విశాల్‌ హాట్‌లైన్‌ బాక్సులు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కో బాక్సుకు 36 ఫోన్లను కనెక్ట్‌ చేసే అవకాశ ముంటుంది. సబ్‌–బుకీ నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను తొలుత హోల్డ్‌లో పెడతాడు. ఇదే బాక్సుకి అనుసంధానించి ఓ బ్రాడ్‌ కాస్టింగ్‌ ఫోన్‌ కూడా ఉంటుంది. మ్యాచ్‌ కు, టీవీలైవ్‌కు మధ్య కొంత సమయ ముంటుంది. దీన్ని ఆసరాగా చేసుకో వడా నికి ఓ ముఠా సభ్యుడు గ్రౌండ్‌లోనే ఉం టాడు. ఫోర్లు, సిక్స్‌లు కొట్టిన ప్పుడు, వికెట్‌ పడినప్పుడు వెంటనే బ్రాడ్‌కాస్టింగ్‌ ఫోన్‌ ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రధానబుకీలకు ఏకకాలంలో సమాచారం ఇస్తాడు. అతడు దీని ఆధారంగా హోల్డ్‌లో ఉన్న కాల్స్‌ నుంచి అనువైనవి ఎంపిక చేసుకుని లాభాలు పొందుతాడు.

క్రెడిట్‌ దాటితే బ్లాక్‌లిస్ట్‌...
ఈ వ్యవహారంలో నేరుగా డబ్బు తీసుకువచ్చి పందాలు కాయరు. ప్రతి పంటర్‌కు కొంత క్రెడిట్‌ లిమిట్‌ ఉంటుంది. అది దాటితే మాత్రం ఏజెంట్లను పంటర్ల వద్దకు పంపి నగదు వసూలు చేయిస్తుంటారు. ఎవరైనా పంటర్‌ పందెం కాసిన సొమ్ము చెల్లించకపోతే అతడిని బ్లాక్‌ లిస్ట్‌లో పెడతారు. సాధారణంగా పంటర్లు కొన్ని వెబ్‌సైట్లలో వచ్చే విశ్లేషణల ఆధారంగా పందాలు కాస్తుంటారు. దీంతో ప్రధాన బుకీలు వెబ్‌సైట్లతోనూ మిలాఖత్‌ అయి తమకు అనుకూలంగా విశ్లేషణలు చేయిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement